కళ్ల కలవరం

3
3

[dropcap]సుం[/dropcap]దరమ్మకు తీరికగా వుండేది భోజనం తరువాతనే. వంటింట్లో సర్ది, రెస్టు తీసుకోవడానికి వెళ్ళే ముందు కాస్సేపు హాలులో సోఫాలో కూర్చుని రిలాక్స్ అవడం అలవాటు. అక్కడ కూర్చుని ఎదురుగా వున్న బల్ల మీద వున్న ఆదివారం ఈనాడు మాగజైన్ తీసుకుని కథ కోసం వెదికి ఆ పేజీ తెరిచి చదవబోయింది. దాని శీర్షిక తప్ప మిగిలిన పదాలు మనసకగా కనిపించాయి..

లేచి వెళ్ళి వరండాలో కూర్చుంది నీరెండలో… బాగా కనిపిస్తాయనుకున్న పదాలు మసక గానే వున్నాయి. పుస్తకం కాస్త దగ్గరగా, దూరంగా పెట్టుకుని చూసినా పరిస్థితి ఏమీ మారలేదు సరి కదా కళ్ళకు స్ట్రెయిన్ అయి తలనొప్పిగా అనిపించి కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు కూర్చుంది.

ఈ కళ్ళ ప్రాబ్లెమ్ వల్ల రచనలు చేయడం మానినా కనీసం కథలు చదవడానికి కూడా కావడం లేదు. బాధగా ఫీల్ అవుతూ నెమ్మదిగా లేచి బెడ్ రూమ్ లోకి వెళ్ళి పడక మీద పడుకుని కళ్ళు మూసుకుంది. కళ్ళు కాస్త శాంత పడి హాయిగా అనిపించి నిద్ర పట్టింది.

***.

అప్పుడు కళ్ళు రెండూ మాట్లాడుకోవడానికి తీరిక దొరికింది.

“ఇద్దరం కవలల లాగా పుట్టినా ఏమి ప్రయోజనం? మనిద్దరి మధ్యగా ఈ ముక్కును అడ్డుగోడగా కట్టి ఒకరినొకరు చూసుకోవడానికి వీలు కాకుండా చేశాయి కదా. అయినా ఇద్దరికీ ఏమి వచ్చినా చెప్పుకోవడానికి నరాలూ, పైన తలలో కూర్చున్న మెదడు పెద్దాయన వున్నాడు కాబట్టి సరిపోయింది. పోనీలే అలాగైనా మనకు వచ్చే కష్టాలు చెప్పుకునే అవకాశం ఇచ్చాడు పుట్టించినవాడు” కుడి కన్ను బాధ పడింది

“ఎన్నిసార్లు చెప్పలేదు మనం ఈ ఆరునెలలలో కళ్ళు చూడడాని కంటే చదవడానికి పనికి రాకుండా ఏదో అడ్డం వస్తూనే వుందని. అది సరి చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా వీళ్ళు.?” ఎడమకన్నుకు కోపం.

“అదే కదా, శరీరంలో మోకాళ్ళు నొప్పులు వచ్చినా, శ్వాస ప్రాబ్లెం అయినా ఇంకేమైనా వెంటనే డాక్టర్ల దగ్గరికి పరుగెత్తుతారు. మాకు కష్టం వచ్చింది అంటే పట్టించుకోరు” కంప్లైంట్ ఇచ్చింది కుడికన్ను.

“అవును ఏదైనా నొప్పి అనగానే పెయిన్ కిల్లర్ అని వేసేసుకుంటారు. మన జబ్బు వాటితో తగ్గదు. ఏదీ కనిపించదు మసకగానే వుంటుంది. పైగా ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అని సామెతలు వేరే చెబుతారు. జ్యోతిష్యంలో కుడికంటిని సూర్య రూపంగా, ఎడమకంటిని చంద్ర రూపంగా పరిగణిస్తారు. ఇవన్నీ కాక శరీరంలో పర్ఫెక్ట్ గోళాకారంగా వుండే అంగాలు కళ్ళేనట! ఇవన్నీ చెప్పటం వింటూ వుంటాము. ఇన్ని ప్రత్యేకతలు వున్నా ఏమి ప్రయోజనం?” నిట్టూర్చింది ఎడమకన్ను.

“వీరు చూడగలరు కాబట్టే తినగలరు, నడవగలరు, ఏ పనైనా చేయగలరు. అంధకారం అయితే ఏమి చేస్తారు? మనం చూడబట్టేకదా, పలానా పని చేయాలన్నా మెదడుకు సంకేతాలు వెళ్ళేది, ఆయన సూచనలు ఇచ్చేదీ. ఏదీ కనిపించనేలేదు అంటే ఒక మూలన కూర్చోవాల్సిందే..” కోపం తగ్గలేదు కుడి కంటికి.

“ఇన్ని ప్రయోజనాలు చెప్పుకుంటే ఏమి లాభం? పూర్తిగా కనిపించకుండా చేస్తే తప్ప ఎటువంటి యాక్షన్ వుండదు. మొన్న ‘కళ్ళలో cataract వచ్చినట్టు వుంది. వెళ్ళి చేయించుకోవడానికి పది నిమిషాలేనట రెండురోజుల్లో మళ్ళీ కనుచూపు వచ్చేస్తుందని’ ఇంటికి వచ్చిన వారు ఎవరో చెబుతున్నావిని వూరుకున్నారు. కొంచెం కూడా మనమంటే లెక్కలేకుండా పోయిందనుకో” కోపం వచ్చింది ఎడమ కంటికి కూడా.

“ఇక సహించడం కష్టం. లోపల మన చూపుకు అడ్డుగా, ముదిరి పోతున్న cataract కు బాగా సహకరించడమే. అట్లయినా మనలను సరిచేసుకోవడం మొదలు పెడతారేమో చూడాలి” ఏకాభిప్రాయం అయ్యింది రెండింటికీ.

“అయినా ఇప్పటికి డెబ్బై ఏళ్లు చక్కగా పని చేశాము కదా..మనకూ వయసును బట్టి కొన్ని రిపేర్లు అవసరం అని ఎందుకు అనుకోరు? ఏదైనా మనము సరిగావుంటే కదా పనైనా, పాటైనా. కళ్ళు పూర్తిగా పనిచేయనంత దాకా ఆగాలా? కాస్త ముందుగానే ఆలోచించాలి. ఎందుకు తాత్సారం చేయాలి? మనం ఇలాగే వుంటే పని చేయడం కష్టం అని సంకేతాలు పంపుదాము. ఆ తలలో మెదడు పెద్దాయన ఎలాగైనా ఒక ఆలోచనయినా కలిగిస్తాడేమో చూద్దాం” నిర్ణయం రెండు కళ్లదీ.

***.

ఇంతలో పడుకున్న సుందరమ్మకు మెళుకువ వచ్చింది.

‘ఇక లేచి కాఫీ పెట్టాలి’ అనుకుని లేచింది. సుందరమ్మభర్త మూర్తి గారు “కాఫీ ఇస్తావా సుందరీ” అని అడిగాడు వంటింటి తలుపుదగ్గర.

“ఇదిగో కలుపుతున్నా…”అని రెండు కాఫీలు కలిపి గ్లాసులు తీసుకుని హాలులో కూర్చున్నారు ఇద్దరూ.

“ఇక ఎక్కువరోజులు కానీయకూడదండీ కేటారాక్ట్ ఆపరేషను చేయించుకోవాల్సిందే ఈ రోజు అబ్బాయి వచ్చాక చెబుతాను.” అంది

“వాడు పోయిననెలలో ఈ ప్రస్తావన తెచ్చాడు సుందరీ. ఈ కరోనా రామాయణంతో ఇబ్బందిగావుంది. మనకా వయసయింది కదా అందుకే ఆలోచిస్తున్నాఅన్నాడు.”

“కానీ ఈ కరోనా ఎప్పుడు నిర్మూలన జరుగుతుందో తెలియకుండా వుంది. అలాగని కళ్ళు పూర్తిగా కనిపించక పోతే రిస్కు తీసుకోక తప్పదుకదా” అంది సుందరమ్మ.

“దగ్గరలో ఒక కంటి ఆస్పత్రి వుందట. నిన్నవివరాలు తెలుసుకుంటాను అంది విమల కూడా. ఈ రోజు అడుగుతాను” అన్నారు మూర్తి.

ఇంతలో కొడుకు రాజశేఖర్,కోడలు విమలా వచ్చారు ఆఫీసుల నుండీ.

వాళ్ళు ఫ్రెష్ అయ్యాక అమ్మ కళ్ల ఇబ్బంది ఎక్కువ అవుతున్నట్టు చెప్పాడు మూర్తి వాళ్ళకు.

“నేను వివరాలు కనుక్కున్నాను మామయ్యా. ఆ హాస్పిటల్ గురించి మా ఆఫీసులో ఒక ఫ్రెండుకు బాగా తెలుసట. అక్కడ వాళ్ళమ్మకు కళ్ల ఆపరేషన్ బాగా చేశారట. కరోనా కేర్ కూడా బాగా చూసుకుంటారట… ముందురోజు టెస్టులు అన్నీ చేస్తారుట మీకు ఎలాగూ షుగర్, బి.పి. లాటివి లేవు కదా అత్తయ్యా కనక ప్రాబ్లెం వుండదు. ఒక్కసారి రేపు వెళ్ళివస్తాము. వీలైతే రెండు రోజుల్లో ఒక కన్నుఆపరేషన్ చేయించేద్దాం” అంటూన్న కోడలిని ప్రేమగా చూసింది సుందరమ్మ.

కొడుకు రాజశేఖర్ కూడా భార్య కనుక్కున్న వివరాలు సంతృప్తిగా వున్నట్టు చెప్పి “ఇక ఆలస్యం లేదమ్మా” అని చెప్పాడు.

రాత్రి నిశ్చింతగా పడుకుంది సుందరమ్మ.

***.

కళ్ళు రెండూ సంతోషంగా వున్నాయి ఆరాత్రి.

“చూశావా…ఇక కుదరదు అని పెద్దాయనకు చెప్పగానే వీళ్ళ ఆలోచనలు మారాయి. దేనికైనా నోటీసు బలంగా ఇవ్వాలి.”

“ఏదో injection ఇస్తారట. నొప్పేమీ కాదు కదా…“

“ఆ … ఏమీ వుండదులే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కదా. మన లోపల ముదిరిన పొర పగలగొట్టి తీసేసి కొత్తది పెడతారట. పది నిమిషాల పని. మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినలా? కొత్తది అమర్చినా రెండు రోజుల్లోనే కనిపించడం మొదలవుతుందిట..”

“ఇంతకీ మనిద్దరికీ ఒకేసారి చేయరు అన్నారు కదా. మొదట ఒక కన్ను చేసి…మళ్ళీ కొన్ని రోజులకు ఇంకోటీ”

“అయితే ఒక కన్నుకు కొద్దిరోజులు పని ఎక్కువ అవుతుంది”

“అయినా ఏమి పరవాలేదు. నీకు నేనూ, నాకు నువ్వూ వున్నాము. ఒకరికి బాగాలేకపోతే ఇంకొకరు సాయం అంతే. అయినా బాగు అయ్యేంతవరకూ నల్ల కళ్ళద్దాలను పెట్టుకొని రక్షించుకుంటారు. అయినా ఒక కన్ను బాగయ్యిందని అలాగే వుంటే చదవటం కూడా ఇబ్బందే. ఇంకో కంటిని సరి చేసుకుంటేనే చక్కగా చదువు కోవడానికి వీలు అవుతుంది. అందుకే మనలో ఎవరికి ముందు అయినా ఇంకొకరు వేచి వుండాలి. ఎలాగైనా తొందరగా సరిపోతాము. అయినా మనమున్నది ఒక రచయిత్రి శరీరంలో. చదవటం, రాయటం ఆవిడకు తప్పని సరిగా జరగాలి కాబట్టి చింత లేదు. ఎక్కువ ఆలోచించక పడుకో” అంది సంతోషంగా కుడికన్ను

***

పొద్దున కొడుకూ కోడలూతో సుందరమ్మ దంపతులు కంటి హాస్పిటల్ కు వెళ్ళటం, టెస్టులూ అన్నీ నార్మల్ అని వచ్చాక మరురోజే కళ్ళకు ఆపరేషన్ జరగటం. ఆశ్చర్యకరంగా ఆరోగ్యంగా వున్నసుందరమ్మ గారికి మరో కన్ను కూడా ఇంకో వారం లోపల జరగటంతో ఎంతో సులభంగా జరిగిపోయింది.

చూపు ఒక నెలలోనే బాగా రావటంతో రచయిత్రి సుందరమ్మ ఆనందంగా చదవటం, రాయటం చేస్తూంటే.. బాగయిన కళ్ళు రెండూ ఎంతో సంతృప్తిగా వున్నాయి.

మనిషి తెలుసు కోవాల్సింది ఒక్కటే వయసు పెరిగే కొద్దీ శరీరానికి రిపేర్లు తప్పవు.

అన్నీ బాగుంటే కదా నడుస్తుంది బండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here