రెండు ఆకాశాల మధ్య-2

1
4

[dropcap]ర[/dropcap]షీద్ మెల్లగా నడుస్తున్నాడు. రోజూ నడిచే తోవే.. కళ్ళు మూసుకునైనా నడవగలిగేంత అలవాటైన తోవ.. అతని ఆలోచనలన్నీ మూడు నెలల తర్వాత జరగబోయే ఫర్హానా నిఖా చుట్టే తిరుగుతున్నాయి. ఫర్హానా తనకంటే రెండేళ్ళు పెద్దది. ఆడపిల్ల కావడం వల్లనేమో తనకంటే పదేళ్ళు పెద్దదానిలా ఆరిందాలా ప్రవర్తిస్తో ఉంటుంది. తనని చిన్న పిల్లాడిలా చేసి అధికారం చెలాయిస్తో ఉంటుంది. అవసరం వచ్చినపుడు అమ్మలా ఆదుకుంటుంది కూడా.

అందుకే ఫర్హానా అంటే తనకు చాలా యిష్టం. బార్డర్‌కు ఆనుకుని ఉండే గ్రామాల సంబంధాలు వద్దని చెప్పడంతో అన్నయ్యే పట్నం కుర్రాడి సంబంధం చూశాడు. అతను అన్నయ్య స్నేహితుడే. ఆర్. ఎస్. పురాలో అతనికి పండ్ల దుకాణం ఉంది. “నాకు నాలుగేళ్ళుగా తెల్సిన అబ్బాయి. చాలా బుద్ధిమంతుడు. నమాజీ.. పెద్దలంటే గౌరవం. మన ఫర్హానా సుఖపడ్తుంది నాన్నా” అని అన్నయ్య చెప్తుంటే వంట గదిలోంచి విన్న ఫర్హానానే కాదు తను కూడా ఎంత మురిసిపోయాడో..

అతని పేరు ఫిరోజ్. వాళ్ళ అమ్మానాన్నల్తో కలిసి యింటికొచ్చినపుడు చూశాడు. ముట్టుకుంటే మాసిపోయేలా మంచి రంగున్నాడు. చిరు గడ్డం, పెదవుల మీద నిరంతరం మెరిసే చిరు దరహాసం.. చాలా సిగ్గరిలా అన్పించాడు.. నాన్నతో మాట్లాడేటప్పుడు కూడా తల వొంచుకునే మాట్లాడాడు.

వాళ్ళు వెళ్ళిపోయాక తను ఫర్హానాని ఎలా ఆటపట్టించాడో గుర్తుకు రాగానే అనాయాసంగానే అతని పెదవుల మీద నవ్వు విరిసింది.

“కాబోయే షొహర్ని బాగా చూసుకునే ఉంటావుగా.. నీకు నచ్చాడా? నిజం చెప్పు” అని అడిగాడు.

ఫరానా సిగ్గు పడిపోతూ తలొంచుకుని, “చూడనే లేదు. నువ్వు చూశావుగా. నీ కాబోయే జీజాజి ఎలా ఉన్నాడో నువ్వే చెప్పు” అంది.

“అబద్దాలు చెప్పకు.. నువ్వు పరదా చాటునుంచి అతన్ని తొంగి తొంగి చూడటం నేను గమనించలే దనుకున్నావా?” అన్నాడు.

“అయ్యో ఏం చూడటంలే.. అసలా మనిషి తల పైకెత్తితేగా ముక్కూ మొహం ఎలా ఉన్నాయో చూడటానికి? అమ్మాయిలా తలొంచుకుని కూచుంటే నుదురూ జుట్టూ తప్ప యింకేం కన్పిస్తాయి చెప్పు.. అందుకే చూసినా చూడలేదనే చెప్పా. నువ్వు చెప్పు అతనెలా ఉన్నాడో” అంది.

“చాలా అందంగా ఉన్నాడు దీదీ.. రంగయితే అచ్చం పాల మీగడే అనుకో.”

“గడ్డం మీసాలు ఉన్న అమ్మాయిలా ఉన్నాడు కదూ నాజూగ్గా.. సిగ్గుపడ్తూ” అంటూ నవ్వింది.

“అంటే నువ్వు చూశావన్న మాట.”

“ఆ చూశాలే.. వాళ్ళు వెళ్ళడానికి లేచి నిలబడినప్పుడు అన్నయ్య ఏదో అడిగాడుగా. అప్పుడో క్షణం అతను అన్నవైపు తిరిగి చూశాడు. అదే నా భాగ్యం అనుకున్నా.”

“నీ భాగ్యానికేమైంది దీదీ.. చాలా నెమ్మదస్తుడు. నువ్వు మాటకారివి కదా. నీదే రాజ్యం” అన్నాడు.

ఆమె సిగ్గుపడిపోయి గదిలోకి పారిపోయింది.

ఆమె నిఖా రోజు వేలికి పెట్టుకునే ఉంగరం తన సంపాదనలోంచే కొనాలని అతని కోరిక. అందుకే పెళ్ళి నిశ్చయమైనప్పటినుంచి నెల జీతం మొత్తం యింట్లో యివ్వకుండా దాచి పెడ్తున్నాడు.

దీపావళి రోజు టపాసులు పేలినట్టు ఏదో శబ్దం విన్పిస్తే ఆలోచనల్లోంచి బైటపడి చెవులు రిక్కించి విన్నాడు. బార్డర్‌కు దగ్గరగా ఉండే వూళ్ళో ఉండటం వల్ల మిగతా గ్రామస్థులకు మల్లే ప్రతి చిన్న శబ్దానికి ఉలిక్కి పడటం, తుపాకుల శబ్దమేమోనని భయపడటం అతనికి అలవాటైంది. రాత్రుళ్ళు నిద్రలోంచి అలా ఎన్నిసార్లు ఉలిక్కిపడి లేచాడో.. “నాన్నా.. పాకిస్తాన్ సైనికులు మళ్ళా కాల్పులు జరుపుతున్నట్టున్నారు. ఆ శబ్దాలు విన్నావా? తొందరగా బయల్దేరండి. ఇక్కణ్ణుంచి పారిపోయి ఎక్కడైనా తలదాచుకుందాం” అని తను భయంతో బిగదీసుకుపోతూ అనడం.. నాన్న సముదాయిస్తూ “అది తుపాకుల శబ్దం కాదురా. వూళ్లో పెళ్ళి జరుగుతోంది. బాణాసంచా కాలుస్తున్న శబ్దం అది. ఇప్పుడు రెండు దేశాల మధ్య ప్రశాంత వాతావరణమే ఉందిగా, నిశ్చింతగా పడుకో” అనడం..  మామూలైపోయింది.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం లేకున్నా ఎన్నిసార్లు పాకిస్తానీ సైనికులు శాంతి ఒప్పందాల్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరిపారో.. ఎన్నిసార్లు గొడ్డూ గోదా యిళ్ళూ వదిలేసి శిబిరాల్లో తల దాచుకోవాల్సి వచ్చిందో గుర్తొచ్చి అతను భయంతో వణికిపోయాడు.

ఈసారి స్పష్టంగా తుపాకులు పేలుతున్న శబ్దం వినబడింది. అతనికి ఎటువైపుకు పారిపోవాలో అర్థం కాలేదు. తమ వూరు అటు పాకిస్తానీ సైనిక శిబిరాలకు, యిటు భారతదేశ సైనికి శిబిరాలకు సరిగ్గా మధ్యలో ఉంది. భారతదేశ సైనికులు కాల్పులు జరిపినా తూటాలు బార్డర్ దాటి పాకిస్తాన్ భూభాగంలో పడాలని లేదు. అవి కొన్నిసార్లు గ్రామంలోని ఏ యింటి గోడలకో ఛిద్రాలు చేయవచ్చు లేదా పొలాల్లో పని చేసుకునే ఏ రైతు గుండెల్లోకో చొచ్చుకుని పోవచ్చు.

అతనికి భయంతో కాళ్ళూచేతులు వణకసాగాయి. చుట్టూ చూశాడు. రోడ్డు తప్ప తల దాచుకోడానికి ఏమీ కన్పించలేదు. అప్పటికి దాదాపు రెండు కిలోమీటర్లు నడిచాడు. ఆర్.ఎస్.పురా వెళ్ళాలంటే మరో ఐదు కిలోమీటర్లు నడవాలి. దానికన్నా వెనక్కితిరిగి వూరివైపుకు పరుగెత్తి వెళ్ళడమే క్షేమం అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా వూరి వైపుకు పరుగు లంకించుకున్నాడు. ఇప్పుడు తుపాకీ శబ్దాలు ఎడతెరపి లేకుండా పెద్దగా విన్పించసాగాయి. ఇరువైపులా సైనికులు కాల్పులు జరుపుతున్నారని అర్థమై ప్రాణభయంతో మరింత వేగంగా పరుగెత్తసాగాడు. నెత్తిమీదనుంచి జుయ్యిమంటూ శబ్దం చేస్తూ ఏదో వస్తువు దూసుకెళ్ళింది. మరుక్షణం పెద్ద శబ్దంచేస్తూ అతనికి దూరంగా బాంబు పేలింది. క్షణకాలం ఆగి వెనక్కి తిరిగి చూశాడు.. ఆకాశం పైనుంచి నిప్పులు కుమ్మరించినట్టు ఎగసిపడ్తోన్న మంటలు.. దట్టంగా అల్లుకుంటూ పొగ.. పాకిస్తానీ సైనికులు ఫిరంగులో కాల్పులు జరుపుతున్నారని అర్థమైంది.

ఫిరంగుల గురించి ఆ వూళ్లో వాళ్ళందరికీ తెలుసు. పాకిస్తానీ సైనికులే కాదు భారతీయ సైనికులు కూడా ప్రయోగించే ఫిరంగి గుళ్ళకి వూళ్లోని మట్టి యిళ్ళు ఎన్ని ధ్వంసమయ్యాయో చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్పేస్తాడు. కొన్నిసార్లు ఫిరంగి గుళ్ళు పొలాల్లో పడి పేలకుండా ఉండిపోతే అధికార్లకు వర్తమానం పంపి వాటిని నిర్వీర్యం చేసిన సంఘటనలు కూడా వాళ్ళ అనుభవంలో ఉన్నాయి.

ఇలా పరుగెత్తుకుంటూ పోతుంటే ఏ ఫిరంగి గుండో తన పక్కన పడి పేలితే ప్రాణాలు పోవటం ఖాయమని అతనికి అర్థమైంది. అరఫర్లాంగు దూరంలో రోడ్డుకింద నుంచి వర్షపు నీరు పోవడానికి తూము కట్టి ఉన్న విషయం గుర్తొచ్చింది. రోడ్డుకిరువైపులా సిమెంటు దిమ్మెలు కూడా ఉన్నాయి. ఆ దారెంట నడిచి వెళ్ళే మనుషులు ఒక్కోసారి సేద తీర్చుకోడానికి కొద్దిసేపు సిమెంటు దిమ్మెల మీద కూచుని, మళ్ళా తమ నడకని కొనసాగిస్తుంటారు.

అది గుర్తుకు రాగానే రషీద్ వింటిని వదిలిన బాణంలా అటువైపుకి దూసుకెళ్ళాడు. తూము కన్పించగానే అతనికి ప్రాణం లేచొచ్చింది. రోడ్డు దిగి, తూముకింద దాక్కున్నాడు. తుపాకులు పేలుతున్న శబ్దం మరింత పెరిగింది. అతనికి అమ్మానాన్నల్తో పాటు తనకు అత్యంత ప్రియమైన అక్క గుర్తొచ్చింది. వాళ్ళెక్కడున్నారో అన్న దిగులు.. యింటి బైట ఉంటే తూటాలు తగిలే ప్రమాదముంది. నాన్న పొలానికెళ్ళి ఉంటాడు. ఈ శబ్దాలు విని యింటికి చేరుకుని ఉంటాడో లేదో.. కాల్పులు కొద్దిసేపు ఆగితే తను కూడా యిల్లు చేరుకోవచ్చని అతని ఆశ.. కుటుంబ సభ్యులతో కలిసుంటే సురక్షితంగా ఉన్నట్టనిపిస్తుందని అనుకున్నాడు..

కొద్దిసేపు తుపాకుల శబ్దం ఆగింది. నిర్విరామంగా కాల్పులు జరిపాక మధ్యలో అరగంటో గంటో విరామం మామూలే. రషీద్ మెల్లగా లేచి నిలబడ్డాడు. వేగంగా పరుగెత్తితే వూరిని చేరుకోడానికి ఇరవై నిమిషాలకు మించి పట్టదు. ఓ క్షణం అనుమానంగా ఆకాశం వైపుకు చూశాడు. కాల్పులు నిజంగానే ఆగాయా? ఎంత సేపు ఆగుతాయి? తను వూరు చేరుకునేవరకు మళ్ళా కాల్పులు జరపరా? ఎలా తెలుస్తుంది?

ధైర్యం చేసి ఏదో ఓ నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి.. అతను వూరి వైపుకి వెళ్ళడానికే నిర్ణయించుకుని, రెండడుగులు వేశాడు. గాల్లో జుయ్యిమని ఏదో దూసుకువస్తున్న శబ్దం.. అతనికి అతి సమీపంలో ఫిరంగి గుండు పడింది.

క్షణాల్లో అది పెద్ద విస్ఫోటనంతో పేలిపోయింది. రషీద్ శరీరం గాల్లోకి లేచి, రెండు ముక్కలై, రోడ్డు మధ్య పడిపోయింది.

***

తన భర్త పొలానికెళ్ళాక, మున్నాని పిల్చుకుని వూరి పొలిమేరల్లో ఉన్న దట్టమైన చెట్ల వైపుకు నడుస్తోంది ఫౌజియా. ఆమె చేతిలో కొమ్మలు కోయడానికి ఉపయోగపడే దోటీ కర్ర ఉంది. పదునైన కొడవలిని పొడవాటి కర్రకు బిగించి కట్టిన దోటీ కర్ర.. ఆమె తన పక్కనే నడుస్తోన్న మున్నా వైపు చూస్తూ “ఏరా బాగా ఆకలేస్తోందా?” అని అడిగింది.

మున్నాకు ఏమర్ధమయిందో ఏమో ‘మే’ అని రెండుసార్లు శబ్దం చేసి, నడకను కొనసాగించాడు.

“మూడు నెలల్లో అక్క పెళ్ళి ఉంది కదా. అది మాకు శుభకార్యమే. కానీ నీకో ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలుసా నీకు? యింతకుముందు యిద్దరక్కల పెళ్ళిళ్ళకు రెండు మేకపోతులు హలాల్ చేయబడి బిర్యానీలో ముక్కలుగా మారిపోయాయి. మీ అమ్మ ఆడమేక కాబట్టి బతికిపోయింది. లేకపోతే దాన్ని కూడా కోసేసి, మసాలా వేసి మాంసం కూర వండి పెళ్ళి విందులో వడ్డించేవాడు మీ నాన్న.”

మున్నా మళ్ళా ‘మే’ అన్నాడు. వాడి గొంతు భయంతో వణుకుతున్నట్టు అన్పించింది ఫౌజియాకి.

“భయపడుతున్నావా? నేనున్నానుగా.. ఎందుకు భయం? నువ్వు నా నాలుగో కొడుకువి. పెళ్ళి కోసం నిన్ను బలిస్తానంటే వూర్కుంటాననుకున్నావా? అది నా కూతురి పెళ్ళయినా సరే.. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేసి కాపాడుకుంటాను. నువ్వు దిగులు పడకు.”

మున్నా నుంచి ఏ స్పందనా రాకపోయేటప్పటికి దాని వైపు చూసి, “ఏంటీ మాట్లాడవు? నమ్మకం లేదా? మీ నాన్నకు మొన్నే హెచ్చరిక చేశాగా.. మరో మేకపోతుని కొని హలాల్ చేయండి తప్ప నా కొడుకుని మాత్రం తాకొద్దని చెప్పాలే. నువ్వు నిశ్చింతగా ఉండు” అంటూ దాని మెడమీద ప్రేమగా నిమిరింది.

అప్పుడే ఆమెకు ఎదురొస్తున్న శంకర్‌లాల్ “ఏం భాభీ..ఎలా ఉన్నావు? మా ఫక్రుద్దీన్ భాయ్ ఎలా ఉన్నాడు చూసి నాలుగు రోజులైంది” అన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here