మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-15

3
3

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

ఫకీర్ కడుపు నుంచి బయటపడ్డ చిలుక లోకి ప్రవేశించిన జయదేవ్ వేగంగా అంతఃపురానికి చేరుకున్నాడు. ఎప్పటిలానే ఆ రాత్రి రాగలత, మహారాజుకు కథ చెప్పసాగాడు.

అదృశ్య రూపం నుంచి బయటపడి ముసుగుతో వస్తాడు అనుకున్న తారానాథ్ ఏమైపోయాడోనని మనోరమ  ఏడవటం మొదలు పెట్టింది. మకరంద్ కూడా ఆందోళనతో మాధురీ బేగంని వేడుకొన్నాడు తాము వెళ్లి తారానాథ్ జాడ కనుక్కుంటామని. జయంతుని (అవంతి) మాత్రం పంపనని చెప్పింది మాధురి బేగం. “పది రోజుల గడువు. లాల్మియా కనపడిన వెంటనే ఈ అక్షింతలు చల్లండి. అతని పళ్ళు ఊడిపోతాయి. పళ్ళతో పాటు అతని శక్తులన్నీ పోతాయి” అని మంత్రాక్షతలు ఇచ్చి చెప్పింది మాధురి. దిగులుగా చూస్తూ జయంతుని రూపంలో ఉన్న అవంతి అక్కడే ఉండిపోయింది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు బయటకి వెళ్ళిపోయారు.

గురవయ్య వెంట వచ్చిన వ్యక్తికి ముసుగు తీసి,  తారానాథ్‌ని చూసి మండిపడ్డాడు లాల్మియా. వారిద్దరితో  పాటు బాణంభట్టును కూడా ఆగ్రహించి శిక్షించపోతే ముగ్గురూ క్షమించమని వేడుకొన్నారు. లాల్మియా కనికరించి తన శిష్యులుగా చేసుకుని తిరిగి ముగ్గురికి అంజనం పట్టించి ఎవరికీ కనపడకుండా చేశాడు. గురవయ్యకు మళ్ళీ కొంత విభూతి ఇచ్చి ఈసారి కచ్చితంగా బేగంను తీసుకొని రమ్మన్నాడు. తాను గోరిలోకి ప్రవేశిస్తూ బయట కాపలాగా అదృశ్య రూపంలో ఉన్న తారనాథ్‌ని ఉంచాడు.

ఈసారి గురవయ్య మకరంద్ కంటే కొంచెం ముందుగా నడుస్తున్న మనోరమ మీద విభూతి చల్లి వేగంగా నడవటం మొదలెట్టాడు.

మౌనంగా అంతే వేగంతో అదృశ్యంగా ఉన్న అతని వెంట నడిచి వెళ్లి పోసాగింది. అదృశ్యంగా ఉన్న గురవయ్య అతనికి కనపడక, చెల్లి ఎందుకు వేగంగా నడిచిపోతుందో తెలీక, మనోరమని ‘చెల్లి’ అని పిలుస్తూ మకరంద్ కూడా ఆమె వెనకే రాసాగాడు. కానీ వారి వేగాన్ని అందుకోలేకపోయాడు.

లాల్మియా ఉన్న గోరి దగ్గరికి వచ్చాడు గురవయ్య. అతని వెనకే మనోరమ. వారిని అనుసరిస్తూ మకరంద్. గురవయ్య తారానాథ్‌కు మాత్రమే కనిపిస్తున్నాడు. “ఏమిట్రా నా భార్యను తీసుకు వచ్చావ్” అని గట్టిగా అరిచాడు తారానాథ్. బావ గొంతు గుర్తుపట్టాడు మకరంద్. కానీ కనీపించడం లేదేం! “ఏమిటీ వింత బావ” అన్నాడు. ఆ విషయాన్ని వివరించసాగాడు తారానాథ్. అంతలో గురవయ్య పారిపోయాడు. అతని వెంట అనుసరిస్తూ వెళ్ళిపోయింది మనోరమ. కంగారుగా తారానాథ్, మకరంద్ బయల్దేరారు మనోరమ ఎక్కడుందో వెదకటానికి.

గురవయ్య వడివడిగా నడవసాగాడు వెనక్కితిరిగి మనోరమని చూస్తూ. మౌనంగా అతన్నే అనుసరిస్తూ వేగంగా నడుస్తూ వస్తోంది మనోరమ. ఆమెను వదిలించుకోవాలని ఎక్కడెక్కడో తిరిగాడు. లాభం లేక తన ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టి భార్య గున్నమ్మని పిలిచాడు. ఆమె బయటకు వచ్చింది. గురవయ్య కనపడలేదు, కానీ మౌనంగా నిలుచున్న మనోరమ కనిపించింది. తన భర్త గొంతుతో ఏదో దెయ్యం పిలుస్తున్నదని భయపడి తలుపు వేసుకున్నదామె.

చేసేదేమీలేక గురవయ్య వీధులన్నీ తిరగసాగాడు. ఎంత ప్రార్థించినా మనోరమ వెనక్కి తిరిగి వెళ్లడం లేదు. విభూధి మహత్యం. తిరిగి తిరిగి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. మనోరమ కూడా అతనికి దూరంగా కూర్చుంది.

ఆ ఇల్లు ఒక పెద్ద వేశ్యామణిది. తెల్లవారి బయటకి వచ్చిన వేశ్య రత్నమంజరికి అద్భుత సౌందర్యరాశి అయిన మనోరమ కనిపించింది. ‘ఎవరు నీవు’ అని అడిగింది. మనోరమను వదిలించుకోవటానికి గురవయ్యకి ఒక ఆలోచన వచ్చి, తానొక యక్షుడనని,  అందుకే కనిపించడం లేదని ఏదేని వరము కోరుకోమని అడిగాడు. ‘నేనొక వేశ్యను. ఒకప్పుడు చాలా ధనం సంపాదించి,  తర్వాత మొత్తం కోల్పోయాను. ఈ రూపసుందరిని  కొన్నాళ్ళు తనదగ్గర ఉంచమని, అందుకు వంద వరహాలు ఇస్తా’నని చెప్పింది. గురవయ్య సంతోషంతో వరహాలు తీసుకొని,  లోపలకు వచ్చినట్టు వచ్చి, తనని అనుసరిస్తున్న మనోరమ లోపలికి రాగానే వెంటనే బయటికి వెళ్లిపోయాడు. చటుక్కున తలుపు వేసేసింది రత్నమంజరి. అలాగే నిలబడిపోయింది మనోరమ. రత్నమంజరి ఇల్లూ వాకిలి శుభ్రం చేసుకొని తాను చక్కగా అలంకరించుకొని, మౌనంగా ఉన్న మనోరమను కూడా అలంకరించింది. ఒక విందు ఏర్పాటు చేసి ధనికులందరినీ ఆహ్వానించింది.

మనోరమ కోసం వెతికి వెతికి మకరంద్ తారానాథ్‌లు తిరుగుముఖం పట్టారు. పైగా మూడు దినాలు అయింది నాలుగో నాటి ఉదయం ఆ మంత్రగాడు లాల్మియా గోరి నుండి బయటకు వస్తాడు అని తారానాధ్ చెప్పడంతో ఇరువురు గోరి దగ్గరకు వచ్చారు. గతంలో లాల్మియా చెప్పినట్టు తారానాధ్  “లాల్ కా సవాల్” అని మూడు సార్లు పిలిచాడు.

“ఓరి గురు ద్రోహి! నమ్మించి మోసం చేస్తున్నావా! నేను బయటికి రాను. మీరిద్దరూ వెళ్లి పోండి” అన్నాడా మాయావి. “నీచుడా మా కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తున్నావ్” అంటూ మకరంద్ గోరి దగ్గరికి వెళ్లి కత్తితో పడగొట్టడానికి ప్రయత్నించసాగాడు.ఆయుధం వంకర పోయింది కానీ గోరి పగలగొట్ట లేకపోయాడు.

అంతలో ఒక వాయసం గాలిలో ఎగురుతూ వచ్చింది అక్కడికి.  “వీరుడా నీ  పట్టుదల మెచ్చుకోదగినదే. కానీ నువ్వు విచ్ఛిన్నం చేయబోతున్నది రోహియాబేగం అనే ఒక పవిత్రురాలి సమాధిని. అది మంచి పని కాదు” అంది. “దీనిని పగలగొట్టనిదే లాల్మియా బయటకు రాడు” అన్నాడు మకరంద్.

ఒక సత్కార్యానికి నేను సాయ పడాలి అని నిర్ణయించుకున్న వాయసం గోరి దగ్గరికి వెళ్లి “నాయనా! లాల్! నీ తల్లి రోహియాని వచ్చాను. బయటికి రా” అని రోహియా గొంతుకతో పిలిచింది.

గోరీ తలుపులు తెరుచుకొని లాల్మియా బయటికి రావటం, అంతలో మకరంద్ తన చేతిలోని మంత్రాక్షతలని వాడి మీద చల్లటం, వెంటనే వాడి నోటిలోని పళ్ళన్నీ గవ్వల్లాగా జలజలా రాలి క్రింద పడటం జరిగిపోయింది క్షణంలో. వాయసం ఎటుపోయిందో తెలీదు.

“నా తల్లి నన్ను మోసం చేసిందా” అని రోదిస్తూ వెంటనే లాల్మియా గోరి లోకి వెళ్లి తలుపులు బంధించుకొన్నాడు.

చేసేదేంలేక మనోరమను వెతుకుతూ వారిద్దరు అక్కడినుంచి బయలుదేరారు.

రత్నమంజరి సువర్ణ గుప్తుడు అనే వ్యాపారిని ఆహ్వానించి, తనదగ్గర యక్షకాంత ఉంది అని వర్ణించి చెప్పి, అతని దగ్గర భారీగా ధనాన్ని స్వీకరించి, మనోరమ ఉన్న గదిలోకి పంపించింది. ఆమె సౌందర్యానికి అబ్బురపడుతూ పలకరించబోయాడు అతను. ఎంతకీ పలకక కూర్చుంది మనోరమ. సువర్ణ గుప్తుడు మితిమీరిన కోరికతో ఆమె చేయి పట్టుకోబోయాడు.

అక్కడ లాల్మియా పళ్ళు రాలిపోవడంతో, అతని శక్తులన్నీ నశించి పోవడంతో ఇక్కడ మనోరమకు పూర్వ స్మృతి కలిగింది. మొదట తను ఎక్కడ వుందో అర్థం కాలేదు. కానీ  ఎవరో పరపురుషుడు తన మీద చేయి  వేయబోవడంతో చాచిపెట్టి కొట్టింది.

అదే సమయంలో తారానాథ్‌కి గురవయ్యకి అదృశ్య రూపాలు పోయి స్వస్వరూపాలు వచ్చాయి. తారానాథ్ గురవయ్యని పట్టుకొని మనోరమ ఏదని కొట్టసాగాడు. మనోరమను వేశ్య యింటిలో వదిలిన గురవయ్య జరిగిన విషయం చెప్పాడు. ముగ్గురు రత్నమంజరి ఇంటికి వచ్చారు. అక్కడ మనోరమని పట్టుకోబోతున్న రత్నమంజరిని, ఆమె అనుచరుల్ని మకరంద్ కత్తితో బెదిరించాడు. రత్నమంజరిని, సువర్ణగుప్తుని బంధించి రక్షకభటులకు అప్పగించాడు.

తెల్లవారడంతో సారంగి కథ చెప్పటం ఆపుజేసింది.

(మంత్రశక్తులు కోల్పోయిన లాల్మియా ఏమయ్యాడు? మనోరమాదులకు అతని పీడా వదిలిపోయిందా? చిలుక ఎంత కాలం కథను చెప్తూ, రాగలత ఆయుషుని పొడిగించగలదు?… తరువాయి భాగంలో…!)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here