కశ్మీర రాజతరంగిణి-19

0
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

శ్యేనోహన్తి పతత్రిణో మృగపతిర్ నిష్టాతయిన్నుర్ మృగాన్।
భాద్యన్తే మనయోపి వజ్రమనినా ఖాతా ఖానిత్రైర్ మహీ॥
ప్రష్టానివా చ భాస్వతా గ్రహగణాస్ సూర్యేన్ సార్దూనితాః।
ప్రాయేణాత్ర విలోక్యతే పరిభవత్రాసః సజాతియతాః॥
(జోనరాజు, రాజతరంగిణి 651)

[dropcap]ని[/dropcap]జం నిప్పులాంటిది అంటారు. సత్యం దైవ సమానం అంటారు. కానీ దైవదర్శనం సాధన ఎంత కఠినమైనదో, సత్యం పలకటం అంతకన్నా కఠినమైనది. మనుస్మృతిలో నిజం ఎలా చెప్పాలో అత్యంత మనోహరంగా చెప్పారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టటం అతి కఠినం. అంత సులువు కాదు. జోనరాజు రచించిన రాజతరంగిణి చదువుతుంటే, అడుగడుగునా ఈ ఆలోచన మెదలుతూంటుంది. పలువురు విమర్శక పెద్దలు భారతీయ సాహిత్యాన్ని తేలికగా కొట్టి పారేస్తారు. రాజుగారి ప్రేయసి మెల్లకన్నుపై కవిత్వం చెప్తారని ఎద్దేవా చేస్తారు. రాజాశ్రయం పొంది కడుపులో చల్ల కదలకుండా కూర్చుని శృంగార కావ్యాలు చెప్తారు, రాజుల భజనలు చేస్తూ అంటూ దూషిస్తారు. సామాజిక స్పృహ లేని కవులు అని ఈసడిస్తారు. కానీ కవిత ప్రధానంగా మనస్సంబంధి అన్న విషయం విస్మరిస్తారు. కవితను అర్థం చేసుకోవటం, విశ్లేషించటం అంటే కవితను సృజించిన కవి మానసిక స్థితిని విశ్లేషించటమే కాదు, ఆ మానసిక స్థితి ఎలాంటి సామాజిక పరిస్థితులకు ఫలితమో అర్థం చేసుకోవటం కూడా. కానీ ఎదుటివారిని అర్థం చేసుకోవటం కన్నా విమర్శించి, దూషించి తక్కువ చేయటంలో ఎక్కువ అహం తృప్తి, ఆనందం ఉంటుంది. అందుకని మన ప్రాచీన కావ్యాలన్నీ ఏదో రూపంలో అవహేళనకు గురవుతున్నాయి. దుర్వ్యాఖ్యల మయమవుతున్నాయి. జోనరాజు రాజతరంగిణిపై వ్యాఖ్యానాలు, విశ్లేషణలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.

గ్రద్ద పక్షులను తింటుంది. సింహం వేటాడుతుంది. రత్నంపై వజ్రం గీతలు గీస్తుంది. భూమిని పలుగు పారలతో త్రవ్వవచ్చు. పూవులు రంగులు కోల్పోతాయి. గ్రహాలను సూర్యుడి వెలుగు కప్పేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరికైనా ప్రమాదం ‘సజాతి’ వారి నుంచే వస్తుంది. ఇది జగతి రీతి.

ఈ ఒక్క పద్యం చాలు జోనరాజు ఎంతటి మానసిక క్షోభను అనుభవించాడో తెలుసుకోవటానికి. తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలకు స్పందిస్తూ, వాటిని అర్థం చేసుకుంటూ, జగతి రీతిని విశ్లేషిస్తూ అతి గొప్ప చేదు నిజాన్ని అతి సున్నితంగా, స్పష్టంగా ప్రదర్శించాడు జోనరాజు.

ఎవరికైనా అతి తీవ్రమైన గాయం చేయగలిగేది, తీవ్రమైన వేదనను కలిగించగలిగేది, చావుదెబ్బ కొట్టేది అత్యంత సన్నిహితులే. నమ్మినవారే మోసం చేయగలుగుతారు. ఇది జగతి రీతి. ‘సికందర్ బుత్‌షికన్’ పరాయివాడు. ఇస్లాం ధర్మానుయాయి. ఆయన అకృత్యాలు చేయవచ్చు. ఇస్లామేతరులను అణచివేయవచ్చు. తనవారు కాని వారితో ఘోరంగా వ్యవహరించవచ్చు. కాని సుహాభట్టు మనవాడే. భారతీయుడే. సనాతన ధర్మానుయాయి. బ్రాహ్మణుడు. అతడు ‘సికందర్ బుత్‌షికన్’ లా వ్యవహరించటం ఊహకు అందని విషయం. ప్రపంచంలో ఏ జీవీ కూడా స్వజాతిలో వేటాడదు. పోరాడుకుంటాయి, అరచుకుంటాయి. కానీ చంపుకోవు. అది మనిషికే ప్రత్యేకం. కానీ సుహాభట్టు మతం మారిన తరువాత ఇస్లామీయుల కన్నా ఘోరంగా వ్యవహరించాడు. మతం మారని వారిని హింసించి చంపాడు. వెతికి వెతికి చంపించాడు. ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతున్న వారిని వేటాడి వేటాడి చంపించాడు. ఇక్కడే జోనరాజు రచన ప్రతిభ స్పష్టమవుతుంది. స్వజాతిలో వేటాడవు జీవులు. కానీ గ్రద్దలు, పక్షులు, ‘సజాతి’కి చెందినవి. గ్రద్ద గ్రద్దను వేటాడదు కానీ పక్షులను వేటాడుతుంది. సింహం సింహం చంపుకోవు. కానీ సింహం ఇతర జంతువులను వేటాడుతుంది. స్వజాతి, సజాతి అన్న రెండు పదాల నడుమ ఇంత భేదం ఉంది. ఆ భేదం వల్ల వాటి ప్రవర్తనలో, ఆలోచనలో తేడా వస్తుంది. రత్నం, వజ్రం రెండూ విలువైన రాళ్ళు. కానీ వజ్రం రత్నంపై గీతలు గీస్తుంది. ఇస్లామీయులు, భారతీయులు అందరూ మనుషులే. కానీ ఇస్లాం మతం స్వీకరించగానే అతను ఇస్లామేతరులను హింసిస్తున్నాడు. ఎవరికయినా భయం కానీ, గాయం కానీ సజాతీయుల వల్లనే సంభవించటం జగతి రీతి కదా అని వ్యాఖ్యానిస్తున్నాడు జోనరాజు. ఈ వ్యాఖ్య వెనుక ఎంతో బాధ, వేదనలున్నాయి.

సాధారణంగా ‘Court Poets’ అన్న పదాన్ని సాహిత్య విమర్శకులు వాడుతూంటారు. ఈ ఆస్థాన కవులు తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఆశ్రయించిన రాజులను ఇంద్రుడు, చంద్రుడు అని పొగడాలి. జోనరాజు జైనులాబిదీన్ ఆస్థాన విద్వాంసుడే అయినా ఇతర ఆస్థాన కవులు అనుభవించని కష్టాలు కావ్యరచనలో ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది కల్హణుడి రచనకూ, జోనరాజు రచనకూ నడుమ ఉన్న ప్రధాన భేదం. దీన్ని విస్మరించిన వ్యాఖ్యాతలు కల్హణుడి రాజతరంగిణిని జోనరాజు రాజతరంగిణితో పోల్చి, కల్హణుడికి ఉన్న నిజాయితీ, చిత్తశుద్ధి జోనరాజుకు లేవని తేల్చేస్తారు. రాజతరంగిణి రచన ఆరంభించేసరికి జోనరాజు ముసలివాడు అయిపోయాడని, అలసిపోయాడని, జైనులాబిదీన్ మాట తీసివేయలేక రాజతరంగిణి రచన ఆరంభించాడనీ తీర్మానిస్తారు. రాజతరంగిణి రచన పూర్తికాక ముందే జోనరాజు మరణించటం వారి వాదనకు నిరూపణగా చూపిస్తారు. జోనరాజు రాజతరంగిణిని తేల్చి పారేస్తారు. కల్హణుడి అంత ప్రతిభాశాలి జోనరాజు కాదని తీర్మానిస్తారు.

కల్హణుడు స్వేచ్ఛాజీవి. తన ఇష్టం కొద్దీ రాజతరంగిణి రచన చేశాడు. ఆయన ఎవరి ఆస్థానాన్ని, ఆశ్రయాన్ని కోరినవాడు కాదు. జోనరాజు ఇందుకు భిన్నం. జోనరాజు జీవించిన సామాజిక పరిస్థితులు, కల్హణుడి నాటి పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఇవన్నీ సృజనాత్మక కళాకారుడి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. తద్వారా అతని సృజనను ప్రభావం చేస్తాయి.

కల్హణుడు భారతీయ రాజుల అత్యుతమ పాలనా కాలాన్ని గురించి విన్నాడు. వారి నిర్మాణాలను కన్నులారా చూశాడు. వారి ఔన్నత్యాన్ని సృజనాత్మక కళాకారుడికి ఉండే ప్రత్యేక దృష్టి ద్వారా అనుభవించాడు. తన కళ్ళ ముందున్న ప్రపంచానికీ గత వైభవానికీ హస్తిమశకాంతరం ఉందని గ్రహించాడు. ఆ అనుభూతి, ఆవేదన, ఆలోచనల నుండి అతని సృజన ఆవిర్భవించింది. కల్హణుడు రాజతరంగిణి రచించిన కాలం క్రీ.శ. 1148 -50 గా చరిత్ర రచయితలు భావిస్తున్నారు.

జోనరాజు జన్మించిన తేదీ తెలియదు. మరణించిన తేదీ క్రీ.శ. 1459గా నిర్ణయించారు. జోనరాజు జైనులాబిదీన్ కోరికపై ద్వితీయ రాజతరంగిణి రచనకు ఉపక్రమించాడు. జైనులాబిదీన్ క్రీ.శ. 1418-19, 1420-1470 నడుమ కశ్మీరు సుల్తానుగా ఉన్నాడు. జైనులాబిదీన్ పాలన ఆరంభించిన 35 ఏళ్ళు అయిన తర్వాత జోనరాజు మరణించాడు. జోనరాజు మరణించిన తరువాత ‘తృతీయ రాజతరంగిణి’ని ఆతని శిష్యుడు శ్రీవరుడు కొనసాగించాడు. ఈ రాజతరంగిణిలో ప్రదర్శితమయినది క్రీ.శ. 1459 నుండి క్రీ.శ. 1486 సంవత్సరాలనడుమ చరిత్ర కాబట్టి జోనరాజు క్రీ.శ. 1459 లో మరణించాడని తీర్మానించారు. కానీ జైనులాబిదీన్ రెండు మార్లు కశ్మీరు సుల్తానుగా ఉన్నాడు. మొదటిసారి ఒక సంవత్సరం, రెండోసారి 50 సంవత్సరాలు పాలించాడు. దీని ప్రకారం జోనరాజు, జైనులాబిదీన్ పాలన ఆరంభించిన 35 ఏళ్ళ తరువాత ఎలా తీసుకోవాలన్నది సందేహంలో పడుతుంది. 1459 వరకూ జీవించాడనుకుంటే జైనులాబిదీన్ పాలన 1424లో ఆరంభం కావాలి. అయితే ఓ నాలుగయిదు వందల ఏళ్ళు అటూ ఇటూ అయినా పట్టించుకోనివారం కాబట్టి నాలుగయిదు ఏళ్ళు అటూ ఇటూ అయితే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రీ.శ. 1459లో జోనరాజు మరణిస్తే, అటు సికందర్ బుత్‌షికన్ పాలనా కాలం, షాహిఖాన్ పాలనా కాలం, రాజ్యాధికారం కోసం పోరాటాలు, హింస వంటి వాటన్నింటికీ జోనరాజు ప్రత్యక్ష సాక్షి. అంతే కాదు, రాజతరంగిణిని పర్షియా భాషలోకి అనువదించినప్పుడు ప్రాచీన రాజుల గొప్పతనాన్ని, వైభవాన్ని, అద్భుతంగా అనిపించే గాథలను విస్మరించి, అనువదించటం జోనరాజు దృష్టికి వచ్చే ఉంటుంది. రాజులు ఇస్లామీయులు. రాజభాష పర్షియన్. సంస్కృతం ప్రచలితంలో ఉన్నా, పర్షియన్ భాష ప్రాధాన్యం వేరు. వారి అనువాదాల ఆధారంగా, తెలిసేదేమిటంటే భారతీయ రాజుల గొప్పతనం, వారి దైవాభిమానం, ఐశ్వర్యం, ఉత్తమ పాలన వంటి విషయాలను ప్రస్తావించటం, వాటికి ప్రచారం ఇవ్వటం సుల్తానులకు కానీ, సుల్తానుల అనుచరులకు గాని ఇష్టం లేదని. అంటే, జోనరాజు రాజతరంగిణిలో భారతీయ రాజుల గొప్పతనం కానీ, వారి సమర్థవంతమైన పాలనను కానీ ప్రస్తావించటం, అది నిజమైనా సుల్తానుకు నచ్చదు. సుల్తానుల సమర్థకులకు నచ్చదు. అంటే, కల్హణుడు ఎంత స్వేచ్ఛగా భారతీయ ధర్మం గొప్పతనం, భారతీయ రాజుల ఔన్నత్యాలను ప్రస్తావించాడో, అంత స్వేచ్ఛగా జోనరాజు ఆ యా అంశాలను ప్రస్తావించటం కుదరదు. ప్రస్తావించకూడదు. ఎందుకంటే జోనరాజు రాజతరంగిణిని అంతరంగ ప్రేరణతో రచించటం లేదు. సుల్తాన్ ఆజ్ఞ ప్రకారం రచిస్తున్నాడు. ఎవరయినా, ఏదయినా తయారు చేసేటప్పుడు తనకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా తయారు చేయటం వేరు. వేరేవారి సూచనలను అనుసరించి తయారు చేయటం వేరు. జోనరాజు రాజతరంగిణి ఆదేశాన్ని అనుసరించి రచించినది. పైగా, సమకాలీన సామాజిక పరిస్థితుల వల్ల ఏర్పడిన పరిమితులకు లోబడి రచించినది. అందుకని ఆయన కల్హణుడు ఆపిన దగ్గర నుంచి రాజతరంగిణి రచనను ఎత్తుకొన్నా, కల్హణుడి లాగా రాజుల గురించి, వారి పాలన గురించి, వారి గొప్పతనాల గురించి ప్రస్తావించలేదు. తప్పనిసరిగా ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు మొక్కుబడిగా ప్రస్తావించి ముందుకు సాగిపోయాడు. అందుకే జయసింహుడి (1128-55) నుంచి 1320లో కశ్మీరు సుల్తానుల వశం అయ్యేవరకు ఒక రిపోర్టు రాసినట్టు చకచకా రాజుల పరంపరను మొక్కుబడిగా రాసి వదిలేస్తాడు జోనరాజు. ఎందుకంటే, భారతీయ రాజులను పొగడటం సుల్తానుకు ఇష్టం లేదు. సుల్తాను దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవితం సాగిస్తున్నవాడు, ఎంత గొప్పవాడయినా, వారికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. వారికి ఇష్టం లేని పని చేసి మనుగడ కొనసాగించలేడు. పైగా, ‘సికందర్ బుత్‌షికన్’ పాలన కాలంలో ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలిపోయిన వారందరినీ మళ్ళీ కశ్మీరానికి పిలిచి, వారికి ఆశ్రయం ఇచ్చి కాపాడుతున్నవాడు జైనులాబిదీన్. కాబట్టి అతడికి కష్టం కలిగించే పని చేయటం తానున్న కొమ్మను నరుక్కోవటం మాత్రమే కాదు, కృతఘ్నత కూడా అవుతుంది. అందుకని జోనరాజు భారతీయ రాజుల దోషాలను ఎత్తి చూపించాడు. నైచ్యాన్ని ప్రదర్శించి విమర్శించాడు. చేతకాని తనాన్ని చూపించి హేళన చేశాడు. ఎక్కడయినా తప్పనిసరిగా పొగడాల్సి వస్తే మొక్కుబడిగా ఒక్క ముక్కలో పొగిడి ముందుకు సాగిపోయాడు. అదే సుల్తానుల ‘చెడు’ చెప్పాల్సి వస్తే దాని దోషం వేరే వారిపై ముఖ్యంగా తనవారిపైనే వేసి చూపాడు. గొప్ప చెప్పాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా పొగిడేడు. కానీ తమవారే, తమవారిపై అత్యాచారాలు జరిపిస్తున్నప్పుడు తీవ్రమైన వేదనను అనుభవిస్తూ దాన్ని అత్యంత నిగూఢంగా వ్యక్తపరిచాడు. అలాంటి సందర్భాలలో అత్యద్భుతమైన ప్రతిభను, కవిత్వ ప్రజ్ఞను కనబరచాడు.

ఈ సందర్భంలో మరో విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. భారతీయులు ఇస్లామీయులు ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి మెలిసి ఉండాలన్న ప్రయత్నాలు కశ్మీరులో జరిగినంత నిజాయితీగా భారతదేశంలో ఇతర ఏ ప్రాంతంలోనూ జరగలేదు. ఇక్కడ ఇస్లామీయులు ‘దాడిమూక’లా ప్రవేశించకపోవటంతో ఒకరినొకరు గౌరవించుకుని, అర్థం చేసుకునే ప్రయత్నాలు స్వాభావికంగా జరిగాయి. ఇతర ప్రాంతాలలో తాము విజేతలమన్న అహంభావం ప్రదర్శించే వీలు ఇస్లామీయులకు లభించింది. కశ్మీరులో కొన్ని వందల సంవత్సరాలు పాలితులుగా ఉండటం, విధేయులుగా ఉండడం వల్ల తాము విజేతలమన్న అహంకారం కశ్మీరీ ఇస్లామీయులలో కలుగలేదు. అధికారానికి వచ్చినా సరే, వారు భారతీయ రాజుల ఆస్థానాలలో కీలకమైన పదవులు నిర్వహించినవారు కావటంతో, తాము విజేతలము, ఇతరులు విజితులు అన్న భావన సుల్తానులలో కలగలేదు. పైగా రాజులు సుల్తానులయ్యారు తప్ప వ్యవస్థ మారలేదు. బ్రాహ్మణులు, ఇతరులు కీలకమైన పదవులలో కొనసాగారు. దాంతో పర్షియన్ భాష ప్రవేశించినా, సంస్కృతం భాష ప్రాధాన్యాన్ని, ప్రాభవాన్ని కోల్పోలేదు. సంస్కృత పండితుల గౌరవం తక్కువ కాలేదు. అయితే ఇస్లాం రాజ్యంలో ఇటువంటి పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగే వీలు లేదు. ఇస్లాం సూత్రాలలోనే ఇతరులను కాఫిర్‍లని, జిమ్మీలని భావించి వారు ఇస్లాం స్వీకరించేట్టు చేయటం ఉంది. ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులను సమానంగా చూడడం భరించటం కష్టం. పరమత సహనం ప్రదర్శించే సుల్తానును సహించటం కష్టం. దాంతో నెమ్మదిగా కశ్మీరులో పరిస్థితి మారటం మొదలయింది. ఇతర ప్రాంతాల నుంచి కశ్మీరు వచ్చి చేరిన ఇస్లామీయులు కశ్మీరులో ఇస్లామేతరులు అనుభవిస్తున్న స్వేచ్ఛను, సౌఖ్యాన్ని ఆమోదించలేకపోయారు. ఫలితంగా కశ్మీరులో ఇస్లామేతరులపై అత్యాచారాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా సూఫీ మత ప్రచారకుడు మీర్ మహమ్మద్ హమదాని కశ్మీరు వచ్చి ఉన్న పన్నెండేళ్ళు కశ్మీరును సంపూర్ణంగా రూపాంతరం చెందించాయి. కశ్మీరులో కాఫిర్‍లపై జిహాద్ ప్రకటితమయింది. ‘బహరిస్తాన్-ఇ-షాహి’, ‘తోష్‌ఫాయల్-అహబ్’ వంటి గ్రంథాలలో కాఫిర్‍లను హింసించి, తీవ్రమైన విధంగా ప్రవర్తించినందుకు ‘సికందర్ బుత్‌షికన్’ ను ‘noblest ruler’గా పొగడటం కనిపిస్తుంది.

ఇదంతా జోనరాజుకు తెలుసు. ప్రత్యక్ష సాక్షి ఆయన. కానీ తన రాజతరంగిణిలో ఆయన మహమ్మద్ హమదాని ప్రసక్తి తేనే లేదు. పలువురు విశ్లేషకులు ఈ విషయంలో జోనరాజును విమర్శిస్తారు. ఆయన తన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనించలేదని అంటారు. రాజతరంగిణి ఆయన నిజాయితీగా రాయలేదని వ్యాఖ్యానిస్తారు. కానీ సుల్తాన్ ఆశ్రయంలో ఉంటూ… ఆ సుల్తాన్ అభిమానించే మత ప్రచారకుడిని ‘దోషి’గా నిలపటం లౌక్యం కాదు. బ్రతుకుపై ఆశ ఉన్నవాడు చేయాల్సిన పని కాదు. సుల్తాన్ ఉప్పు తింటూ సుల్తాన్ గౌరవించే వ్యక్తిని దూషించటం (అది నిజమైనా) అనౌచిత్యం. అందుకే జోనరాజు మహమ్మద్ హమదాని ప్రస్తావనే రాజతరంగిణిలో తేలేదు. ‘సికందర్ బుత్‌షికన్’ మంచివాడు, అమాయకుడు. అతడిని పాడు చేసింది, అతని పేరు మీద అకృత్యాలు చేసి విలయతాండవం చేసింది మతం మారిన ‘సుహాభట్టు’ అని పదే పదే చెప్తాడు. సుహాభట్టును తీవ్రంగా దూషించాడు. అందరికీ సుహాభట్టును ప్రతీకగా చేసి తిట్టి కసి తీర్చుకున్నాడు. సుహాభట్టుని కూడా ‘సైఫుద్దీన్’ అని తిట్టలేదు. అదో దోషం అవుతుంది. కాబట్టి సుహాభట్టు సైఫుద్దీన్ అయినా, జోనరాజు ఎక్కడా అతను మతం మారిన తరువాత స్వీకరించిన పేరును ప్రస్తావించలేదు. అతడిని మతం మార్చి దుష్కృత్యాలకు ప్రేరేపించిన హమదాని పేరు ప్రస్తావించలేదు. సుహాభట్టు అనే పేరుతోనే అతదిని విమర్సించాడు. సికందర్ బుత్‌షికన్ చర్యలన్నిటికీ సుహాభట్టును బాధ్యుడిని చేశాడు. పెర్షియ చరిత్ర రచయితలు సికందర్ బుత్‌షికన్ కు మార్గదర్శకత్వం చేసినందుకు హమదానిని, సైఫుద్దీన్ ను పొగిడేరు. వారు సైఫుద్దీన్ అన్నారు కానీ సుహాభట్టు అన్నపేరు ఎక్కడా ప్రస్తావించలేదు. పెర్షియన్ రచయితలు ఏ విషయం ఆధారంగా సికందర్ బుత్‌షికన్ ను పొగిడేరో, జోనరాజు ఆ విషయం ఆధారంగానే సికందర్ ను విమర్శించాలి. కానీ, అందుకు భిన్నంగా సికందర్ మంచివాడే సుహాభట్టే దుశ్చర్యలన్నీ చేశాడు అని వ్యాఖ్యానించాడు జోనరాజు. అందుకే, స్వజాతి వాడయిన సుహాభట్టు సజాతివాడయ్యాడు. అతనివల్లే ఎక్కువ హాని కలుగుతోంది. ఇది లోకరీతి అన్నాడు జోనరాజు. అంతకు ముందు, రాజు దాహిర్ ను మోసం చేసింది, చివరి క్షణంలో అతని గుట్టుమట్లు అరబ్బులకు చెప్పింది అతని నమ్మినబంటులే. పృథివీరాజుకు అన్యాయం చేసిందీ అతడు నమ్మినవారే. ఇప్పుడు కశ్మీరులో అకృత్యాలు జరుపుతున్నదీ సజాతివారే.. సుల్తానుదేమీ దోషంలేదు. ఎదుటి వాడిలో దోషం వున్నా, వాడిని సమర్ధిస్తూ, వీలయితే వాడి దోషాన్ని కప్పిపుచ్చి, తమవారిలో దోషాలను వెతికి, ఎత్తిచూపించి, దూషించే సగటు భారతీయుల న్యూనతా మనస్తత్వానికి బీజాలు బహుశా ఆ కాలంలోనే పడ్డాయేమో…కాలక్రమేణా ఆ న్యూనతభావం తనది అన్న దాన్ని చులకనచేసుకోవటమే గొప్పతనం అనే స్థాయికి ఎదిగిందేమో అనిపిస్తుంది జోనరాజు రచించిన రాజతరంగిణి ఆధారంగా కవి మానసిక స్థితిని అంచనావేయాలని ప్రయత్నిస్తే!!!!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here