కలవరపరిచే “మీల్”

1
3

[dropcap]ఈ[/dropcap] రోజు పదకొండు నిముషాల లఘు చిత్రం “మీల్”. విశేషం ఏమిటంటే ఇందులో సంభాషణలు లేవు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే చిత్రం. షూట్ చేసింది మాత్రం కేవలం ఇంటి లోపలే. దేశంలో జరుగుతున్నవి బయట సాగుతున్న ఊరేగింపుల కేకల ద్వారా, టీవీ వార్తల ద్వారా తెలుస్తుంది. ఒక కుటుంబం అంటే ఒక మైక్రోకాజం కదా. ఆ కుటుంబానికి ఏ ఏ ఆప్షన్లు మిగిలాయి?
భార్య రత్నాబలి భట్టాచార్జీ (పాత్రలకు పేర్లు లేవు) వంటగదిలో గేస్ పొయ్యి ముందు నిలబడి వుంది.ఆమె ముఖం పై దెబ్బలు తగిలిన వాపు, కమిలిపోయిన చర్మము దేనికో సాక్ష్యం చెబుతున్నట్టు. ఒక పొయ్యి మీద కుక్కరు, మరోదాని మీద మూత పెట్టిన కడాయిలో ఏదో. కుక్కర్ లో ప్రెషర్ పెరుగుతున్నట్టే ఆమె లోనూ ఆవేశం, కోపం, నిస్సహాయత్వం, ఉక్రోషం పెరుగుతున్నాయి, ఆమె వేగంగా తీసుకుంటున్న ఊపిరులు, తీక్షణంగా ఒకే చోట చూస్తున్న చూపుల సాక్ష్యంగా. కుక్కర్ కైతే ప్రెషర్ ఒక స్టేజికొచ్చాక కూత పెట్టి బరువు దించుకుంటుంది. ఇదే పూర్తిగా రెండు నిముషాల సీను.
ఇప్పుడు రెండు గదుల మధ్య గోడకు ఇవతల నుంచీ ఒక షాట్. ఒక గదిలో కొంత సర్దిన సామాను. కోపంగా వున్న భర్త ఆదిల్ హుస్సేన్ కాలు గాలిన పిల్లిలా తిరుగుతుంటాడు. కోపంగా పడుతున్న అడుగులు, అడ్డం వచ్చిన దాన్నల్లా తన్నడం అతని కోపాన్ని ప్రకటిస్తాయి. పక్క గదిలోకెళ్ళి బీరువా మీద నుంచి ఒక సూట్ కేస్ తెచ్చుకుని సామాను అందులో కుక్కుతాడు. బీరువా ఇవతలే అతని తండ్రి అరుణ్ ముఖోపాధ్యాయ కుర్చీలో పూర్తిగా వొంగిపోయి కూర్చుని వున్నాడు. వయోవృధ్ధుడు. దారికడ్డంగా వున్నాడు. రెండో సూట్‌కేస్ తెస్తున్నప్పుడు అక్కడున్న మంచినీటి గ్లాసును తన్నేస్తాడు ఆదిల్. ఇంతకీ ఇదంతా దేనికి? ప్రయాణమా? ఎక్కడికి? సరదా ప్రయాణాలకైతే ఇల్లంతా ఇంత బీభత్సంగా వుండదు కదా. ఆదిల్ అరచేతికి కట్టు కట్టి వుంది. రక్తం మరకలున్నాయి. పెద్దాయన నిస్సహాయత్వం. గడ్డం మీద ఎంగిలి, తుడుచుకోలేడు. నోరు కొంచెం వంకర పెడతాడు. బహుశా మాట్లాడనూ లేడేమో. బయట ఏదో ఊరేగింపు వెళ్తోంది. భారత్ మాతా కీ జై; నరేంద్ర మోదీ కీ జై; మాతో పెట్టుకోవాలని చూస్తున్నవారు తస్మాత్ జాగ్రత్త; వార్నింగు ఇది; మా పార్టీ కి జై. ఈ నినాదాలు వినిపిస్తున్నాయి. సూట్‌కేస్‌తో పాటే తండ్రి ఎదుట వున్న మంచం మీద కూలబడి తల దించేసుకుంటాడు ఆదిల్. కొడుకు వైపు చూస్తూ ఏదో మాట్లాడ బోయి మాట్లాడ లేక తన స్పందన ని కూర్చున్న చోటే ఉచ్చ పోయడం ద్వారా వ్యక్త పరుస్తాడు ఆ పెద్దాయన. బయట కొడుకు అవిషేక్ జైన్ చెల్లా చెదురుగా పడి వున్న గాజు ముక్కలను తీస్తూ వుంటాడు. వంటగదిలో చూస్తే తల్లి రొట్టెలు కాలుస్తోంది. మరో గదిలో తండ్రి, తాత ముందు కూర్చుని వున్నాడు. ఆదిల్ లేచి ఆ తలుపు సగం మూస్తాడు. ఆ అబ్బాయి ఎత్తుతున్న గాజు ముక్కలన్నీ కింద పడి విరిగిన గోడ గడియారానివి. గడియారం ఇంకా పని చేస్తూనే వుంది. ఒక ప్రభావవంతమైన సింబల్.

టీవీ లో వార్తలు పిల్లల పరీక్షలు మొదలైనట్టు. మరో వార్త ఎక్కడో జరిగిన దొమ్మీలో కొంతమంది మరణించారని తెలుపుతుంది. కొడుకు యూనిఫారంతో తయారుగా వున్నాడు. తన బేగ్ లోంచి పరీక్షల అట్ట తీసి దాని మీద అంటించి వున్న శివుని స్టిక్కర్ ను చించేస్తాడు. బడిలోనే కాదు, జీవితం లో కూడా ఇది పరీక్షా కాలం. అంత చిన్న పిల్లవాడికీ విషయాలు అర్థమవుతున్నాయి.
టీవీలో విలేఖరి మనుషులను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. కథా స్థలం కలకత్తా కావచ్చు, ఈశాన్య భారతం కావచ్చు, ఆ భాష స్పష్టంగా తెలీలేదు. ఒకామె బాధగా చెబుతోంది : 70 క్రితం ఇక్కడ ఉన్నట్టు పత్రాలు చూపించమంటున్నారు. మేము కార్మికులం. ఎక్కడి నుంచి తెస్తాము అలాంటి పత్రాలు? నేపథ్యంలో గుంపు కేకలు వినపడుతున్నాయి : చావనైనా చస్తాం గానీ పత్రాలు ఇచ్చేది లేదు అని.
వంట అయిపోయింది. ఆమె గిన్నెలన్నీ భోజనం బల్ల మీద సర్దుతుంది. భోజనానికి కూర్చుంటారు ఆమె, భర్తా, కొడుకూ నూ. టీవీలో బెంగాలీనో అస్సామీలోనో ఏదో వినిపిస్తోంది. ఇప్పుడు కెమెరా ఆ గదికీ, టాయ్లెట్ కీ మధ్య వున్న గోడ ఇవతలినుంచి రెంటినీ ఒకే ఫ్రేం లో చూపిస్తుంది. టాయ్లెట్ చాలా అశుభ్రంగా వుంది.
దీని తర్వాత వచ్చేదే పతాక సన్నివేశం. అది మీరు సినిమాలో చూడాల్సిందే.
దర్శకుడు ఓ పాతికేళ్ళ కుర్రాడు. అభిరూప్ బాసు. తను చెప్పదలచినది స్పష్టంగానూ, చిత్రీకరణ చాలా వైవిద్యంగా, క్రియేటివ్ గానూ వున్నాయి ఈ చిత్రంలో. ఎంత పరిణతి. లఘు చిత్రాలు కొన్ని తీసాడు. ప్రాహా లో దర్శకత్వం లో పట్టా పొందాడు. ఈ చిత్రానికి కథా, స్క్రీన్‌ప్లే వ్రాసి, దర్శకత్వమూ ఎడిటింగూ తనే చేసాడు. దేశంలో రగులుతున్న ఓ సమస్యను సంభాషణలు లేకుండానే ఒక కుటుంబ సభ్యులందరి ముఖాల్లో ఆందోళనలద్వారా మనకు చూపిస్తాడు. అతని మిజాన్ సెన్ చూడండి. గది గోడల్లో అతి పురాతనమైన తెలుపు నలుపు లో వ్యక్తుల ఫోటోలు. కానీ పత్రాలెక్కడినించి తెస్తారు? ఆ క్షణాన్ ఆ ఇంట్లో తాత, తండ్రి, కొడుకు, పుట్టబోతున్న తమ్ముడో/చెల్లెలో వున్నారు. ఎవరికీ పేర్లు లేవు. వారు ఒక సంఖ్య మాత్రమే. చిందరవందరగా వున్న ఇల్లు, కానీ దేవుని గూడులో వెలుగుతున్న అగరొత్తులు. లేండ్ లైన్ ఫోను (ఐడెంటిటీ). ఒక మూలన ఓ పరుపును చుట్టి కట్టేసారు. హిందీలో బోరియా బిస్తర్ అంటారు. అంటే గోనె సంచీ, పడక వస్తువు (పరుపు లాంటిది, లేదా కేవలం దుప్పటి). ఈ ఫ్రేస్ అంతకంటే ఎక్కువ లేని వారనీ తెలుపుతుంది; తరిమేస్తే ఆ రెండూ తీసుకుని వెళ్ళిపోవాల్సిన అగత్యమూ కనిపిస్తుంది. తట్టా బుట్టా లాంటి పదబంధమిది. కాలం కింద పడి ముక్కలు ముక్కలు అయ్యి, చెల్లా చెదురుగా పడి వుండడం, ఇతర వస్తువులు కూడా చెల్లా చెదురుగా వుంటాయి మన దేశంలో ప్రస్తుత వాతావరణాన్ని బొమ్మ కడుతూ. దీనికి కెమెరామేన్ దీప్ మెట్కర్ ని మెచ్చుకోవాల్సిందే. ఇక సంభాషణలు లేనప్పుడు వినిపించే నేపథ్య సంగీతమూ, శబ్దాలూ మరింత సన్నిహితంగా మాట్లాడతాయి. ఆ నిశ్శబ్దాలు, ఆ din లాంటి చప్పుళ్ళూ చాలా చక్కగా కమ్యూనికేట్ చేస్తాయి. అందరి నటనా, మరీ ముఖ్యంగా ఆదిల్-రత్నాబలి లు, చాలా బాగుంది.
యూట్యూబ్ లో వుంది. తప్పక చూడండి.

https://youtu.be/CRgzvBACpZA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here