[box type=’note’ fontsize=’16’] “సర్వమానవ సౌభ్రాతృత్వ భావనతో ‘ఆత్మవత్ సర్వభూతాని’ అన్న అవగాహనతో అందరి బాగు కోరటంలోనే అందరి బాగూ ఉంది” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి “రంగుల హేల” కాలమ్‌లో. [/box]
[dropcap]జీ[/dropcap]వితాన్ని దిద్దుకోవాలి…. తీర్చి…. చక్కని బొట్టులా అంటుంటారు పండిత పెద్దలు.
నిజమే! వంకర లేకుండా తీర్చి దిద్దినబొట్టు చూడచక్కగా ఉంటుంది మరి. కానీ అది చెప్పినంత వీజీ కాదు కదా!
ప్రతి మనిషికీ జీవితాన్ని అందంగా నలుగురికీ ముచ్చట గొలిపేట్టుగా అలంకరించుకోవాలనే ఉంటుంది. తనకి నచ్చేలా, చూసేవారు మెచ్చేలా, నలుగురిలో గర్వంగా నిలబడేలా ఉండాలని కోరుకోని మానవుడుండడు కదా.
అదంతా ఊహల్లో బాగానే ఉంటుంది. కానీ వాస్తవానికి వస్తే ఎన్నో ఇబ్బందులు, కష్టాలు తప్పవు. ఎంత శ్రమపడినా బ్రతుకు అనుకున్నట్టుగా ఆశించినంత అందంగా ఉండదు..
ఎవరికీ తమ జీవిత చిత్రంపై తృప్తి ఉండదు. ఏదో ఇంటర్వ్యూల్లో సెలబ్రిటీ అయ్యాకా ఓ పెద్ద హీరో గారు నేను చాలా తృప్తివంతమైన జీవితం గడిపానని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, తాను తిన్న ఢక్కామొక్కీలూ, ఎదురుదెబ్బలూ, సంతానం చూపించిన చుక్కల గురించీ చెప్పుకుంటే గ్లామర్ దెబ్బ తింటుందన్న భయంతో. కానీ నిజానికి ప్రతివారికీ తమ జీవితం పట్ల పూర్తి సంతృప్తి ఉండదు. తామనుకున్నట్టుగా తమ జీవనం లేదనీ దాన్నిఇంకా బాగా దిద్దుకోలేకపోయామనీ ప్రతివారూ మనసులో చింతిస్తూ ఉంటారు. అక్షరాస్యత లేని అమాయకులు కూడా నేనలా చేసి ఉంటే నా బతుకు బావుండేది అనుకుంటారు.
మానవ జన్మ ఎత్తాకా తీరని కోరికలు ఉంటూనే ఉంటాయి. తమకు ఎదురైన నిరాశలూ, ఇంకా ఇతరేతర చిన్నా చితకా ఈతి బాధలూ మానవులంతా తట్టుకొని నిలబడవలసిందే! ప్రతి వ్యక్తీ నేటి జీవితానుభవాన్ని బట్టి నిన్న చాలా తెలివి తక్కువగా బ్రతికాననుకుంటాడు. నేటి నుండి నిన్నను చూసినట్టుగా నేటినుండి రేపటిని చూడలేడు కదా! కాబట్టి అదలా జరగవలసింది జరిగిపోతుందంతే. వగచి లాభం లేదు. విధాత కఠినమైన హెడ్ మాష్టర్ లాంటి వాడు. ఒకసారి రాయగా దిద్దేసిన పేపర్‌ని మరి రాయనివ్వడు. రికార్డు చేసేసిపోయిన గత కాలంలోకి తొంగిచూడగలం గాని దిద్దలేము. అయితే పొందిన అనుభవాల్ని పాఠాలుగా మదిలో నిలుపుకుని రాబోయే కాలంలో ఆచి తూచి అడుగువెయ్యొచ్చు. ఐరనీ ఏంటంటే జరిగిన ఏ సంఘటనా, పునరావృతం కాదు. మనం సంపాదించామనుకున్న అనుభవ జ్ఞానం సునాయాసంగా జీవిత రధాన్నిలాగిపారెయ్యడానికి అచ్చంగా, కత్తిలా ఉపయోగపడుతుందన్న గ్యారంటీ లేదు. ఏ కాస్త సారమో లాభించొచ్చు, అదీ అనుమానమే! ఎందుకంటే రాబోయే వన్నీ మన దగ్గర చిట్కాలు లేని కష్టబాధలే.
జీవితాన్నిఒక ప్లాన్ ప్రకారం ఆశించినట్టుగా చక్కబెట్టుకోవాలని/చక్కబెట్టుకుందామని కాస్త చదువూ సంధ్యా ఉన్నవారందరూ అనుకుంటారు. తీర్చిదిద్దబడిన జీవితాలు అరుదుగా కనబడతాయి. తమకు లభించని అవకాశాలు తమ పిల్లలకు అందజేస్తే వాళ్ళు ఆకాశాన్ని అందుకుంటారని ఆశపడతారు కొందరు. సకల సదుపాయాలూ కలగజేస్తారు. ఆ సంతానం దేనిలోనూ ఆసక్తి చూపెట్టరు. దిద్దుకునే మాట అలా ఉంచి అలాంటి అవగాహనే ఉండదు వారికి.
ప్రతి రోజూ పెట్టుకునే బొట్టే.. అన్నిరోజులూ సరిగా కుదరదు. మన చేతిలో తిలకమే… మనచేతిలో అద్దమే. తిలకం దిద్దుకునే పుల్లా అదే.. అయినా రోజుకొకలా వస్తుంది బొట్టు. ఒకో రోజు అద్భుతంగా అనుకున్నట్టుగా కుదురుతుంది. మరోసారి ఒకమాదిరిగా.. మరీ ఒక్కోసారి చెరిపి మళ్ళీ పెట్టాలనిపించేట్టుగా వస్తుంది… బొత్తిగా బాగోదు. కానీ టైం ఉండదు. జీవితమూ అంతే. ఎక్కడో ఒకచోట అనుకున్న దారి తప్పిపోతుంది. తెలిసి తెలిసీ.. నిస్సహాయులం ఐపోతాం. దాన్ని తప్పిపోయిన అసలు దారి లోకి లాగాలనీ, గాడిలో పెట్టాలనీ శతవిధాలా ప్రయత్నం చేస్తుండగానే మనకై దేవుడు నిర్దేశించిన గమ్యం వచ్చేస్తుంది. గోల్ అయిపోతుంది. చివరికి జీవితం ఎవరో టీనేజ్ కుర్రాడు తీసిన అవకతవక షార్ట్ ఫిల్మ్‌లా ముగుస్తుంది.
నేనెప్పుడో ఒక కవిత ఇలా రాసుకున్నాను.
“వేగం”
చిన్నప్పటి కొత్త నోట్ పుస్తకంలో మొదటిపేజీల్లోనే
రాశాం అక్షరాలు అందంగా, గుండ్రంగా…
ఆ తరువాతి పేజీలు ఒకటే కంకిరి బింకిరి
పెద్దప్పటి జీవితం మొదట్లోనే ఆశయాలూ,ఆదర్శాలూ
ఆ పై బ్రతుకంతా ఒకటే ఉక్కిరి బిక్కిరి…
ఈ మాటలెంత నిజమైనా ఒక నిబద్దత, లక్ష్యం, గురి ఉన్నప్పుడు జీవితాన్నిఏ దశలోనైనా కొంతలో కొంత దిద్దుకోగలుగుతాం. లేదంటే చుక్కాని లేని నావైపోతుంది జీవనం. అందుకే ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడూ మన పసితనాన్నీ, ఇతరేతర హాబీలనీ, మనకు నచ్చిన అతి చిన్న ఆనందాల్నీ మర్చిపోకూడదు. మన మీద మనకి అభిమానం, ప్రేమ ఎట్టి స్థితిలోనూ మరుగున పడనీయరాదు. మనపై మనకి ఉండవలసిన గౌరవం తగ్గించుకోకూడదు. తీరిక చేసుకుని మనతో మనం గడుపుతూ ఉండాలి రోజులో కొంతసేపు. ఎక్కడున్నా మనమూ మన ఆలోచనలూ ప్రత్యేకం. మనకి మనం అపురూపం అనే మాట మరువ రానే రాదు సుమా!
హైస్కూల్ క్లాస్‌లో కూర్చునే పిల్లలందరూ బాగా చదువుకుని జీవితంలో తండ్రిలా, మాస్టారిలా గొప్ప వారవ్వాలనే అనుకుంటారు. కొందరికి విద్య బాగా అలవడి అవకాశం దొరికి పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాల్లోకి వెళతారు. కొందరు తక్కువ చదువుతోనే ఆగిపోతారు. వారు వ్యాపారమో, వ్యవసాయంలో చేసుకుంటూ స్థిరపడతారు. ఉద్యోగాలు చేసేవారు బాగా పనిచేసి ప్రమోషన్ తెచ్చుకుని పై హోదాలోకి వెళ్లాలనుకుంటారు. వ్యాపారస్తులు బాగా కష్టపడి బిజినెస్ అభివృద్ధి చేసుకోవాలని, పంటలు పండించుకునే వారు పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఎక్కువ ఫలసాయం పొందాలనుకుంటారు. ఇలా ప్రతివారూ జీవితంలో తమ జీవన ప్రమాణం పెంచుకునే దిశగా ప్రయాణిస్తూనే ఉంటారు.
కళాకారులు మరింత ప్రతిభావంతంగా కళల్ని సేవించాలనీ, రచయితలు మరిన్ని నాణ్యమైన రచనలు చేయాలనీ కష్టపడుతుంటారు. ఆ విధంగా తమ దిద్దుబాటు క్రమంలో దిద్దుబాటలో ప్రయాణిస్తుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు మరికాస్త శ్రద్ధతో సాధన చేస్తూ భగవంతుని ధ్యాసలో, ధ్యానంలో మరింత పరిణతి చెందాలనుకుంటారు.అన్నీ తమను తాము దిద్దుకునే మార్గాలే.
మన జీవితాల్ని తీర్చుకునే క్రమంలోనే,మన తోటివారివి,మన క్రిందివారివి, మనల్ని నమ్ముకున్నవారి జీవితాలు కూడా ఉంటాయి. వారి దిద్దు ప్రక్రియలో మనవంతు సాయం, ఆర్థిక సహాయం గానో, ఆత్మీయ మిత్ర సాయంగానో చేస్తూ పోతే జగతి నందనవనం కాకపోయినా, కంటకవనం కాకుండా ఉంటుంది. ఏమంటారు?
మనిషి తన బ్రతుకును తాను చక్కదిద్దుకునే క్రమమే మెరుగైన జీవన గమ్యానికి రహదారి.
జీవితమొక నిరంతర దిద్దుబాటు
రోజు రోజుకూ కోరుకునే ఎదుగుబాటు
మెరుగైన చక్కని బ్రతుకుకోసమే కదా మరి ఈ నిత్యసాహిత్య చదువురాతలు. చక్కగా అంటే సౌజన్యంతో. సామరస్యంతో, సంఘీ భావంతో, సర్వమానవ సౌభ్రాతృత్వ భావనతో ‘ఆత్మవత్ సర్వభూతాని’ అన్న అవగాహనతో అందరి బాగు కోరటంలోనే అందరి బాగూ ఉంది.