[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
[dropcap]హే[/dropcap]మాంగిని ఒకానొక రమ్యాతి రమ్యమైన పుష్పోద్యానవనంలో దించి వెళ్ళిపోయింది బాతు. అది ఏ లోకమో, అచట నున్నవారు దేవాంగనలో, నాగకన్యలో తెలియక, వారి ఆటపాటలను ఆశ్చర్యంతో తిలకించ సాగింది హేమాంగి. అంతలో ఆమె ఉనికిని గమనించిన కొందరు స్త్రీలు ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నారు.
నవరత్న ఖచిత సింహాసనంపై కోటి సూర్యుల కాంతితో మెరుస్తూ, శిరమున నాగపింఛము, ఉరమున విష్ణు పాద చిహ్నములు, నడుమున వేలాడుతున్న కరవాలము ఉన్న వారి మహారాణి మంజుషాదేవి ముందు హేమాంగిని హాజరుపరిచారు. “నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చా”వని అధికారస్వరంతో అడిగిన మంజుషా దేవికి తన కథను క్లుప్తంగా విన్నవించుకుంది హేమాంగి. శివ స్వాముల వారి ధర్మమా అని పక్షి రూపం నుండి మానవ రూపం పొంది, తన మనోహరుడు మైనాకుని వెతుకుతూ ఇక్కడకు వచ్చినట్లు చెప్పింది.
‘శివస్వాములవారి పంపున వచ్చినావు కనుక మాకు అతిథివి’ అని పలికి, అక్కడ ఉన్న చెలికత్తెతో ఒక బంగారు పాత్రలో తెచ్చిన పానీయమును ఆమెకిచ్చింది. అమాయకంగా దాన్ని అందుకొని ఆ మధుర పానీయము స్వీకరించింది హేమాంగి. దానివల్ల తన గతాన్ని, తనను తానే పూర్తిగా మర్చిపోయింది.
గట్టిగా నవ్వుతూ “నేనెవరిని” అని ప్రశ్నించింది మంజూషాదేవి.
“ఏమో నాకు తెలియదు” అన్నది హేమాంగి.
“నీవు ఎవరివి? నీ పేరేమిటి ?”అన్నది.
“క్షమించాలి. నా పేరు గుర్తు లేదు” అన్న హేమాంగితో “నేను చెప్తాను. నీ పేరు ‘మందమతి’. నీవు ఒక పరిచారికవు” అని చెప్పింది.
“అవును నా పేరు మందమతి. నేను పరిచారికను…పరిచారికను…’ పదేపదే అనుకుంది హేమాంగి.
మరునాడు మైనాకుడు తన హేమాంగి కొరకు దుఃఖిస్తూ ఉన్న సమయంలో అటుగా వెళుతున్న హేమాంగిని చూసి ఆశ్చర్యానందాలతో ఆమెని పిలుస్తూ వెళ్లి చెయ్యి పట్టుకున్నాడు. ఆమె తెల్లబోయింది. మీరెవరు అని ప్రశ్నించింది. మైనాకుడు ఆశ్చర్యంతో, ఆవేదనతో ఎన్నో మారులు తమ గతాన్ని ఆమెకు గుర్తు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతని చేయి విదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
నిజానికి మైనాకుణ్ణి నాగలోకం తీసుకొని వచ్చినది చతురిక. సరస్సులో మునిగిన మైనాకుని చూసి మోహించి అతనిని తన లోకానికి తీసుకువచ్చింది చతురిక. కానీ అతని అపురూప సౌందర్యాన్ని చూసి మైమరిచిపోయిన రాణీ మంజూషాదేవి అతనిని తన వాడిని చేసుకోవాలనుకోవడంతో చతురిక మౌనంగా ఉండి పోయింది. మంజూషాదేవి ఎంత ప్రయత్నించినా మైనాకుడు తన ప్రేయసి హేమాంగిని మర్చిపోవడం కల్ల అని చెప్పి తిరస్కరించాడు. అంతలో అక్కడికి వచ్చిన హేమాంగికి ఒక రకమైన పానీయం ఇచ్చి ఆమె జ్ఞాపకశక్తిని పోగొట్టింది.
***.
చిలుక కథ ప్రారంభించింది ఐదవ రాత్రి.
మాధురీ బేగం చనిపోయిందన్న అపోహతో పరమానందభరితుడై కళామందిరం ప్రవేశించాడు లాల్మియా. కానీ మాధురీ బేగం బ్రతికే ఉండటం చూసి ఖంగుతిన్నాడు.
అతనిని చూసి క్రోధోద్రేకంతో మాధురీ బేగం ఒరలో నుంచి కత్తిని దూసింది. ఒకరినొకరు దూషించుకుంటూ, బెదిరించుకుంటూ తలపడ సాగారు. మకరంద్, అవంతి, మనోరమ పక్క గదిలోనుండి వారి పోరాటాన్ని చూడసాగారు. ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమైపోయాడు లాల్మియా. సూక్ష్మశరీరంగా మారి అక్కడ ఉన్న ఒక పెద్ద అద్దంలో దూరిపోయాడు. మాధురీ బేగం కూడా అద్దంలో ప్రతిబింబం లాగా మారిపోయింది. అద్దం గిరగిరా తిరుగసాగింది. అంతలో లాల్మియా ఆ గదిలో ఎదురుగా ఉన్న గోడ మీద చిన్న కీటకంగా మారిపోయాడు. మాధురీ బేగం ఏం చేస్తుందో తెలియదు, కానీ అక్కడంతా పొగ కమ్ముకున్నట్లు అయింది. “అయ్యో. మాధురీ! చచ్చిపోతున్నాను. క్షమించు” అన్న లాల్మియా గొంతు వినిపించింది. ఆ కీటకం ఆ గదిలో నుండి తప్పించుకొని మకరంద్ వాళ్లు ఉన్న గదిలోకి వచ్చి వాళ్ళను చూసి, రొద పెడుతూ వాళ్ళ చుట్టూ తిరగసాగింది. మకరంద్ తెలివిగా అక్కడ ఉన్న ఒక వస్త్రాన్ని కీటకంపై వేసి ఒడుపుగా పట్టుకున్నాడు.
మాధురీ బేగం వచ్చి ‘ఆ పురుగును ఒక గాజుబుడ్డీలో కెక్కించి పాతాళ హోమం చేయాలి’ అని ఒక గాజు బుడ్డీని తీసుకొచ్చింది. మకరంద్ నేర్పుతో కీటకాన్ని బుడ్డి లోకి ఎక్కించాడు. మాధురీ బేగం తక్షణం దాన్ని మూతను భద్రంగా బిగించింది.
మందిరం వెనుక వైపు ఉన్న ఆవరణ దగ్గరకు వెళ్లి పలుగులతో అక్కడ తవ్వసాగారు. నీళ్ళకోసం మాధురి లోపలకు వెళ్ళింది. ముగ్గురూ పారలతో మట్టిని తీసి, పక్కకు చూసేసరికి లాల్మియా ఉన్న గాజుసీసా దొర్లుకుంటూ పోసాగింది. “పట్టుకోండి పట్టుకోండి” అంటూ మాధురి అరిచేసరికి మకరంద్ వేగంగా పరిగెత్తి, దొర్లిపోతున్న గాజు సీసాను పట్టుకో బోయాడు. అది నేలమీద నుండి గాలిలోకి ఎగిరి పోవడంతో “ప్రయత్నం అంతా వృథా అయింది” అన్నది మాధురీ బేగం నిరాశగా.
తారానాథ్, బాణంభట్టు, గురవయ్యలు దూరంగా జానెడు పొడవు గల గాజు సీసా దానంతట అదే నేల మీద దొర్లుతూ పోతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. పట్టుకోవాలని చూశారు. అది ఏదో ఒక వైపు నుంచి తప్పించుకు పోతూనే ఉంది. చివరికి ముగ్గురు కలిసి దానిని గట్టిగా పట్టుకున్నారు.
తెల్లవారటంతో కథనం చాలించింది చిలుక. రాజుగారు రాణివాసము వీడినదే తడవుగా చిలుక వచ్చి రాగలత భుజముపై వాలింది. తన శరీరము ఎక్కడ ఉందో వెతికి వస్తానని చెప్పి కిటికీలో నుండి రివ్వున ఎగిరిపోయింది.
తిరిగి తిరిగి, ఎండదెబ్బకు వడగాల్పుకు శోషిల్లి ఎగరటానికి శక్తి లేక ఉన్న చిలుకను అటుగా వస్తున్న దుందుభి దంతనాథులు చూశారు. ఒకరినొకరు గుర్తించుకున్నారు. జయదేవ్ వృత్తాంతమంతా విన్న ఆ రాక్షస దంపతులు చెప్పారు – ఒక ఫకీరు వేషధారి ఏదో కళేబరమును మోసుకొని, కీకారణ్యమై యున్న “అర్జునారణ్యం” వెళ్ళటం చూశామని. “అక్కడకు 40 యోజనాలు దూరంలో హిమాలయ తుల్యమైన ఒక పెద్ద కొండ, దాని శిఖరంపై నుండి ప్రవహిస్తున్న జలపాతం. దానికి 5 యోజనాల దూరంలో వుంది అర్జునారణ్యం. 1000 సంవత్సరముల వయస్సు గల అర్జునమనే మర్రివృక్షం అక్కడ ఉండడం వల్ల దానికి ఆ పేరువచ్చింది. అక్కడకు నీవు వెళ్ళు. ఏ సందర్భంలో నైనా మా సహాయం అవసరమైనప్పుడు మా తల వెంట్రుక ఒకదానిని నిప్పులో వెయ్యి. అది భస్మం కాకమునుపే మేము వచ్చి నీ సాన్నిధ్యంలో ఉంటాం. ఒకే గురుని శిష్యుల మైన మన మైత్రికి మేము నీకు చేయగల సహాయం ఇంతే” అని చెప్పి తన తల వెంట్రుకలు కొన్ని తీసి చిలుకగా ఉన్న జయదేవుని మెడలో కట్టాడు దంతనాధుడు.
ఆ ప్రకారంగా జయదేవుడు ఆ వృక్షాన్ని చేరుకొన్నాడు. ఆ వృక్షానికి ఉన్న రెండు అగ్నిగోళాలు అగ్ని చిమ్ముతూ ఉన్నాయి. ఆ చెట్టుకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా లోపల ఏముందో చూడటానికి ప్రయత్నించింది చిలుక. “వేలెడంత చిలుకవు. ఎంత సాహసం” గర్జన లాంటి మాటలు చెట్టు తొర్రలో నుండి వెలువడ్డాయి. “గూండా ఫకీర్ శిష్యుడైన ఈ అజేయుని దాటి రాగలవా” అన్నాడు మళ్ళీ.
అంతలో గంటలు మోగించుకుంటూ గుండా ఫకీరు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చీ రావడంతోనే గెంతుకుంటూ దూరమవుతున్న చిలుకను చూసి గుర్తించాడు. దానిని తరమసాగాడు. చిలుక వెంటనే పైకి ఎగిరి అతని కళ్ళు రెండు పొడిచింది. కళ్ళు తెరవలేకపోయినా గబుక్కున దాన్ని పట్టుకొని దాని కంఠం కొరకబోయాడు. చిలుక శరీరం వదిలి, అతని కన్నీటి బిందువుల్లో ఒకటై జయదేవ్ గాలిలో తేలిపోయాడు. ఫకీరు చేప ఆకారంలో నీటి బిందువును మింగబోయాడు. జయదేవ్ తక్షణం ఒక మండూకమై పోయాడు. ఫకీర్ ఒక సర్పమై కప్పను మింగబోగా, అది ఒక గండభేరుండమై పామును ముక్కున కరచుకొని అంతరిక్షానికి ఎగిరిపోయింది. సర్పము, గండభేరుండం భీకరంగా పోరాడసాగాయి. గగనమార్గంలో అక్కడికి వచ్చిన దుందుభి దంతనాథులకు ఆ సర్పాన్ని గట్టిగా పట్టుకోమని అప్పగించి, చిలుక శరీరంలోకి జయదేవుడు ప్రవేశించి అంతపురం వైపు పయనించాడు.
(గతాన్ని మర్చిపోయిన హేమాంగి మైనాకుని గుర్తించగలదా? హేమాంగికి పూర్వజ్ఞానం రప్పించడానికి మైనాకుడు ఏం చేశాడు? మర్రిచెట్టు తొర్రలో జయదేవుని శరీరం సురక్షితంగా ఉందా? దుందుభి, దంతనాధులు సర్పాకారంలో ఉన్న గూండా ఫకీర్‌ని బంధించి ఉంచగలరా?….. తరువాయి భాగంలో..!)
(సశేషం)