[dropcap]ఎం[/dropcap]దుకో మా వూరు వెళ్ళాలనిపించడం లేదు.
ఆ మనుషులని కలవాలనిపించడం లేదు.
ఊర్లో అడుగుపెట్టగానే వినిపించే ఆత్మీయ పలకరింపులు
రచ్చబండల దగ్గర క్షేమ సమాచారాలు కరువైపోయాయి.
మనసుల మధ్య అంతరాలు, అహంభావాలు పెరిగిపోయాయి.
బళ్ళు ఓడలై, పెద్ద పెద్ద మేడలై
నడమంత్రపు సిరికి నిలయాలై
బంధాల మధ్య అడ్డుగోడలై
అపహాస్యం చేస్తున్నాయి.
భూదందాలు, గూండాగిరీలు, సెటిల్‍మెంట్లు
గిరి గిరి వ్యాపారాలు ఎక్కువైపోయాయి.
పీడించుకు తినడమే పెద్ద వ్యాపకమై
ధన వ్యామోహమే ఏకైక వ్యాపారమై
దర్జా వెలగబెడుతున్నాయి!
పెద్దరికాలు, వావి వరుసలు మాయమైపోయాయి
ఉమ్మడి కుటుంబాలు ఛిన్నాభిన్నమై
అనురాగ బంధాలు ఛిద్రమై
అనాదరణకు చిహ్నాలై నిలిచాయి.
ఎక్కడ చూసినా –
రాజకీయ రచ్చలూ, వైషమ్యాల చిచ్చులూ రగులుతున్నాయి.
కోడి పందాలు కుల విద్వేషాలై
ఎడ్ల పందాలు ప్రాంత విభేదాలై
మనుషుల రక్తం కళ్ళ జూస్తున్నాయి.
నా ఊరి రహదారులన్నీ మురికి కూపాలయ్యాయి.
ఊరివాళ్ళ మనసులన్నీ గబ్బు కంపు కొడ్తున్నాయి
అందుకే –
మా ఊరు వెళ్ళాలనిపించడం లేదు.
ఆ మనుషులను చూడాలనిపించడం లేదు.