పెళ్లితో కావాలి

0
3

[dropcap]”పె[/dropcap]ళ్లి చేసుకుంటాను. నాకు అనుకూలం కావాలి. అంతే.” మళ్లీ చెప్పింది శ్రావణి.

“చాల్లే. ఎవరు నీ సొద వింటారు. ఎన్నని పెళ్లి సంబంధాలు తప్పిపోయాయి. ఇప్పటికైనా మా మాట విను” చెప్పింది సావిత్రి.

“అవును తల్లీ. పట్టు విడు.” చెప్పాడు అప్పారావు.

శ్రావణి తల్లిదండ్రులు సావిత్రి, అప్పారావు. అప్పారావు ఒక రిటైర్డ్ క్లాస్ ఫోర్ ఎంప్లాయి. సావిత్రి గృహిణి. వీళ్ల ఏకైక సంతానం శ్రావణి.

అతి ప్రయాసతో శ్రావణికి మంచి చదువుని సమకూర్చారా తల్లిదండ్రులు.

శ్రావణి కూడా పట్టుదలతో బాగా చదివి ఓ డిగ్రీ పొందింది. అదే రీతిన ఓ ప్రయివేట్ కంపెనీలో ఓ ఉద్యోగం సంపాదించుకుంది.

శ్రావణి పెళ్లీడుకొచ్చి చాన్నాళ్లవుతుంది.

తమకు తగ్గ పెళ్లి సంబంధాలు వెతుక్కొస్తున్నారు ఆ దంపతులు.

ఐనా శ్రావణి కారణంగా అవన్నీ తప్పిపోతున్నాయి.

తను పెళ్లితో ఇల్లు దాటితే తన తల్లిదండ్రుల స్థితి గతి ఏమిటని తలుస్తుంది శ్రావణి. అందుకే వచ్చిన పెళ్లివారితో నిక్కచ్ఛిగా తన ఆలోచన చెప్పి అందుకు ఆంగీకరిస్తేనే తదుపరి పెళ్లి మాటలు అంటుంది.

శ్రావణి ఆలోచన – తన జీతంలో సగ భాగం తన తల్లిదండ్రులకి నెల నెలా ఇవ్వాలని.

ఒకరిద్దరు అందుకు సమ్మతిస్తూనే అది నిరంతరం కాక కొన్నాళ్ల వరకైతే తమకి అభ్యంతరం లేదన్నారు కూడా. ఐనా అందుకు శ్రావణి ఒప్పుకోలేదు.

చాలా మంది మధ్యలో ఉద్యోగం పోతే అప్పుడేమిటని శ్రావణిని ప్రశ్నించారు. అందుకు శ్రావణి మరో ఉద్యోగం వెతుక్కుంటాను లేదా తన తల్లిదండ్రులకై సవ్యమైన పనేదో చేపడతానని సూటిగా చెప్పేయగా ఆ సంబంధాలు కూడా పూసిపోయాయి.

మిగతావి ఆదిలోనే తెగిపోయాయి.

అప్పారావు, సావిత్రి తెగ దిగులవుతున్నారు శ్రావణి వైఖరికి. ఐనా తమ ప్రయత్నాలని ఆపడం లేదు. శ్రావణి కూడా పట్టు వీడడం లేదు.

“అమ్మా నాన్నా హైరానా పడకండి. నాకు పెళ్లి రాత ఉంటే నా విన్నపాన్ని మన్నించిన వాడు దొరక్కపోడు. నాకు పెళ్లి కాకపోదు.” అననేసి శ్రావణి ఉద్యోగంకి బయలుదేరింది.

ఆ తల్లిదండ్రులు నిస్సత్తువయ్యారు.

***

సుమారుగా సంవత్సరం తర్వాత –

తను తీసుకు వచ్చిన ఒకతనిని తన తల్లిదండ్రులకి చూపుతూ, “ఈయన సుబ్బారావు. నాతోనే పని చేస్తున్నారు. వీరికి పెళ్లయ్యింది. భార్య పోయింది. ఏడాదిన్నర పాప ఉంది.” అని చెప్పింది శ్రావణి.

అప్పారావు, సావిత్రి అయోమయమవుతున్నారు. తమ ఎదురుగా కుర్చీలో కూర్చున్న సుబ్బారావును చూస్తూ ఉండిపోయారు.

“వీరు నా గురించి నా ద్వారా తెలుసుకున్నారు. అలాగే వీరికి నా ఆలోచన చెప్పాను.” చెప్పుతుంది శ్రావణి.

ఆమె తల్లిదండ్రులు అస్తవ్యస్తంగా కదులుతున్నారు.

“నా నియమాన్ని వీరు అంగీకరించారు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అలాగే వీరూ తన నియమం చెప్పారు. అదే వీరి బిడ్డని నా బిడ్డలా చూసుకోవలసి ఉంటుందని చెప్పారు. నేను సమ్మతించాను.” అని చెప్పుతుంది శ్రావణి.

ఆ తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు.

“మా పెళ్లికి మీరేమంటారు” అడిగింది శ్రావణి తన తల్లిదండ్రులని చూస్తూ.

వాళ్లిద్దరూ ఒకే మారు కూతురుని చూశారు. ఆమె నిశ్చలంగా ఉంది.

“మాట్లాడండి. చెప్పండి” అంది శ్రావణి.

అప్పుడే, “నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. తను నా బిడ్డని చక్కగా చూసుకోవడమే నాకు కావాలి. అంతే.” చెప్పాడు సుబ్బారావు.

“వీరి కుటుంబం …” అనంటున్న అప్పారావుకి అడ్డై –

“ముందు మా పెళ్లికి మీరు సమ్మతమవుతే తన వాళ్లతో మాట్లాడమని అతన్ని కోరుకున్నాను. మొదట మీరేమంటారు” అనంది శ్రావణి.

“ఏమంటావు” అడిగాడు అప్పారావు భార్యని.

సావిత్రి కూతురుని చూస్తుంది.

“అమ్మా బంధుత్వాలు కంటే సంబంధం అనుకూలంగా కుదురుతుందో లేదో చూడు. మీకు కావలసింది నా పెళ్లి, నాకు కావలసింది మీరు. అంతే. సంశయాలు వద్దు.” చెప్పేసింది శ్రావణి సూటిగా.

సావిత్రి చివరికి తలాడించేసింది.

***

ఇరు కుటుంబాల వారు సమావేశమయ్యారు.

శ్రావణి, సుబ్బారావుల పెళ్లికి సమ్మతించారు.

“మీ బిడ్డని నా బిడ్డగా చూసుకుంటాను. అలాగే నా జీతంలో సగం నా తల్లిదండ్రులకై హెచ్చిస్తాను. కచ్ఛితంగా అందుకే ఈ పెళ్లికి నేను అంగీకరిస్తున్నాను.” అని నిక్కచ్చిగా ఆ అందరి ముందూ సుబ్బారావుతో చెప్పింది శ్రావణి.

“నా బిడ్డని నీ బిడ్డగా నువ్వు చూసుకుంటుంటే నీ తల్లిదండ్రులని నా తల్లిదండ్రుల్లా నేనూ చూసుకుంటాను.” చెప్పేశాడు సుబ్బారావు.

ఆ పెద్దలు ముచ్చటయ్యారు.

***

ఓ శుభ ముహూర్తాన –

శ్రావణి, సుబ్బారావు భార్యాభర్తలయ్యారు.

***

శ్రావణికి ఆడబిడ్డ పుట్టింది.

కాలం గడుస్తుంది.

సుబ్బారావు బిడ్డ, శ్రావణి బిడ్డ సాకబడుతున్నారు అచ్చు కవల పిల్లల మచ్చున.

ఇప్పుడు వారిది పెళ్లీడు. వారి అమ్మమ్మ, నానమ్మలతో పాటు వారి తాతలు వారి పెళ్లి సంబంధాల వెతుకులాటలో మస్తు ఉల్లాసంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here