[dropcap]”అ[/dropcap]రవై సంవత్సరాలుగా ఈ సృష్టి నన్ను/ అనుక్షణం అబ్బురపరుస్తూనే ఉంది/ ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది” అంటూ ‘అనామకుడు’ పేరిట ప్రసిద్ధి పొందిన ఎ.ఎస్. రామశాస్త్రి సృజించిన అరవై పద్యాల ‘అక్షరాంజలి’ ఆరంభమవుతుంది.
“నిక్షిత్ప విశ్వరహస్యం, సృష్టివిలాసం/ నిరంతరం నాలో కలిగించే ఆలోచనల్ని ఆ సృష్టికర్తకే/నివేదించాలన్న కోరిక ఎన్నాళ్ళుగానో నాలో నిక్షిప్తమై ఉంది. సృష్టికర్త ప్రేరణతోనే/సృష్టిలో నేను చూస్తున్న విశేషాలనీ వింతలనీ/సృష్టికర్తకు విన్నవించుకునే ప్రయత్నం మొదలుపెట్టాను” అంటూ ఈ రచనకు ప్రేరణను, ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.
ఈ పద్యాల ‘అక్షరాంజలి’లో, ఆత్మనివేదన, నీ వినోదం, మా సందేహం, నీ విలాసం, ఉపనిషత్తులు, సనాతన విజ్ఞానం, నా విన్నపం – అన్న శీర్షికలతో పద్యాలున్నాయి.
“కారణమేమి వ్రాయుటకు – కాదు ధనార్జన కాదు కీర్తియున్/కారకుడైన నీ పయిని గౌరవమంతయు విన్నవించుటే” అన్న ఆలోచనను స్థిరం చేస్తూ ఈ పుస్తకాన్ని అందరికీ ఉచితంగా అందజేస్తున్నారు.
‘నీ వినోదం’ అన్న శీర్షికన ఉన్న పద్యాలలో సృష్టిలోని విచిత్రాలను, అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవటం కనిపిస్తుంది. మనం అనేక విషయాలను పట్టించుకోం. అలుసుగా, సామాన్యంగా చూస్తాం. అలాంటి విషయాలలోని ‘అద్భుతాన్ని’, ‘ఆశ్చర్యాన్ని’ అవి ఎంత అసామాన్యమైనవో ఆలోచనాత్మకంగా ప్రదర్శిస్తాయి ఈ అధ్యాయంలోని కవితలు.
“తూరుపు వెల్గురేకలను, తోయపుధారల, ప్రాణవాయువున్,/క్షీరమునిచ్చు గోవులను, సేద్యము చేయగ సారభూములన్/పారు నదీనదంబులను, పర్వతశ్రేణుల, సాగరంబులన్/కోరగ ఊహకందనివి కూర్చితివన్నియు నీదు కాన్కగా” – ఇది ప్రకృతిని చూసి ఆశ్చర్యంతో పలికిన పద్యం.
“ఉన్నవి శ్వాస తీయుటకు ఊపిరితిత్తులు, అన్నకోశమున్/సన్నని రక్తనాళమున సన్నసనంబుగ నింపు గుండెయున్” అంటూ మానవ శరీర నిర్మాణం చూసి ఆశ్చర్యపోతూ చెప్పిన పద్యం ఆలోచనలను కలిగిస్తుంది. మానవ శరీరమనే యంత్రాన్ని నిర్మించి ప్రోగ్రామ్ చేసింది ఎవరో! అన్న ఆలోచనను కలిగిస్తుంది.
‘ఉపనిషత్తులు’ విభాగంలోని పద్యాలు ఉపనిషత్తులలో చర్చించిన అనేక తాత్వికాంశాలను సరళంగా, సూక్ష్మంలో ప్రదర్శిస్తాయి.
సనాతన విజ్ఞానం విభాగంలో ‘నిరాకరం’ శీర్షికలో నిరాకారాన్ని వర్ణించే పద్యం “అపుడు ఇపుడు ఉండు; అచట ఇచట ఉండు;/స్థలము కాలములను నిలువబోదు;/లేవు పూర్వపరము; లేవు వాసనలేవి/లేదు నాశనంబు లేనెలేదు” అంటూ ముగుస్తుంది.
అత్యంత క్లిష్టమైన, తాత్విక భావనలను అత్యంత సరళంగా, సులువుగా అర్థమయ్యే రీతిలో పద్యాల రూపంలో అందించారు.
‘నా విన్నపం’ అన్న చివరి విభాగంలో “మతమైనను కులమైనను/జతగా దేశంబులైన సంఘంభైనన్/మితిమీరు ‘దురభిమానము’/పతనమునకు మొదటి మెట్టు వలదది నాకున్” అనే సార్వజనీన భావాన్ని ప్రదర్శిస్తారు.
పుస్తకం చివరలో పద్యాలలో ప్రదర్శించిన వైజ్ఞానిక అంశాల వివరణను అనుబంధంగా చేర్చారు. తన అరవయ్య ఏట అరవై పద్యాలలో తన అనుభవం ద్వారా గ్రహించిన విజ్ఞానాన్ని, కలిగిన ఆలోచనలను ప్రదర్శించి అందించిన రచయిత అభినందనీయులు. ఈ పద్యాలను ఏ కాస్త తెలుగు తెలిసిన వారయిన చదివి ఆనందించవచ్చు, ఆలోచించవచ్చు.
పుస్తకం చదివి తమ అభిప్రాయాలను రచయితకు తెలపడం ద్వారా రచయితకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వచ్చు. రచయిత తన బాధ్యత నెరవేర్చారు. ఇక సాహితీ ప్రియులు తమ బాధ్యత నెరవేర్చాలి.
***
అక్షరాంజలి
రచన: అనామకుడు
ప్రచురణ: అపరాజిత పబ్లికేషన్స్,
పేజీలు: 54
వెల: అమూల్యం
ప్రతులు: ఉచితం
asramasastri.com/books/aksharanjali.pdf