[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు వచ్చిన గ్రంథాల కంటే భిన్నమైన వస్తురూపాలతో – విలక్షణంగా వెలువడిన గ్రంథాల విశ్లేషణ. తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]
నిష్ఠుర వాస్తవాలు – పరిణత శైలీశిల్ప కథాకథనాలు: ‘అభిశప్త కథలు’
[dropcap]“సా[/dropcap]రస్వత కళానిధి” ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మిగారు తెలుగు సాహితీలోకంలో సుప్రసిద్ధ సారస్వత మూర్తి. తెలుగు సంస్కృత భాషల్లో ఉన్నత విద్యావంతురాలు. కళాశాల ప్రాచార్యులుగా ప్రముఖులు. ఆధునికాంధ్ర కవిత్వంలో వ్యక్తిత్వ వికాసం, భగవద్గీత వ్యక్తిత్వ వికాసం, కవిత్రయ మహాభారతంలో మేనేజ్మెంట్ రీతులు- వంటి ఉత్తమ గ్రంథాలతో భావిభారత పౌరుల వ్యక్తిత్వ నిర్మాణం పట్ల సదాశయ స్ఫూర్తిని ప్రచోదితం చేస్తున్న నిబద్ద గుణశీల. ప్రవచనకర్తగా, వక్తగా, సభా వేదికల నుండి, ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసార మాధ్యమాల ద్వారా అనన్య ప్రాచుర్యం, విజ్ఞుల ఆదరణ కలిగిన విదుషీమణి. డాక్టర్ నాగరాజ్యలక్ష్మిగారి అపూర్వ సృజనగా- ‘ప్రకృతి విలాసం’, ‘మన పుణ్య నదులు’, ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’-సాహిత్య రూపకాలు వెలువడి ఆమెయే ప్రయోక్తగా ప్రదర్శింపబడి ప్రముఖ సాహితీవేత్తలచే, విమర్శకులచే విశేష ప్రశంసల్ని పొందాయి. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారు అనేక ప్రతిష్ఠాత్మక పదవుల్ని నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్వర్ణ పతకం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కారం, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఆచార్య దివాకర్ల వేంకటావధాని, రాయప్రోలు సాహిత్య పురస్కారాలు వంటి ఎన్నో సత్కారాల్ని పొందారు.
‘అభిశప్త కథలు’ డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారి ప్రయోగాత్మక రచన మాత్రమే కాక సామాజిక ప్రయోజనాత్మక రచన కూడా. బాలల సంరక్షణ సమితి సభ్యురాలుగా తాను చూసిన, చూసి ఆవేదన చెందిన, పరిష్కరించిన కొన్ని సామాజిక అవాంఛనీయతల్ని, బాధ్యతగా నిర్వహించిన కార్యక్రమాల్ని వాస్తవిక సంభవాల ఆధారంగా ఈ కథా కథనాల్ని వెలువరించారు ఆమె.
ఈ సంపుటిలో ఇరవై ఒక్క కథలు ఉన్నాయి. ఈ కథలోని అభిశప్తలు అందరూ వ్యక్తుల అలసత్వానికి, ఉపేక్షకు, వ్యవస్థల దౌర్భాగ్యానికి, మొత్తం సమాజపు దుర్మార్గాలకు, దారుణాలకు బలి అయిన వారే. వారందరూ మైనర్లే. అనాథలంతా, అభాగ్యులంతా! ఈ కథలన్నిటా ప్రధాన పాత్ర సునంద. ఆమె బాలల సంరక్షణ సమితి సభ్యురాలు. ఆ సంస్థ నిర్వహించే బాధ్యతాయుత కార్యక్రమాల్ని రచయిత్రి మొదటి కథలోనే ఇలా చక్కగా వివరించారు: “నిరాశ్రయులు దారిద్ర్యరేఖకు అట్టడుగున ఉన్నవారు తమ పిల్లలను బాలల సంరక్షణ సమితి ద్వారా ప్రభుత్వ సదనాలలో కానీ, స్వచ్ఛంద సంస్థల నిర్వహణలో నడపబడుతున్న బాలల సంరక్షణ సంస్థలలో కానీ చేర్చడానికి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అలా వచ్చిన బాలబాలికలను పరిశీలించి వారి తల్లిదండ్రులు, కుటుంబ పరిస్థితులు విచారించి సమితి సభ్యులు వారికి తగిన సంరక్షణ కేంద్రాలను జిల్లా స్థాయిలో నిర్ణయించి వారికి సిఫార్సు చేసి పంపిస్తారు. అనాథ బాలబాలికలను వారి బంధువులు, బాధ్యత కల వ్యక్తులు కానీ వెంట బెట్టుకొని వచ్చి బాలల సంరక్షణ సమితి అప్పగిస్తారు”.
‘అభిశప్త’ కథలో శిరీష అనాథ. 12 ఏళ్లకే తల్లిదండ్రులిద్దరూ కన్నుమూశారు. ఎవరో బంధువులు దురాశతో ఆమెను చేరదీసి ఊడిగం చేయించ సాగారు. 15 సంవత్సరాలు వచ్చేసరికి అందం, అమాయకత్వం నిండిన నీడలేని యువతి అయింది. ఫలితంగా కామాంధుల విలాస క్రీడలకు ఆట వస్తువు అయింది. వీధిన పడే పరిస్థితి వచ్చింది. రైల్వే పోలీసుల ప్రమేయంతో బాలల సంరక్షణ సమితి చేరింది. ఆరోగ్య పరీక్షలు చేయించారు. హెచ్.ఐ.వి పాజిటివ్ అని తేలింది. వసతి, మందులు ఇప్పించడం వంటి సౌకర్యాలు కల్పించారు.
కానీ ఉన్నట్టుండి ఒకరోజు శిరీష ఒక లేఖ రాసి వసతిగృహం వదలి విడిపోయింది. పురుష జాతి మీది తన ఆగ్రహాన్ని దుర్మార్గులైన పెద్దల ఆకర్షించి వారిని కూడా హెచ్.ఐ.వి పాలు చేస్తానని తీర్మానించుకొన్నట్టు ఆ లేఖ సారాంశం! “ఇలా స్త్రీ జాతి బతుకుతున్న జనారణ్యంలో ఎవరిని తప్పు పట్టాలి? ఈ చరిత్ర ఎలా మారుతుందని ఆశించాలి? అభిశప్త శిరీష వంటి అమాయకపు యువతులకు సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, దేశం పట్ల ఎంతవరకు విశ్వాసం, గౌరవం మిగిలి ఉంటాయి? ఈ పిచ్చి తల్లిని ఎవరు తమ ఒడిలోకి చేర్చుకుంటారు? ఈ సందేహాలను నివృత్తి చేసేది ఎవరు?” అంటూ కథ ముగిసింది. నిజానికి ముగియలేదు. సమాజం, మనుషులు అంతర్వీక్షణం చేసుకొని జవాబు ఇవ్వవలసిన ప్రశ్నలతో కథ- ‘సశేషమే’!!!
‘పడిలేచిన కెరటం’ కథలో లావణ్య పై కిరణ్ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి దయనీయమైన స్థితిలో వదలి పారిపోయాడు. ఆ పిల్లకు బాలల సంరక్షణ సమితి ఆఫ్టర్ కేర్ సర్వీసెస్ అనే ప్రభుత్వ బాలల సంక్షేమ శాఖ కల్పించిన సదుపాయాల ద్వారా చదువుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఆమె విశ్వవిద్యాలయంలో పట్టా పుచ్చుకుని గోల్డ్ మెడల్ సాధించి న్యాయశాస్త్రంలో పీహెచ్‍డి కూడా చేసింది. అన్యాయానికి బలి అయిన వారికి చేయూతనిచ్చి నిలబెట్టి ధైర్యం చెప్పి జీవితాన్ని అందిస్తే చాలామంది లావణ్య లాగా పడిలేచిన కెరటాలై ఉన్నత స్థాయిలో జీవిత లక్ష్యాన్ని చేరుకుంటారు – అనేది సందేశం!
‘జీవనజ్యోతి’ కథలో పిల్లలు లేని దంపతులు బాలల సంరక్షణ సమితి ద్వారా పిల్లలను దత్తత తీసుకునే విధానం, అమలు తీరును తెలియజేస్తుంది.
‘కంచే చేను మోస్తే’ కథలో ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్‌లో ఆడపిల్లలపై జరిగే అకృత్యాలు, వాటికి పరిష్కారంగా బాలల సంరక్షణ సమితి చేపట్టిన చర్యల వివరణ వచ్చింది.
యవ్వనారంభ దశలో 10వ తరగతి చదువుతున్న కాలు జారిన రాములమ్మ కూతురు కలియుగంలో కుంతిలా మారింది. ఆమె కన్న బిడ్డను బాలిక సంరక్షణ కేంద్రంలో చేర్పించి అభం శుభం తెలియని ఆమెకు చదువే జీవితానికి దిక్సూచిగా ఒక దృఢమైన లక్ష్యాన్ని అందించింది సమితి.
‘నిర్ణయం’ కథానిక బాల్య వివాహాల నిరసన, తిరస్కారం, ఆ దురాచారానికి బలి కాబోతున్న సరళని బాలల సంరక్షణ సమితి వారు ఆదరించటం, రామినేని ఫౌండేషన్ వారి సహకారంతో ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడే రేట్లు చేయటం ఇతివృత్తం. ఆమె ‘సరళ ఫ్యాషన్ డిజైనర్స్’ యజమానురాలుగా అభివృద్ధి పథంలోకి అడుగ పెడుతున్నది!
‘న్యాయం కోసం’, ‘ ఇది కథ కాదు’ కథానికల్లో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వయసు మీరిన వారు ఆడపిల్లలపై జరిపే అకృత్యాల్ని, వాటికి విరుగుడునీ చూపటం జరిగింది.
‘మబ్బులు విడిచిన సూర్యుడు’, ‘ఇది కథ కాదు – రెంటిలోనూ తల్లిదండ్రుల నిర్లక్ష్యం పర్యవసానంగా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా చెడిపోతుంది ఎంతో ఆర్థంగా చిత్రించడం జరిగింది. అలాగే ‘వెలుగుదారి’, ‘మసకబారిన బాల్యం’ కథానికల్లో ఈనాటి విద్యా విధానంలో రావలసిన మార్పుల్ని, తల్లిదండ్రుల దృక్పథంలో వాంఛనీయమైన పరిణామాల చిత్రణ ఎంతో ఆర్థంగా జరిగింది. ‘అమ్మ దొరికింది’ కథలో పుష్కరాల్లో తప్పిపోయిన రవి బాలల సంరక్షణ సమితి ఆదరణతో ఈనాడు 24 ఏళ్ల వయసులో పోలీస్ ఆఫీసర్‌గా అసలు తల్లిదండ్రుల్ని తిరిగి కలుసుకోవటం ఇతివృత్తం. ‘విముక్తి’ కథానికలో వెట్టిచాకిరీ నుండి ఒక ఆడపిల్లకి విముక్తి కలిగించడం ప్రధాన అంశం. ‘అనుబంధం’ కథానిక పిల్లల కోసం ఆరాటపడే దంపతులకు బాలల సంక్షేమ సమితి పిల్లల్ని పెంచుకోవడానికి అందజేయడం, ఫాస్టర్ కేర్ పద్ధతిలో వారి సంరక్షణ బాధ్యతల్ని అప్పజెప్పడం, తద్వారా బిడ్డకు తల్లిదండ్రులకు మధ్య అనుబంధాన్ని స్థిరపడేటట్లు చేసి పరస్పర ప్రేమ ఆప్యాయతలు కలిగింప చేయటం కథాంశంగా సాగింది.
‘అభిశప్త’ కథలు సంపుటిలో ‘కర్తవ్యం’, ‘విధి’, ‘బ్రతుకు బండి’ అనేవి కరోనా మహమ్మారి తెచ్చిన కష్ట పరంపరని మాత్రమే కాక మానవ సంబంధాల్లో తీసుకువచ్చిన సానుకూల పరిణామాల్ని కూడా చిత్రించాయి.
‘అభిశప్త’ కథలు సమకాలీన సమాజ సంక్లిష్టతలను, అమానవీయతలను, వ్యవస్థలకు మనుషులకు మధ్యన గల సంఘర్షణల్నీ, ఈనాటికీ సంఘంలో సాగిపోతున్న అక్రమ, అసంబద్ద, అనైతిక, అనాగరిక రీతీ రివాజుల్నీ పారదర్శకంగా ఆవిష్కరించాయి. అవాంఛనీయ ధోరణులను ఎత్తి చూపడమే కాక వాటికి అందుబాటులో ఉన్న నివారణ పద్ధతులను, ప్రభుత్వ ప్రోత్సాహకాలను, సంస్థలను, ఆ సంస్థలో చొరవతో సామాజిక నిబద్ధతతో పనిచేస్తున్న సునంద వంటి కార్యకర్తల గుణ శీలాన్ని కూడా ఎంతో సంఘటనాత్మకంగా ఆవిష్కరించాయి.
డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారి కథాకథన విధానం, శైలీ శిల్పాలు- నిజానికి నాటక నిర్మాణ పద్ధతిలో సాగాయి. అందువలననే అవి సన్నివేశం వెంట సన్నివేశాన్ని చకచక జరుపుతూ అద్భుతమైన దృశ్యాత్మకతను సాధించుకున్నాయి. నాటక రూపమైన కథలుగా రూపొందాయి. సంపుటిలోని కథలన్నిటా డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారి సామాజిక అధ్యయనం, సమస్యా పరిశీలనం స్ఫుటంగా ద్యోతకమవుతోంది. ఇంతవరకు రచయితలు ఎవరూ స్పృశించని లేక ప్రత్యేకంగా గుర్తించని వివక్షతకు గురి అవుతున్న బాలబాలికల జీవితాల్లోని చీకటి కోణాలను డాక్టర్ నాగరాజ్యలక్ష్మి గారు ఎంతో పరిణత మనసుతో ఆవిష్కరించారు. ఆ విధంగా ఒక ముఖ్యమైన సామాజిక అవసరాన్ని, సాహిత్య అవసరాన్ని కూడా ఆమె నిబద్ధతతో, నిమగ్నతతో నెరవేర్చారు. వారికి హృదయపూర్వక అభినందనలు. ఆ నిరంతర అధ్యయన శీలికీ, జీవితాసుభవశాలికీ హృదయపూర్వక అభినందనలు!!