[dropcap]”ఆం[/dropcap]టీ, టికెట్ కొన్నాను. నా స్నేహితుడు కృష్ణ వెళున్నాడు. అతను తోడుంటాడు..” అన్నాడు భార్గవ్.
“అదేంటి? ఇంకా పాపకి ఆరు నెల్లైనా నిండలేదు. సుష్మ మళ్ళీ పని మొదలెట్టింది. చంటి పిల్లతో కష్టపడతారు,…”
మెట్లు దిగి వస్తూ ఆ సంభాషణను విన్న సుష్మ.. “అమ్మా మా గురించి ఆలోచించకు, ఇద్దరం ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా, ..పాపను చూసుకోగలం, వచ్చే బుధవారమే ప్రయాణం. నీక్కావలసినవి ఏమైనా ఉంటే చెప్పు, తెప్పిస్తాను” అంది.
కూతురు కూడా అలా అనేసరికి మ్రాన్పడింది పద్మ.
“మీకు సహాయంగా ఉందామనే కదే నేను వచ్చింది…”
అమ్మ అన్న మాటకి విసుక్కుంటూ, “అమ్మా… హాయిగా ఇంకాస్సేపు పడుక్కుందాం అంటే, నువ్వు కడిగే గిన్నెల చప్పుడుకు, మెలకువ వచ్చేస్తుంది. పాప కూడా లేచి పోతోంది. ఇంక మూడు పూటలా వంటలంటూ చంపుతున్నావు, బేబీ పుట్టాక ఫిగర్ కాపాడుకోడం కుదరటం లేదు” అంది సుష్మ.
“ఔనత్తయ్యా.. నేను కూడా ఫిట్‌నెస్ ప్రోగ్రాంలో చేరుదాము అనుకుంటున్నాను, దానికి కావలసినట్టు ప్రత్యేకమైన పోషకాలను తినాలి” అంటూ వంత పాడాడు.
భార్గవ్ కూడా అలా అనేసరికి బాధకలిగింది పద్మకు. సుష్మ భుజాన ఉన్న పాపను తీసుకుని జో కొడుతూ నిర్లిప్తంగా సోఫాలో కూచుంది పద్మ.
***
ఈ కోవిడ్ సమయంలో తలిదండ్రులను తమదగ్గర ఉండాలని పిల్లలందరూ కోరుకుంటూ ఉంటే వీళ్ళేమిటి ఇలా అంటున్నారు..? …అసందిగ్ధమైన ఆలోచనలు ముసురుకున్నాయి పద్మకు.
విమానాశ్రయానికెళుతూ సుష్మ రత్నకు ఫోన్ చేసింది.
“రత్నా, చెప్పినవన్నీ గుర్తున్నాయికదూ, ఇల్లంతా శుభ్రంగా తుడిచిపెట్టు. నువ్వు కూడా ఏవి ముట్టుకున్నా చేతులు కడుక్కో, అమ్మను బాగా చూసుకోవాలి, ..” అవతల నుంచి రత్న ‘అలాగే సుష్మక్కా..’ అని ఉంటుందని పద్మకు తెలుసు.
రత్న పద్మ ఇంట్లో మూల సౌకర్యంగా కట్టిన చిన్న ఇంట్లో ఉంటుంది. రత్న మొగుడు డ్రైవర్. ఇంట్లో తోట పని, బయట పనులన్నీ చేసిపెడతాడు. రత్న ఇంటి పనంతా చేస్తూ చేదోడుగా ఉంటుంది.
***
ప్రయాణం అనుకున్నంత కష్టంగా జరుగలేదు. వైద్య పరీక్ష ఇమ్మిగ్రేషన్ తనిఖీ అయ్యాక పద్మ సీనియర్ సిటిజన్ కనుక ఇంట్లోనే క్వారంటైన్ చేయాలని అనుకూలం చేసారు.
పద్మ తన బాగోగులు కనుక్కుంటూ, తోడుగా వచ్చిన కృష్ణకు కృతజ్ఞతలు చెప్పింది.
రత్న భర్తతో పాటు కారు తీసుకుని వచ్చి ఎదురు చూస్తోంది. ఇంటికి చేరాక పద్మకు, తన స్వంత గూటికి చేరిన సంతోషం సహజంగా కలిగింది. రత్న తనకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు అమర్చి పెడుతోంది,
ఇంట్లో తీరిక దొరికిన పద్మకు తాను గత కొన్ని నెలలుగా పక్కకు పెట్టి ఉంచిన అనువాద కార్యాన్ని పూర్తి చేయాలని దృఢంగా నిశ్చయించింది.
క్వారంటైన్ సమయం గడచింది.
స్నేహితుడు వర్మ వచ్చాడు. వర్మ ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు.
ఇంట్లోకి రాగానే పద్మను ఆప్యాయంగా పలుకరించాడు.
“పద్మా, అనువాదం ఎలా సాగుతోంది? అకాడమీ వాళ్ళు ఆ పుస్తకాన్ని త్వరలో ప్రచురించాలనుకుంటున్నారు. అదీ మూల రచయిత గారు కూడా వివిధ భాషలలో తమ పుస్తకం రావాలని ఆతుర పడుతున్నారట. ప్రత్యేకించి తెలుగు అనువాద పుస్తకం ఆవిష్కరణకు స్వయంగా హాజరు కావాలని ఉత్సాహ పడుతున్నారట.”
“వర్మా.. ఇంకో నెల రోజుల్లో పూర్తి చేసేస్తాను. ఇప్పుడు సమయాన్నంతా ఇందుకే కేటాయిస్తున్నాను.”
“మంచిది పద్మా.”
“నువ్వు మళ్ళీ సాహిత్య లోకానికి మరలి వచ్చావు.. సంతోషంగా ఉంది. నేను వెళ్ళొస్తాను.”
***
“పద్మా! అనుకున్న దానికంటే త్వరగా ముగించావు. ప్రచురణకర్త కూడా ముద్రణ పూర్తి కావించాడు. ముఖ్య అతిథి కూడా తమ వీలును తెలిపారు. వచ్చే వారమే ఆవిష్కరణ. సన్నాహాలనన్నింటినీ నేను చూసుకుంటాను. ఈ విషయం భార్గవకు సుష్మకు చెప్పాను. ఎంతో సంతోషించారు.”
ఇక్కడకు వచ్చాక తను పంపిన సందేశాలకు కూడా జవాబు నివ్వలేదు భార్గవ, సుష్మలు. వాళ్ళ ప్రవర్తనకు విస్తుబోతూనే ఉంది.
తానంటే ఎంతో ప్రేమను కురిపించే సుష్మ తన కుశలాన్ని కూడా కనుక్కోక పోయినందుకు నొచ్చుకుంది.
తను వచ్చాక పూర్తి చేసిన అనువాదాన్ని గురించి చెప్పాలని అనుకుంది. కాని ఆవిష్కరణ రోజు వరకూ చెప్పకూడదనుకుంది.
అంతలో పిలుపు వచ్చింది. ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. సుష్మ వీడియో కాల్ చేసింది. ఆతురతతో పిలుపునందుకుంది.
“పాప ఎలా ఉంది, బాగా చూసుకోగలుగుతున్నావా….” ఇంకా ఏవేవో ప్రశ్నలను అడగబోయింది, తానింతవరకూ నొచ్చుకున్న సంగతిని మరచిపోయింది.
“అమ్మా ఆ సంగతి ఒదిలెయ్. ముందుగా నీకు శుభాకాంక్షలు, వెళ్ళి నెల రోజులైనా కాలేదు.అప్పుడే 300 పేజీల నవలను అనువాదం చేసేసావు. వర్మ చెప్పారు, వచ్చే వారమే ఆవిష్కరణ అట కదా. నిజంగా నువ్వు చాలా హార్డ్ వర్కర్‌వి. వర్మ గారు నువ్విక్కడ ఉన్నప్పుడు నాతో నాలుగైదు సార్లు మాట్లాడారమ్మా, నువ్వు పూర్తిగా రచనలు మానేసావని పదే పదే నాతో చెప్పారు. నీ ప్రతిభనంతా మరచిపోయి మాకోసం ఇంటి పనుల్లో లీనమై పోయావు. మేం వద్దన్నా వినవు ఇక్కడుంటే. వర్మ నాతో చెప్పారమ్మా! వయసు 60 – 65 దాటాక మిగిలిన ఆ సమయం చాలా విలువైనదని. చూసావా తీరిక దొరకడంతో చక్కగా మేలైన రచన చేసావు.”
అర్థం అయింది పద్మకు, మనసు మబ్బులు వీడింది.
“ఆవిష్కరణ అంతర్జాలంలోనే కదా,మేమూ పాల్గొంటాము” అంది సుష్మ.
“సరే,” అంటున్న పద్మతో తన మాటలు కొనసాగిస్తూ, “అమ్మా, పుస్తకావిష్కరణ రోజు చక్కగా కుదిరిందమ్మా. ఆరోజు ఇక్కడ థాంక్స్ గివింగ్ డే. వర్మ గారు నాతో మరీ మరీ చెప్పడం వల్లనే, ఇంటి పనుల్లో మునిగిపోయిన నువ్వు తిరిగి నీ ప్రతిభను మేలుకొలిపావమ్మా. ఆయనకు నా పక్షాన కృతజ్ఞతలను చెప్పమ్మా…” అంటూ హడావిడిగా.. “ఉండు, ఉండు అలాగే రాతలో మునిగిన నీకు చేదోడు,వాదోడుగా ఉన్న రత్నను మరచిపోకు” సుష్మ మాటలకు … ఊ కొడుతూ ఫోన్ నిలిపింది పద్మ.
***
తనను హడావిడిగా పంపించేసినందుకు కారణం తెలిసి మనసు కుదుట పడింది పద్మకు.
వర్మ రానే వచ్చాడు. ముద్రణ పొందిన పుస్తాకాన్నొకటి పద్మకు చూపిస్తూ “చాలా బాగా వచ్చింది పద్మా, ఇదిగో అట్టమీది బొమ్మ శీర్షికకు ఎంత బాగా కుదిరిందో..” అన్నాడు.
పద్మ ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని “వర్మా! రాసింది మాత్రం నేను, మిగతాది అంతా నీ కృషి, ప్రోత్సాహం…” పద్మ చూపుల్లో కృతజ్ఞత తొణికిసలాడింది. పద్మ ముఖంలో కొత్త వెలుగును చూసాడు వర్మ.
ఇంక పొడిగించకుండా.. “నువ్వు పూర్వపు రచయిత్రిగా మళ్ళీ ఉద్యమించాలని, సుష్మతో మాట్లాడాను పద్మా, మళ్ళీ నువ్వు మునుపటి రచయిత్రి పద్మగా ముందుకు రావాలి. మధ్యలో సంసారంలో అనేక ఒడిదుడుకులను ఓర్పుతో ఎదుర్కున్నావు. ఇప్పుడు మిగిలిన సమయం చాలా విలువైనది, దానిని నీ ప్రతిభకు వినియోగించు. అన్నట్టు విశ్వవిద్యాలయంలో ఉత్తమ పరిశోధన చేసిన విద్యార్థికి బహుమానం ప్రకటించావు కదా! చెక్ రాసి ఇయ్యి, వాళ్ళకు అందజేస్తాను..” అన్నాడు వర్మ.
“అవును వర్మా.. నువ్వు చెప్పినట్టు నా సమయయాన్ని, ధనాన్ని నాకు తృప్తి నిచ్చే విధంగా ఉపయోగిస్తాను.” అంటూ రాసి ఉంచిన చెక్‌ను వర్మకు అందించింది పద్మ.
ముద్రణ పొందిన పుస్తకాన్ని మరొక సారి మనసారా చూస్తూ, “అనేక ధన్యవాదాలు వర్మా” అంది.
అంతలో కాఫీ కప్పులతో వచ్చింది రత్న.
“ముందు రత్నకు అభినందనలు, ఈ మంచి కాఫీకి, చలాకీ సేవలకీ..” అంటూ మెచ్చుకోలుగా చూసాడు వర్మ.
రత్న వంక అభిమానంగా చూసింది పద్మ.