[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. నితిన్ తనేజా తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. [/box]
[dropcap]కొ[/dropcap]మ్మ మీద కోయిల కులాసాగా కూర్చుని ముఖం పరవశంగా పెట్టింది. బహుశా కమ్మగా పాటందుకునీ వుంటుంది. దాని ముఖకవళికలు చూస్తుంటే ఎవరికైనా ముచ్చటగా అనిపిస్తుంది.
హిందుస్తానీ సంగీతం పాడుతున్న సుప్రసిధ్ధ గాయనీమణి బ్రహ్మానందంగా కచేరీ చేస్తుంటే ఇలాంటి ముఖ కవళికలే మనకు కనిపిస్తాయి కదా అనుకున్నాడు నితిన్ తనేజా.
అంతకు ముందు వరకూ వినిపించిన సుమధుర కోయిల గానం హఠాత్తుగా వినబడకుండా ఆగిపోయింది. కోకిల కదలికలను బట్టి అదింకా పాడుతున్నట్టే వుంది. కానీ తనకి వినబడడం ఆగిపోయింది.
అదేమి విచిత్రమో అన్ని వినిపిస్తుంటాయి. వినిపిస్తున్నట్టే వుండి అకస్మాత్తుగా వినబడడం మానేస్తాయి. ఇలా తరుచూ జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఈ మధ్యన బాగా ఆలోచించాడు. బాగా జలుబు చెయ్యడం వల్ల చెవికి, ముక్కుకి సంబంధం ఉండడం వల్ల అలా జరిగివుంటుందిలే అని సరిపెట్టుకునే ప్రయత్నం చేసాడు.
కానీ మనసు మూలలో మూలమూలలో ఏదో చిన్న సందేహం… ఇంకేదో అనుమానం. ఇంట్లో వాళ్లకి ఈ విషయం చెప్పాలో వద్దో తెలియలేదు. వినికిడి సమస్య వయసు మళ్ళిన వాళ్ళకి వస్తుంది కానీ తనలాగ 14 ఏళ్ళ వాళ్లకి ఎక్కడైనా వస్తుందా? రాదు… రాదు కాక రాదు అని సరిపెట్టుకునే ప్రయత్నం చేసాడు.
టీనేజ్ తాలూకు సిగ్గు, మొహమాటం విషయాన్ని దాచేందుకు తోడ్పడ్డాయి. కానీ అది ఇబ్బందికరంగా మారుతూ వచ్చింది ఆ అబ్బాయికి. క్లాసులో పాఠాలు సరిగ్గా వినబడడంలేదు. టీచర్ మాటలూ సరిగ్గా వినబడడం పోయింది. అందరూ గొంతు తగ్గించి మాట్లాడినట్టుగా ఉంటోంది.. కావాలని అందరూ గొంతు తగ్గించి మాట్లాడుతున్నారా లేక తనకి అలా వినిపిస్తోందా?
ఎందుకో… ఎందుకో పిల్లలు తనని చూసి నవ్వుతున్నట్టు తన గురించే మాట్లాడుకున్నట్టు అనిపించసాగింది. అది నిజమా? లేక తన ఊహా? ఏమో ఏదీ అర్థం కాక కొంచెం అయోమయంగా అనిపించసాగింది.
ఇంతకు ముందులాగ అందరితో కలవలేకపోవడం, కలిసినా ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోవడం రోజు రోజుకీ పెరగసాగింది. ఒక్కసారిగా ఒంటరితనంగా అనిపించసాగింది. అందరూ తనకేదో పేరు పెట్టి ఏడిపిస్తున్నట్టు తోచడంతో స్కూల్‌కి వెళ్లే మూడ్ రానురాను తగ్గిపోసాగింది. అన్నలూ చెల్లితో కూడా సరిగ్గా మాట్లాడాలంటే ఎందుకో జంకు కలగసాగింది.
ఢిల్లీకి చెందిన నితిన్ తండ్రి వేదప్రకాష్ తనేజా బిజినెస్‌మాన్. తల్లి ప్రేమ్ తనేజా గృహిణి.
బడిలో మిత్రులుండేవారు. వారితో ఆడేవాడు.. కానీ అందరి మధ్యా వున్నాకొద్దికొద్దిగా పెరుగుతున్నప్పుడు తను ఒంటరిగా వున్న భావన కలిగేది.
మనసులో కలిగే ఊహలకి కాగితంమీద చిత్రంగా రూపం ఇచ్చేవాడు. ఆ పని చేస్తుంటే సంతృప్తిగా అనిపించేది. తన చిత్రాలను అందరూ మెచ్చుకుంటుంటే సంతృప్తి కలిగేది. అంతర్పాఠశాలల పోటీల్లో పాల్గొని బహుమతులు పొందిన రోజులూ వున్నాయి. ఒకసారి అలాంటి పోటీలో రజత పతకం లభించింది,.
వినికిడి సమస్య నితిన్‌ని అయోమయానికి గురిచేసింది. తెలియకుండానే న్యూనతను పెంచింది. అతని బడి టీచర్ సమస్యని గుర్తించి ఇంట్లోవాళ్ల చెవిన వేసింది. పిల్లాడు సరిగ్గా ఎవరితోనూ కలవకుండా ఉండడానికి కారణం కన్నవారికి తెలిసింది. వెంటనే వాళ్ళు వైద్యుడిని సంప్రదించారు. వైద్యుడు ఈ.ఎన్.టీ. స్పెషలిస్టుని సంప్రదించమన్నాడు. రకరకాల పరీక్షలు నితిన్ వినికిడి చెవి మీద నిర్వహించారు. పద్నాలుగేళ్ల నితిన్‌కి మిక్స్డ్ హియరింగ్ లాస్ ఉందని నిర్ధారించారు వైద్యులు. 26 డిసెంబర్ 1994న కండక్టివ్ హియరింగ్ లాస్‌కి ఆపరేషన్ జరిగింది. కానీ sensorineural hearing loss అతనితోనే మిగిలిపోయింది దానివల్ల ఎడమ చెవికి హియరింగ్ ఎయిడ్ 1999లో పెట్టుకోవలసివచ్చింది. 1994 ఆపరేషన్ తర్వాత 1999 మధ్యలో ఆతను అనుభవించిన బాధ చెప్పనలవి కానిది. ఆపరేషన్ జరిగింది. కానీ క్లియర్‌గా వినబడడం లేదు, ఏకాగ్రతతో వింటే కానీ చెవి క్యాచ్ చెయ్యడం లేదు. కాస్త దూరంగా ఉంటే అర్థం కావడం లేదు. ఇది చెప్పేదెలా… చెప్పుకోడానికి బెరుకు. అది కూడా అంత ఖర్చుపెట్టి ఆపరేషన్ జరిగాక కూడా సమస్య ఇలా ఉంటుందా అని అందరికి అనిపిస్తుందేమోనన్న భావం కలుగుతూ ఉండేది. 2005లో OCD మానసిక పరమైన ఒక అనారోగ్యం ఉందని నిర్ధారించారు. అది బహుశా ఆత్మన్యూనత వల్ల మొదలై రకరకాల మందులు మింగే పరిస్థితి ఆ చిన్న వయసులోనే కల్పించింది. ఇదిలా ఉండగా 2011 నుండి రెండు చెవులకి హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోడం ప్రారంభించవలసివచ్చింది. నితిన్‌కి జనంలోకి హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుని వెళ్లడం ఆ వయసులో చాలా ఇబ్బందిగా ఉండేది. తనని అందరూ అదోలా చూస్తున్నట్టూ ఆ చూపుల్లో జాలి సానుభూతి గుప్పించినట్టు అనిపించి అత్యవసరమయితే తప్ప బయటకి వెళ్లడం మానేసాడు.
వినికిడి సమస్యకి పరిష్కారం హియరింగ్ ఎయిడ్స్,లిప్ రీడింగ్ ఉపయోగపడతాయి. కానీ ఏమీ వినబడని వ్యక్తికీ సంజ్ఞలతో కూడిన భాష మాత్రమే ఇప్పుడున్న పరిష్కారం.
హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకున్నప్పటికీ స్పష్టంగా వినబడకపోవడం బాధాకరమైన అంశం. కొందరికవి స్పీచ్ రీడింగ్‌కి ఉపయోగపడతాయి. అవి లేకపోతే మాట్లాడడమూ స్పష్టంగా వీలుపడదని వివరించారు హెలెన్ కెల్లెర్. మనకి మనమే ఆత్మవిశ్వాసం జోడించుకుని న్యూనతను దూరం చేసుకుంటే మన ఊహకి అందనంత ఎత్తుకు ఎదిగిపోగలం అని కూడా ఆమె చెప్పారు.
మంచి జోక్ ఫలానా సినిమాలో బాగా పేలిందని అందరూ పగలబడి నవ్వినప్పుడు వీక్షించడం మినహా ఆ జోక్ వినడం సంభవించదనే వూహ బాధాకరంగా అనిపించేది నితిన్‍కి. అసలే చెవులు వినబడవన్న బాధ ఒక వైపుండగా మానసిక సమస్యమీద ఆలోచనలు ఒత్తిళ్లుగా మారి వేధించసాగాయి.
తన భావాలు ఎవరి దృష్టిలోకి రాకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు నితిన్. కానీ ఎన్నోసార్లు కళ్ళు అతని మనసుకు అద్దం పడుతూ వచ్చయి. ఎవ్వరినీ కలవాలని మాట్లాడాలని అనిపించడం పోయింది.
ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి బీకామ్ చదివి మూడేళ్ళ కంప్యూటర్ సైన్స్ డిప్లొమా కూడా పూర్తి చేసిన నితిన్ తన తోటి దివ్యాంగుల కోసం పాటుపడాలని నిర్ణయించుకున్నాడు. సేవారంగం మనసుకు తృప్తినిస్తుంది కానీ జేబు నింపదన్నది అక్షరసత్యం. ఇతర వృత్తులన్నీ కడుపు నింపేవి, జేబునింపేవీ అయితే సోషల్ వర్క్ ఒక్కటీ మాత్రం హృదయాన్ని తృప్తితో నింపగలిగినది. ఎన్ని వేలూ, లక్షలూ సంపాదించినా కలగని తృప్తి ఒక మంచి పని చేసినప్పుడు, ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టినప్పుడు కలుగుతుంది. కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు.
కరుణ, దయ నితిన్‌కి భగవంతుడిచ్చిన వరాలు.. అందువల్ల అతను సేవారంగంలో అడుగిడుతూనే అంకితభావంతో పనిచెయ్యసాగాడు. కరుణ ఎంతో గొప్పది. కరుణ కలిగినవ్యక్తి మాట్లాడుతూ ఉంటే వినికిడి శక్తిలేనివారికి కరుణారసభావాలు మాటల రూపంలో వినిపిస్తున్నట్టే అనిపిస్తుంది. దానికి కారణం కళ్ళలోని కరుణ. చూడలేని వ్యక్తికీ కరుణామూర్తిని మనసుతో చూసినట్టే ఉంటుంది. దానికి కారణం అతని నోటినుండి వెలువడే కరుణా పూరిత వాక్యాలు.
భగవంతుడు హృదయాల ఘోష వింటాడు, అంధుడై ముందుకు పోడు. ఆప్తుడై ఏదో విధంగా ఆదుకోడానికి చూస్తాడు. మనిషి చేసే ప్రార్థనలు పెడచెవినపెట్టడు. ఏదో విధంగా సహకరించాలని అనుకుని మంచి తోడ్పాటు ఇచ్ఛే వ్యక్తులను తోడుగా చేరుస్తాడు. వాళ్ళే సంఘసేవకులు.
నితిన్ బధిరత్వాన్ని కలిగివున్నా తన వైకల్యాన్ని సేవానిరతితో జయించినవాడు కనక సేవా రంగంలో కొనసాగాడు. తన బధిరత్వాన్ని విస్మరించి ప్రతీ వైకల్య బాధితుడికి సేవా హస్తాన్ని అందించసాగాడు నితిన్. పక్కవారి నిరాశాజనక ఆలోచనలను నశింపచేయడానికి తాను ఆశావాదిగా మారాడు. ‘వినికిడి శక్తి లేకపోతే ఏంటి, అసాధారణంగా ఆలోచించే మెదడుంది. సూక్ష్మమైన అంశాలను సైతం చూడగల చూపులున్నాయి. వాటితో చేయలేనిది లేదు’ అనే నిశ్చయానికి వచ్చాడు నితిన్.
‘వినబడకపోవడం వైకల్యం కాదు. వినబడటం లేదు అనే ఊహని ఉధృతం చేసుకుని మనసును పాడు చేసుకోడమే ప్రమాదకరమైన వైకల్యం’ అని అందరికీ చెప్పసాగాడు. తనమనసులో కలిగిన భావాలు దివ్యాంగులకు చెప్పి వారిలోని న్యూనతను పోగొట్టసాగాడు.
నీతీ, నిజాయితులను నిజ భూషణాలుగా చేసుకుని ముందుకు నడుస్తున్న నితిన్ ఎందరో హేమాహేమీల దృష్టిలో పడ్డాడు. ఇంటర్నేషనల్ ఫేస్‌బుక్ గ్రూప్ అడ్మిన్ నితిన్ లక్షణాలు చూసి ముగ్ధుడై అతన్ని తన గ్రూప్‌కి అడ్మిన్‌గా చేసాడు.
మార్టిన్ బ్లూమ్ఫీల్డ్ ఇండియాకి చెందినతను dyslexia వున్న వ్యక్తి వివరాలను అడిగాడు. అప్పుడు నితిన్ మహారాష్ట్రకు చెందిన మసరత్ ఖాన్‌ని పరిచయం చేసాడు. మసరత్ ఖాన్ మహారాష్ట్ర డైస్లెక్సియా అస్సోసియేషన్‌కి సీ.ఈ.ఓ. ఆతను కూడా నితిన్‌కి బాగా దగ్గరయ్యాడు. డైస్లెక్సియా సమస్య వున్న పిల్లలు త్వరగా భాషని ఆకళింపు చేసుకోలేరు. రంగుల దగ్గరి తేడాలు పజిల్స్, రైమ్స్ లాంటివి వీరికి కష్టంగా అనిపిస్తాయి. చిన్నప్పుడే రైమ్స్ చెప్పలేకపోయే పిల్లలను గుర్తించి డాక్టర్ని సంప్రదించడం అనివార్యం. ఆ సంస్థ కార్యక్రమాలలో నితిన్ కూడా వర్చ్యువల్‌గా పాల్గొంటుంటాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే దివ్యాంగుల అభివృద్ధి కార్యక్రమాల్లో నితిన్ పాత్ర ఉత్తర భారతదేశం నుండి ఉండడం అభినందనీయం.
నితిన్ ఫేస్‌బుక్ గ్రూప్ అంతర్జాతీయ ఇన్ఫర్మేషన్ సెంటర్‌గా తయారయ్యింది. దివ్యాంగుల డేటా బేస్ నితిన్ దగ్గర లభించసాగింది. 2011 నుండి సంస్థ పేరు తెచ్చుకోసాగింది.
ఇప్పుడు వంద దేశాలతో నితిన్‌కి సుహృద్ భావ బంధం వుంది. వేలాదిమందితో అనుబంధం వుంది. అన్ని రకాల వైకల్యాలున్నవారిని ఒక వేదిక కింద చేర్చి వారికి మంచి భవిష్యత్తు అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు నితిన్. ప్రతీ దివ్యాంగుడూ తన కాళ్ళమీద నిలబడేలా చూడడమే నితిన్ నిత్యం కనే కమ్మటి కల.
ఎనేబుల్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నాడు నితిన్. హేమాహేమీలందరూ నితిన్‌తో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి కారణం అతనిలో వున్న సేవా నిరతి. త్రినయని ట్రస్టీ తోనూ స్నేహముంది. సేవారంగం ఎన్నో అభినందనలనూ పురస్కారాలనూ అందించింది.
జీవితాంతం సేవారంగానికి అంకితమై ముందుకు సాగడం నితిన్ ఆశ. ఆ ఆశతో ఆశావాదంతో వున్న నితిన్ ఇచ్చే సలహా, సందేశం ఈక్రింది వాక్యాల్లో ప్రస్ఫుటమవుతోంది.
ఏ వ్యక్తి అయినా ఎదగాలి అనుకుంటే తప్పకుండా పక్కవ్యక్తి ఎదుగుదలకు తోడ్పడాలి, అది అందరూ అన్నివేళలా గుర్తుంచుకోవాలి అని ముందుగా చెప్తాడతను.
- నీ వీపు నువ్వే తట్టుకో. నీ మనసును నువ్వే ప్రోత్సహించుకో. అప్పుడు నీ గెలుపుకు నువ్వే కారకుడవవుతావు.
- నీ వైకల్యాన్ని ముందు నువ్వు ఓడిస్తేనే నువ్వు విజయుడివి.
- ఇలా పుట్టానే అని బాధపడకు. ఎలా ఎదుగుతున్నావో చూసి అభినందించేలా సాగు.
- కలకాలం జీవిస్తావనుకుంటూ కలలు కను. ఈ రోజే అస్తమిస్తావనుకుంటూ కష్టించు.
- గెలిచిన వారు ఎప్పుడూ ఓడలేదన్నది నిజం కాదు. దీక్షాబద్ధులైనవారు ఎప్పటికైనా గెలవగలరన్నది సత్యదూరం కాదు.
- తనని తాను జయిస్తే వందలమందిని జయించగల స్థైర్యం వస్తుంది.
- విజయం మన వెంట రాదు మనమే విజయం వెనక సాగాలి.
- పని ఆపకు. నీ కోసమే కాదు, నువ్వు చెయ్యలేవు అని పదే పదే చెప్పినవారిని ఛాలెంజ్ చేసేందుకైనా కసిగా కష్టించు.
- ఎవరో వస్తారు ఎదో చేస్తారని ఎదురు చూడకు. నువ్వేదైనా చెయ్యగలవన్న నమ్మకంతో ప్రారంభించు.
చివరగా అతనొక మాట చెప్పాడు. మాట్లాడలేనివారు వినలేనివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
- నా కన్నే నా చెవి..
- నా చెయ్యే నా నోరు.
ప్రతీ బధిరుడూ ఇలా ఆలోచించుకోగలిగితే బధిరత్వం బాధించదు. వైకల్యం ఉందన్న వూహ కూడా తలెత్తదు.
నితిన్ తనేజా ఫేస్‌బుక్‌లో ‘పర్సన్ విత్ డిస్‌ఎబిలిటీ’ అనే అంతర్జాతీయ సంస్థ పేజీలో ముఖ్య నిర్వాహకుడు.. ఎనభైవేలమంది దాకా సభ్యులున్న ఆ పేజీ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, కళా, విద్యారంగ వివరాలను అన్ని రకాల సమస్యలున్న దివ్యాంగులకూ స్వాంతనా లభిస్తుంది. సమస్యలకు పరిష్కారమూ ఉంటుంది.