సత్యాన్వేషణ-25

0
3

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]ఆ[/dropcap]యన కేరళలోని కాలడిలో నంబూద్రీ బ్రాహ్మణులైన శివగురువులు, ఆర్యాంబలకు జన్మించారు. వైశాఖ శుద్ధ పంచమి నాడు, పునర్వసు నక్షత్రములో జన్మించారు. సంవత్సరము గురించి వాదోపవాదాలు వున్నాయి. 780 – 800 మధ్యన ఒక సంవత్సరమని చరిత్రాకారులు అంగీకరించారు. చాలా చిన్నతనములో తండ్రిని కోల్పోతారు. ఆయన బాలమేధావి. తల్లి ఉపనయనము కావించి గురుకులముకు పంపుతుంది. చాలా చిన్న వయస్సులో వేదాలను, వేదాంగాలను సాంగోపాంగముగా నేర్చుకుంటారు. భిక్షకు వెడితే పేద బ్రాహ్మణ స్త్రీ చిరిగిన వస్త్రాలతో శరీరము కప్పుకు తిరుగుతూ ఏమీ ఇవ్వలేక వుసిరి కాయ భిక్షగా వేస్తుంది. ఆమె స్థితికి హృదయము ద్రవించిన శంకరులు ‘కనకధారాస్తవము’ ఆశువుగా చదివితే బంగారు వుసిరికాయలు వర్షంలా కురిశాయట.

తల్లి పూర్ణానదికి వెళ్ళలేకపోతే ఆయన నదిపాయ ఒకటి ఇంటి వైపుకు మరలుస్తారు. కేరళరాజు సన్మానిస్తానంటే బ్రహ్మచారులకు తగదని తిరస్కరిస్తారు. తొమ్మిదవ ఏట చెరువులో ముసలి పట్టుకుందని చెప్పి సన్యాసము తీసుకుంటారు. తల్లి సంసారములోకి లాగుతున్నదని చెప్పి ఒక మొసలి మాయను సృష్టించారు శంకరులు. తను అల్పాయిష్కుడని, సన్యాసము తీసుకుంటే మరో జన్మ క్రిందికి వస్తుందని కాబట్టి సన్యాసానికి వప్పుకోమని తల్లిని వప్పిస్తాడు.

హిందూమత దుస్థితి చూచి కర్తవ్యపాలనకు పూనుకుంటారు. బౌద్ధ, జైన మతాల తాకిడి, చార్వాక భౌతికవాదము, నాస్తికవాదము ప్రచారములోకి వచ్చాయి. కర్మకాండలకు ప్రాధాన్యత హెచ్చి, జ్ఞానానికి తగ్గింది. కాపాలికాది దుష్ట సంప్రదాయము ప్రబలి మూఢనమ్మకాలతో బలులతో ప్రజలు విసిగిపోతున్నారు. అవి ఆనాటి సవాళ్ళు. హిందూ మతాన్ని సంస్కరించటమూ, జ్ఞానమార్గములోకి నడపటమూ, తన వాదనా ఫటిమతో ఖండించటమూ చెయ్యాలి. ముందుగా గురువును వెతుకుతూ నర్మదా తీరము వెడతారు.

నర్మదా తీరములోని ఒక గుహలో శ్రీ గోవిందపాదుల ఆశ్రమము చేరుతారు. ముమ్మారు ఆశ్రమము చుట్టూ ప్రదక్షిణ చేసి శిష్యునిగా స్వీకరించమని ప్రార్థిస్తాడు శంకరులు. ‘నీవెవరు’ అని గురువు అడిగిన ప్రశ్నకు తాను పంచభూతములూ కానని, కేవల ఆనంద స్వరూపుడనని చెబుతారు. అద్వైతి యని సంతోషించి గురువు శిష్యునిగా చేర్చుకుంటారు. గురువు చేత బ్రహ్మసూత్ర భాష్యాల మహావాక్యాల విశేషార్థాలను చెప్పించుకుంటాడు. నర్మదకు వరద వస్తే, జలాకర్షణ మంత్రముతో తన కమండలములోకి నీరంతా చేర్చి తరువాత వదులుతారు శంకరులు.

గురువు ఆజ్ఞ పై కాశీకి వెళ్ళి బ్రహ్మసూత్రభాష్యాలు రాయటము మొదలు పెడుతారు. అక్కడ ఆయనకు శిష్యులు రావటము మొదలవుతుంది. నర్మదా నదిని కమండలములో పట్టిన వాడే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాస్తాడన్న వ్యాసులవారి మాటను నిజము చేస్తారు శంకరులు. ఒకనాడు గంగకు వెడుతుంటే చండాలుడు ఒకడు అడ్డు వస్తాడు. ‘ప్రక్కకు తప్పుకో’ అంటారు శంకరులు.

‘నన్నా నాలోని ఆత్మనా’ ప్రశ్నిస్తాడా చండాలుడు. అధ్వైతము బోధిస్తున్నా తను పూర్తిగా పాటించటము లేదని తప్పు గ్రహించి అతనికి పాదాభివందనము చేస్తారు శంకరులు. ఆ సందర్భములో ‘మనీషాపంచకము’ చెబుతారు.

“అన్నమాయదన్నమాయ మథవా చైతన్యమేవ చైతన్యాత్।
యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛగచ్ఛేతి॥”

ఒకనాడు వృద్ధ బ్రాహ్మడు వచ్చి భాష్యాలను చూచి పరీక్షిస్తాడు. ఆయనే వేదవ్యాసుడని గ్రహిస్తారు శంకరులు. “భాష్యం సమగ్రంగా వుంది” అని దీవిస్తాడు వ్యాసుడు.

ప్రయాగలో కుమారభట్టు అగ్నికి అహుతి కావడము చూస్తారు శంకరులు. భట్టు సూచనతో మండన మిత్రునితో వాదించి మీమాంస తత్త్వాన్ని ఖండిస్తారు. ‘బ్రహ్మ సత్యం, జగం మిథ్య’ అన్నది నిరూపిస్తారు. మండన మిత్రుని భార్య ఉభయభారతి కామశాస్త్రంపై ప్రశ్నిస్తే, ఒక రాజు శరీరములోకి పరకాయ ప్రవేశము చేసి వచ్చి సమాధానము ఇస్తారు. మండనమిత్రుడు ఓడానని సన్యాసము స్వీకరించి ‘సురేశ్వరాచార్యులని’ సన్యాసనామముతో శిష్యుడై శంకరులను అనుసరిస్తాడు.

కపాలిలు శంకరుని హతమార్చటానికి కుట్ర పన్నితే, నృసింహస్వామిని ప్రార్థిస్తాడు శిష్యుడైన పద్మపాదులు. ఆ కపాలి వక్షము చీల్చి చంపేస్తాడు నరసింహస్వామి. పద్మపాదులు, శంకరులకు అనుంగశిష్యుడు.

మూకాంబికలో ఒకరింట వారి మూగ పుత్రుడు వింతగా ప్రవర్తిస్తూ వుంటే శంకరులు వానిని, చూచి అతనికి ఆత్మజ్ఞానము కరతలామలకమని అతనిని ఉద్ధరించ శిష్యునిగా చేర్చుకుంటారు. అతనే హస్తామలకుడు.

ఒకచోట ప్రసవించబోయే కప్పకు వాన నుంచి గొడుగు పట్టే పామును చూచి ఆ ప్రదేశము మహిమాన్వితమని అక్కడ ఒక మఠము స్థాపిస్తారు. అదే శృంగేరి లోని శారదామఠము.

అతి కష్టమైన తోటకావృత్తములో గురువైన శంకరులను శృతించిన శిష్యుడు తోటకాచార్యులుగా ప్రసిద్దికెక్కారు. ఆయన శంకరుల మరో అనుంగు శిష్యుడు.

ఇలా పద్మపాదుడు, సురేశ్వరాచార్య, తోటకాచార్యులు, హస్తామలకుడు అన్న నలుగురు ప్రధాన శిష్యులు ఏర్పుడుతారు. శంకరులు జ్ఞాన మార్గాన్ని చెబుతూ నిర్గుణోపాసన చెబుతూనే, సగుణోపాసనకు అనుకూలముగా పంచాయతన పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు. అలా ఆయన షణ్మతస్థాపనాచార్యులు అయ్యారు. కైలాసము నుంచి స్ఫటిక లింగాలను తెచ్చి చిదంబరములో స్ఫటికలింగము, కేదారములో ముక్తిలింగము, నేపాలు నీలకంఠములో వరలింగము, కంచిలో యోగలింగము, శృంగేరిలో భోగలింగముగా ఏర్పాటు చేశారు. శ్రీశైలములో కొన్నిరోజులు తపస్సు చేశారు. అక్కడే ఆయన సౌందర్యలహరి రచించారని అంటారు.

శృంగేరిలో వుండగా తల్లికి ఆఖరి ఘడియ వచ్చినది గ్రహించి యోగశక్తితో తల్లి వద్దకు వెళ్ళి ఆమె మరణించిన తరువాత యోగాగ్నిలో ఆమెను దహనము చేసి వెనకకు వస్తారు. శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యులను పీఠాధిపతిగా చేస్తారు. ద్వారకలో ఒక మఠము ప్రతిష్ఠించి హస్తామలకుణ్ణి పీఠాధిపతిని చేస్తారు. పూరీలో గోవర్ధన మఠము స్థాపించి పద్మపాదుణ్ని పీఠాధిపతిని చేస్తారు. జ్యోషిమఠములో మరో మఠము స్థాపించి తోటకాచార్యుణ్ణి పీఠాధిపతిని చేశారు. ఇలా దేశము నాలుగు దిక్కులా నాలుగు మఠాలు స్థాపించి హైందవాన్ని కట్టుదిట్టం చేశారు. బదిరిలో నారాయణ సాలిగ్రామము గంగలో మునిగి వుంటే బయటకు తీసి పునఃప్రతిష్ఠించి దానికి పూజావిధులకు నంబూద్రి బ్రహ్మలను నియమించారు. ఇలా దేశ సమైక్యతను చాటారు. కాశ్మీరు చేరి అభినవగుప్తుడిని ఓడించి, సర్వజ్ఞ పీఠాన్ని దక్షిణ ద్వారాము గుండా ప్రవేశించి పీఠాన్ని అధిరోహించారు.

బదిరిలో బదిరీనాథున్ని సేవించి కేదారములో కేదారనాథున్ని సేవించి హిమాలయాలలోకి వెళ్ళిపోయారు. నాలుగు మఠాలను స్తాపించిన విషయము, మహా మేధావి, కవి ప్రస్థాన త్రయానికీ బ్రహ్మసూత్రాలకూ భాష్యం రాశారని సర్వులూ అంగీకరిస్తారు. శంకరులు అతి చిన్న వయస్సులో అనేకసార్లు దేశము నలుమూలలా తిరిగారు.

ప్రస్థాన త్రయము అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులూ, భగవత్గీత మీద భాష్యాలు అద్వైత పరంగా చెప్పారు. ఉపనిషత్తులన్ను పరావిద్య అంటారు. పారమార్థి సత్యాన్ని దర్శింపచేస్తాయి కాబట్టి.

వివేకచూడామణిని, ఆత్మభోద వంటివి రచించారు.అద్వైత సిద్ధాంతాలను క్రోడీకరించి అందించారు.

శంకరులు మహామేధావి, కవి, పండితులు. అత్యల్ప కాలములో అనేక రచనలు చేశారు. భాష్యగ్రంథాలు 23, ఉపదేశ గ్రంథాలు 54, స్త్రోత్రాలు 76, మొత్తము 153. ఇవ్వన్నీ ఆయన తన 32 సంవత్సరాలలో రాశారు. అదీ దేశము నలుమూలలా తిరుగుతూ, వాదనలు చేస్తూ, హైందవాన్ని పటిష్ఠము చేస్తూ. ఇది సామాన్య మానవుల వల్ల అయ్యేది కాదన్నది నిజము. ఆయన రాసినవి చదవటానికే మనకు ఒక జీవితకాలము సరిపోదు.

దశోపనిశత్తు మీద, భగవద్గీత మీద, బ్రహ్మసూత్రాల మీద సమగ్రమైన వ్యాఖ్య వ్రాసినది శంకరులు ఒక్కరే.

‘జన్తూనాం నరజన్మ దుర్లభమతః’ అంటారు శంకరులు. వివేకచూడామణి అత్యంత క్లిష్టమైన తార్కికమైన గ్రంధము. అలాంటి తార్కిక గ్రంధము మరోటి సాహిత్యములో లేదన్నది నిజం. భజగోవిందమన్న ‘మోహముద్గరముగా’ ప్రఖ్యాతి చెందినది.

కురుతే గంగాసాగారగమనం
వ్రత పరిపాలన మథవా దానం।
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన॥ 17॥

భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం.

నేడు మనము రోజూ చేసుకుంటున్న నిత్య పూజా విధానము శంకరులు కూర్చినదే. అదే విధముగా మన దేవీ దేవతా స్తోత్రములు కూడా. అందులో అత్యంత ఉత్తమమైనది సౌందర్యలహరి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here