[dropcap]జ[/dropcap]న్మ నివ్వడంలో తప్పు చేయని దేవుడు
బుద్ధి నివ్వడంలో తప్పు ఎందుకు చేస్తాడు?
తవ్వుదాం… వెలికితీద్దాం
ఆధారాలేమైనా దొరుకుతాయేమో పరీక్షిద్దాం.
పుర్రె నిండా పుట్టెడు కల్మషాన్ని పుటం పెట్టి
పచ్చి నిజాలను నిగ్గుతేలుద్దాం.
దురాలోచన పొగల వెనుక దూరమవుతున్న విలువలను
జారిపోతున్న కాలంలో
జరిగి పోతున్న వాస్తవాల దారి
గుట్టు విప్పి తెలుసుకొందాం.
పొర్లివచ్చే మాటల వెనుక అర్థాలను,
ముంచెత్తే అనర్థాలను,
మత్తుగొల్పే మాయాజాలపు అడుగులోని
నిండుగున్న నిజాలను
కళ్లారా కలిసొద్దాం.
మౌన తెరల మాటున
మూగ పోరాల రోదనలో
గడ్డకట్టిన రహస్యాలను,
వేదనలను గురి పెట్టి చేదిద్దాం.
నీతిమాలి గతితప్పిన
మతిహీనపు మనుగడలో
ఛిద్రమౌతున్న నిజాలని చేరదీసీ
మదమెక్కిన మత్తేభ భావజాలన్ని
చీల్చి చండాడి,
ఎండగట్టి ఎదురుపడ్డ డొల్లతనాన్ని విదిలిద్దాము.. వదిలేద్దాం.
మానవత్వం మరచి, దానవత్వం హెచ్చి,
మురికి కోపంగా మారిన మెదడు వీధి
మలుపులో చచ్చుపడిన మనిషి లక్షణాలను తట్టి
మనసును మరమ్మత్తు చేసి
మనిషితనం గుర్తుకుతెద్దాం.
మనిషి మనిషిలో
మనిషిని చేపట్టి నడిపిద్దాం.