[dropcap]కొ[/dropcap]డుకంటే కోటి పుణ్యాల ఫలమనుకున్నాను
నా ఆశల సౌధానివనుకున్నాను
నా ఆశయ దీపమనుకున్నాను
తీరని కోర్కెల ప్రతిరూప మనుకున్నాను
నా వంశాన్ని నిలుపుతావనుకున్నాను.
సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచావు
సంస్కృతి పట్ల నిబద్ధతతో మెలిగావు
సన్మార్గంలో పయనిస్తూ భరోసా నిచ్చావు
నిరంతర శోధనలో పరితపించావు
తార్కికంగా అలోచిస్తూ
తెలివిగా జవాబిస్తూ
ఎందరినో మెప్పించావు, మరెందరినో అలరించావు
నాలో క్రొంగొత్త ఆశల మోసులు వెలయించావు
సరస్వతీ పుత్రుడ వయ్యావని సంబరపడ్దాను
నీ విజయ పరంపరలో నేను
ప్రశంసల జల్లులలో తడిసి ముద్దవుతాననుకున్నాను
నా వంశోద్ధారకా!
చెట్టంత కొడుకువని మురిసిపోయాను
పున్నామ నరకం తప్పించావనుకున్నాను
వృద్ధాశ్రమం ఆశ్రయించాల్సిన అవసరం లేదనుకున్నాను
కానీ కన్నా –
డాలర్ పరుగు పందెంలో ‘డ్రాకులా’కి చిక్కి
నిలువెల్లా నన్ను నిప్పుల కొలిమిలో తోసి
నువ్వు చితితో చెలిమి చేశావా?
విధి వంచితుల జాబితాలో నన్ను చేర్చి
నువ్వు వరల్డ్ ట్రేడ్ సెంటర్ వయ్యావా?