[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 58వ భాగం. [/box]
[dropcap]“యె[/dropcap]స్… సుబ్రహ్మణ్యేశ్వరరావు స్పీకింగ్” గంభీరంగా ధ్వనించింది సుబ్రహ్మణ్యేశ్వరరావు స్వరం.
ఆ స్వరం వింటుంటే మోహన్‌లో ఏదో తెలియని ధైర్యం, భద్రత భావం కలిగాయి.
“సార్… నేను మోహన్‌ను.”
“యస్ మోహన్. ఎలా ఉంది ఢిల్లీలో? నీ నవల చాలా బాగుంది. ప్రపంచానికి ఆనందుడి గురించి తెలియని విషయాలను ఆసక్తికరంగా తెలియ చెప్తుంది నీ నవల. తెలుగులో హిస్టారికల్ ఫిక్షన్ నవలలు అడుగంటుతున్న సమయంలో నీ నవల ట్రెండ్ సెట్టర్ అవుతుంది” గబగబా అన్నారు ఆయన.
“సార్… మీ సలహ కోసం ఫోను చేశాను.”
అప్పుడు పసికట్టారాయన మోహన్ గొంతులోని బాధను.
“ఏమయింది మోహన్? ఎనీ ప్రాబ్లమ్?” అడిగారు
జరిగింది చెప్పాడు మోహన్. “ఇప్పుడు నన్ను ఏం చెయమంటారు?”
“మోహన్… సైంటిఫిక్ సర్కిల్స్‌లో ఇది సర్వ సాధారణం. ఆయితే ఆదర్శానికి నిలబడి అన్నీ వదులుకునేందుకు సిద్ధపడతావా? లేక, రాజీ పడి, నీ పరిశోధన వెలుగులోకి వచ్చేట్టు చేస్తావా అన్నది నీ నిర్ణయం. ఒకటి మాత్రం గుర్తుంచుకో, అధికారంలో ఉన్న వారిని ఎదిరించి ఎంతో అరుదైన సందర్భాలలో తప్ప విజయం సాధించిన వారు లేరు. తుఫానుకు తల వంచని వృక్షం విరిగిపోతుంది. గాలి వాలుగా వంగే గడ్డిపోచ నిలుస్తుంది.”
“కానీ… ఎన్నో కష్టాలు అనుభవించాను. నష్టపోయాను. ఇంత కష్టపడి సాధించిన దాన్ని మరొకరితో పంచుకోవాలన్న ఆలోచన ఇబ్బందిగా ఉంది.”
“ఓ పని చెయ్యి. పరిశోధన నీ ఒక్కనిది కాదు. నీతో దాదాపుగా చివరి వరకూ ఉన్నది డాక్టర్ శశికళ. బుద్ధ సిద్ధాంతాలకూ, గ్రీకు తాత్వికతకూ నడుమ ఉన్న సారూప్యతను ప్రదర్శించటం ద్వారా నీ అవగాహనను పెంచింది డాక్టర్ శశికళ. నువ్వు ఏ నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆమెను సంప్రదించటం ధర్మం” అన్నాడు సుబ్రహ్మణ్యం.
సాధారణంగా మనం ఎదుటి వారిని సలహాలు అడిగేది మనకు తెలియక కాదు. మనం అనుకుంటున్న దానికి ఎదుటి వారి నుంచి నిర్ధారణను ఆశిస్తాం. అలాంటి సలహాలే మనకు నచ్చుతాయి కూడా. అందుకే సుబ్రహ్మణ్యం సలహా మోహన్‌కు నచ్చింది.
మోహన్‌కు శశికళతో మాట్లాడాలని ఉంది. కానీ తనంతట తాను మాట్లాడాలంటే జంకుగా ఉంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారి పేరు చెప్పి “ఆయన మాట్లాడమన్నారు” అనే అవకాశం లభించింది.
వణుకుతున్న చేతులతో మౌనంగా పెదవులపై దైవ ప్రార్థనతో శశికళకు ఫోను కలిపాడు మోహన్.
ఎందుకని ఉద్విగ్నంగా అనిపిస్తోందో అతనికి తెలియటం లేదు.
ఆమె ఫోను ఎత్తలేదు.
కాస్సేపు ఏం చెయ్యాలో ఆలోచిస్తుండిపోయాడు.
ఇంతలో ఫోను వచ్చింది.
దైవప్రార్ధన తీవ్రతను పెంచి,
ఫోను వచ్చింది.
దైవప్రార్ధన తీవ్రతను పెంచి, ఫోనెత్తి, హలో అన్నాడు.
“ఫోన్లోకాదు, వ్యక్తిగతంగా కలసి మాట్లాడుకుందాం”, అంది. మరోమాటకు ఆస్కారం ఇవ్వకుండా ఫోను కట్ చేసింది.
చాలాసేపు అతడు తన చేతిలోని ఫోనువైపు చూస్తూండిపోయాడు.
చివరికి ఓ నిశ్చయానికి వచ్చాడు.
సెక్రటరీకి ఫోన్ చేసాడు.
పి.ఏ. ఫోను ఎత్తింది.
“నేను నాతో పాటు పరిశోధనలో పాల్గొన్న శశికళను సంప్రదిస్తాను. ఆమె అభిప్రాయం తెలుసుకుని నా నిర్ణయం చేప్తాను. నాకు ఓ వారం సమయం ఇవ్వమని సెక్రటరీకి చెప్పండి.”
“ఆల్ ది బెస్ట్. ఆలోచించి నిర్ణయం తీసుకోండి” అంది పి.ఏ.
***
ఢిల్లీ యూనివర్సిటీని చూస్తుంటే మోహన్ శరీరంలో విచిత్రమైన ప్రకంపనలు కలిగాయి. చారిత్రక కట్టడాలను చూస్తే అతని మనస్సు చిత్రంగా స్పందిస్తుంది. గత చరిత్ర కళ్ల ముందు కదులుతుంది. ఆ ప్రాంతంలో నడయాడిన చారిత్రక పురుషుల విగ్రహాలు మనసులో మెదలుతాయి.
ఢిల్లీ యూనివర్సిటీ 1922లో ప్రారంభమయింది. హరిసింగ్ గౌర్ ప్రథమ వైస్ చాన్సలర్‌గా పని చేశారు. ఆకాలంలో – 1881లో ప్రారంభమయిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ, 1899లో ప్రారంభమయిన హిందూ కాలేజీ, 1792లో ప్రారంభమయిన ఇప్పటి జాకీర్ హుస్సేన్ ఢిల్లీ కాలేజీ, అప్పటి ఢిల్లీ కాలేజీ, 1917లో స్థాపించిన రామ్జాస్ కాలేజీలు మాత్రమే ఉండేవి. 1911లో బ్రిటీష్ వారు తమ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చటంతో ఢిల్లీ ప్రాధాన్యం పెరిగింది. ఆ కాలంలో వైస్రాయ్ భవనం 1933లో ఢిల్లీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆఫీసుగా మారింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం, యూనివర్సిటీ స్థాపించి 25 ఏళ్లయింది. 1948లో ఈ సందర్భంగా జరిగిన సభకు పండిత జవహర్ లాల్ నెహ్రూ, మౌంట్‌బాటెన్ దంపతులు, అబ్దుల్ కలామ్ ఆజాద్, జాకీర్ హుస్సేన్, శాంతి స్వరూప్ భట్నాగర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ యూనివర్సిటీ అధ్యాపకులలో చరిత్ర పరిశోధకుడు ఆర్. ఎస్.శర్మ, నోబుల్ బహుమతి గ్రహీత అమార్త్యసేన్, ప్రధాని మన్‌మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రథమ ప్రధాని భార్య రానా లియాకత్ ఆలీ ఖాన్ వంటి వారున్నారు.
ఇదంతా ఆ భవంతులను చూస్తుంటే మోహన్ మనస్సులో మెదలుతోంది. ఎంతెంత మంది మహామహులు, ఎంత మంది అత్యద్భుతమైన తెలివి తేటలు కలవారు, ఈ భవంతులలో తిరుగాడారు కదా అనిపించింది. ఈ గోడలు, మట్టి, చెట్లు ఎన్నెన్ని అద్భుతమైన గాథలు తమలో ఇముడ్చుకుని మౌనంగా నిలచి ఉన్నాయో అనిపించింది.
అంతలో తాను చరిత్రను పరిశోధించి తెలుసుకునే సత్యాలు నిజంగా సత్యాలేనా అన్న ఆలోచన బలంగా కలిగింది.
ఒక శిలా ఫలకం లభిస్తుంది. దాని ఆధారంగా ఊహిస్తారు. ఒక శిల్పం లభిస్తుంది. అదేమిటో ఊహిస్తారు. కానీ నిజంగా ‘అదే’ అని నిర్ధారించటం కష్టం.
శిథిలమైన దేవాలయం లభిస్తుంది. దానిలో బౌద్ధుల విగ్రహాలు లభిస్తాయి.
కొందరు, దేవాలయ నిర్మాతలు విగ్రహాన్ని కూలగొట్టి, దాని శకలాలతో మందిరం నిర్మించారని ఊహిస్తారు. మరి కొందరు, అదే ఆధారంతో తమ మందిరాలలో, పూజలు లేకుండా పడి ఉన్న బుద్ధుడిని ప్రతిష్ఠించి పూజించేవారు, “ఎంతటి పరమత సహనం కలవారో” అంటారు. ఇందులో ఏది నిజం?
ఎవరికి వారు తాము చెప్పిందే నిజం అని ఒప్పించాలని తపిస్తారు. వాదిస్తారు. ఆధారాలను చూపుతారు.
తాము చరిత్రగా స్థిరపరిచేది లభిస్తున్న ఆధారాల ప్రకారం తమ తమ వ్యక్తిత్వాలు, అభిప్రాయాల ప్రకారం ఊహిస్తున్నది. అదే నిజం అనేందుకు వీలు లేదు.
అంతలో మరో ఆలోచన బలంగా తాకింది.
తాను శశికళను స్నానం చేస్తుంటే చూశాడు.
అద్భుతమైన అందం. మైమరచిపోయాడు. ఆమెలో శిల్పాన్ని చూశాడు. కాని ఆమె శిల్పం కాదు, సజీవమైన మనిషి అని గ్రహింపుకు రాగానే సిగ్గు పడ్డాడు. నేరభావనకు గురయ్యాడు.
ఆమె ఏమనుకుని ఉంటుంది?
అది తాను ఊహించగలడే తప్ప అదే నిజమని అనలేడు.
ఒక సంఘటన జరిగింది. దానిలో ఏం జరిగిందో ఇద్దరికే తెలుసు. కానీ ఆ జరిగిన దానికి తమ స్పందన ఏమిటో ఎవరి స్పందన వారికే పరిమితం.
కాని దాని గురించి ముడో వ్యక్తి ఊహకు జరిగినదానికి, జరిగినదానిలో పాల్గొన్న వ్యక్తుల స్పందనలకూ సంబంధం లేదు.
ఇప్పుడు సజీవంగా ఉన్న వారి గురించే ఇలా ఉంటే చరిత్రలో కాలగర్భంలో కలసిపోయి, అస్సలు పరిచయం లేని వారి గురించి ఇన్నేళ్ల తరువాత మూడో వ్యక్తి చేసే ఊహలో ‘సత్యం’ ఎంత ఉంటుంది?
ప్రతి ఒక్కరూ తన ఊహనే అందరూ ‘సత్యం’గా ఆమోదించాలని పట్టుబట్టి ఒప్పించాలని ప్రయత్నించటంలో వైజ్ఞానిక దృక్పథం ఉందా? అహంకారంతో కూడిన మూర్ఖత్వం ఉందా?
ఆలోచిస్తున్న మోహన్ శశికళను గమనించలేదు.
ఆమె గొంతు సవరించుకుంది.
ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు.
‘సెలీనా’ ఎదురుగా ఉన్నదనుకున్నాడు.
తనకు సెలీనా విజయపురిని దర్శింప చేసిన విషయాలు గుర్తుకు వచ్చాయి. చివరికి ఆమె తనకు సన్నిహితంగా రావటం గుర్తుకు వచ్చింది.
అతని శరీరం స్పందించింది. మనసు మనోహర గీతం గానం చేయటం ఆరంభించింది.
అతడు అడుగు ముందుకు వేశాడు తన ప్రమేయం లేకుండానే.
ఎన్నో ఏళ్లు… కాదు ఎన్నెన్నో జన్మల ఎదురు చూపులు పూర్తయిన భావన కలుగుతోంది. ఆ క్షణంలో ఆతడికి తానెవరో స్పృహ లేదు. ఆమె ఎవరో అన్న ఆలోచన లేదు.
జన్మ జన్మలుగా ఏ ఆత్మతో సంయోగం కోసం తన ఆత్మ తపిస్తోందో ఆ ఆత్మ రూపం ధరించి ఎదురుగా నిలుచున్న భావన కలిగింది.
అతడు అడుగు ముందుకు వేసిన సమయానికి ఆమె కూడా ఏదో లోకంలో ఉన్నట్టు, ఎవరో తన ప్రమేయం లేకుండానే అడుగు ముందుకు వేయించినట్టు అడుగు ముందుకు వేసింది.
ఇద్దరు ఈ లోకంలో ఉన్నట్టు లేరు.
ఇద్దరికీ తమ శరీరాల స్పృహ ఉన్నట్టు లేదు.
ఒకరి ఊపిరి మరొకరి ఊపిరిలో కలిసేంత దగ్గరగా వచ్చారు.
ఇద్దరి శరీరాల వేడిమి మిళితమైపోయేంత దగ్గరగా ఉన్నారు.
“స్వామీ! నీ కోసమని వామ పయోధరానికి కుంకుమ పంకాన్ని, దక్షిణ స్తనానికి మలయచందనాన్ని దట్టంగా అలముకున్నాను. ఇది నీ కొరకే. గ్రీష్మతాపం తీర్చడానికి ఇంతకన్నా రమ్యమైన పద్ధతి మరొకటి లేదు.”
ఆమె అన్నదో, అన్నట్టు అతడికి వినిపించిందో, అనిపించిందో తెలియదు.
ఆమె చేతులు సాచిందో, అతడు ఆమెని దగ్గరకి లాక్కున్నాడో తెలియదు.
“ఇంతటితో సరిపోదు నా బింబాధరం చుంబిస్తే దప్పిక ఉండదని నువ్వే అంటావు.”
ఆమె అన్నదో, అతడు విన్నాడో, అతడికి అనిపించిందో తెలియదు.
జన్మజన్మలుగా దప్పికతో తపిస్తున్న ఆత్మల స్వరాలు, మానవ శరీరాలలో ఒదిగి వారి మనస్సులలో ప్రతిధ్వనింపజేశాయో తెలియదు.
ఇరువురు ఒకరినొకరు అల్లుకుపోయారు.
ఒక చిక్కటి కాంతి పుంజం వారిద్దరినీ తన వెలుగు పరిధిలో బంధించి ఒకటిగా చెసినట్టు తోచింది.
అతడు ఆమె అధరాలను అందుకున్నాడో, ఆమె అతడి అధరాలను తన మృదువయిన పెదవులతో అందుకున్నదో తెలియదు.
వేర్వేరు శరీరాలలో ఒదిగిన ఒకే ఆత్మ రెండు భాగాలు, కలసి ఒకటి కావాలన్న తీవ్ర తపనతో ఒకదానిలో ఒకటి ఒదిగినట్టు వారి పెదవులు కలిశాయి.
ఆ మధుర చుంబనం ఎంత కాలం ఉందో!
గదిలో అలారం మ్రోగటంతో ఇద్దరూ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డారు.
అప్రయత్నంగా ఆమె “ఆనందా” అంది. “అయ్యో” అన్నాననుకుంది.
“సెలీనా” అన్నాడతడు. “సారీ” అన్నాననుకున్నాడు.
ఆమె దూరం జరిగింది. అర్ధనిమీలిత నేత్రాలతో ఆయాసపడుతూ అతని వైపు చూస్తూ నిలబడింది.
అతను విప్పారిన నేత్రాలతో, తనలో చెలరేగుతున్న తాపాన్ని అదుపులో పెట్టుకుంటూ ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు.
నెమ్మదిగా ఇద్దరికీ తాము ఎక్కడ ఉన్నారో గ్రహింపుకు వచ్చింది.
మళ్లీ అలారం మ్రోగింది.
ఆమె గడియారం వైపు చూసింది. “నాకు క్లాసుంది. వచ్చేదాకా ఉండండి” అని టెబుల్ పైన ఉన్న నోట్స్ తీసుకుని పరుగెత్తింది.
ఆవేశాన్ని అణచుకుంటూ, ఆయాసాన్ని దీర్ఘంగా ఊపిరి తీయటం ద్వారా అదుపులోకి తెచ్చుకుంటూ కుర్చీలో కూర్చున్నాడు మోహన్. అంతలో అతని దృష్టి టేబిల పై ఆమె నోట్స్ తీయగానే బహిర్గతమయిన ఫోల్డర్ పై పడింది.
కుతూహులంగా చూశాడు, “నాగార్జున కొండలో బౌద్ధ భిక్షువులు” అని ఉంది. శశికళ రాసిన వ్యాసం.
తీసి చదవటం ఆరంభించాడు.
(సశేషం)