[dropcap]ఆ[/dropcap] అమ్మాయి –
అమ్మ కమ్మని చేతివంట
కడుపారా తినాలని
నాన్న తెచ్చిన రకరకాల పళ్ళన్నీ
మనసారా రుచి చూడాలనీ
అమ్మానాన్నల తీపి కబుర్లు వింటూ
కంటినిండా నిద్రపోవాలనీ
ఊహల రెక్కలు అల్లారుస్తూ
సెలవు లివ్వగానే
కాలేజీ హాస్టలు నుంచి
రామచిలకై రయ్యిన ఊర్లో వాలిపోతుంది.
ఇంట్లో అడుగు పెట్టగానే –
అమ్మా నాన్నల అరుపులు ఆహ్వానిస్తాయి
రణగొణ ధ్వనులు విస్మయపరుస్తాయి
చదువుకున్న సంస్కారం విడిచి
ఇద్దరూ పరిసరాలను మరిచి
దున్నల్లా రంకెలేస్తూ పోట్లాడుకుంటూ
ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటుంటారు.
ఆ బీభత్స దృశ్యాన్ని చూసి
భీతిల్లి ఒంటరి కుందేలై కుమిలిపోతుంది.
తనువు రెండు శకలాలుగా విడిపోతుంది
ఇల్లు నరకానికి నకలుగా తోస్తుంది
ఇప్పటివరకు జైలుగా భావించిన హాస్టలు భవనం
సుందర నందనవనమైపోతుంది
అంతే –
స్నేహితుల మధ్య సీతాకోకచిలుకలా విహరించడం కోసం
మనసు రైల్వే స్టేషన్ వైపు పరుగుతీస్తుంది!
పిల్లల భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసే
ఆ బాధ్యత లేని బాంధవ్యం
రెండు సమాంతర రైలు పట్టాల్లా
విడాకుల వైపుకు దారి తీస్తుంది!