[dropcap]ప్ర[/dropcap]తిరోజు ఆశగానే మొదలవుతుంది
నిన్నటి కన్నా నేడు బాగుంటుందేనని
బహుశా రేపు కూడా ఇలాగే కొనసాగుతుందేమో
అయినా అదే ఆశ ను శ్వాసగా చేసుకొని
బతుకు బండిని నడుపుతూనే ఉంటాం
కలల సీతాకోకచిలుకలు ఎగురుతున్నప్పుడల్లా
విశ్వాసపు పూలను ఎరగా పెడుతుంటాం
కోరికల అశ్వాలు పరిగెత్తుతున్నప్పుడల్లా
సాధ్యాసాధ్యాల చిట్టాలతో అదుపు చేస్తుంటాం
ఎదురు చూపుల దారులలో
స్వప్న తారకల వెలుగులు ఆరబోసుకుంటూ
గుండె గూటిలో కలతల్ని దాచేసుకుంటూ
విజయతీరం వైపు సాగిపోతూనే ఉంటాం
బహుశా
కోరికలది, కలలది సముద్ర దాహమేమో
లోతే తెలియని అగాధాలతో
కమ్మగా మొదలైనా కన్నీటితో ముగుస్తాయి
సముద్రపునీరు, కన్నీరు కవల పిల్లలేమో
రుచిలోనూ, రూపులోనూ, విస్తారంలోనూ
తీరని దాహాలతో మనిషిని ముంచేస్తూంటాయి