అవే మాటలు

91
6

:ఇతివృత్తం:

[dropcap]పి[/dropcap]ల్లలు పెద్దవాళ్లైన తరువాత కన్నవాళ్ళపైనే ఆధారపడకుండా… తమ స్వశక్తితోనే జీవించాలని చెప్పడమే ఈ నాటిక ముఖ్యోద్దేశం…

ఇందులో పాత్రలు:

సుదర్శనం : తండ్రి, 70 సంవత్సరాలు, రిటైర్డ్ ప్రభుత్వ ఉన్నతాధికారి.

సుమతి : తల్లి, 65 సంవత్సరాలు, గృహిణి.

ఆనంద్ : కొడుకు, 45 సంవత్సరాలు, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని.

ఆమని : కూతురు, 40 సంవత్సరాలు, చిన్నతనంలోనే కనిపిస్తుంది.

సుందరి : కోడలు 40 సంవత్సరాలు (తెరవెనుక మాత్రమే)

ఇద్దరు మనుమలు : 12 సంవత్సరాలు, 8 సంవత్సరాలు (తెరవనుక మాత్రమే)

ఉపోద్ఘాతం:

ఉద్యోగ విరమణ చేసిన తరువాత, హైదరాబాద్‍లోనే స్థిరపడతాడు సుదర్శనం. భార్య, కొడుకు, కోడలు, మనుమలిద్దరూ… అందరూ కలిసి ఒకే ఇంట్లో వుంటారు. కొడుకు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వ్యవస్థాపకుడు, యజమాని…

***

సుదర్శనం సొఫాలో కూర్చుని దినపత్రిక చదువుతుంటాడు. సుమతి వంటగదిలో బ్రేక్‍ఫాస్ట్ తయారు చేస్తుంటుంది. ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపించి, కోడలు వంటగదిలో అత్తగారికి సహాయం చేస్తుంటుంది. అప్పుడే మార్నింగ్ వాక్ నుంచి వస్తాడు కొడుకు ఆనంద్.

***

ఆనంద్ : (సోఫాలో కూర్చుంటూ) నాన్నగారూ!

సుదర్శనం : (పత్రికను ప్రక్కకు జరిపి) ఏంటి బాబూ?

ఆనంద్ : మన కంపెనీకి ఈ మధ్యనే అమెరికాలోని ఓ పెద్ద కంపెనీ ప్రాజెక్టు వచ్చింది కదా! ఆ ప్రాజెక్టు కోసం ప్రత్యేకమైన విద్యార్హతలున్నవారు, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సబ్జెక్టులో మంచి అనుభవం ఉన్నవాళ్ళు, కనీసం ఓ పదిమందైనా ఇప్పటికిప్పుడు మనకు కావాలి. అందుకే ఈరోజు, రేపు, ఎల్లుండి, మా ఆఫీసులో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశాము.

సుదర్శనం : చాలా సంతోషం బాబూ! (అంటూ కారిపోతున్న కళ్ళనీళ్ళు తుడుచుకుంటాడు)

ఆనంద్ : నాన్నగారూ! ఏమైంది! ఎందుకేడుస్తున్నారు!! (ఆదుర్దాగా అడిగాడు)

సుదర్శనం : ఏంలేదు బాబూ… ఏంలేదు!

ఆనంద్ : నో… నో… మీరిలా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు! నాకేదో భయంగా వుంది నాన్నగారూ! (తండ్రి దగ్గరగా జరిగి కూర్చుని) నిజం చెప్పండి నాన్నగారూ! ప్లీజ్!

సుదర్శనం : చెప్తాను బాబూ!… (నిట్టూర్చి) ఈ రోజు నువ్వు జీవితంలో చక్కగా స్థిరపడ్డావు! ఒక కంపెనీకి యజమానివి కూడా! ఇప్పటికే ఓ వందమందికి ఉద్యోగాలిచ్చి, వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నావు! మరికొంతమందికి కూడా ఉద్యోగాలు ఇవ్వబోతున్నావు! అది తలుచుకుని గర్వపడుతున్నాను! ఇవి ఆనంద భాష్పాలు మాత్రమే! నువ్వేం భయపడకు బాబూ!

ఆనంద్ : అంతేనా!…. అయితే సరే నాన్నగారూ! వాస్తవానికి అమ్మా, మీరు చిన్నతనం నుండి ఎంతో ప్రేమాభిమానాలతో పెంచారు! విద్యాబుద్ధులు నేర్పించారు! ప్రయోజకుడ్ని చేశారు! ఈ రోజు నేను ఈ స్థాయికి ఎదిగానంటే, అది మీ ఇద్దరి చలవేకదా… నాన్నగారూ! మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి నాన్నగారూ! (ముందుకు వంగి తండ్రి కాళ్ళకు నమస్కరిస్తాడు)

సుదర్శనం : (ఆశీర్వదిస్తూ) అవుననుకో! కాని నీ కృషి, పట్టుదలలు కూడా తక్కువేం కాదులే బాబూ!

ఆనంద్ : అన్నట్లు, మీరు ఉద్యోగం చేసే రోజుల్లో చాలా ఇంటర్వ్యూ కమిటీల్లో మెంబరుగా ఉండేవారు! మీ అనుభవం ఎంతో గొప్పది! అందుకే ఈ మూడు రోజులు, మీరు మా ఆఫీసుకి వచ్చి ఇంటర్వ్యూలలో మాకు తోడ్పడవచ్చుగా నాన్నగారూ!

సుదర్శనం : అలాగే బాబూ! తప్పకుండా వస్తాను!

ఆనంద్ : సరే నాన్నగారూ! నేను త్వరగా తయారై ఆఫీసుకి బయలుదేరుతాను! ఈ రోజు కొంచెం ముందేవెళ్ళాలి! (లోపలికెళ్తాడు) (అప్పుడే సుమతి వచ్చి, సోఫాలో కూర్చుంటుంది)

సుమతి : ఆ! ఏంటండీ! తండ్రీ కొడుకులు చాలాసేపట్నుంచి ముచ్చట్లాడుకుంటున్నారు! ఏమిటి సంగతి!

సుదర్శనం : ఏం లేదు సుమతి! పుట్టినప్పుడు ఇంతున్న మన బుడతడు, మన కళ్ళముందే, పెరిగి పెద్దవాడై, బాగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు! ఒక కంపెనీకి యజమాని కూడా! చాలా మందికి ఉద్యోగాలిస్తున్నాడు! అది తలచుకుని గర్వపడుతూ… బాబుతో ఆ విషయాలే మాట్లాడుతున్నాను… అంతే!

సుమతి : నిజమేనండి… మీరు చెప్పింది యథార్థం!

సుదర్శనం : అది సరే! మనవళ్ళిద్దరూ స్కూల్‍కెళ్ళారా?

సుమతి : వాళ్ళిద్దర్నీ స్కూలుకి పంపిన తరువాతే, కోడలు వంటగదిలో నాకు సహయపడుతుంది!

సుదర్శనం : ఓహో! అలాగా!

సుమతి : ఏమండీ! నేనో మాటడుగుతాను… నిజం చెప్తారా?

సుదర్శనం : అదేంటి సుమతి! అలా అడిగావు! నీకేనాడైనా అబద్ధం చెప్పానా?

సుమతి : అయితే! ఇందాక మీరు కళ్ళనీళ్ళు పెట్టుకోవడం నేను చూశాను! అందుకు బాబుకు చెప్పిన కారణం నిజమేనా?

సుదర్శనం : ఇన్నేళ్ళు నాతో కలిసి కాపురం చేసినదానివి… నా మనసులోని భావాలను నువ్వు పసిగట్టలేవని నేనెలా అనుకుంటాను! నువ్వూహించింది నిజమే!

సుమతి : అయితే… అసలు కారణం ఏంటో నాకిప్పుడు చెప్పండి!

సుదర్శనం : అలాగే సుమతి… చెప్తాను! ఇరవై సంవత్సరాల క్రితం… ఆ రోజు ఉదయాన్నే నేను ఆఫీసుకు బయలుదేరాను. అప్పుడే… బయటినుండి, హుషారుగా, సంతోషంగా వచ్చిన బాబు…

(గతంలోకి).

***

ఆనంద్ : అమ్మా! నాన్నగారూ! చెల్లీ! అందరూ రండి!! (ముగ్గురూ వస్తారు) నేను ఎం.సి.ఎ. ఫస్ట్ క్లాస్‍లో పాసయ్యాను! (సంతోషంగా అరుస్తూ చెప్తాడు)

ఆమని : ఓ! కంగ్రాచ్యులేషన్స్ రా అన్నయ్యా!!

ఆనంద్ : థాంక్స్ చెల్లీ!

సుదర్శనం : కంగ్రాచ్యులేషన్స్ బాబూ!

సుమతి : చాలా సంతోషం బాబూ!

(ఆనంద్ తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాడు)

సుదర్శనం : ఆ! బాబూ! నాకు ఆఫీసుకి టైమవుతుంది…. సాయంత్రం పెందలాడే వస్తాను… నలుగురం కలిసి బయటికెళ్ళి డిన్నర్ చేద్దాం! ఓకేనా!

ఆనంద్ : సరే నాన్నగారూ!

సుదర్శనం : నేను బయలుదేరుతాను! (బయటికెళ్తాడు)

ఆనంద్ : అమ్మా! నేను కూడా అలా బయటికెళ్ళొస్తాను! మా ఫ్రెండ్స్ అందర్నీ కలిసి వస్తాను! కుదిరితే అందరం కలిసి లంచ్ బయటే చేస్తాము!

సుమతి : అలాగే బాబు! డబ్బులేమైనా కావాలా?

ఆనంద్ : అక్కర్లేదమ్మా! నా పాకెట్ మనీ ఉందిలే! సరిపోతుంది! మరి నే వెళ్ళిరానా?

సుమతి : వెళ్ళిరా…! బాబు. రాత్రికి మనం డిన్నర్‍కి బయటికెళ్తున్నాం గుర్తుందిగా… కాస్త తొందరగా వచ్చేయ్!

ఆనంద్ : అలాగేనమ్మా! (బయటికెళ్తాడు)

ఆమని : అమ్మా! మరి నేనూ…. కాలేజీకెళ్ళొస్తాను!

సుమతి : అలాగేనమ్మా! జాగ్రత్తమ్మా!!

ఆమని : సరేలే! (బయటికెళ్తుంది)

(తనలో తాను నవ్వుకుంటూ/తలుపేసుకుని, వంటగదిలోనికి వెళ్తుంది సుమతి)

(అనుకున్నట్లే ఆ రోజు రాత్రి అందరూ బయటికెళ్ళి డిన్నర్ చేసి కొంచెం లేటుగా ఇంటికొస్తారు…. మరుసటిరోజు ఉదయం అందరూ నిద్రలేచి ఎవరి పనుల్లో వాళ్ళుంటారు… అప్పుడే ఆనంద్ జిమ్ నుండి వస్తాడు)

***

సుదర్శనం : బాబూ!

ఆనంద్ : ఏంటి నాన్నగారూ!

సుదర్శనం : నీకో ముఖ్యమైన విషయం చెప్దామనుకుంటున్నాను…!

ఆనంద్ : చెప్పండి నాన్నగారూ!

సుదర్శనం : ఇప్పుడు నువ్వొక పోస్ట్ గ్రాడ్యుయేట్‍వి! ఈ రోజు నుండి ఒక్క సంవత్సరంలోపు, నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి! అది చిన్నదా… పెద్దదా…. అనేది నాకనవసరం! ఉద్యోగం సంపాదించాలి… అంతే! నీ కాళ్ళమీద నువ్వు నిలబడాలి! ఈ రోజునుండి, ఒక్క సంవత్సరం తరువాత నీకు నానుండి ఎలాంటి సహాయం అందదు… ఆర్థికంగా కూడా….! ఎలా ఉద్యోగం సంపాదించాలా అని… నువ్వే ఆలోచించుకో!!

ఆనంద్ : (తండ్రి వద్దనుండి కలలో కూడా ఊహించని ఆ మాటలకు, ఖంగుతిన్న ఆనంద్, బాధతో తలదించుకుని విసురుగా, తన రూమ్‍లోకి వెళ్తాడు)

సుమతి : (అప్పుడే అక్కడికి వస్తూ) ఏంటండీ… బాబూ అలా బాధపడుతూ వెళ్ళాడేంటి?

సుదర్శనం : (ఆనంద్‍తో తను చెప్పిన మాటలను పూసగుచ్చినట్లు చెప్తాడు) అదీ జరిగింది!

సుమతి : అలా ఎలా అన్నారండీ! వాడి రిజల్టు వచ్చి కేవలం రెండురోజులయింది. అంతలోనే… వాడితో అలా చెప్పాల్సిన అవసరమేమొచ్చింది మీకు? ఏది ఏమైనా… మీరు తప్పుచేశారండి!

సుదర్శనం : నా ఉద్దేశం అది కాదు సుమతీ!

సుమతి : మీ ఉద్దేశం ఏదైనా… మీరు అలా చెప్పి ఉండల్సింది కాదు… దేనికైనా ఓ సమయం సందర్భం ఉండాలి కదా!

సుదర్శనం : సరేలే! ముందు వాడి దగ్గరికెళ్ళి… ఎలాగొలా సముదయించు!

సుమతి : మీరు చేసిన నిర్వాకానికి… మరి నాకు తప్పుతుందా! (రుసరుసలాడుతూ ఆనంద్ దగ్గరికెళ్ళింది. కళ్ళు మూసుకుని, స్టడీ టేబిల్ దగ్గర కూర్చుని బాధతో కుమిలిపోతున్న, ఆనంద్ తలపై చేయి వేసి, ప్రేమగా నిమురుతూ) చూడు బాబూ! మీ నాన్నగారు నాకంతా చెప్పారు! నువ్వు బాధపడడంలో అర్థం వుంది! నేను కాదనను! కాని, నాన్నగారు ఏ ఉద్దేశంతో అలా అన్నారో అని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా… నాన్నా!!

ఆనంద్ : ఏంటమ్మా అర్థం చేసుకునేది! నాన్నగారు అలా అంటారని నేనసలు ఊహించనేలేదు! అవున్లే నన్నంటే అనగలిగారు గాని, చెల్లిని అలా అనగలరా? మొదటినుండి నన్ను, చెల్లిని మీరు వేరుగానే చూస్తున్నారు!!సుమతి : అలాంటిదేమీ లేదు బాబూ! మీరిద్దరూ మాకు రెండు కళ్ళలాంటివారు… ఏ ఒక్క కన్నుకు బాధకలిగినా మేము తట్టుకోలేము!! అవును… నిజమే…. నువ్వు చెప్పినట్లే, చెల్లితో మేము అలా చెప్పలేము… ఎందుకో తెలుసా?

ఆనంద్ : నాకెలా తెలుస్తుంది?

సుమతి : చెల్లి… వచ్చే సంవత్సరానికి డిగ్రీ పూర్తి చేస్తుంది! ఆ తరువాత దానికి పెండ్లి చేయాలి! అత్తారింటికి పంపాలి! మహా ఉంటే మన ఇంట్లో, మనతో మరో రెండు మూడు సంవత్సరాలుంటుంది! ఆ తరువాత అత్తగారింటికి వెళ్ళాల్సిందే! అప్పుడు తను మనకు దూరమవుతుంది. తన ఊరు మారుతుంది. తన వీధి మారుతుంది. తన ఇల్లు మారుతుంది. తన గోత్రనామం మారుతుంది. హు… కొత్త బంధువులు, కొత్త స్నేహితులు…

ఆనంద్ : అవునమ్మా! చెల్లి విషయంలో నువ్వు చెప్పింది నిజమేనమ్మా!! నేనలా ఆలోచించనే లేదు… వింటుంటే బాధగా వుందమా!!

సుమతి : ఉంటుంది బాబూ… ఉంటుంది! ఇంకో విషయం చెప్పనా! పెండ్లైన తరువాత తనని భర్త, అత్తామామలు, బావలు, మరుదులు, ఆడబిడ్డలు… ఎలా చూసుకుంటారో… అనే మనోవేదన… తల్లిదండ్రులను ఎప్పుడూ వెంటాడుతూనే వుంటుంది. (దుఃఖాన్ని దిగమింగుతూ) ఆ ఆవేదన మాకే కాదు… ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకు తప్పకుండా ఉంటుంది!!

ఆనంద్ : అవునమ్మా! నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా!!

సుమతి : ఇక నీ విషయానికొస్తే, నేను, నువ్వు, నాన్నగారు… మనం ఎప్పటికీ కలిసే వుంటాము! ఇక ఉద్యోగం విషయానికొస్తే… చెల్లిని ఉద్యోగం చేయించాలా… వద్దా… అనేది తనకు కాబోయే భర్త, అత్తామామల నిర్ణయంపై ఆధారపడి వుంటుంది! అందుకే… చెల్లి ఉద్యోగం విషయంలో మేము ఏమీ నిర్ణయంచలేము కదా బాబూ!!

ఆనంద్ : అవునమ్మా! నిజం!

సుమతి : ఇక నీ ఉద్యోగం విషయానికొస్తే… ‘ఉద్యోగం పురుషలక్షణం’ అన్నారు పెద్దలు! అందుకే నువ్వు ఉద్యోగం చేయాలి! అప్పుడే నువ్వు ఆర్థికంగా నీ కాళ్ళపై నువ్వు నిలబడగలవు… నీకు పెండ్లైన తరువాత నీ భార్యాబిడ్డలను నువ్వే పోషించుకోగలవు! అప్పుడు సంఘంలో నీకు గౌరవం వుంటుంది! విలువ ఉంటుంది! సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది!!

ఆనంద్ : అవునమ్మా!

సుమతి : అందుకే నాన్నగారు నువ్వు ఉద్యోగం చేయాల్సిన ఆవశ్యకతను నీకు తెలియజేసేందుకు అలా మాట్లాడారు… అంతేగాని, నీ మీద ప్రేమలేక కాదు! కాకపోతే, ఆ చెప్పిన మాటలు నీకు కొంచెం కఠినంగా అనిపించి వుంటాయి… అందుకే ఆ మాటలు నిన్ను అంతగా బాధపెట్టాయి! వాస్తవానికి, నాన్నగారు ఆ మాటలు నీ సంతోషకరమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, నీ మంచి కోసం చెప్పారు! అర్థం చేసుకోబాబూ!

ఆనంద్ : అమ్మా! నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది… నేను ఇప్పుడే నాన్నగారితో మాట్లాడతాను! పాపం, నాన్నగారిని నా ప్రవర్తన ఎంత బాధపెట్టి వుంటుందో కదా అమ్మా… పదమ్మా నాన్నగారి దగ్గరికెళ్దాం!

(ఇద్దరూ సుదర్శనం దగ్గరికి వస్తారు)

ఆనంద్ : నాన్నగారూ!

సుదర్శనం : ఏంటి బాబూ… నేనన్నమాటలతో ఇంకా బాధపడుతున్నావా?

ఆనంద్ : అమ్మ నాకు అంతా అర్థమయ్యేటట్లు చెప్పింది. నా ప్రవర్తన మిమ్మల్ని బాధపెట్టి వుంటుంది కదూ… నన్ను క్షమించండి నాన్నగారూ! (తండ్రి కాళ్ళకు నమస్కరిస్తాడు)

సుదర్శనం : లే బాబూ… లే! మొత్తానికి నన్ను అర్థం చేసుకున్నావ్… అంతే చాలు!

ఆనంద్ : నాన్నగారూ! రేపటినుండే నా ఉద్యోగాల వేట మొదలవుతుంది. యం.సి.ఏ. తో పాటు ఈవెనింగ్ కాలేజీలో చదివి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు పూర్తిచేసి “ఎడ్వాన్సడ్ డిప్లొమా ఇన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్” కూడా సాధించాను! ఆ విద్యార్హతలతో, ఆరు నెలలలోపే, నేను ఏదో ఒక ఉద్యోగం సాధించి తీరుతాను!

సుదర్శనం : యస్.. దట్ షుడ్ బి ది స్పిరిట్…. ప్రొసీడ్! ఆల్ ది బెస్ట్!!

ఆనంద్ : థాంక్యూ నాన్నగారు! (తన రూంలోకి వెళ్తాడు)

సుదర్శనం : (సుమతి వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ) సుమతీ… థాంక్యూ వెరీమచ్!

సుమతి : ఊరుకోండి మీరు మరీనూ! పిల్లలకు వివరంగా చెప్తే అర్థం చేసుకుంటారండీ!!

సుదర్శనం : అవును సుమతీ… నాకూ అర్థమైంది!

***

(ఆరునెలలు గడిచాయి… ఒకరోజున)

***

ఆనంద్ : నాన్నగారూ! మీకు ఓ మంచి శుభవార్త చెప్దామని మూడురోజుల నుండి చూస్తుంటే…. ఇవాళ్టికి దొరికారు!

సుదర్శనం : అవునా! అయితే ఇప్పుడు చెప్పు బాబూ! (అప్పుడే సుమతి, ఆమని అక్కడికి వస్తారు)

ఆనంద్ : నాకు మంచి ప్యాకేజీలతో మూడు కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చాయ్!

ఆమని : కంగ్రాచ్యులేషన్స్ రా! ఏది ఏమైనా యు ఆర్ వెరీ గ్రేట్ రా అన్నయ్యా!!

ఆనంద్ : అది నీకు నామీద ఉన్న అభిమానం చెల్లీ! ఎనీ హౌ థాంక్యూ వెరీమచ్!!

సుదర్శనం : ఓ… వెరీగుడ్ న్యూస్… కంగ్రాచ్యులేషన్స్ బాబూ!

సుమతి : చాలా సంతోషం బాబూ!

ఆనంద్ : మీ ఇద్దరి ఆశీర్వాదాల వల్లనే, నాకు మూడు మంచి ఉద్యోగాలొచ్చాయ్!

సుదర్శనం : మరి… ఏ కంపెనీలో జాయిన్ అవుదామనుకుంటున్నావు బాబూ!

ఆనంద్ : ఆ విషయంలోనే మీ సలహా కావాలి నాన్నగారు! మొదటిది బెంగుళూరులో, రెండోది హైదరాబాద్‍లో, మూడోది మద్రాసులో…

సుదర్శనం : ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏమీలేదు బాబు! ఇక్కడ నువ్వు చూసుకోవాల్సింది ఎంత ప్యాకేజీ అని కాదు… ఏ ఉద్యోగంలో చేరితే నీ కెరీర్ డెవలప్‍మెంటుకు ఉపయోగపడుతుందో చూసుకోవాలి! నీకింకేదైనా ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఉంటే, ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ఏ ఉద్యోగం సహకరిస్తుందో ఆలోచించుకోవాలి! అంతే!!

ఆనంద్ : అర్థమయింది నాన్నగారూ! నేను ఒక పది సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి, ఆ తరువాత సొంతంగా… నేనే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను! తద్వారా నా జీవితంలో నేను ఒక ఉన్నతస్థాయికి చేరుకోడమే కాకుండా…. పదిమందికీ ఉద్యోగాలిచ్చి ఉపాధి కల్పిద్దామనుకుంటున్నాను! అదే… నా లక్ష్యం!!

సుదర్శనం : చక్కటి ఆలోచన బాబు… ఇక ఆలస్యం దేనికి? నీ లక్ష్యాన్ని చేరుకునేందుకు అనువైన కంపెనీ ఏదో నిర్ణయించుకుని, ఆ కంపెనీలో చేరు బాబూ!

ఆనంద్ : భవిష్యత్తులో నా లక్ష్యం నెరవేరాలి అంటే, బెంగుళూరు కంపెనీయే సరైంది నాన్నగారూ!

సుదర్శనం : మరింకేం… బెంగుళూరు కంపెనీలోనే జాయిన్ అవ్వు బాబూ!

ఆనంద్ : అలాగే నాన్నగారు…. అయితే ఈ రోజే ఆ మద్రాసు, హైదరాబాదు కంపెనీలకు నేను చేరలేకపోతున్నట్లు తెలియజేస్తాను. అలాగే బెంగళూరు కంపెనీకి నా అంగీకారాన్ని తెలియజేస్తాను!!

సుదర్శనం : వెరీగుడ్! ఆల్ ది బెస్ట్ బాబూ!!

సుమతి : ఏమైతేనేం… మన బాబు సాధించాడండీ! మీరు సంవత్సరం టైం ఇస్తే, ఆరునెలల్లోనే చేసి చూపించాడు… చూశారుగా… మన బాబంటే ఏమనుకున్నారు మరి!!

(అంటూ ఆనంద్ వైపు గర్వంగా చూస్తుంది)

(వర్తమానంలోకి)

సుదర్శనం : అదీ విషయం సుమతి! ఆ రోజు బాబుతో నేను అన్న కఠినమైన మాటలు, నాకు ఎప్పుడూ గుర్తొస్తుంటాయ్! అవి గుర్తొచ్చినప్పుడల్లా… నా గుండెను ఎవరో పిండేసినట్లనిపిస్తుంది!!

సుమతి : అంటే…. అప్పుడెప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం మీరు మాట్లాడిన మాటలను ఇంకా గుర్తుచేసుకుంటూ, ఇప్పటికీ బాధపడుతున్నారా?!

సుదర్శనం : అవును సుమతి! నిజానికి, నాలాగా అంత కర్కశంగా ఏ తండ్రైనా తన కొడుకుతో మాట్లాడతాడా!! అలాంటి తప్పు నేను చేశాను! ఆ రోజు నా మాటలకు బాబు ఎంత బాధపడి వుంటాడో, నా గురించి ఎంత చెడ్డగా అనుకుని వుంటాడో.. అని తలచుకుంటే చాలా బాధనిపిస్తుంది! కళ్ళంట నీళ్ళు కారుతాయి సుమతి! ఈ రోజు నువ్ చూసిన, చూస్తున్న కన్నీళ్ళు కూడా అవే!

(కళ్ళనీళ్ళు తుడుచుకుంటాడు)

సుమతి : ఏంటండీ… ఏడుస్తున్నారా!! మీరు మరీనూ… విడ్డూరం కాకపోతే… ఆ తరువాత అంతా మంచే జరిగింది కదా! మీరు బాధపడాల్సిన అవసరమేముంది?

సుదర్శనం : ఏమిటో సుమతి… గుర్తొచ్చినప్పుడల్లా ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా, నా వల్ల కావట్లేదు….!

సుమతి : అయితే సరే! నేనొక విషయం చెప్తాను వింటారా?

సుదర్శనం : అయ్యో… వినకపోవడమేంటి? చెప్పు సుమతి!

సుమతి : మొన్ననే… ఆగష్టు 15… భారతదేశ 74వ స్వాతంత్ర దినోత్సవం రోజున మన దేశప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు ఢిల్లీలోని ఎర్రకోటపై మన జాతీయ జెండా ఎగురవేసిన తరువాత, జాతినుద్దేశించి ప్రసంగించారు… ఆ ప్రసంగంలో యువతకు ఆయన ఒక చక్కని సందేశాన్ని అందించారు!

“25 సంవత్సరాలు పైబడిన బిడ్డలు, కన్న తల్లిదండ్రులపైన ఆధారపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలి!” అని. ఆ రోజు టి.వీలో మీరూ చూశారుగా!

సుదర్శనం : ఆ…ఆ! చూశాను సుమతీ!

సుమతి : ఆ సందేశాన్ని బట్టి మీకేమర్థమయింది?

సుదర్శనం : అదీ నువ్వే చెప్పు సుమతి!

సుమతి : మన ప్రధానిగారు, ఇప్పుడు యువతకు చెప్పిన మాటలనే… 20 సంవత్సరాల క్రితం మీరు మీ అబ్బాయికి చెప్పారు.. అంతే!

సుదర్శనం : అవును… నిజమే సుమతి!

సుమతి : మరి… ఇకపై మీరు బాధపడడం ఆపేస్తారా లేక ఇకముందు కూడా ఇలాగే బాధపడుతూ వుంటారా?

సుదర్శనం : మంచిదానివే… నువ్వింత వివరణాత్మకంగా చెప్పిన తరువాత కూడా, నేనింకా బాధపడతానా… నో… వే! ఇకపై బాధపడనే పడను!!

సుమతి : చాలా సంతోషమండి!

(ఆఫీసుకి బయలుదేరిన ఆనంద్, అప్పుడే అక్కడికి వస్తాడు)

ఆనంద్ : ఆ! నాన్నగారు! నేను ఆఫీసుకెళ్తున్నాను…. గుర్తుందిగా…. మీరు పదకొండు, పదకొండున్నర మధ్య ఆఫీసుకొచ్చేయండి… ఏంటి వస్తున్నారుగా!

సుదర్శనం : ఆ…ఆ…! తప్పకుండా వస్తాను బాబూ!!

(ఆనంద్ ఆఫీసుకు బయలుదేరాడు… సుదర్శనం తన గదిలోకి వెళ్తాడు… సుమతి…. మామూలే… తలుపేసుకుని… వంటగదిలోకి వెళ్తుంది….)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here