[dropcap]వై[/dropcap]రి పై పోరుకు…
వెలుగు దివిటీలు కళ్ళలో..
వెలిగించుకెళ్ళావు!!
నువు లేని క్షణం.. ఒక్కో..
నవయుగంలా…
నన్ను తిరిగి తిరిగి పుట్టిస్తున్నాయి!!
నీకై వేచి వేచి నా కళ్ళకలువలు,
కెందామరలై…నాయి.
ఏ అలికిడి విన్నా…నువ్వొస్తున్నావనే
ఊహే!!
మబ్బులు కదలాడితే…
నీ అల్లరి అలకలు గుర్తొచ్చి,
మనసు కన్నీటి జల్లవుతోంది!!
నెలరాజు నను చూసి..ఏడి
నీ జోడు నా సరికాడంటివని,
పరిహసిస్తున్నట్లుంది!
మన తోట పూలన్నీ…
ఒంటరినైన నన్న జాలిగా..
చూస్తూ..,
పరిమళాన్ని
పంచకుండుంట వశ్యం కావటం లేదు సుమా!
కన్నీరు జారే నీలాగే అంటున్నాయి!!
నీ విధి నా ధర్మమని తెలిసినా…
ఏవిటో..మనసు మాట వినదు,
అదిగో నీకోసం చూసి చూసి
వెన్నెలంతా..ఏట్లో మునిగిందిప్పుడే..!!
తూరుపు గూట్లో…ఎర్రపిట్ట రెక్కలు విప్పుతోంది,
రెప్పలంటని నాకళ్ళలో నిప్పు రాజుకుంటోంది!!
అలసిన మేను నీ గుండె తలగడ కోరుతున్నా..
శత్రుమూకలపై తలపడుతున్న నిన్ను తలచుకుంటూ….
నా మోకాళ్ళ పై తల ఆన్చి….
ఈ నట్టింట నేలపై ఆనే నీ పాదాలకై. ఎదురు చూస్తూ…
నీ..రాకకై….నీ సఖి!!