[dropcap]త[/dropcap]ల్లిదండ్రులకు నలుగురు ఆడపిల్లల తరువాతి సంతానం వినయ్. భార్గవరామయ్యగారి ఏకైక కూతురు వినీత. పెద్దల అభిప్రాయాలకు వ్యతిరేకంగా, ఆధునిక భావాల భ్రమలో, సహజీవనం గడుపుతున్నారు వినీత, వినయ్.
వినీత నెలతప్పింది. వైద్య పరీక్షకై డాక్టర్ వద్దకు వచ్చారు. అనంతరం వినయ్ గుసగుసగా డాక్టర్‌తో ఏదో చెప్తూ తనని చూసి తత్తరపడి ఆపేసి వెళ్ళిపోవడం గమనించి డాక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూసింది.
‘మీకు పుట్టబోయేది ఆడబిడ్డని తెలిస్తే అబార్షన్ చేయమన్నారు’ అంది డాక్టర్.
‘వినయ్ ప్రవర్తనకి అర్థం ఇదా?’ అవాక్కైన వినీత అతగాడి కాలర్ పట్టుకుని చెంప చెళ్ళుమనిపించి ‘ఒక ఆడపిల్ల పుడితే ఒక తల్లి పుట్టినట్లే అని కూడ గ్రహించలేని నీవంటి కుసంస్కారితో ఇకపై ఎటువంటి బంధం నాకొద్దు. గుడ్ బై’ విసవిసా వెళ్ళిపోయింది.
వివాహం చేసుకుని ముగ్గురు ఆడపిల్లలకి తల్లై ఆనందమైన జీవితం వినీత గడిపితే, పెళ్ళికి నోచుకోక బలవంతపు బ్రహ్మచారిత్వం అనుభవించాడు పాపం వినయ్!