గొంతు విప్పిన గువ్వ – 28

42
3

[box type=’note’ fontsize=’16’] ఒక స్త్రీ సంపూర్ణ జీవన సంఘర్షణలను, ఆమె జీవనయానంలో ఎదురైన విభిన్న సంఘటనలను నేపథ్యంగా చిట్టి పొట్టి కథల సమాహారాన్ని ధారావాహికగా అందిస్తున్నారు ఝాన్సీ కొప్పిశెట్టి. ఉత్తమ పురుషలో సాగే ఈ ‘గొంతు విప్పిన గువ్వ’ పాఠకుని దృష్టికోణాన్ని అంచనాలను తారుమారు చేస్తూ విభ్రాంతికి లోను చేస్తుంది. [/box]

రెండో పువ్వు

[dropcap]మా[/dropcap]కు ఆరు బెడ్రూముల అరెకరం ఇల్లు మెంటైన్ చేయాలంటే మా తాతలు దిగి వచ్చేవారు. హనుమంత రావనే ఒక తెలుగబ్బాయి ఆదివారాలు క్లీనింగ్‌కి కుదిరాడు. నాకు తెలుగోడు అనగానే ప్రాణం లేచొచ్చింది సుమా.

అతను ఒళ్ళు దాచుకోకుండా నిజాయితీగా పని చేసేవాడు. గంటకు ముప్పై డాలర్లు.. దాదాపు ఎనిమిది గంటల్లో అద్దాలతో సహా శుభ్రం చేసి ఇల్లంతా అద్దంలా మార్చేసేవాడు.

ఓ రోజున ఉబుసుపోక అతనిని పెళ్లయ్యిందా అని అడిగాను. ముగ్గురు పిల్లల తండ్రినంటూ నన్ను ఆశ్చర్యంలో ముంచేసాడు. పైగా అతనిది ప్రేమ పెళ్ళని, భార్య అమెరికన్ అమ్మాయని చెప్పాడు. నాకు నమ్మశక్యం కాలేదు.

అంత సాదా సీదా ఆంధ్రా అబ్బాయి అమెరికన్ అమ్మాయిని ఎలా పడేసాడా అని నాలో కుతూహలం పెరిగింది. పైగా ఈ కాలంలో ముగ్గురు పిల్లలు ఏమిటని అడిగాను.

అతను నాకు చెప్పిన మూడో సంతానం కథకు నా వెన్ను జలదరించింది.

***                     

“పల్లెటూళ్ళో పెంకుటింట్లో వుండాల్సిన నన్ను అమెరికాలో ఇంద్రభవనం లాంటి బంగ్లాకు కొద్దికాలం యజమానిని చేసింది నా జెన్నీ…”  

జెన్నీ గురించి చెబుతున్న హనుమంతరావు గొంతు ఆర్ద్రతతో గద్గదమయ్యింది.

చమర్చిన కళ్ళను తుడుచుకుని మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు. 

ప్రతిష్టాత్మకమైన అమెరికన్ యూనివర్సిటీ డిగ్రీ సంపాదించాలన్న కోరిక చిన్నతనం నుండీ నన్ను కాల్చేస్తూ వుండేది. గుక్కెడు గంజి తాగి బతుకీడ్చే నేను, పట్టుబట్టి న్యూయార్క్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ మీద మాస్టర్స్ అడ్మిషన్ సంపాదించి యుఎస్‌కి వచ్చాను.

భయంభయంగా జెఎఫ్‌కె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఐదేళ్ళ క్రితం అడుగుపెట్టిన నా బతుకు చిత్రాన్నే మార్చేసింది జెన్నిఫర్.

నా విద్యాకాల వ్యయమంతా పూర్తిగా కాలేజీ ఫండ్స్ మీద నడిచినా పైసా పైసాకి తడుముకునేవాడిని. రెండు డాలర్ల టీ తాగాలంటే నూట యాభై రూపాయల టీ అవసరమా అని ప్రతి డాలర్ ఖర్చునూ రూపాయిల్లోకి తర్జుమా చేసుకుని ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్త పడేవాడిని.

ఆంగ్లేయుల ఉచ్ఛారణ అర్థం కాక బదులిచ్చే భాషా ధారాపటిమ లేక న్యూనతా భావనతో కుంచించుకుపోయేవాడిని. క్లాసులో ఎవరితోనూ కలవలేక ఒంటరిగా నాలో నేను కుమిలిపోయేవాడిని. సరిగ్గా ఆ సమయంలో అప్సరస లాంటి జెన్నిఫర్ కేవలం నాపై జాలితో నాకు దగ్గరయ్యింది. జెన్నీ పక్కనుంటే చాలు చెప్పలేనంత ధైర్యంగా వుండేది నాకు. జెన్నీ ఆపద్భాంధవిలా ప్రతీ కష్ట సమయంలోనూ తోడుండేది.

జెన్నీ ఫోస్టర్ పేరెంట్స్ సంరక్షణలో పెరిగిన అనాథ. చిన్నతనం నుండీ స్వచ్ఛమైన  ప్రేమకు నోచుకోని ఆమె ఎవరయినా ప్రేమలేమితో అలమటిస్తుంటే మనస్ఫూర్తిగా తన స్నేహ హస్తం చాచి వాళ్ళ ఒంటరితనాన్ని దూరం చేసేది. 

నా కళ్ళకు తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఏషియన్లు, చింకీలు అంటూ తేడాలు కనిపించేవి కాని జెన్నికి అందరూ కేవలం మనుషుల్లా మాత్రమే కనిపించేవారు.

జెన్నీ కలుపుగోలుతనం ఆశ్చర్యపరిచేది నన్ను. ఆడా మగా తారతమ్యం లేకుండా కలివిడిగా కలిసిపోయేది. ఆమె మనసులో స్నేహభావం తప్ప మరే వికారాలు వుండేవి కావు.

ఆంగ్లంలో సరిగ్గా మాటాడటం కూడా తెలియని నాకు కాలేజీ జరిగే రోజుల్లో వారానికి ఇరవై గంటల పాటు తనకు పరిచయమున్న సూపర్ మార్కెట్లో జెన్నీ పని ఇప్పించింది.

డాలర్లలో నా మొదటి సంపాదన అందుకున్న రోజున నా కళ్ళల్లో ఆనందబాష్పాలతో జెన్నీని అసంకల్పితంగా అమాంతం కౌగలించుకున్నాను. సుతిమెత్తని ఆ సుకుమార శ్వేత పుష్పాన్ని తొలిసారిగా గుండెలకు అదుముకున్న ఆ క్షణం నుండీ నా గుండెల్లో జెన్నీ దేవతలా కొలువై పోయింది. ఆ నిముషంలో నాకూ తెలియదు ఆ ధవళ సుందరి శాశ్వతంగా ఈ భక్తుని గుండె గుడిలో నిక్షిప్తమై పోతుందని. 

కాలేజీ సెలవుల్లో జెన్నీ నాకు ఫుల్ టైం పని ఇప్పించటం కోసం చాలా తాపత్రయ పడేది.

జెన్నీ నన్ను వారాంతాల్లో, సెలవుల్లో చక్కటి సందర్శనా స్థలాలకు పర్యాటక ప్రదేశాలకు తిప్పేది. రెస్టారెంట్లో బిల్లు నన్ను కట్టనిచ్చేది కాదు. మా దేశానికి నువ్వు అతిథివి, అతిథులకు విందు ఇవ్వటం మా బాధ్యత అనేది. ఈ అతిథి ఒకనాటికి పతి రూపు దాలుస్తాడని ఆమె బహూశా అప్పుడు అనుకొని వుండక పోవచ్చు. 

మా కోర్సు పూర్తి అయి నేను తిరిగి ఇండియా వెళ్ళాల్సిన పరిస్థితిలో నాకు భారతదేశంలో మరే బంధాలు లేవని జెన్నీకి తెలిసింది.  అంతే. వెంటనే నా  స్టూడెంట్ వీసా స్టేటస్ సత్వరంగా మారే మార్గాలన్నీ ఒక లాయరుతో సంప్రదించింది.

లాయరు విచారణలన్నీ పూర్తయ్యాక జెన్నీ నాకు ప్రపోస్ చేసింది. నా చెవులను నేను నమ్మలేకపోయాను. నా దురదృష్టపు తలరాత పైన నమ్మకం లేని వాడిని. పాశ్చాత్య దేశ సంస్కృతి, అక్కడి ఆచార వ్యవహారాలు, అలవాట్లు మచ్చుకైనా అలవర్చుకోలేని అజ్ఞానుడిని. భారతదేశ మారుమూల కుగ్రామంలో అనామకంగా పుట్టి పెరిగిన అల్పుడను. బార్బీ బొమ్మలాంటి ఆ  గాజు బొమ్మ  మట్టిలో పుట్టి  పెరిగిన నన్ను పెళ్ళాడతాననటం కేవలం నాకు అమెరికా పౌరసత్వం ఇప్పించటం కోసమేనా… నేను నోరు వెళ్ళబెట్టాను. తెరుచుకున్న నా నోటిని తన లేత గులాబీ పెదవులతో మూసేసింది. ‘ఐ లవ్యూ హనీ’ అంటూ నా చెవిలో గుసగుసలాడింది.

జెన్నీ ‘హనుమంతు’ అని పలకలేక నా పేరులో మొదటి రెండక్షరాలతో నన్ను హనీ అని పిలుస్తుంది. ఆమె తేనె జాలువారేట్టు ‘హనీ’ అని తియ్యగా పిలిచినప్పుడల్లా నేను పరవశించి మైమరిచి పోతుంటాను.  అలా జెన్నీ నేనూ  ఒకటయ్యాం.

అనుకున్నదే తడవుగా రిజిస్టరు వివాహం, తరువాత లాయరు సమక్షంలో ఏవేవో కాయితాల మీద సంతకాలు, ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంటుకి జెన్నీ పెట్టుకున్న పిటిషన్లు…  అన్నీ చకచకా జరిగిపోయాయి. నేను కేవలం నిమిత్తమాత్రుడిలా చూస్తూండిపోయాను.

ఇక అప్పటి నుండీ నాకు జీవితం ఒక సంభ్రమమై పోయింది. నేను కలలో కూడా ఊహించని అందమైన జీవితాన్ని నాకు ప్రసాదించిన జెన్నీని శక్తి వంచనా లేకుండా ప్రేమిస్తున్నాను.

మన సంస్కృతిలో భర్త అంటే భరించేవాడు. కాని నిజానికి నా భార్యే నన్ను భరిస్తుంది. ఇద్దరమూ చేసింది ఒకే మాస్టర్స్ డిగ్రీ అయినా అక్కడి సిటిజన్ అయిన ఆమెకు వున్నంత వెసులుబాటు నాకు వుండేది కాదు. జెన్నీకి వెంటనే మంచి జీతంతో ఉద్యోగం వచ్చేసింది. నేను ఇప్పటికీ ఇంకా అవే పెట్రోలు బంకుల్లోనూ, సూపర్ మార్కెట్లలోనూ, చిన్నా చితకా క్లీనింగ్ పనులే చేస్తున్నాను.

నేను ఎటువంటి ఆత్మన్యూనతా భావంతో బాధ పడకుండా జెన్నీ నన్ను నిత్యం  ఆహ్లాద పరుస్తుంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి మనసుకు హత్తుకునేట్టు నవ్వుతూ చెబుతుంది. వెన్నముద్దలాంటి జెన్నీ నవ్వితే వెన్నెల చిలకరించినట్టే వుంటుంది. అంతకు మించిన స్వర్గం వుంటుందని నేననుకోను. ఆ నవ్వులో నేను ప్రపంచాన్ని మరిచిపోతాను.

నేను సరైన ఉద్యోగంలో స్థిరపడకుండానే మా పెళ్ళయిన మూడు నెలలకే జెన్నీ గర్భం దాల్చింది. ఫోస్టర్ పేరెంట్స్ ఇళ్ళల్లో పెరిగిన జెన్నీకి తన స్వంత పిల్లలు, కుటుంబం కావాలన్న తపనతో మాతృత్వానికి వెంటనే సిద్దపడి పోయింది.

మా సంసార నౌకా ప్రయాణానికి మూడొంతుల ఇంథనం జేన్నీయే సమకూర్చేది. అలా కష్టపడుతూనే నన్ను పెళ్ళయిన మూడేళ్ళ లోపే రెండు బొమ్మలకు నాన్నను చేసింది. మొదటి బిడ్డ ఆడపిల్లని తెలిసినప్పుడు పాప ఫెయిరీలాంటి జెన్నీలా పుట్టాలని కోరుకున్నాను.

తలపై నల్లటి జుట్టు, నల్లటి కనుపాపలు మాత్రమే నావి తీసుకుని పుట్టిన తెల్ల చిన్న దొరసానిని చూసినప్పుడు నా ఆనందానికి హద్దులు లేవు.

మళ్ళీ నెలసరి కూడా రాకుండా జెన్నీ రెండోసారి గర్భం దాల్చింది. రెండోసారి బాబు అచ్చంగా ఆంగ్లేయుడే పుట్టాడు. వాడి ఒంటి గులాబీ రంగు, తల పైన బ్లాండ్ హెయిర్, నీలి కళ్ళు… అచ్చం జెన్నీ నోట్లోంచి ఊడిపడ్డాడు నా వంశోద్ధారకుడు. వాడిని చూస్తేనే గర్వంతో ఒళ్ళు గగుర్పొడిచింది నాకు. ఇద్దరు పిల్లలు చాలనుకున్నాము.

నా సంపాదన అంతంత మాత్రమే కాబట్టి నేను పని మానేసి ఇంట్లో బేబీ సిట్టింగ్ చేసేవాడిని. బొమ్మల్లాంటి పిల్లల సమక్షంలో నాకు సమయం తెలిసేది కాదు. పితృవాత్సల్యంతో ఉప్పొంగిపోయేవాడిని. జెన్నీ పనిలోకి వెళ్ళి పోతుండేది.

త్వరత్వరగా రెండు కాన్పులు అవ్వటం, కాన్పుల తరువాత శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకపోవటంతో జెన్నీ చాలా అలసటగా కనిపించేది. నాలో తెలియని అపరాధ భావన దొలిచేస్తూ వుండేది. నాలో నేను బాధ పడటం మినహా ఏమీ చేయలేని అప్రయోజకుడిని.

ఆర్థికంగా స్థిరపడకుండా గబగబా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులం అయ్యామే కాని మా సంపాదన ఇంటి అద్దె, పిల్లల ఖర్చులు ఇతరత్రా ఖర్చులకు బొటాబొటీగా సరిపోయేది. శని ఆదివారాలు జెన్నీ పిల్లలను చూసుకునేది నేను పనిలోకి వెళ్ళేవాడిని. ఎంత చేసినా మాకు సేవింగ్స్ అంటూ వుండేవి కావు.  చిన్నపాటి ఆడంబరాలు  కూడా ఆశనిపాతాలే.

దేశమేదయినా పేదరికం ఒకటేనేమో. అమెరికాలో డాలర్లలో సంపాదించి ఇండియాలో రూపాయిల్లో ఖర్చు చేస్తే డబ్బు కనిపిస్తుందే తప్ప డాలర్లలో సంపాదించి డాలర్లలోనే ఖర్చు పెట్టవలసి వస్తే పరిస్థితిలో మెరుగేమీ వుండదు.

నెలనెలా ఇంటి అద్దె కట్టే బదులు ఒక స్వంత ఇల్లు కొనుక్కుని అద్దె కట్టే డబ్బులను ఈఎంఐలుగా కట్టాలని జెన్నీ కోరిక. కాని ఇంటి కోసం డౌన్ పేమెంట్ చేసేందుకు పెద్ద మొత్తం మా దగ్గర లేదు.

నా ప్రియమైన జెన్నీ కోరిక తీర్చలేని నా అసమర్థతపై నాకే కోపం వచ్చేది. తన కోరిక తీర్చలేని నా జీవితమే వ్యర్థంగా తోచేది.

సరిగ్గా అదే సమయంలో జెన్నీ ఒక చైనా దంపతుల ప్రకటన చూసింది. ఆ చైనీస్ యువతి ఆరోగ్యం గర్భధారణకు అనుకూలంగా లేనందున, చైనాలో సరోగసీ నిషిద్ధమైన కారణంగా వాళ్ళకు వయసులో వున్న ఆరోగ్యవంతురాలైన, అప్పటికే పిల్లలను కని వున్న ఒక సరగేట్ మదర్ కావాలని ప్రకటన.

సరగసీ ఖర్చులు, మందుల ఖర్చులు, పురిటి ఖర్చులే కాకుండా బిడ్డను కని ఇచ్చాక ముప్పై వేల యుఎస్ డాలర్లు అదనంగా ఇస్తామని ప్రకటన.

స్వంత ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక తీవ్రంగా వుండటంతో అది తీరే మార్గం కనిపించని జెన్నీ ఆ అవకాశం వదులుకోవటం అవివేకమని వెంటనే వారికి కాల్ చేసి మాట్లాడింది.

సరగసీ నాకు అర్థం కాని విషయం. ఆ సంప్రదాయమేమిటో, గర్భం అద్దెకివ్వటమేమిటో అంతు పట్టని చిన్న మెదడు నాది. జెన్నీ కడుపున మరొకరి బిడ్డను మోయటమనే ఊహే నాకు నచ్చలేదు.

జెన్నీ నాకు వివరించి చెప్పింది. చైనా దంపతులకు వారి బయోలాజికల్ బిడ్డే కావాలి కనుక సాంప్రదాయబద్దంగా జరిగే అద్దె గర్భ ప్రక్రియ కాదని, తను కేవలం జస్టేషనల్ సరగేట్ మదర్ మాత్రమే అని నచ్చచెప్పింది. పుట్టే పిల్లలకు మా జీన్స్ రావు కనుక ఆ ప్రక్రియకు తనెంతో ఆనందంగా వుంది.

సంప్రదాయ పద్దతిలో అయితే తండ్రి వీర్య కణాలు జెన్నీ గర్భాశయం లోకి చొప్పిస్తారు. జస్టేషనల్ పద్దతిలో బయట కృత్రిమ పద్దతిలో ఫలదీకరించిన పిండాన్ని మాత్రమే జెన్నీ గర్భాశయంలో పెడతారుట.

నాకు అర్థం అయ్యీ కానట్టుగా వుంది. కాని ఒకటి మాత్రం నిజం. అనైతికం అనుకున్నదేదీ జెన్నీ చేయదు.

నా జెన్నీ ఏమి చేసినా మా కుటుంబం కోసమే. అయినా జెన్నీ మూడోసారి గర్భం దాల్చి ఆరోగ్యం పాడు చేసుకోవటం నాకిష్టం లేదు. ఆ మాటే అంటే ఆ ఒక్క గర్భంతో మా దశ మారిపోతుంది, మాకో స్వంత ఇల్లు ఏర్పడుతుంది, మా పిల్లల భవిష్యత్తు బావుంటుందని నచ్చచెప్పింది. జెన్నీ మాటలను నా కంఠంలో ప్రాణం వుండగా కాదనలేను.

వెంటనే జెన్నీ ఐవీఎఫ్ స్పెషలిస్టుని కలవటం ఆ చైనా దంపతులు రావటం, సరగసీ లాయరుని కలవటం, సరగసీ ఏజన్సీ సమక్షంలో సరగసీ కాంట్రాక్టు రాసుకోవటం అన్నీ చకచకా జరిగిపోయాయి.

జెన్నీకి చాలా రకాల వైద్య పరీక్షలు, రక్త  పరీక్షలు, స్కానింగులు జరిగాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్న కాలంలో డాక్టరు సలహా మేరకు జెన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నాకు దూరంగా వేరుగా పడుకునేది.

సానుకూల సమయం చూసి సరైన పద్దతిలో ఐవీఎఫ్ స్పెషలిస్ట్ చైనీస్ దంపతుల నుండి అండాలను, వీర్య కణాలను సేకరించి కృత్రిమంగా ఫలదీకరణం చేసి, ఫలదీకరణం పొందిన పిండాలను పీజీడీ టెస్టింగ్ చేయించి, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ పరీక్ష తదనంతరం  ఆరోగ్యంగా వున్న ఒకే ఒక మగ శిశువు పిండాన్ని జెన్నీ గర్భాశయంలో ఇంప్లాంట్ చేసి ప్రోజేస్టిరోన్ అనే హార్మోన్ సపోర్ట్ ఇస్తూ వచ్చాడు.

పిండం గర్భంలో పెట్టినప్పటి నుండి  రెండు వారాల్లో గర్భ నిర్ధారణ జరుగుతుంది. జెన్నీకి ఈ రెండు వారాల నిరీక్షణ ఓ జీవితకాల నిరీక్షణలా అయ్యింది.

ఇలాంటివేమీ తెలియకుండానే తను ఇద్దరు పిల్లలను కన్నది. ఇది కొత్త అనుభవం. జీసస్ పై భారం వేసి ఫలితం కోసం ఎదురు చూసింది. ఆ ఫలితంపై ఆధారపడ్డ తన స్వంత ఇంటి కల ఆమెను కలవర పెట్టేది.

జెన్నీ కన్నా వంద రెట్లు అధికంగా ఆ పిండ ప్రదాతలు, పుట్టబోయే బిడ్డ తల్లితండ్రులు ఫలితం కోసం నిరీక్షించారు. వారి దృష్టిలో జెన్నీకి లభించే ద్రవ్య ప్రయోజనం కన్నా వారికి లభించే సంతాన ప్రయోజనం అమూల్యమైనది.

“హనీ నా గర్భం నిలుస్తుందా, నా కల ఫలిస్తుందా..” జెన్నీ ఆరాటంగా నన్ను పదే పదే అడుగుతుండేది.

వ్యాకులతతో వడిలిపోయిన ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని “నీ మంచి మనసును దేముడు కూడా నొప్పించ లేడు జెన్నీ.. తప్పకుండా ఫలిస్తుంది కలత పడకు” అంటూ ముద్దాడే వాడిని.

మొత్తానికి మేము ఆతృతగా ఎదురు చూసిన ఆ క్షణం రానే వచ్చింది. రక్త పరీక్షకు వెళ్ళేప్పుడు ఆందోళనతో జెన్నీ కాళ్ళు చేతులు మంచులా చల్లబడ్డాయి. కళ్ళు మూసుకుని నన్ను గట్టిగా పట్టుకుని జీసస్ ను ప్రార్థించింది. ఆమె మొర ఆలకించాడేమో ఆ యేసు ప్రభువు బ్లడ్ రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. తన హెచ్ సీ జీ లెవెల్స్ బాగా పెరిగాయి.

ఆ చైనా దంపతుల ఆనందానికి అవధులు లేవు.  వాళ్ళు జెన్నీకి పౌష్టికాహార, మందుల నిమిత్తం పది వేల డాలర్లు అప్పటికప్పుడే జెన్నీ అకౌంటుకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయారు.

నెల రోజులుగా రకరకాల పరీక్షలతో ఉద్విగ్నతతో ఆందోళన పడిన జెన్నీ ఆ రాత్రి సంతృప్తితో ప్రశాంతంగా నా కౌగిలిలో ఒళ్ళు మరిచి నిద్రపోయింది.

మగతలో వున్న నా ప్రియ సఖిని తమకంతో నాలో మమేకం చేసుకున్నాను.

మార్నింగ్ సిక్నెస్‌తో వికారంతో జెన్నీ చాలా బాధ పడుతుండేది. చైనా నుండి జెన్నీ గర్భం అప్డేట్స్ కోసం క్రమం తప్పకుండా ఫోన్ కాల్స్ వచ్చేవి.

డాక్టరు చేసిన ఆరు వారాల స్కాన్ మమ్మల్ని షాక్‌కి గురి చేసింది. గర్భంలో వున్నది ఒక బిడ్డ కాదు, ఇద్దరు బిడ్డలు. డాక్టరు కూడా గర్భంలో ఒక పిండం స్థాపిస్తే ఇద్దరు బిడ్డలు అవ్వటమేమిటని ఒకింత ఆశ్చర్యపోయాడు. ఎప్పుడో కాని జరగని విధంగా పిండం రెండుగా విడిందేమోననుకున్నాడు.

స్కాన్లో అంతా సవ్యంగా వుండటంతో ఐడెంటికల్ కవలలు కలుగుతారని అభిప్రాయపడ్డాడు. కవల పిల్లలన్న వార్త విన్న చైనా దంపతుల కాలు నేల మీద ఆగలేదు. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు పడటం వాళ్ళ అదృష్టమేనని అమితానందంలో జెన్నీ తీసుకుంటున్న రెండింతల శ్రమకు సహృదయంతో నెలనెలా ఖర్చుల నిమిత్తం ముందుగా మాటాడుకున్న దాని కన్నా మరో ఐదు వేల డాలర్లు ఎక్కువగా పంపటం మొదలెట్టారు.

నెలలు నిండే కొద్దీ జెన్నీ కడుపు సైజు పెరిగి బరువు మోయ లేక నడవటానికి అవస్థ పడేది. ఆమె గర్భం బరువుకు పాదాలు వాచిపోయేవి. పొట్ట మీద చర్మం బాగా సాగిపోయి పల్చబడి సుస్పష్టంగా కనిపించే ఎరుపు నీలం రక్తనాళాలు చూసి నేను భయపడి పోయేవాడిని. అంతా కూడి అరవై వేల డాలర్ల కోసం జెన్నీ ఆరోగ్యాన్ని అలా పణంగా పెట్టటం నాకు చెప్పలేనంత దుఃఖం కలిగించేది.

రేపు ఆపరేషన్ చేసి పిల్లలను బయటకు తీస్తారనగా చైనా నుండి కవలల తల్లితండ్రులు వచ్చారు. వచ్చీ రావటమే ఆనందంగా ముప్పై వేల డాలర్లు ఇచ్చేసారు.

అంత క్రితం జెన్నీ మా ఇద్దరు పిల్లలను నార్మల్ డెలివరీలో కన్నది. ఇప్పుడు సిజేరియన్. నేను భగవంతుడిని నా జెన్నీని ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకున్నాను. అనుకున్న ముహూర్తానికి సజావుగా పిల్లలను వెలికి తీసారు. చిత్రంగా పిల్లలిద్దరూ ఒకేలా లేరు. పిండ విభజన వలన ఒకేలా ఐడెంటికల్ గా పుడతారనుకున్న పిల్లలిద్దరూ భిన్నంగా వున్నారు. ఆపరేషన్ వేళలో మధ్యలో తెర అడ్డు కారణంగా జెన్నీ పిల్లలను చూడ లేకపోయింది.

పురిటిలోనే పసిగుడ్డులను చైనా దంపతులు తీసుకెళ్ళిపోయారు. జెన్నీ ఒక్కసారయినా పిల్లలను కంటితో చూడలేక పోయినందుకు బాధ పడింది. మన పిల్లలు కాని పిల్లలను చూసి లేనిపోని పాశం పెంచుకోవటం మంచిది కాదని జెన్నీని ఓదార్చానే కాని తన కడుపులో తొమ్మిది నెలలు మోసిన తల్లి కనీసం బిడ్డలను కళ్ళారా ఒకసారి చూడకుండా, మనసారా చేతులతో స్పృశించకుండా అలా తీసుకెళ్ళి పోవటం నాకు కొంచం అమానుషంగానే అనిపించింది.

మూడో రోజున జెన్నీ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి ఇంటికొచ్చేసింది. అనుకున్న విధంగా అప్పటికే మేము బుక్ చేసుకున్న ఇంటికి బాకీ పెట్టిన ముప్పై వేలు కట్టేసి ఇల్లు స్వాధీనం  చేసుకున్నాము. క్రమంగా జెన్నీ ఆరోగ్యం కోలుకుంటోంది.

జెన్నీ కోరిక మేరకు ఆ చైనా దంపతులు నెల నిండిన పిల్లలిద్దరి పిక్స్ వాట్సప్‌లో పంపారు. ఇద్దరబ్బాయిల్లో ఒకడు స్పష్టంగా చైనీయుల ముఖ కవళికలతో వున్నాడు. రెండో బాబు వేరుగా వున్నాడు. ఆ చిత్రం చూసిన నా మనసులో ఏదో అనుమానం రేగింది. నా అనుమానాన్ని రూఢీ చేస్తూ త్వరలోనే వాళ్ళ నుండి కాల్ వచ్చింది.

వాళ్ళు పిల్లలిద్దరికీ చేయించిన డి ఎన్ ఏ పరీక్షలో రెండో బిడ్డ వాళ్ళ బిడ్డ కాడని తేలిందట. నేనూ జెన్నీ అవాక్కయిపోయాము. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాము. ఇల్లు కొనుక్కున్న ఆనందమంతా ఆవిరై పోయింది. ఇద్దరం నిలువునా నీరైపోయాము.

అప్పటి నుండీ జెన్నీ మానసికంగా కృంగి పోయింది. జరిగిన అవాంఛనీయ సంఘటనకు పరిష్కారం మా శక్తికి మించి జటిలమైపోయింది.

ఐవీఎఫ్ చేసిన డాక్టరు పిల్లలను సూపర్ఫిటేషన్ కవలలని నిర్ధారించాడు. పిల్లలిద్దరి గర్భధారణ కాలం వేర్వేరని నిర్ణయించాడు. డాక్టరు ఐవీఎఫ్ పద్దతిలో పిండాన్ని ఇంప్లాంట్ చేయటం వలన గర్భం దాల్చిన జెన్నీకి, రెండు వారాల తరువాత సహజసిద్ధంగా తనలో జరిగిన అండోత్సర్గంలో ఉత్పన్నమైన అండం నా వీర్యకణాలతో కలవటం వలన కలిగిన రెండో గర్భం కారణంగా పుట్టిన కవలలు వాళ్ళు. ఇద్దరినీ ఒకేసారి బయటకు తీసినప్పటికీ వారి మధ్య రెండు వారాల వయసు తేడా వుంది. ఇది చాలా అరుదుగా కొన్ని లక్షల్లో జరిగే ఒకానొక మిరాకల్. అది విన్న మేమిద్దరం శిలా ప్రతిమల్లా వుండి పోయాము.

చైనా దంపతులు తమది కాని బిడ్డ వారికి వద్దన్నారు. ఇద్దరు పిల్లలతో చాలనుకున్న మాకు అకస్మాత్తుగా అనుకోని మూడో బిడ్డ ఆగమనమం షాకింగ్ సర్ప్రైజ్. అంతవరకూ మేము కలలోనైనా ఊహించని బిడ్డ రాకకు సిద్దంగా లేని జెన్నీ తల్లిమనసు అంతలోనే చెట్టుకు కాయ భారమా అన్నట్టుగా బిడ్డ కోసం ఉరకలు వేసింది.

అప్పుడు మొదలయ్యింది అసలైన సంక్షోభం. వాళ్ళు బిడ్డను మాకు తిరిగి ఇవ్వమన్నారు. కవలలన్న సంతోషంలో వాళ్ళు చేసిన ఎక్స్‌ట్రా పేమెంట్ దాదాపు ముప్పై ఐదు వేల డాలర్లు తిరిగి అడిగారు. మా చేతిలో చిల్లి గవ్వ లేదు. ఉన్నదంతా ఇంటి కింద కట్టేసాము. పోనీ డబ్బు సమకూర్చే వరకూ బిడ్డ వాళ్ళ దగ్గరే రెండో బిడ్డతో పాటు పెరుగుతాడనుకుంటే అదీ లేదు. మా పిల్లాడిని సరగసీ ఏజెన్సీలో అప్పగించేశారు.

ఏజెన్సీ బిడ్డను రెండు నెలలు పోషించి చైనా దంపతులకు బాకీ పడ్డ ముప్పై ఐదు వేలతో పాటు బిడ్డ ఫ్లైట్ చార్జీలు, మెన్టేనన్స్ కింద ఏజెన్సీకి మరి కొన్ని వేలు బాకీ కట్టాలని, ఆలస్యం చేసే కొద్దీ బాకీ పెరిగిపోతుందని హెచ్చరించింది.

కంటితో చూడని కన్నబిడ్డ కోసం జెన్నీ మనోవ్యథ ఎక్కువై పోయింది. కంటిపై కునుకు లేదు. పుండుపై కారం చల్లినట్టు ఏజెన్సీ బిడ్డను దత్తత కోసం ప్రకటన చేసింది. దత్తతతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో వుంది. పరాయి చేతుల్లో బిడ్డను తలుచుకునే కొద్దీ జెన్నీకి పేగు బంధం సలిపేది.

జెన్నీ కడుపుకోతకు అంతే లేదు. బిడ్డలు లేక అల్లల్లాడిపోయిన ఒక తల్లికి తన గర్భాన్ని ఇవ్వటమే తను చేసిన నేరమయ్యింది. మా ఆర్ధిక ఇబ్బందుల వలన గర్భానికి తొమ్మిది నెలల అద్దెగా కొంత డబ్బు తీసుకున్న పాపం శాపమయ్యింది. 

బిడ్డ పుట్టిన మొదటి నెల చైనా దంపతుల దగ్గర, తరువాత రెండు నెలలు ఏజెన్సీలో ఒక పనివాడి పాలనలో, తరువాత ఎంపికలో… తన కడుపున పడ్డ పాపానికి అపరిచితుల చేతుల్లో బిడ్డకెన్ని తిప్పలు వచ్చాయంటూ కుమిలిపోతూ నా జెన్నీ కంటికి మింటికి ఏకధారగా ఏడ్చింది.

“హనీ నాకు నా కొడుకు కావాలి… నా బిడ్డను నాకు తెచ్చివ్వు…” అంటూ జెన్నీ బేలగా నన్ను కరుచుకుని ఏడుస్తుంటే నాకు ఏం చేయాలో తెలిసేది కాదు.

“హనీ, అంతా డబ్బుమయమేనా… మాతృత్వానికి మానవత్వానికి విలువే లేదా. కేవలం డబ్బు లేని కారణంగా నా బిడ్డను నేను చేజార్చుకోవాలా. హనీ మనకీ ఇల్లొద్దు. నాకు నా బాబు కావాలి.” అంటూ ఆక్రోశించే జెన్నీని ఊరడించే శక్తి నాకు లేకపోయింది.

ఏమైనా చేసి బాబుని తెచ్చి జెన్నీకి ఇవ్వాలని వుండేది. ఏమి చేయలేని అసహాయ స్థితి. జెన్నీ దుఃఖం నన్ను నిర్వీర్యుడిని చేసింది.

డబ్బు… డబ్బు… డబ్బుకెంత విలువ.

ఆ డబ్బే చేతిలో వుంటే బిడ్డను తెచ్చి నా జెన్నీ చేతిలో పెట్టేవాడిని కదా…!

ప్రయాస పడి అప్పు చేసి సరగసీ లాయరుని ఆశ్రయించి ఏజెన్సీ పైన కోర్టులో కేసు వేసాము.

ఆరు వారాల స్కాన్నింగులో పొరపాటుని గ్రహించ లేకపోవటం ఐవీఎఫ్ చేసిన డాక్టరు అసమర్ధతని, డాక్టరు నియమించిన జాగ్రత్తలు పాటించక తొందర పడటం మా తప్పని, కవల పిల్లలనగానే ఎక్స్‌ట్రా డబ్బిచ్చిన చైనీయులు తమ బిడ్డ కాదని తెలియగానే పసిబిడ్డను త్యజించటం వాళ్ళ అమానవీయతని, ఇరు పార్టీల మధ్యా సామరస్యం కుదర్చటానికి బదులు పరిస్థితులను అవకాశంగా తీసుకుని బిడ్డను దత్తత పేరుతో ఫోస్టర్ పేరెంట్స్‌కి అమ్మాలనుకోవటం ఏజెన్సీ నేరమని… కోర్టులో జరిగిన అనేకానేక విషయాల వాగ్వివాదాల మధ్య కేసు వాయిదాల మీద వాయిదాలు పడింది.

ఆ చట్టపరమైన యుద్ధంలో మానసిక భావోద్వేగాల చెలగాటంలో నా జెన్నీ తల్లిమనసు నలిగిపోయింది. పసితనం నుండి నలుగురు ఫోస్టర్ పేరెంట్స్ చేతులు మారి స్వచ్చమైన ప్రేమ కోసం తల్లడిల్లిన జెన్నీ తిరిగి తన బాబు  ఫోస్టర్ పేరెంట్స్ చేతుల్లోకి వెళతాడనే ఊహకే తల్లడిల్లిపోయింది.

నేను జెన్నీని ఆ పరిస్థితిలో చూడలేక మేము కొన్న కొత్త ఇంటిని అమ్మేసి, సైన్సు లాజిక్కుతో భగవంతుని మ్యాజిక్కుతో పుట్టిన ఆ రెండో పువ్వును తెచ్చి జెన్నీ ఒడిలో పెట్టాను.

మేము ఇద్దరు పిల్లలతో ఖాళీ చేసిన ఇంట్లోకి దేవుని మాయా ప్రమేయంతో పుట్టిన మూడో బిడ్డతో పాటు తిరిగి అద్దెకు మారిపోయాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here