మహిళా స్వావలంబనే ధ్యేయంగా కృషి చేసిన శ్రీమతి రమాబాయి రెనడే

4
4

[box type=’note’ fontsize=’16’] ది. 25-01-2021 శ్రీమతి రమాబాయి రెనడే జయంతి మరియు వర్థంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి. [/box]

[dropcap]మ[/dropcap]హిళల విద్య కోసం శ్రమించి, పాఠశాలలు స్థాపించి, సాధారణ విద్యతో ఉపయోగం అంతగా లేదని గ్రహించి, వృత్తి విద్యకు పెద్దపీట వేసి, భారతీయ మహిళలకు మార్గదర్శనం చేసిన మార్గదర్శకురాలు శ్రీమతి రమాబాయి రెనడే!

వీరు 1862వ సంవత్సరం జనవరి 25వ తేదీన నాటి బొంబాయి ప్రెసిడెన్సీ దేవరాష్ట్రలో సతారా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో కుర్లేకర్ వంశంలో జన్మించారు. వీరిది పేద కుటుంబం. అప్పటి ఆచారం ప్రకారం తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించకపోవడం సహజం. అదొక మూఢాచారం. అందుకే రమాబాయికి కూడా చదువు అందని ద్రాక్షపండయింది.

11వ ఏటనే గొప్ప న్యాయవాది, సంఘ సంస్కరణాభిలాషి అయిన శ్రీ మహాదేవ గోవింద రెనడేతో వీరి వివాహము జరిగింది. రెనడే భార్యను చదువుకునేందుకు ప్రోత్సహించారు. ముందుగా మరాఠీ భాషను నేర్పించారు. పండితురాలిని చేశారు. తరువాత ఆంగ్ల భాషను నేర్పించారు. మాతృభాషలో నిష్ణాతురాలయిన తరువాతే భూగోళం, చరిత్ర, గణిత శాస్త్రాలనూ నేర్పించారు.

దీనిని బట్టి మన పరిపాలకులు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ముందు మాతృభాష నేర్పిన తరువాత శాస్త్ర విషయాలను నేర్పించాలి.

నిరక్షరాస్యురాలి స్థాయినుండి భర్త నేర్పిన విద్యతోనే ఎదిగి, ఆయనకే కార్యదర్శి అయ్యారావిడ. అంత గొప్ప సంఘసంస్కర్త భార్య అయినందుకు గర్వపడ్డారు. ఆయన కార్యకలాపాలన్నింటిలో పాలు పంచుకున్నారు. ప్రార్థనా సమాజం, ఆర్య సమాజాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. రెనడే ఆమెకు ఉపవ్యాసకళలో కూడా శిక్షణను ఇచ్చారు. తొలిరోజుల్లో ఆయన వ్రాసిస్తే రమాబాయి సాధన చేసేవారు. తరువాత స్వయంగా మంచి ఉపన్యాసకురాలిలా మారారు. మరో సంఘసంస్కర్త ‘పండిత రమాబాయి’కి వీరు ఆతిథ్యమిచ్చి కొంతకాలం తమ ఇంటిలో అతిథిగా ఆదరించారు.

1886వ సంవత్సరంలో పూనాలో ‘బాలికా పాఠశాల’ను స్థాపించారు. బొంబాయిలో ‘హిందూ లేడీస్ సోషల్ లిటరరీ క్లబ్’ని స్థాపించారు. దీనిలో మహిళల కోసం చేతిపనులు, కుట్టుపని, నర్సింగ్ వంటి వృత్తివిద్యలకు ప్రముఖ స్థానం కల్పించారు.

ఈ కార్యక్రమాలను వీరే స్వయంగా పర్యవేక్షించడంతో సత్ఫలితాలు కలిగాయి. స్త్రీలను అభివృద్ధి పథంలో నడిపించారు.

1897వ సంవత్సరంలో అమెరికా పర్యటనలో మరిన్ని అనుభవాలని సంపాదించారు. ఫిజి, కెన్యాదేశాలలోని భారతీయ శ్రామికుల, కార్మికుల కష్టాలు నివారించడంలో కృషిచేశారు.

పూనాలోని తమ పూర్వీకుల ఇంట్లోనే సేవా సదన్‌ను స్థాపించారు. సేవాసదనాలలో వీరు సలిపిన కృషి అనితర సాధ్యం. చాల విద్యా సంస్థలను నెలకొల్పారు. అన్ని వయసుల వారికి వివిధ స్థాయిలలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం.

ఆనాడే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్స్, జూనియర్ కాలేజీలు, వయోజన విద్యా పాఠశాలలు, మరాఠీ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేశారు. వీరు ఆంగ్ల మాధ్యమంలో కూడా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూలు స్థాపించారు. భాష నేర్పించడం కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం భాషల ప్రాముఖ్యతని గుర్తించిన విషయాన్ని మనం ఈనాడు కూడా అనుసరించవలసిందే! బాల బాలికలు, మహిళలు అభివృద్ధి చెందితే, విద్య నేర్చితే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మి విద్యారంగంలో సేవలను అందించారు.

సాంకేతిక విద్యా సంస్థలు, వృత్తి విద్యాసంస్థలు ఉపాధ్యాయశిక్షణా సంస్థలు అవి ఇవి అనేమిటి? జీవన నైపుణ్యాలను పెంపొందించి, జీవనోపాధిని కలిగించే/మహిళలకు స్వావలంబన కలిగించి ఆర్ధికాభివృద్ధికి తోడ్పడే అమ్మకపు కేంద్రాలను కూడా స్థాపించారు.

పూనా సేవాసదన్‌లో 3 మహిళా హాస్టళ్ళను ఏర్పాటు చేశారు. వైద్య విద్యార్ధులు, నర్సింగ్ విద్యార్థినులకు వీటిలో వసతి కల్పించారు.

సేవా సదన్ ప్రారంభంలో ఎక్కువమంది వితంతువులు నర్సింగ్‌లో శిక్షణ పొందేవారు. ఒకసారి వార్షికోత్సవాలలో బహుమతి ప్రదానం జరుగుతుంది, అపుడు ఒక వితంతువు ఆచారం ప్రకారం వితంతు వేషధారణ, శిరోముండనం చేయించుకుని వచ్చారు. ఆమెను చూసి యువకులు అల్లరి చేసి గేలి చేస్తూ అరిచారు. వెంటనే రమాబాయి “మీ ఇళ్ళలో అమ్మ, అక్క, చెల్లి, వదిన వంటి వారిని ఇలాగే గేలి చేస్తారా?” అని ప్రశ్నించి వారి నోళ్ళు మూయించారు. అంత ప్రాక్టికల్ వ్యక్తి ఆమె.

బాల నేరస్తుల పాఠశాలలను, మానసిక వికలాంగుల పాఠశాలలను సందర్శించేవారు. వివిధ ప్రత్యేక సందర్భాలలో వారిని సందర్శించి, వారితో మాట్లాడి పూలు, పళ్ళు, తినుబండారములు అందించేవారు. వారిని ఆనందపరిచి తనూ ఆనందించేవారు. వారందరి అభ్యున్నతిని కాంక్షించారు. ఈ విధంగా ఆనాడే వేలాది మందికి సేవలందించి అభినందనలను అందుకున్నారు.

భారతదేశంలో నర్సింగ్ కార్యకలాపాలు విస్త్రృత పరిధిలో సాగడానికి రమాబాయిగారు వేసిన పునాదులు చాలావరకు దోహదం చేశాయి. ఈ విషయంలో వీరికి సామాజిక సంస్కర్తలు బి.ఎం.మల్బరీ, దయారామ్ గిడుమాల్ చేసిన సహాయం ఎనలేనిది.

1901వ సంవత్సరంలో మహాదేవ గోవింద రెనడే మరణించారు. అప్పుడు తన కార్యక్షేత్రాన్ని బొంబాయి నుండి పూనాకు మార్చారు. అయితే బొంబాయి, మిగిలిన ప్రాంతాలలోని స్త్రీల అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించారు.

భారత మహిళా పరిషత్ అధ్యక్షలుగా పనిచేశారు. 1904, 1908, 1912, 1920 సంవత్సరాలలో ఈ సమావేశాలు జరిగాయి. వీటికి అధ్యక్షత వహించారు. స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, సమాజాన్ని పట్టిపీడిస్తున్న దురాచారాలు, మూఢాచారాలు, వితంతువుల బాధలు, బాల్యవివాహాలు, సాంఘిక సమస్యలను గురించి చర్చించేవారు. పరిష్కారమార్గాల కోసం సూచనలు చేసేవారు. లింగబేధం, లైంగిక వేధింపులనుండి రక్షించుకోవడం వంటి వాటిని గురించి చర్చించి పరిష్కార మార్గాలను చూపించేవారు. మొత్తానికి ఈ సమావేశాలు స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసి కొంతవరకు ఫలితాలను సాధించాయి.

1912వ సంవత్సరంలో ‘కేంద్ర కరువు ఉపశమన కమిటీ’లో పనిచేశారు. 1921లో బొంబాయి ప్రెసిడెన్సీలోని మహిళలకు ఓటు హక్కు సాధించడం కోసం ఉద్యమం చేశారు. మాంటేగ్ – ఛేమ్స్‌ఫర్డ్‌లను కలిసి మెమొరాండంను సమర్పించారు.

స్వాతంత్ర సమరయోధులను ఖైదు చేసిన సెంట్రల్ జైలు, ఎరవాడ జైలును సందర్శించేవారు. మహిళా ఖైదీలను కలిసి వారి బాగోగులను తెలుసుకునేవారు. వారి బాగుకోసం ప్రార్థనలు చేసేవారు.

1913వ సంవత్సరంలో గుజరాత్, కథియవార్ ప్రాంతాలలోని క్షామబాధితులకు సేవలను అందించారు.

వివిధ యాత్రాస్థలాలలో ఉత్సవాల సమయంలో వాలంటీర్లుగా సేవాసదనం మహిళలు పాల్గొనేవారు. వారితో పాటు రమాబాయి కూడా వెళ్ళి వారిలో ఉత్సాహాన్ని నింపేవారు. ఈ విధంగా వారిలో సేవాగుణాన్ని సుసంపన్నం చేశారు. తనకి తగిన వారసులుగా తయారు చేసి జాతికి అందించారు.

ఈ విధంగా ఆధునిక మహిళాభివృద్ధి కోసం ఉద్యమాలు చేసి విజయం సాధించిన మహిళగా, 25 సంవత్సరాల పాటు మహిళా విద్య, హక్కులు, సాధికారిత, జాగృత పరచడం కోసం కృషి చేసి బొంబాయి, పూనాలలో సేవాసదన్లు నడిపి మహిళాభ్యుదయానికి బాటలు వేసిన సంఘ సంస్కరణాభిలాషి శ్రీమతి రమాబాయి రెనడే. వీరు “సేవాసదన్‌కు పర్యాయపదం రమాబాయి” అనిపించుకున్నారు. ఇంత గొప్ప సంస్థలతో భారత జాతికి, ప్రత్యేకించి మహిళలకు జీవితాంతం సేవలందించి 1924 జనవరి 25న (తన పుట్టిన తేదీనే) మరణించారు.

వీరి శతజయంతి సందర్భంగా 1962వ సంవత్సరం ఆగష్టు 15వ తేదీన 15 నయా పైసల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.

వీరి జయంతి మరియు వర్ధంతి జనవరి 25 సందర్భంగా నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here