[dropcap]మ[/dropcap]గధరాజైన జరాసంధుడు గిరివ్రజ అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు. ఇతను మహాభారతంలో సభాపర్వంలో వచ్చే పాత్ర. ఇతను పరమ శివభక్తుడు, రాక్షసుడు, మంచి బలవంతుడు, శక్తిశాలి. ఈయన పుట్టుక కూడా చాలా విశేషమైనది. ఈయన తండ్రి బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ వారి వలన సంతానం కలుగలేదు. ఒకరోజు బృహద్రధుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చందకౌశిక అనే మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని, సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు. బృహధ్రద మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు (ఆ ఋషికి బృహధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిగ్భ్రాంతికి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుంది. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరకి తీసుకొని వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది.
ఆ విధముగా జరాసంధుడు ఇద్దరు తల్లులకు పుట్టిన వాడు. జరా అనే రాక్షసి ద్వారా జీవము పోసుకున్నాడు కాబట్టి జరాసంధుడు అనే పేరు వచ్చింది. ఒకరోజు చందకౌశిక మహర్షి బృహద్రడుడి రాజ్యానికి వచ్చి జరాసంసంధుడిని చూసి, జరాసంధుడు పరమ శివభక్తులలో ఒకడౌతాడు అని చెబుతాడు. జరాసంధుడు శ్రీకృష్ణునిపై వైరము పెంచుకోవటానికి కారణము ఉంది. అది ఏమిటి అంటే జరాసంధుడు తన ఇద్దరు కుమార్తెలను మధుర రాజైన ఉగ్రసేనుని కొడుకు కంసునికి ఇచ్చి వివాహము చేస్తాడు. కంసుని సోదరి దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహము చేస్తాడు. దేవకీ వసుదేవులు అంటే కృష్ణుని తల్లిదండ్రులు. కృష్ణుని వల్ల తనకు చావు ఉన్నదని తెలిసిన కంసుడు బలరామ కృష్ణులను చంపటానికి ప్రయత్నించగా వీరిద్దరూ యవ్వనంలో ఉండగానే వారి మేనమామ కంసుని చంపుతారు. తన అల్లుడైన కంసుని చంపినందుకు బలరామకృష్ణులపై పగ పెంచుకొని మధురపై 17 సార్లు దండెత్తినప్పటికీ విజయాన్ని సాధించలేకపోతాడు. 18వ సారి కాలయవనుల సహాయముతో మధురపై దండెత్తలనుకుంటాడు. ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు తన యదు వంశస్థులను కొత్తగా సముద్రగర్భములో నిర్మించిన ద్వారకకు తరలిస్తాడు.
శ్రీకృష్ణుడు తన మాయతో కాలయవనుని, సూర్య వంశానికి చెందిన మాంధాత కుమారుడైన ముచుకుందుడు కృతయుగము నుండి తపస్సుచేసుకుంటున్న గుహవైపు మళ్లిస్తాడు. వృద్ధుడైన ముచుకుందుడు తన తపస్సును భగ్నము చేసిన కాలయవనుని భస్మము చేస్తాడు. ఈ విధముగా ముచుకుందుని ఆగ్రహానికి గురైన కాలయవనుడు భస్మము అయినాక బలరామ కృష్ణులు ద్వారకకు బయలుదేరుతారు. దారిలో జరాసంధుడు వీరిపై తన సైన్యముతో దాడిచేస్తాడు. బలరామ కృష్ణులు ప్రవర్షణ అనే పర్వతము ఎక్కి జరాసంధుని సైన్యము నుండి తప్పించుకుంటారు. జరాసంధుడు అతని సైన్యము ఆ పర్వతానికి నిప్పు పెట్టి వారిని సజీవదహనం చేయాలనీ యత్నిస్తారు కానీ సోదరులు ఇద్దరు ఆ ప్రమాదం నుండి తప్పించుకొని ద్వారకకు చేరుతారు. శ్రీ కృష్ణునికి జరాసంధుని చావు తన చేతిలో వ్రాసి పెట్టలేదు అన్న విషయము తెలుసు కాబట్టి జరాసంధుని చంపకుండా వదిలివేస్తాడు.
ఆ తరువాత చాలా కాలానికి తన బలము ఆధిపత్యాన్ని ఋజువు చేసుకోవటానికి శివునికి ఒక యజ్ఞము చేయాలని తలుస్తాడు. ఈ యజ్ఞములో తాను ఓడించిన వందమంది రాజుల తలలతో హారముగా చేసి రుద్రునికి సమర్పించాలని భావిస్తాడు. బందీగా ఉన్న రాజులు ఈ విషయాన్నీ శ్రీకృష్ణనికి సందేశాన్నిపంపుతూ వారిని రక్షించమని ప్రార్థిస్తారు. కొంత కాలము తరువాత ధర్మరాజు మిగిలిన రాజులను జయించి రాజసూయ యాగము చేయాలనుకుంటాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు “ఇంకా నీవు జరాసంధుడిని జయంచలేదు” అని చెప్పి జరాసంధుడి బందీలుగా ఉన్న రాజుల స్థితిని తెలియజేస్తాడు. రాజసూయానికి కావలసిన ధనము అవసరము అని ఆ జరాసంధుడి వద్ద మిక్కిలి ధనము ఉన్నదని, జరాసంధుడు అనేక రాజులను బంధించి హింసిస్తునాడని, రాజులను శివుడికి బలి క్రింద ఇస్తున్నాడని శ్రీకృష్ణుడు చెబుతాడు.
శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను, భీముడు, అర్జునుడు జరాసంధుడి వద్దకు బ్రాహ్మణుల వేషముతో వెళ్ళి యుద్ధ భిక్ష వేడుతాను అని చెప్పి మగధ బయలు దేరుతాడు. శ్రీ కృష్ణుడు భీమార్జునలను తీసుకొని గిరివ్రజ నగరంలోకి దొడ్డిదారి గుండా చేరుతాడు. శత్రువుల కోటలోకి దొడ్డిదారి గుండా ప్రవేశించటము తప్పు కాదు అని శ్రీకృష్ణుడు చెప్పి, పొలిమేరలు చేరాక జరాసంధుడి కోట మీద ఉన్న ఢంకా గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు. ఆ ఢంకాలు శత్రువులు ఎవరైన రాజ్యములో ప్రవేశిస్తే తామంట తామే మోగుతాయి. భీముడికి చెప్పి ఆ ఢంకాలను భీముడి ఉదరముతో చీల్చమని చెబుతాడు. ఢంకాలు ధ్వంసము చేశాక శ్రీకృష్ణ, అర్జున, భీములు రాజమార్గంలో కాకుండా దొడ్డిమార్గములో రాజధానిలో ప్రవేశిస్తారు. బ్రాహ్మణ వేషధారులైన శ్రీకృష్ణ, భీమార్జునులు శత్రువులుగా గుర్తింపక వారికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరిస్తాడు. తాంబూలాలు ఇవ్వబోతే శ్రీ కృష్ణుడు నిరాకరించి యుద్ధ భిక్ష కోరుతాడు. జరాసంధుడు అంగీకరించగా శ్రీకృష్ణుడు భీముడితో మల్లయుద్ధము చేయమని కోరుతాడు. అంగీకరించిన జరాసంధుడు వారి పరిచయాలు చెప్పమని అడుగుతాడు. వచ్చినవారు శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు అని తెలిసి తానూ భీముడితో మల్లయుద్ధము చేయాలని తెలుసుకున్న జరాసంధుడు తన కుమారుడైన సహదేవునికి (పాండవులలోని సహదేవుడు కాదు) పట్టాభిషేకము చేసి భీమునితో మల్లయుద్ధానికి తలపడతాడు.
జరాసంధుడు-భీముడు ఘోరాతి ఘోరంగా పోరాడుతుంటారు. ఈ యుద్ధము 27 రోజులు గడుస్తుంది. జరాసంధుడు జన్మ రహస్యము తెలిసిన శ్రీకృష్ణుడు, జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరే వేరే దిక్కులకు విసిరి వేయమని భీముడికి గడ్డిపరకను చీలుస్తూ సౌజ్ఞ చేసి చూపిస్తే ఆ సూచన మేరకు భీముడు జరాసంధుని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వేరే వేరే దిక్కులకు పడేస్తాడు. ఆ విధంగా జరాసంధుడు అస్తమిస్తాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవుడు పాండవులతో సంధి చేసుకొని కురుక్షేత్ర యుద్దములో పాండవుల పక్షాన పోరాడుతాడు.