[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. గీతే గీతని నడిపిస్తుంది
[dropcap]న[/dropcap]గరంలో ఒక మంచి దేవాలయం ఆ రామ మందిరం. అక్కడే ఉమా చంద్ర మౌళీశ్వరుడు, గణేశుడు, హనుమాన్ మందిరాలు కూడా ఉన్నాయి.
ఒక సాయంత్రం (ప్రదోషకాలంలో) శివాలయంలో పూజకి హాజరైన శేషయ్య బయటికి వచ్చేస్తుండగా, ఆ ఆలయ కమిటీ ఛైర్మన్ ఆలయం ఆఫీసులో అరుస్తూండటం వినబడింది. చైర్మన్ తెలిసిన వాడే గదా అని శేషయ్య లోపలికి అడుగుపెట్టారు. ఛైర్మన్ గౌరవంగా ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టాడు.
అక్కడ రామదాసు, అతడి భార్య లక్ష్మి నిలబడి ఉన్నారు. వాళ్ళు ఏదో ఒకటి రెండు సార్లు మాట్లాడబోయారు. కానీ చైర్మన్ వినిపించుకోవటం లేదు. వాళ్ళిద్దర్నీ శేషయ్య గుర్తు పట్టారు. వాళ్ళు కొద్ది వారాలక్రితం స్టేడియంలో జరిగిన షణ్ముఖ శర్మ గారి గీతా జ్ఞానయజ్ఞంలో రోజూ వచ్చి ఒక మూల కూర్చుని, శ్రద్ధగా వింటూ, రాసుకొంటూ కనుపించేవారు. ఇప్పుడు ఛైర్మన్ మాటల్ని బట్టి ఆ లక్ష్మి ఈ దేవాలయంలో రోజూ ఉదయం పరిశుభ్రంగా ఊడవటం, కళ్ళాపి చల్లటం, ముగ్గులు వేయటం వంటి పనులు చేస్తోంది. కొన్ని రోజులు నాగా పెట్టిందని, వేతనం చెల్లింపులో లెక్కల మీద ఛైర్మన్ పంచాయతీ.
“ఇంకెప్పుడూ ఇలా చేయకండి” అంటూ ఛైర్మన్ వాళ్ళని పంపించేశాడు.
తనకు వేరే పని ఉందని అంటూ శేషయ్య కూడా లేచారు. ఛైర్మన్ గుడి బయటదాకా వెంట వచ్చాడు.
ఆ వీధి మొదట్లో రామదాసు, లక్ష్మి నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నారు. శేషయ్య అక్కడ ఆగి, అడిగారు:
“మీరు గీత ప్రవచనాలకి స్టేడియంకి వచ్చేవారు కదా!”
“అవునండయ్యా” అన్నాడు రామదాసు.
“నీ భార్య ఇక్కడ చేసే పని చాలా ఉన్నతమైంది. ఛైర్మన్ అరుస్తుంటే, ఎందుకు గట్టిగా మాట్లాడరు?”
భార్యా భర్తలిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
“అయ్యా, ఆయన చెప్పే లెక్కలు తప్పు. అలాగని మేం గట్టిగా చెప్పామనుకోండి. అక్కడ భక్తులు అంతా వింటున్నారు కదా. ఆయన ఇంకా రెచ్చిపోతాడు. మా మాటే నెగ్గాలని మాకూ కోపం వస్తుంది. మేమూ అరుస్తాం. చివరికి ఆయనకీ, మాకూ కూడా బుద్ధి నశిస్తుంది. అందరి ముందూ నాకన్నా ఆయనకే అవమానం… అయినా నా మాటే నెగ్గాలన్న ఒక్క కోరిక నా బుద్ధి నశించటానికి కారణం అని తెలిసికూడా, నేను ఎందుకు కోపానికి లోనవ్వాలి? గీతలో కృష్ణయ్య చెప్పింది అదే కదయ్యా!”
శేషయ్య ఆ భార్యాభర్తల్ని ఆశీర్వదించాడు.
***
కర్ణాటకలోని ఒక పీఠాధిపతి సత్సంగ మందిరంలో ఆ ఉదయం నిత్యం జరిగే అభిషేకం పూర్తయింది. దేశంలో ఎక్కడెక్కడినుంచో భక్తులు వచ్చి, అభిషేకం తరువాత తీర్థం కోసం బారులు తీరారు.
పీఠాధిపతి అక్కడ తమకోసం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చుని వచ్చే వారిలో తనకు తెలిసిన వారిని పలకరిస్తున్నారు. తీర్థం మాత్రం ఆయన తరువాత నిలబడిన సహాయకులు ఇస్తున్నారు.
వరుసలో వెళ్తున్న వారంతా (పురుషులైతే) చొక్కాలు తీసేసి, పీఠాధిపతులకు దూరం నుంచే నమస్కారం చేస్తున్నారు.
పంక్తిలో వస్తున్న శేషయ్యను చూడగానే పీఠాధిపతులు పలకరించారు. ఒక నిమిషం పాటు మాట్లాడుకున్నారు. శేషయ్య ముందుకు నడిచి స్వామీజీ సహాయకుడి దగ్గర తీర్థం తీసుకుంటూంటే, దూరంగా రామదాసు, లక్ష్మి స్వామీజీ కేసి భక్తితో చూడటం కనుపించింది.
శేషయ్య వాళ్ళిదర్నీ దగ్గరకి పిలిచారు.
రామదాసు చొక్కా తీసేసాడు. ఇద్దరూ భయం భయంగా ముందుకు వచ్చారు.
శేషయ్య రెండడుగులు వెనక్కి వేసి, పీఠాధిపతులతో చెప్పారు.
“వీళ్ళు మా ప్రాంతంలో గీతను చదివి, అర్థం చేసుకొని సాధన చేస్తున్న దంపతులు.”
పీఠాధిపతి వాళ్ళకేసి చూశారు. ఏదో సందేహం కలిగింది.
“వాళ్ళు ఏం చేస్తుంటారు?” అని అడిగారు శేషయ్యని.
“రామదాసు వృత్తి రీత్యా చర్మకారుడు. అతని భార్య మా దగ్గర రామాలయంలో ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచే సేవ చేస్తూంటుంది. నిత్య గీతా సాధకులు. తమ ఆశీర్వచనం కోరుతున్నారు.”
రామదాసు, లక్ష్మి తమకి ఆ స్వామిని చూడటమే భాగ్యం అనుకుంటున్నారు. అంతలో స్వామీజీ వాళ్ళని దగ్గరికి రమ్మన్నట్లుగా తల ఊపారు.
శిష్యులు “దూరం, దూరం” అంటున్నారు.
వాళ్ళిద్దరూ ముందుకొచ్చారు. పీఠాధిపతుల ఎదురుగా రెండు చేతులూ జోడించి వినయంగా నిల్చున్నారు.
“మీకు వచ్చిన రెండు మూడు గీతా వాక్యాలు చెప్పండి” అన్నారు స్వామీజీ.
ఆ ఇద్దరూ ఒకరివంక ఒకరు చూసుకున్నారు.
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన…” ఒక శ్లోకం చెప్పారు. స్వామీజీ శ్రద్ధగా వింటున్నారు.
“విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని, శుని చైవ, శ్వపాకే చ పణ్డితా స్సమదర్శినః…(జ్ఞాని అయిన యోగి విద్య వినయాది విషయాలలో బ్రాహ్మణుని, ఆవుని, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసాన్ని ఆరగించేవానిని కూడా సమానమైన దృష్టితో చూస్తాడు)…”
ఆ క్షణంలో పీఠాధిపతుల కళ్ళల్లో ఒక మెరుపు.
‘ఇక చాలు ‘ అన్నట్లుగా సైగ చేశారు.
సహాయకుడు వాళ్ళిద్దరికీ తీర్థం ఇవ్వబోయాడు.
స్వామీజీ ఆపారు. తనే స్వయంగా ఆ తీర్థ పాత్ర అందుకున్నారు.
వాళ్ళిద్దర్నీ దగ్గరికి రమ్మన్నారు. తనే స్వయంగా తీర్థం ఇచ్చారు.
ప్రసాదం ఇచ్చారు.
“మీరిద్దరూ మా ప్రతినిధులుగా మీ చుట్టుపక్కల వాడల్లో గీతా ప్రచారం సాగించండి” అంటూ చిరునవ్వుతో ఆశీర్వదించారు.
రామదాసు, లక్ష్మి కళ్ళల్లో ధారగా ఆనంద బాష్పాలు.
ఇవతలకు వచ్చాక, వాళ్ళిద్దరూ ధన్యవాదాలు చెప్పబోతుంటే, శేషయ్య అన్నారు:
“గీతని నమ్ముకున్న వాడి గీతని, గీత ఎప్పుడూ సుపథంలోనే నడిపిస్తుంది.”
2. వాస్తు అంటదు!
చదువు అబ్బలేదు.
అయినా పరాంకుశానికి బ్రతుకుతెరువు బాగా అబ్బింది. ‘వీడికి చదువు రాలేదు, పాపం బిందెలకి, బక్కెట్లకి మాట్లు వేయటం కూడా రాదు, ఎలా బ్రతుకుతాడో’ అని బెంగ పడుతూనే అమ్మా, నాన్న ఓ మంచిరోజున బక్కెట్ తన్నేశారు.
వాళ్ళకి అంత్యక్రియలు జరిపించిన సిద్ధాంతి గారే జాలిపడి, “నాతో వస్తావురా?” అని అడగటమే ఆలస్యం మూటా ముల్లె సర్దుకుని ఆయన స్కూటరెక్కేశాడు పరాంకుశం.
ఆ సిద్ధాంతి గారి వ్యాపకాల్లో ముఖ్యమైంది వాస్తు. గురువుగారి ద్వారా సంక్రమించిన వాస్తుశాస్త్రంలో ‘అ, ఆ’ లు ఉపయోగించుకొని బ్రతికేయచ్చు అని ఒక్క ఏడాది అనుభవంతో కొంత నమ్మకాన్ని జేబులో వేసుకున్న అంకుశం ముహూర్తం చూడకుండా సిటీకి వెళ్ళాలని ధూమ (రహిత) శకటంలోకి జంప్ చేశాడు.
పరాంకుశం పంచె కట్టేశాడు. విభూతిరేఖలతో మొహం రుద్దేశాడు.
పెదాలు కదిలిస్తూ, పైకి శబ్దం వినబడకుండా, ‘నాకు ధనలక్ష్మి సంక్రమించుగాక’ అని తథాస్తు దేవతలకోసం ఎదురుచూస్తూ, ‘వాస్తు బ్రహ్మ’ అని బోర్డు పెట్టేశాడు ఆ సిటీలో.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చిరంజీవికి ప్యాకేజీ పెరిగిపోయి లక్ష దాటిపోయింది. పెళ్ళికి ముందే మంచి ఇల్లు కొందామని, గ్రామంలో తన తాతగారి ఇల్లులాగా మంచి పెరడు గిరడు ఉండాలని తహతహ.
ఆన్ లైనులో వెతికితే ‘వాస్తు బ్రహ్మ’ అంకుశం తారసపడ్డాడు.
***
తొలి ఇల్లు చూశారు.
“బాబూ,నువ్వు చిరంజీవిగా ఉండాలంటే …”
“ఇప్పుడు చిరంజీవినే కదా!”
“పేరు కాదు బాబూ, నీ జీవితం ఉండాలంటే, ఈ ఇల్లు కలలోకూడా కోరుకోకు.”
“అదేమిటండీ, బజారుకి దగ్గర, ఆఫీసుకి దగ్గర కదా!”
“అవును వల్లఖాటికి ఇంకా దగ్గర. వందగజాలే దూరం.”
“ఎందుకు వద్దంటున్నారు?”
“ఈ కొంపకి వీధిశూల తగలడిందిరా నాయనా.”
అంతే, అది రద్దయిపోయింది. చిరంజీవికి ఓ వెయ్యి రూపాయలు విజిటింగ్ ఫీజూ ఖర్చయిపోయింది.
మళ్ళీ ఆదివారం నాడు ఇంకో ఇల్లు చూశారు.
“ఊహు, లాభంలేదురా చిరం. వంటగది ఈశాన్యంలో ఉంది. నీక్కాబోయే భార్యకీ నీకూ రోజూ భోగిమంటలే.”
“నాకు పెళ్ళి కాలేదు కదా!”
“అయ్యాకేరా అబ్బీ. అయినా ఈశాన్యంలో కుంపట్లేమిటిరా బడుద్ధాయి.”
అంతే, ఆ ఇల్లూ పోయింది. చిరంజీవికి మళ్ళీ ఓ వెయ్యీ వదిలింది.
మళ్ళా ఆదివారం …
ఈసారి, ఇంటిని బయటనుంచి చూస్తూనే అంకుశం పెదిమ విరిచేశాడు.
“బొత్తిగా లాభం లేదోయ్. జీవితమంతా ప్యాకేజీలు పెరక్కుండా ఇలాగే దిగులుగా దిగాలు పడి కూర్చుంటావ్.”
“ఎందుకంటారు? వంటగది ఆగ్నేయంలో ఉంది. నీళ్ళు ఈశాన్యానికే పరుగెడుతున్నాయి. పడకగది నైఋతిలో ఉంది. అద్భుతం కదా!”
“ఎంత వెర్రివాడవోయ్. నైఋతి పశ్చిమంలో పడమటవైపు ప్రవేశద్వారం ఉంటే ఎంతప్రమాదమో చెప్పానా! అర్థం చేసుకోవాలయ్యా. ప్యాకేజీల చదువులు కేజీలక్కేజీలు చదివితే కాదు.”
చిరంజీవికి నీరసమొచ్చేసింది. ఓ ప్రక్కన తనకి పెళ్ళి కుదిరింది. అప్పటికే ఈ వాస్తుబ్రహ్మగారి మాట ప్రకారం 23 ఇళ్ళు చూశాడు. ప్రతి ఇంటికీ వాస్తు దోషాన్ని పట్టుకుంటున్నాడు ఈ అంకుశం. వాస్తు గోల లేని ఇల్లు దొరకదా? అసలు వాస్తు ప్రయోజనం ఏమిటి??… బాగా ఆలోచించాక మనో వికాసం బాగా కలిగింది.
దొరికింది !!!
వరుసగా మూడు వారాలు ప్యాకేజీల చిరంజీవి నుంచి ఫోన్ రాకపోతే, అంకుశానికి సందేహం కలిగింది.
తనే ఫోను చేశాడు.
“ఏమయ్యా, నీ కోసం మూడు ఆదివారాలు నా అమూల్యమైన సమయాన్ని కేటాయించుకొని వృధాగా కూర్చున్నానయ్యా. ఏమయిపోయావు.”
“ఇల్లు చూసుకున్నాను స్వామీ.”
“ఆ! మరి వాస్తు!”
“సూపర్‌గా ఉంది స్వామీ.”
అంకుశం ఖంగారు పడ్డాడు. వాస్తు సలహాదారుని వీడు మార్చేశాడా?
“మరి నాకు చూపించవుటోయ్!”
“రండి. ఇవ్వాళ మధ్యాహ్నమే వెళ్దాం.”
చిరంజీవి తన కారులో అంకుశాన్ని సిటీ బయట ‘యువర్ హోమ్’ కంపెనీ కట్టిన విల్లాలుండే ప్రాంగణానికి తీసుకెళ్ళాడు.
కారు దిగి, ఎదురుగా ఉన్న విల్లాని చూస్తూనే, అంకుశం పెదిమ విరిచేశాడు.
“లాభం లేదోయ్. దీనికి వాయవ్యంలో ఉత్తర వాయవ్యం పెరిగింది. దాంతో …”
చిరంజీవి కిసుక్కున నవ్వాడు.
“ఇది కాదు స్వామీ. అదిగో ఆ వెనకాలున్న బహుళ అంతస్తుల భవనంలో ఆఖరి అంతస్తు. గాలి వెలుతురు పుష్కలంగా వస్తాయి. ఇంకా దానికి మీ వాస్తు కావాలా?”
మెడ వెనక్కి వంచి, తల పైకెత్తి, ఆ 35 అంతస్తుల భవనంలో చివరి అంతస్తు కేసి చూస్తూనే అంకుశం కళ్ళు తిరిగి పడిపోయాడు.