మేరే దిల్ మె ఆజ్ క్యా హై-5

4
3

[box type=’note’ fontsize=’16’] ప్రసిద్ధ హిందీ/ఉర్దూ కవి, సినీ గీత రచయిత శ్రీ సాహిర్ లుధియాన్వీ శత జయంతి సంవత్సరం సందర్భంగా వారి ఎంపిక చేసిన కొన్ని కవితలను ‘మేరే దిల్ మె ఆజ్ క్యా హై’ శీర్షికతో స్వేచ్ఛానువాదం చేసి సంచిక పాఠకులకు అందిస్తున్నారు గీతాంజలి. [/box] 

‘ఇక్కడ కాదు., ఇంకెక్కడైనా కలువు’

[dropcap]నీ[/dropcap]కేం., నన్ను ఇక్కడ కలవ మని సందేశం పంపావు.,
కానీ., నాకు ఇష్టం లేదు!

తాజ్ మహల్ నీకో అత్యున్నత ప్రేమకి చిహ్నం కావచ్చు!
ఈ ఖరీదైన మహల్ ని చుట్టుముట్టిన పరిమళాలు వెదజల్లే పూల తోట నీకు పారవశ్యం కలిగిస్తుండొచ్చు!
కానీ నాకు ఇది కష్ట జీవుల రక్తం పిండి కట్టించిన సమాధి మాత్రమే!
సమాధి ఎక్కడైనా ప్రేమకు చిహ్నం అవుతుందా చెప్పు?
అయినా కానీ ప్రేయసీ ఇక్కడ వద్దు ., నన్ను ఇంకెక్కడైనా కలువు!

ఎందుకంటే.,
బాదుషా దర్బారులో., హోరెత్తే గరీబుల ఆర్తనాదాలకు విలువ ఉంటుందని అనుకోను!
క్రూరమైన రాజ శాసనాలు లిఖించబడ్డ రహ దారుల్లో.,
ప్రేమ నిండిన గరీబు ఆత్మలు చేసే ప్రయాణం కనిపిస్తుందా?
ఈ తాజ్ మహల్ సౌందర్యాన్ని చూసి మురుస్తున్నావు కానీ.,
ఇది ఎందరి సామాన్యుల స్వచ్ఛమైన ప్రేమను అవమానించిందో నీకేం తెలుసు?
బతుకు తెరువు కోసం కష్టపడే శ్రమజీవులు.,
క్షణం తీరిక లేక పోయినా ., ప్రేమలు మాత్రం చావని వాళ్ళు
తాజ్ మహల్ లేక పోయినా
ప్రేమించు కోవడం ఆపనివాళ్ళు.,
సంపదతో సంబంధం లేని
వాళ్ళ నిష్కల్మషమైన ప్రేమని వెక్కిరించింది కదూ కఠినమైన పాలరాతి తాజ్ మహల్?
అందుకే., ఇక్కడ వధ్ధు ఇంకెక్కడైనా కలుద్దాం!

ప్రియురాలా., ప్రేమ గాలులు వీచే పరదాల వెనక.,
రాజభోగాలు అనుభవిస్తున్న దానా
చైతన్యం లేని మనుషుల కుస్థితమైన పరాచకాల్లో మైమరచి పోయేదానా.,
నీ అంధకారం నిండిన ఇంటి దిక్కు కనీసం
ఒకసారన్నా చూసి ఉండాల్సింది !

ఒక్క షహన్ షా నేనా?
ఈ లోకంలో
లెక్కలేనంత మంది ప్రేమించుకున్నారు
ఎవరన్నారు వారి ప్రేమ పవిత్రం కాదని.,
ఎవరన్నారు వారిది నిజమైన ప్రేమ కాదని?
వారి కోసం ., తాజ్ మహళ్లు ఏమైనా జ్ఞాపక చిహ్నాలుగా కట్టబడ్డాయా., లేదే?
ఎందుకంటే., ఆ ప్రేమికులంతా
నా లాగే నిరుపేదలు మరి !

అయినా ప్రేయసీ., ఒకటి చెప్తా విను!
వారి ప్రేమ.,
ఆ షహన్ షా ప్రేమ కంటే తక్కువేమీ కాదు!
ప్రజల సొమ్ముతో తాజ్ మహల్ కడితేనే నిజమైన ప్రేమనా?
పోలికెందుకు ప్రేయసీ.,?
అది కాదు కానీ., మరో జాగా చెప్పు అక్కడ కలుధ్ధాం., ఇక్కడ మాత్రం వద్దు!

ఈ సమాధులు,
మహళ్లు , ఖిల్లాలు, రహదారులు
ఎత్తయిన పురాతన కట్టడాలు అన్నీ మృత అవశేషాలై
భూమి మొఖం మీద
మా పూర్వీకుల చమట, రక్తం, ఎముకల్లోనుంచి మొలిచిన రాచ పుండ్లు అని నీకు తెలిస్తే కదా!
నేనెట్లా కలవగలను చెప్పు నిన్నిక్కడ?

నీకింకో విషయం తెలియాలి
ఈ కఠినమైన పాల రాతి కట్టడాలని గొప్ప శిల్ప సౌందర్యంతో .,
తమ చేతుల ఉలితో చెక్కిన ఆ శ్రమజీవులు కూడా.,
ఎవరినో ఒకరిని గాఢంగా ప్రేమించే వుంటారు.
జీవితమంతా ఒకరి ప్రేమలకోసం మరొకరు అల్లల్లాడే ఉంటారు.

అయినా సరే.,
ఆ ప్రేమికుల జీవన్మరణాలు ఏ గౌరవానికి, గుర్తింపుకీ నోచుకోకుండానే.,
అజ్ఞాతంగానే ముగిసిపోయి ఉంటాయి.,
వాళ్ళ ఒంటరి సమాధుల మీద ఒక్కరు కూడా కనీసం ఒక్క దీపాన్ని కూడా వెలిగించి ఉండరు!
అందుకే ., ఈ సమాధి దగ్గర ఎందుకులే ప్రేయసీ.,
మన కలయికకి మరో స్థలం చెప్పు!

ఇది విను.,
యమునా నది ఒడ్డున మొలిచిన లెక్కలేనన్నని ఆకాశ హార్మ్యాలు.,
ఎకరాల కొద్దీ విస్తరించిన తోటలు, ధనాగారాలు పొంగి పొరలే భవంతులు.,
ఈ సంపద బలుపుతో తన ప్రియురాలి కోసం తాజ్ మహల్ కట్టి.,
ఆ షహన్ షా గుడిసె కూడా కట్టుకోలేని ఈ బీద వాళ్ల ప్రేమపై క్రూర అపహాస్యం చేస్తున్నాడు?

అందుకే ప్రియురాలా.,
హృదయమే లేని ఈ తాజ్ మహల్ దగ్గర ఎందుకు చెప్పు?
ప్రేమకు చిహ్నం సమాధా?
వెర్రి కాకపోతే నీకు ., ఆ షహన్ షాకు?
ఈ సమాధుల దగ్గర ఎందుకు కానీ.,
మరో చోటు చెప్పు
మరో మాట చెప్పు.,ఇక్కడ మాత్రం వద్దు

మరింకెక్కడైనా కలుధ్ధాం
మన తాజా ప్రేమలు కలబోసుకుందాం!

మూలం: సాహిర్ లుథియాన్వి
స్వేచ్ఛానువాదం: గీతాంజలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here