[dropcap]చె[/dropcap]ట్టు – పిట్ట – పుట్ట
కలిసిన ప్రకృతి లో
మట్టి పరిమళపు మేళవింపులో
ఎన్నో ఎన్నో స్మృతులెన్నెన్నో!
మూగజీవుల పలకరింతలు
చిగురుటాకుల రెపరెపలు
పరుగులు తీసే
నదీ నదాలు
అనుభవ సారపు జీవవాహినులు!
నిన్నటి వేదనల వల్మీకాలు
రేపటి ఆశల తొలకరులు
నేటి అనుభవాల పులకరింతలు
ఆరాట-పోరాటాల పడుగు పేకలు!
జానపదుల జాజరలు
ఙ్ఞానపథానికి సోపానాలు
మనిషితనానికి పలవరింతలు
మహా కావ్యానికి
శ్రీకారాలు !!