[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]
[dropcap]ఇ[/dropcap]ళ్ళన్నీ క్రీమ్ కలర్‍లో వున్నాయి. అందువల్ల కూలింగ్ ఎక్కువట. వేరే రంగు తమ ఇళ్ళకి వేసుకోవాలి అనుకునేవాళ్ళు గవర్నమెంట్ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలట, అమెరికాలో లాగే! మన ఇండియాలో మాత్రం ఇటువంటి రూల్స్ లేవు… అసలు ఇంట్లో ఫంక్షన్ అని రోడ్డు మొత్తం షామియానాలు వేసి మూసేసినా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, పట్టించుకోరు! అలా దుబాయ్‍లో వేరే రంగు వేసుకుంటే ఇళ్ళకి టాక్స్‌లు కూడా అదనంగా కట్టాలిట. మన ఇండియాలో యూనిఫార్మిటీ అనే మాటకి జనం చాలా దూరం! కొంతమంది సప్త వర్ణాలు పెయింట్ చేయించుకుంటారు. చూసే వాళ్ళకి కళ్ళు చెదిరేట్టు, ఎర్రని ఎరుపు, ఆకుపచ్చా, పసుపు పచ్చా, డార్క్ బ్లూ లాంటివి! అమెరికాలో కూడా కొండ మీద ఇల్లు కట్టుకునేవాడు డార్క్ రంగు లేసుకుంటే, ఎదురింటి వాడి పర్మిషన్ తీసుకోవాలి, లేదా ఫైన్, ఇంకా జైలు శిక్షా కూడా అనుభవించాలి. ఎన్ని ఏళ్ళున్నా దుబాయ్‍లో ఇల్లు స్వంతంగా కట్టుకునే చట్టం, సిటిజెన్‌షిప్ ఇచ్చే సౌలభ్యం లేదు దుబాయ్‌లో. ఎందుకంటే ఇక్కడ సిటిజెన్స్‌కి పిల్లల ఎడ్యుకేషన్, ముసలివాళ్ళకి మెడికల్ అన్నీ ఫ్రీ మరి! మనలాంటి అన్య దేశస్థులకి పని చేసి సంపాదించుకునే హక్కు తప్ప మరే హక్కు ఇవ్వరు.
2020 ఎక్స్‌పో కోసం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద నిర్మాణాలు, మాల్స్ తయ్యారవుతున్నాయి. ఎటు చూసినా స్కై స్క్రాపర్స్. మెడలు ఎత్తి చూసి చూసి మెడలు నొప్పి పుట్టాయి. బస్ కోసం ముందే కార్డు కొనుక్కోవాలి, బస్‍లో టికెట్ వుండదు. ముందే పంచ్ చేయడం ద్వారా బస్ ఎక్కగలము. ఎక్కడ చూసినా మాల్స్‌లో, సూక్‌లలో, చివరకి డ్రైవర్స్ కిచ్చే ఎకామిడేషన్‍లో కూడా ఎయిర్ కండీషనింగేట. దుబాయ్‍లో ఈ రోజు చూసిన స్కై స్క్రాపర్స్, ఫ్లై ఓవర్స్ మళ్ళీ నెల వుండవుట… అంత త్వరగా నిర్మాణాలు మారిపోతూ వుంటాయట. చాలా వేగవంతంగా కూడా జరుగుతాయట.
బస్‌లలో, టాక్సీల్లో, చివరికి రోడ్ల మీద కూడా స్మోకింగ్, డ్రింకింగ్‍తో బాటు చూయింగ్ గమ్ నమలడం కూడా శిక్షార్హమే! మన రోడ్ల మీద గుట్కా తిని అసహ్యంగా నెత్తుటి మరకల్లా వుమ్మే వాళ్ళని అక్కడకి పంపి శిక్షలు వేయిస్తే బుద్ధొస్తుందేమో!
ఒకసారి లిల్లీ ఇండియా వచ్చినప్పుడు, ఇద్దరం అపోలో హాస్పిటల్‍లో నా మిత్రులు డా. నాయక్ గారి దగ్గరకు వెళ్తున్నాం. అంతకు ముందు ఒక బిల్డింగ్‍లో ఈ.ఎన్.టీ. టెస్ట్ రాస్తే లిల్లీకి, మెట్లు ఎక్కుతుండగా, కార్నర్స్‌లో టైల్స్ మీద జీసస్, బుద్ధుడూ, రాముడూ, వినాయకుడూ లాంటి బొమ్మలున్న టైల్స్ పెట్టడం చూపిస్తూ నేను “అవి ఎందుకు పెట్టారో చెప్పగలవా లిల్లీ?” అన్నాను. ఆమె తెలీదు అంది. “పాన్ గుట్కాలు తిని వుమ్మకుండా, అక్కడ దేవుళ్ళ బొమ్మలు పెట్టారు” అంటే ఆశ్చర్యపోయింది. అయినా వుమ్మే ప్రబుద్ధులు కూడా వుంటారనుకోండీ! అంతే కాదు ‘ఇచ్చట మూత్ర విసర్జన చేయరాదు’ అన్న బోర్డ్‌ని చూసి, – అప్పుడే గుర్తొచ్చినట్లు రోడ్ల మీద మూత్రం పోసే వాళ్ళుంటారు!
నేను సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా వున్నప్పుడు నపుంసకుల గురించి తీసిన ఓ ఆర్ట్ ఫిలిం సెన్సార్ చేస్తుంటే, ఒక దృశ్యం కట్ చేయకుండా వుంచాలనీ, అది సివిక్ సెన్స్‌కి సంబంధించినదనీ నేను వాదించాను. అదేమిటంటే, ఒక పోలీస్ రోడ్డు మీద గోడ వైపు తిరిగి మూత్రం పోసి, వెనక్కి తిరిగి, పార్క్‌లో ఓ యువ జంట ముద్దు పెట్టుకోవడం చూసి, “పబ్లిక్ ప్లేసెస్‍లో ఇలాంటి పనులు చేస్తారా?” అని చలానా రాస్తాడు. అప్పుడు ఓ నపుంసకుడు వచ్చి, “నువ్వు పబ్లిక్ ప్లేస్‍లో చేసిన పని కన్నా అసహ్యమైనదా, వాళ్ళు ముద్దు పెట్టుకోవడం? అది నీకేం హాని చేసిందీ?” అనడం, నాకు కరక్టే అనిపించింది. ఆ పని పోలీస్ చేయడం.. అది కూడా!
ఆ దేశపు రాజకుమారుడు షేక్ అహ్మద్ సెక్యూరిటీ గార్డ్స్ లేకుండా మాల్స్‌లో తిరుగుతూ అప్పుడప్పుడూ కనిపిస్తాడుట. అలాగే స్త్రీలూ స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా తిరగొచ్చట! బహుశా ‘సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్’ అని గైడ్ చెప్పింది నిజమే కావచ్చు! తుపాకీ భీతీ, దైవభీతీ రెండూ పని చేస్తున్నాయి కాబోలు! ‘సాగా ఇవా ది వరల్డ్’ అన్న మ్యూజియం దగ్గర మా బస్ ఆపారు. ఆ దేశంలో వున్న వృత్తి విద్యలన్నీ చేస్తున్న బొమ్మలున్నాయి అందులో. ఏమరుపాటుగా చూస్తే మనుషుల్లాగే వుంటాయా బొమ్మలు. అంత రియలిస్టిక్‍గా.
అక్కడ జెండా నలుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో వుంది. నలుపు – చమురుకీ, ఆకుపచ్చ – సుభిక్షతకీ, పసుపు – పరాక్రమానికీ సూచనట.
ఇక్కడ రాతి పాత్రల యుగంలో కూడా తయ్యారు చేసిన పూసల నగలూ, రాళ్ళ నగలూ, ఆ రంగులు చూస్తే స్త్రీకి ఆదిమానవుల కాలం నుండీ నగల మోజే అనిపించింది. ఆ తర్వాత జుబేరా రోడ్ లోకి వెళ్ళాం.
‘పామ్ జుబేరా’ అనే దీవిని కర్జూరపు వృక్షం ఆకృతిలో మలిచారు. ఆదివారాలు స్త్రీలు మాత్రమే సందర్శించవచ్చట. పర్యాటకుల గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు. ‘అతిథి దేవో భవ’ అన్న మాటకి అక్షరాలా విలువిస్తారు. మన టూరిస్టులు సందర్శనార్థం ఇచ్చే డబ్బు మీదే ఆ దేశపు ఆర్థిక విధానాలు ఆధారపడి వున్నాయి మరి! గమ్, సిగరెట్, తాగుడూకి మాత్రమే కాదు, రోడ్లు ఎక్కడంటే అక్కడ క్రాస్ చేసినా, ఆ దేశంలో శిక్షలున్నాయి. అవి కఠినంగా అమలు జరుపుతారు కూడా! జుబేరా రోడ్డు అంతా మెడికల్ ఫ్యాక్టరీలూ, ‘స్పా’లూ ఎక్కువగా కనబడ్డాయి. 2.6 మిలియన్స్ అక్కడ వుండవలసిన జనాభాగా నిర్ణయం అయింది. అక్కడ స్థానికులకి మెడికల్, ఎడ్యుకేషన్, పాస్‍పోర్ట్ అన్నీ ఫ్రీ. నాలుగు సార్లు వివాహం ఆడచ్చు, కొన్ని నిబంధనలతో. భార్యకి తగ్గని అనారోగ్యం ఉన్నప్పుడూ, భార్య మరణిస్తే, బ్రతికుండగానే ఆమె అంగీకారంతో కానీ వివాహ మాడచ్చు, కానీ అందరినీ సమానంగా చూసుకోవాలి.
ఇస్లామిక్ సెంటర్ అనే పెద్ద మతపరమైన బిల్డింగ్ చూసాం. అందులో మనం ఇస్లాం మతం గురించి ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, ముందు రోజు అపాయింట్‍మెంట్ తీసుకున్న వాళ్లని పొద్దుట పది గంటలకల్లా ఠంచనుగా ఫోన్ చేసి పిలుస్తారట. మన సందేహాలన్నింటికీ మత పెద్దలు జవాబు లిస్తారట. బ్రిటీషు వారి పాలనలో వున్నప్పుడు అతి పొడవాటి మార్గం నిర్మించారు. దాన్ని 2nd December Street అంటారు. ఇక్కడ అతి పెద్ద చేపల మార్కెట్ కూడా వుంది. ఈ పామ్ జుబేరాకి పదిహేడు బ్రాంచెస్ వున్నాయి. ఇక్కడున్న హయత్ రీజెన్సీ హోటల్ అతి పెద్ద రొటేటింగ్ హోటల్.
ఈ పామ్ జుబేరా ఐలాండ్‍లో మన దేశపు ప్రముఖులు విల్లాస్ కొన్నారు. షారూఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ లాంటి మన దేశస్థులే కాకుండా విదేశీయులు బ్రాడ్ పిట్, ఏంజలినా జోలీ లాంటి వాళ్ళు కూడా కొన్నారు. ఇవన్నీ చెప్తున్న మా గైడ్ అజీజ్ “ఒక రోజు నేనూ వాళ్ళ ఇళ్ళ దగ్గర విల్లా కొనాలనుకుంటున్నాను… బలంగా అనుకుంటే సాధించలేనిది లేదు” అన్నాడు.
నేను వెంటనే ఆ యువకుడి ‘గోల్’కీ, మనోబలానికీ చప్పట్లు కొట్టి థంబ్స్ అప్ సైన్ చూపించాను. అందరూ క్లాప్స్ కొట్టారు.
ఈలోగా నీళ్ళ క్రిందుగా మా బస్ ‘ట్రంక్’ లో నుండి ‘స్టెమ్’లోకి ప్రవేశించింది. ఆ దీవి ఖర్జూరపు వృక్షపు ఆకృతితో వుందిగా మరి! గైడ్ కంగారుగా, “మీ లైఫ్ జాకెట్స్ సీట్ క్రింద వున్నాయి, వేసుకోండీ” అనగానే విదేశీయులు కొందరు, సీట్ కింద చెయ్యి పెట్టి తడిమి చూసారు. గైడ్ నవ్వుతో, “ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్” అనగానే అందరం నవ్వేశాం.
తరువాత బూర్జ్ ఖలిఫాని చూపించాడు. ఆడ్రె అడర్‍సన్ అనే అమెరికన్ ఆర్కిటెక్ట్, అందులో హోటల్ నిర్మించాడని చెప్పాడు. పామ్ జుబేరాలో ఇసుక కూడా అతి మెత్తగా ‘మైదా’లా వుంది! ఎందుకంటే సముద్రం మధ్య లోంచి, వేల ట్రక్కులతో ఆ ఇసుకని తెప్పించారట. ఆ ఇసుక నీటిలో కొట్టుకుపోదట. బూర్జ్ ఖలిఫాలోకి వెళ్ళి పైదాకా ఎక్కడానికి టికెట్ వుంటుంది. పెద్ద క్యూ వుంది. మాకు అంత టైమ్ లేదు. ఆ ‘బూర్జ్’లో 18 కేరట్ గోల్డ్‍తో రెండు లైఫ్ సైజ్ గుర్రాల ప్రతిమలుంటాయిట. నాలుగు పెద్ద పెద్ద గోల్డ్ స్తంభాలుంటాయిట. అందులో వున్న హోటల్ 27వ ఫ్లోర్‍లో ఒక పెగ్ 2,700 దీరమ్స్‌ట! అది 27వ ఫ్లోర్‍లో వుండబట్టి ధర అలా నిర్ణయించారుట. ఒక రాత్రి అందులో వుండాలంటే 70,000 దీరమ్స్ చెల్లించాలట. బహుశా ‘బూర్జ్ ఖలీఫా’లో బూర్జ్ అంటే మన ‘బురుజు’ అనేమో! కోట బురుజులని మనమూ వాడతాముగా. వారి పదమే అరువు తెచ్చుకుని వుంటాం. ఇంగ్లీషు వారి ‘రోడ్’ని ‘రోడ్డూ’; ‘బస్’ని ‘బస్సూ’ చేసుకున్నట్లు!
(సశేషం)