[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]పం[/dropcap]దొమ్మిదివందల అరవై ఐదవ సంవత్సరం, ఏప్రిల్ నెల…
ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖకి కేవలం నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్న జోరాఫాం గ్రామం…
వంట గదిలోంచి వస్తున్న పరోటాలు కాలున్న కమ్మటి వాసనని ఆస్వాదిస్తూ ఫక్రుద్దీన్ మట్టి గోడలో కట్టిన తన రెండు గదుల యింటిని తృప్తిగా చూసుకున్నాడు. అతనికి ఈ యిల్లంటే ప్రాణం.. ఈ యింటితో అల్లుకుని ఎన్ని జ్ఞాపకాలో.. దాదాపు రెండు వందల ముస్లిం గుజ్జర్ కుటుంబాలు, పాతిక్కి పైగా హిందూ, సిక్కు కుటుంబాలున్న ఆ గ్రామంలోనే అతని బాల్యమంతా గడిచింది. తన చిన్నతనంలో ఆ స్థలంలో ఓ పూరిపాక ఉండేది. తనకు యుక్తవయసు వచ్చాక పాలవ్యాపారం మొదలెట్టాడు. వూళ్లో బర్రెగొడ్లు ఉన్న వాళ్ళ యిళ్ళకెళ్ళి పాలను కొని, క్యాన్‌లో నింపుకుని రన్బీర్‌సింగ్‌పురాకెళ్ళి అక్కడి హోటళ్ళకు అమ్మి డబ్బులు సంపాదించేవాడు.
అలా కూడబెట్టిన డబ్బుల్తో రెండెకరాల పొలం కొన్నాడు. గుడిసె ఉన్న స్థలంలో మట్టితో యిల్లు కట్టుకున్నాడు. పెళ్ళి చేసుకున్నాడు. రెండు బర్రెగొడ్లని, నాలుగు మేకల్ని కొన్నాడు. పాలవ్యాపారంతో పాటు వ్యవసాయం చేశాడు. రెండు బర్రెగొడ్లు నాలుగయ్యాయి. మరో ఎకరం పొలం కొన్నాడు.
ఇప్పుడు ఫక్రుద్దీన్‌కి నలభై ఐదేళ్ళు.. ముగ్గురు ఆడపిల్లలు.. యిద్దరు మగపిల్లలు.. ఇద్దరాడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకు పంపించేశాడు. పెద్ద కొడుక్కి కూడా ఏడాది క్రితమే పెళ్ళి చేశాడు. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రన్బీర్‌సింగ్‌పురా పట్టణంలో అతను చిన్నా చితకా పనులు చేసుకుంటూ అక్కడే కాపురముంటున్నాడు. చిన్న కొడుకు రషీద్‌కి, మూడో కూతురు ఫర్హానాకి యింకా పెళ్ళి కాలేదు.
ఇద్దరాడపిల్లల నిఖాల కోసం రెండెకరాల పొలంతో పాటు రెండు బర్రెల్ని అమ్మాల్సివచ్చింది. ఓ మేకని జహేజ్‌తో పాటు రెండో అల్లుడికి కానుకగా యిచ్చాడు. రెండు మేకలు పెళ్ళిళ్ళలో విందు కోసం హలాల్ కాబడ్డాయి. ప్రస్తుతం రెండు బర్రెలు, ఓ మేక మాత్రమే మిగిలాయి.
ఆ మేకంటే అతని భార్య ఫౌజియాకు ప్రాణం.. దానికి మున్నా అని ముద్దు పేరు పెట్టుకుంది. ‘ఫర్హానా పెళ్ళికి అవసరమైతే ఈ యిల్లమ్ముకోండి. నాకు అభ్యంతరం లేదు. కానీ నా మున్నాను అమ్ముతానంటే మాత్రం వూర్కోను’ అని ముందే హెచ్చరిక జారీ చేసింది.
రెండో అల్లుడికి కానుకగా యిచ్చిన ఆడమేకకు పుట్టిన మగసంతానం మున్నా.. ఇప్పుడది వయసొచ్చి మేకపోతులా మారి బలిష్ఠంగా తయారైంది. ఫౌజియాని ఎవరేమైనా అంటే చాలు తన వాడి కొమ్ములు ముందుకొచ్చేలా తలను వాల్చి, వేగంగా దూసుకొచ్చి కుమ్మేస్తుంది.
‘మున్నా నాకు నాలుగో బిడ్డ’ అంటూ దాని తలనీ, చెవుల్నీ నిమురుతూ ఫౌజియా మురిసిపోతూ ఉంటుంది.
ప్రస్తుతం ఫక్రుద్దీన్ దిగులంతా ఫర్హానా నిఖా గురించే. సంబంధాలు వస్తున్నాయి. ఎక్కువగా చుట్టు పక్కల ఉన్న గ్రామాల వాళ్ళే ఆసక్తి చూపుతున్నారు. తన కూతుర్ని బార్డర్‍కు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఇవ్వడం ఫక్రుద్దీన్‌కి సుతరామూ ఇష్టం లేదు. ఎటునుంచి ఏ సమయంలో బాంబులు కురుస్తాయో తెలీని దుస్థితి … ఏ క్షణంలో ఏ మోర్టారు వచ్చి యింటి మీద పడుందోనన్న భయం.. నిద్ర లేని రాత్రులు.. రాత్రి పడుకుంటే ఉదయానికి బతికుంటామో లేమో తెలీని అనిశ్చితత్వం.. తన కుటుంబం అనుభవిస్తున్న నరకం ఫర్హానా అనుభవించకూడదు. పరిస్థితి యింత ఘోరంగా ఉంటుందని తెలియక తన యిద్దరు కూతుర్లకి పెళ్ళిళ్ళు చేసి పక్కనున్న గ్రామాలకే పంపాడు. వాళ్ళూ తమలానే దినదినగండంలా బతుకీడుస్తున్నారు.
“ఏంటీ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?” చెక్క కుర్చీలో కూచుని ఆలోచనల్లో మునిగి ఉన్న తన భర్త చేతికి కంచం యిస్తూ అంది ఫౌజియా.
కంచంలో రెండు పరోటాలు, ఆలూ కుర్మా చూడంగానే ఫక్రుద్దీన్‌కి ఆకలి గుర్తొచ్చింది. ఆమెకు సమాధానం చెప్పకుండా పరోటా ముక్కని తుంపి, ఆలూ కుర్మాలో ముంచి, నోట్లో పెట్టుకుని నమిలాడు. కమ్మగా ఉంది.. మరో ముక్క తుంపుకుని నోట్లో పెట్టుకోబోతూ “ఏడీ మన బర్‌ఖుర్దార్.. ఈ రోజు పనికెళ్ళడా?” అని అడిగాడు.
“స్నానం చేస్తున్నాడండీ. వాణ్ణి ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వరా?” కోపంగా అంది. ఆమెకు తన పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. అందునా రషీద్ చివరివాడు కావడంతో మరీ అల్లారుముద్దుగా పెంచుకుంది. వాడి మీద ఈగవాలినా ఆమె సహించలేదు.
“ఎంతసేపు చేస్తాడట స్నానం? తడికెలో కట్టిన స్నానాల గదిలోకి వాడు దూరడం నేను చూళ్ళేదను కున్నావా? గంటకు పైగా అయింది. తొందరగా బైటికి రమ్మను. ఎప్పుడు నాస్టా చేస్తాడూ ఎప్పుడు పట్నాని కెళ్తాడు? ఆలస్యమైతే వాడి యజమాని తిడ్తాడని వాడేగా చెప్పాడు.”
“వెళ్తాడ్లెండి. ఎప్పుడూ వాడి వెంటబడి తరుముతారెందుకు? వాడి మానాన వాణ్ణి బతకనియ్యరా? పదిహేనేళ్ళు కూడా నిండని బిడ్డ శ్రమపడి పట్నానికెళ్ళి నాలుగు డబ్బులు సంపాయించుకుని వస్తున్నందుకు సంతోషపడాల్సింది పోయి ఎందుకు ఏదో ఒకటి అంటుంటారు?”
“అసలు పట్నానికి ఎవడు పొమ్మన్నాడు? వాడికేం ఖర్మ పట్టిందని వేరేవాళ్ళ దగ్గర పన్చేయాలి చెప్పు.. నాతో పాటు పొలానికి రావొచ్చు కదా.”
“వాడికి పొలం పని చేయడం ఇష్టం లేదని నెత్తీ నోరు బాదుకుని చెప్పాడు కదండీ. మీరు చేస్తున్నారుగా వ్యవసాయం.. వాడికి నచ్చిన పనేదో చేసుకోనివ్వండి.”
“వ్యవసాయం చేయడం నామోషీనా వాడికి? ఆ పొలం పెట్టిన కూడే మనం తింటున్నాం. ఆ పొలం పెట్టిన భిక్షతోనే యిద్దరు కూతుర్లకు పెళ్ళిళ్ళు చేశాను.”
స్నానం చేసి అప్పుడే యింట్లోకి వస్తున్న రషీద్ తన తండ్రి వైపు విసుగ్గా చూశాడు. అమ్మ వైపు తిరిగి “మళ్ళా మొదలెట్టాడా ఈయన? ఎన్నిసార్లు చెప్పానమ్మా నాకు పొలం పని ఇష్టముండదని.. పట్నంలో కూలిపనైనా చేస్తాను కాని నా ప్రాణం పోయినా పొలం పని చేయను” అన్నాడు.
“నీలా అందరూ అనుకుని పొలం పనులు మానేస్తే నిజంగానే అందరి ప్రాణాలు పోతాయిరా.. తినడానికి తిండి లేక మాడి చస్తారు. పొలాల్లో రైతులు చెమటోడ్చి శ్రమ పడబట్టే మన నోట్లోకి నాలుగు వేళ్ళూ పోతున్నాయి” అన్నాడు ఫక్రుద్దీన్.
అమ్మ తన చేతికిచ్చిన థాలి పట్టుకుని గోడకానుకుని కూచుని మౌనంగా పరోటాలు తినసాగాడు రషీద్.
“నువ్వు తింటున్నావే పరోటాలు… అవి పొలంలో రైతులు గోధుమలు పండిస్తేనేరా వచ్చాయి. ఆలూ కుర్మా కూడా అంతే… పొలాల్లో ఆలుగడ్డలు పండిస్తేనే వచ్చింది. రైతు రాజు లాంటి వాడురా. నీకలా ఇష్టం ఉండదుగా. ఎవరికిందనో వూడిగం చేస్తూ బానిస బతుకు బతకడమే ఇష్టం” అన్నాడు ఫక్రుద్దీన్.
“రోజూ ఈ నసను భరించలేకుండా ఉన్నానమ్మా. నేను పట్నంలో అన్న వాళ్ళింట్లోనే ఉంటానని అందుకే చెప్పాను. ఈ రోజు సాయంత్రం యింటికి తిరిగి రాను. అక్కడే ఉండిపోతాను” సగం రొట్టెని కంచం లోనే వదిలేసి లేచాడు రషీద్.
“వద్దు నాయనా.. అలా చేయకు. నిన్ను చూడకుండా ఉండలేను. ఆయన మాటలకేంలే.. పట్టించుకోకు” అంటూ తన భర్త వైపు తిరిగి “మీ వల్లనే వాడు తినే తిండిని కూడా వదిలేసి లేచాడు. ఎందుకలా నోరు పారేసుకుంటారు? వాడు తిని లేచేవరకైనా నోరు మూసుకుని ఉండొచ్చుగా” అంది ఫౌజియా.
“వాడు నా మాటలకు రోషమొచ్చి లేచాడనుకుంటున్నావా? తిండి ఎక్కువై లేచాడు” అన్నాడు ఫక్రుద్దీన్.
అప్పటివరకూ వంటగదిలో కూచుని పరోటాలు కాలుస్తున్న ఫర్హానా బైటికొచ్చి “ఎందుకు నాన్నా అలా అంటారు? మీరిలా అంటుంటే వాడు ఏదో రోజు యిల్లొదిలి వెళ్ళిపోతాడు” అంది.
“నీ నిఖా అయ్యేవరకు ఎక్కడికీ పోన్లే దీదీ.. ఈయన ఏమన్నా సరే నీ కోసం భరిస్తాను” అక్క వైపు ప్రేమగా చూస్తూ అన్నాడు రషీద్.
అమ్మతో అక్కతో వెళ్ళిస్తానని చెప్పి నాన్న వైపు ఓ నిరసన చూపొకటి విసిరి బైటికెళ్ళిపోయాడు.
“చూశావా నీ కొడుక్కి ఎంత పొగరో.. వెళ్ళాస్తానని నాతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు చూశావా?” అన్నాడు ఫక్రుద్దీన్.
“వయసొచ్చిన కుర్రాడు.. అన్నన్ని మాటలంటున్నా వాడు కాబట్టి భరిస్తున్నాడు. వేరే ఎవరైనా ఐతే ఎదురుతిరిగి సమాధానం చెప్తారు. వాడు బుద్ధిమంతుడు కాబట్టి మీ గౌరవాన్ని కాపాడుతున్నాడు. ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిది” అంది ఫౌజియా.
“నాకు తెలుసు.. ఈ యింట్లో మీరు ముగ్గురూ ఒకటని… నేనే ఒంటరివాణ్ణి. ఐనా నేనేమన్నానని.. పొలంపనుల్లో నాకు సాయంగా ఉంటే బావుంటుందని కోరుకోవడం తప్పా?” అన్నాడు బాధగా ఫక్రుద్దీన్.
ఫౌజియా సమాధానమివ్వకుండా ఫర్జానా వైపు తిరిగి, “నేను మున్నాని బైట తిప్పుకుని వస్తాను. వాడికి ఆకలేస్తో ఉంటుంది. లేతాకులు తెంపి వాడికి పొట్ట నిండా తిన్పిస్తే గానీ నాకేమీ తినాలనిపించదు” అంది.
“సరే. నీ నాలుగో కొడుకు ధ్యాసలో పడ్తే నీకు మేమెవ్వరం కన్పించంగా. నేను కూడా పొలానికి వెళ్ళొస్తాను” అన్నాడు ఫక్రుద్దీన్.
(ఇంకా ఉంది)