[dropcap]ఫి[/dropcap]బ్రవరి 22వ తేదీ తిల్లయ్యడి వల్లియమ్మై జయంతి, వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పోరాటయోధులు వివిధ మార్గాలను ఎంచుకున్నారు. వివిధ ప్రదేశాల నుండి పోరాడిన ప్రాణత్యాగధనులు ఎందరో? విదేశాలకు వెళ్ళి ఉద్యమాలలో పాల్గొన్నవారు ఉన్నారు. విదేశాల నుండి ఇక్కడికి వచ్చి జాతీయోద్యమాలలో పాల్గొన్నవారూ ఉన్నారు.
అయితే మనదేశం నుండి విదేశాలకు జీవనోపాధి నిమిత్తం వెళ్ళిన కుటుంబంలో అక్కడే పుట్టి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, అక్కడే గిట్టిన యోధులున్నారు.
వారిలో తిల్లయ్యడి వల్లియమ్మై ఒకరు. వీరు నేటి తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్టణానికి సమీపంలో ఉన్న ‘తిల్లయ్యడి’ గ్రామానికి చెందిన వంశీకురాలు. వీరి తల్లిదండ్రులు మంగళత్తమ్మాళ్, మునుస్వామి మొదలియార్లు. ఈ దంపతులు ఇక్కడి నుండి దక్షిణాఫ్రికా దేశానికి వలస వెళ్ళారు. అక్కడ జోహెన్నెస్‌బర్గ్‌లో మిఠాయి దుకాణం పెట్టుకొని జీవిస్తున్నారు. వీరికి 1898వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన వల్లియమ్మై జన్మించారు. ఒక్కగానొక్క కుమార్తెను గారాబంగా పెంచుకున్నారు. బాల్యంనుండి మాతృదేశం భారతదేశం గురించి వర్ణించి చెప్పి ఆమెలో దేశభక్తిని పెంపొందింపజేశారు.
ఆనాటి దక్షిణాఫ్రికా వివాహ చట్టం ప్రకారం చర్చి పెళ్ళే పెళ్ళి క్రింద లెక్క. ఇతర మతాల పెళ్ళిళ్ళను అక్కడి ప్రభుత్వం గుర్తించదు. ఆ వివాహాలు చట్టసమ్మతం కావు. వారి పిల్లలకు వారసత్వపు హక్కులుండవు. తండ్రి ఆస్తిపై ఆ పిల్లలకు హక్కుండదు. ఒక రకంగా అక్రమసంతానం క్రింద భావిస్తారు. భార్య భర్త ఆస్తి, భార్యలకు భర్తల నుండి ఎటువంటి హక్కులు సంక్రమించవు. ఈ చట్టం దక్షిణాఫ్రికాలోని భారతీయులను అవమానాలకు గురి చేసింది.
కార్మికులకు వేతనాలు తక్కువగా ఉండేవి. ఆ తక్కువ వేతనంలో నుంచే ఎక్కువ శాతం పన్ను చెల్లించవలసిన దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి.
దక్షిణాఫ్రికాలోని భారతీయుల దీనావస్థకు గాంధీజీ బాధపడ్డారు. ఈ చట్టాలను వ్యతిరేకించారు. వీటిని రద్దు చేయవలసిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని అక్కడి భారతీయులు ఆయనతో కలిసి ఉద్యమించారు.
ఈ సందర్భంలో వల్లియమ్మై, ఆమె తల్లి మంగళత్తమ్మాళ్ నేటల్ వరకు వెళ్ళారు. మునుస్వామి కూడా సత్యాగ్రహిగా మారారు. కస్తూర్బా కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. చాలామంది భారతీయులు కలిసి అనేక ప్రదేశాలు తిరిగారు. దక్షిణాఫ్రికా జాతి విచక్షణ విధానం ‘అపార్థీడ్’కు వ్యతిరేకంగా పోరాడారు.
1913 మార్చి 14న కోర్టు దక్షిణాఫ్రికా భారతీయులకు సంబంధించి వివాదాస్పదమైన తీర్పును ఇచ్చింది. ఇది దక్షిణాఫ్రికా భారతీయులకి వ్యతిరేకంగా వచ్చింది. ఉద్యమాలు, సత్యాగ్రహాలు ఆరంభమయ్యాయి. కస్తూర్బా, గాందీజీల మద్దతుతో ఇవి జరిగాయి.
1913 డిశంబర్‍లో వల్లియమ్మైను అరెస్టు చేసింది దక్షిణాఫ్రికా శ్వేతజాతి ప్రభుత్వం. మారిట్జ్‌బర్గ్ జైలులో బంధించారు. కస్తూర్బా గాంధి కూడా ఇదే జైలులో శిక్షను అనుభవించడం ఒక చారిత్రక విశేషం. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కనీసం అనారోగ్య కారణంగానయినా వీరిని విడుదల చేయమని ఉద్యమకారులు వేడుకున్నారు. నిరసన తెలియజేశారు. అయినా ప్రభుత్వం వీరిని విడుదల చేయడానికి నిరాకరించింది.
గాంధీజీ ఈమెను ఇంటర్వ్యూ చేశారు. “మీరు భారతదేశంలో పుట్టలేదు. మరి భారతీయుల కోసం జైలుకు ఎందుకు వెళ్ళారు?” అని ఆయన ప్రశ్నించారు. “నేను ఇక్కడే పుట్టాను. అయితే మాత్రం ఏం? నాది భారత భూమే! దక్షిణాఫ్రికాలోని నా భారతీయుల కోసం నేను మరణానికి కూడా భయపడను” అన్నారు.
“భారతదేశానికి జెండా కూడా లేదు. జెండా ఉంటే అది భారతదేశానికి రూపాన్ని ఇస్తుంది.” అన్నారు గాంధీజీ.
“జెండా ఎందుకు లేదు. ఇక్కడ ఉంది” అని తన చీరను చింపి “ఇదిగో ఇదే నా దేశ ఫ్లాగ్ – నా కన్నతల్లి” అన్నారు. గాంధీజీతో. చిత్రమేమిటో తెలుసా? వారు ధరించి – చింపిన చీర రంగులు మన జాతీయ జెండా రంగులే! ఆమె చీర రంగుల ఆధారంగానే మహాత్ముడు మన జాతీయ పతాకానికి రంగులను నిర్ణయించడం గొప్ప చారిత్రక విశేషం.
భారతదేశం కోసం వల్లియమ్మై ప్రాణ త్యాగం తన సంకల్పాన్ని పెంచిందని, ఆమె త్యాగం అనితర సాధ్యమని గాంధీజీ చెప్పారు. అప్పటికే సత్యాగ్రహోద్యమంతో శ్వేతజాతి వారిని భయ పెడుతున్న గాంధీజీకి వల్లియమ్మై స్ఫూర్తిని కలిగించడం గొప్ప చారిత్రక నిజం.
చివరికి 1914 ఫిబ్రవరిలో వీరిని జైలు నుండి విడుదల చేశారు. అస్థిపంజరంలా మిగిలారావిడ. 1914 ఫిబ్రవరి 22వ తేదీన మరణించారు. ఇలా “దక్షిణాఫ్రికా భారతీయుల సత్యాగ్రహ చరిత్రలో గొప్ప యోధురాలి”గా నిలిచారు తిల్లయ్యడి వల్లియమ్మై. తను పుట్టిన ఫిబ్రవరి 22వ తేదీనే కలలుగనే ‘పదహారేళ్ళ వయసు’ లోనే తను చూడని మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన యువతి ఆమె.
“దక్షిణాఫ్రికా వలసరాజ్యాల పాలన యొక్క బలమైన దెబ్బలకు వ్యతిరేకంగా జరిగిన ఒక చిన్న అనూహ్యమైన ధైర్యం”గా వల్లియమ్మై త్యాగాన్ని అభివర్ణించారు.
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో నాగపట్టణంలోని తిల్లయ్యడి దగ్గరలో వల్లియమ్మై జ్ఞాపకార్థం కొన్ని సంస్థలను నెలకొల్పడం జరిగింది. వల్లియమ్మై మెమోరియల్ హాల్, హైస్కూల్, లైబ్రరీలలో వీరు జీవించే ఉన్నారు.
వీరి జ్ఞాపకార్థం 2008వ సంవత్సరం డిశంబర్ 31వ తేదీన రూ.5.00ల విలువతో ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.
ఈ అద్వితీయ త్యాగశీలి జయంతి మరియు వర్ధంతి ఫిబ్రవరి 22 సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet