[dropcap]అ[/dropcap]సంబద్ధ, అవివేక అవాక్కులెందుకు?
నువ్వెందుకు కష్టపడతావ్? నీకా శ్రమెందుకు?
నన్ను ‘వెధవ’ అని అనడానికి!
ఇప్పుడు నిర్వ్దంద్వంగా
‘నేనే వెధవ’నని ప్రకటించుకుంటున్నాను!
నీ పదవి పదిలం చేసుకోవడానికి
ఎందుకు నాకు బురద పూస్తావ్?
నేనే ఒంటి నిండా బురద పులుముకుంటాను!
నీ కుర్చీ పదిలం చేసుకోడానికి
నన్నెందుకు కుత్సితుణ్ణి చేస్తావ్?
కుపితుణ్ణి చేస్తావ్?
నిరాశా, నిస్పృహలు, నైరాశ్యం నిన్ను ఆవహించినపుడు
నిలువునా నిప్పై చెలరేగినపుడు
అసూయా, ద్వేషం, ఈర్ష్య నిన్ను దహిస్తున్నప్పుడు
ఎదుటివాడిపై అభాండమై, బ్రహ్మాండమంతా
బద్ధలవుతుంటావు!
ప్రతిభా దారిద్ర్యం, ఆత్మన్యూనత, అసమర్థతలే
మనిషిని ఈర్ష్యాపరుణ్ణి చేస్తాయ్!
నువ్వు ఎదుటివాళ్ళను అభాసుపాలు చేయాలనుకోవడం
నువ్వు అధః పాతాళానికి
దారి వెతుక్కోవడం!