99 సెకన్ల కథ-39

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]

1. ప్రేమ గీత!

[dropcap]”అ[/dropcap]మ్మా, ఘుమ ఘుమ లొస్తున్నాయి. ఏం చేస్తున్నావ్?” అంటూ కొడుకు ప్రభాకర్ అమ్మ సామ్రాజ్యంలోకి తొంగి చూశాడు. అక్కడ అమ్మ పిండి వంటలు చేస్తోంది.

“మా కోసమేనా?” అంటూ ఉత్సాహంగా వంటగదిలోకొచ్చాడు.

“అమ్మా, రేపు ఫిబ్రవరి 14…” అంటూ నసుగుతున్నాడు.

“ప్రేమికుల దినోత్సవం. అందుకని నువ్వూ, అపర్ణ బయటికెళ్తారు. రాత్రి లేటుగా వస్తారు. అంతేనా?” అంది అమ్మ పారిజాతం.

ప్రభాకర్ ఆశ్చర్యం నటిస్తూ, అమ్మని చుట్టేశాడు.

“వదులు, వదులు. నూనె చిందుతుంది.”

ప్రభా దూరంగా జరిగాడు.

“అందుకని రేపు వంటా గింటా పెట్టుకోవద్దమ్మా. మేం రాత్రి వచ్చేసరికి లేటవుతుందని నీకు తెలిసిపోయింది కాబట్టి…! అవునూ, ఎలా తెలిసిందమ్మా? నేనింకా చెప్పలేదే!”

పారిజాతం నవ్వింది.

“నీకన్నా ముందు అపర్ణ వచ్చి, ‘వెళ్ళనా?’ అని అడిగిందిలే.”

“అబ్బ, కొత్త కోడలు నీ దగ్గర మార్కులు కొట్టేసిందమ్మా…” అంటూ బాధపడిపోయినట్లు మొహం పెట్టాడు ప్రభా.

మళ్ళీ అమ్మని కొంచెం లాలిస్తున్నట్లుగా దగ్గరకెళ్ళి రెండు మాటలు వదిలాడు.

“అమ్మా, ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం కదా! అందుకే అపర్ణ స్నేహితులూ, నా స్నేహితులూ కలిసి రేపు వాలెంటైన్స్ దినాన్ని – అంటే ప్రేమ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అనుకొన్నాం. మేమిద్దరం పొద్దుటే వెళ్ళిపోతాం.. రాత్రికి మాకోసం ఏదో వండెయ్యాలని తాపత్రయపడి, హైరాన పడకు… నా దగ్గరో తాళంచెవి ఉంది కాబట్టి, మా కోసం చూడకుండా నువ్వూ, నాన్నా పెందరాడే తినేసి పడుకోండి… నువ్వు నాన్నకి కూడా చెప్పు. రిటైర్ అయ్యాక కూడా ఆయన ఏవేవో వ్యాపకాలు పెట్టుకుంటున్నాడు. ఆరోగ్యానికి మంచిదికాదు…”

“అవునూ, ప్రేమికుల దినోత్సవం అంటే, అక్కడ ఏం చేస్తార్రా?”

“ఆఁ … అలా అడిగి తెలుసుకొని నీ జ్ఞానాన్ని పెంపొందించుకో…” అంటూ ప్రేమగీత చెప్పాడు.

“అమ్మా, అక్కడికి కేవలం ప్రేమికులే వస్తారు. పెళ్ళి అయీ ఉండచ్చూ; అవబోతూ ఉండచ్చు. పరస్పరం బహుమతులు ఇచ్చుకుంటారు. కలిసి పాటలు పాడుకుంటారు. డాన్సులు చేస్తారు. ఆనందాల ‘ఉయ్యాలల్లో’ కాస్సేపు ఉర్రూతలూగుతారు… అమ్మా, మొత్తం కార్యక్రమం యొక్క గొప్ప లక్ష్యం ప్రేమ విలువని మననం చేసుకోవటం, ప్రేమని పంచుకోవటం, పెంచుకోవటం …….”

పారిజాతం మరోసారి నవ్వుకొంది.

“చాల్చాలు. అర్థమైందిలే గాని, నా పని పాడు చేయకు. రేప్పొద్దున అందరం కలిసి కాఫీ తాగేటప్పుడు చెబుదువుగాని మిగతా విషయాలు.” అంటూ తన ఘుమఘుమ వంటల్లో పడిపోయింది పారిజాతం.

***

ఫిబ్రవరి 14.

పొద్దుట ఎనిమిదింటికల్లా, ప్రభాకర్ తన భార్య అపర్ణతో కలిసి మిత్రులు వాలెంటైన్స్ డే జరుపుతున్న రిసార్ట్స్ కి కారులో బయల్దేరాడు. అమ్మ చేసిన పిండి వంటల్లోంచి తమకి నచ్చినవి కొన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో ప్యాక్ చేయించుకొని పరుగెత్తాడు.

రిసార్టులో ఆ ప్రేమ జంటలన్నీ అర్థరాత్రి దాకా ప్రేమికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని ‘ఉయ్యాలలూగుతూ’ తమ కొంపలకి బయల్దేరారు.

***

ప్రభా, అపర్ణా ఇంటికొచ్చి, తాళం తీసుకొని ఇంట్లో అడుగుపెట్టాక, ప్రభా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

అమ్మా నాన్నలు పడుకొనే గదికి తాళం పెట్టి ఉంది. ఇద్దరూ ఇంట్లో లేరు.

‘ఉయ్యాల’ జోష్ కాస్తా మటాష్ అయిపోయింది. ‘బహుశా సినిమాకి వెళ్ళి ఉంటారు. నాకు చెబితే వద్దంటానని, ఇలా చేశారు’ అనుకున్నాడు. అపర్ణని పడుకోమన్నాడు.

నాలుగైదు సార్లు ఫోన్లు చేశాడు. అమ్మా, నాన్నల రెండు ఫోన్లూ ‘స్విచ్ ఆఫ్’ అనే వస్తోంది.

అర్థమైంది. ‘ఇద్దరూ రెండో ఆట సినిమాకి పోయుంటారు. అసలైన ప్రేమికులు వీళ్ళే. సినిమా చూసేటప్పుడు ఫోన్ ఆపేయటం వీళ్ళకి అలవాటే కదా!’ అనుకుని, నిద్రాదేవత ఒడిలోకి జారుకున్నాడు ప్రభాకర్.

***

తెల్లవారుతోంది. తూర్పున ప్రభాకరుడు ఇంకా పైపైకి రాక ముందే, ‘పిలుపు గంట’ మ్రోగింది. ఇంట్లో ప్రభాకరుడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని, లేచి వచ్చాడు. గుమ్మం బయట అమ్మా, నాన్నా!

కళ్ళు నులుముకొని చూశాడు. నిద్రమత్తు వదిలిపోయింది. అమ్మా నాన్నల మీద విరుచుకుపడిపోయాడు.

వాళ్ళు తలొంచుకొని లోపలికెళ్ళిపోయారు.

ఒక 20 నిమిషాల తరువాత అందరూ కలిసి కాఫీ తాగుతుంటే, ప్రభాకరానికి తండ్రి తన ఫోను తెరిచి చూపించాడు.

ప్రభా, అపర్ణా కలిసి చూశారు.

అందమైన పూలచెట్లు-నీడనిచ్చే చెట్ల మధ్య, జింకలు, నెమళ్ళు, కుందేళ్ళు పరుగెడుతున్న పరిసరాల మధ్య… చాలా మంది ఆడ మగ కలిసి ఆడుకుంటున్నారు… పద్యాలు, పాటలు పాడుకుంటున్నారు… ఏకపాత్రాభినయాలు చేస్తున్నారు… ఆవు దూడలతో తమ ప్రేమ కథలు వినిపిస్తున్నారు. ఒకళ్ళకొకళ్ళు పిండివంటలు తినిపించుకుంటున్నారు… అందరూ మనసారా నవ్వుకుంటూనే వున్నారు….

చిన్న చిన్న వీడియోలు. ఎన్నో!

“ప్రేమ అంటే ప్రకృతిని ప్రేమించటం, నోరులేని జీవాల్ని ప్రేమించటం, ఏ వయస్సులోనైనా మనిషిని ప్రేమించే మనుషులు ఉన్నారన్న నమ్మకాన్ని పంచుకోవటం, పెంచుకోవటం. అంతకన్నా గొప్ప ప్రేమ ఉంటుందా?” అంటున్నాడు నాన్న.

అప్పుడే ప్రభా, అపర్ణలు చివరి వీడియో చూస్తున్నారు.

అవన్నీ ‘ఆనంద నిలయం’ వృద్ధాశ్రమంలో దృశ్యాలు.

అమ్మా,నాన్న ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళారో అర్థమైంది.

అపర్ణ చప్పట్లు కొట్టేస్తోంది.

ప్రభా సిగ్గు పడిపోతున్నాడు.

2. అందులో ఏముంది?

“మీరెన్ని చెప్పండి అంకుల్. నేను మా బాబాయి షష్టిపూర్తి కార్యక్రమానికి రాదలుచుకోలేదు.”

బలరాం తన నిర్ణయాన్ని ఖండితంగా చెప్పేశాడు శేషయ్య గారికి.

అనుకోకుండా రామకృష్ణామఠంలో తారసపడ్డ బలరాంని శేషయ్య అడిగారు:

“రామ్మూర్తి షష్టిపూర్తికి నువ్వు వెళ్తున్నట్లయితే, నేను నీతో పాటు కారులో రావాలనుకుంటున్నాను?”

బలరాం మాట్లాడలేదు.

వినయంగానే తల వంచుకొని నిలబడ్డాడు.

శేషయ్య ఊహిస్తున్నారు.

“ఇంకా ఆర్నెల్ల క్రితంనాటి మీ చెల్లెలి నిశ్చితార్థంలో జరిగిన విషయమే మనసులో పెట్టుకున్నావా?”

“అదేమన్నా చిన్న విషయమా అంకుల్! పెళ్ళి పెద్దని నేను. నా చెల్లెలి పెళ్ళి చూపులకి పిలిస్తే మర్యాదగా వచ్చి, మర్యాద నిలబెట్టుకొని వెళ్ళిపోవాలి గాని …”

బలరాం కళ్ళల్లో నీళ్ళు ఉబుకుతున్నాయి.

శేషయ్య అతని భుజం మీద అనునయంగా చేయి వేసి నిమిరారు.

కొంచెం తేరుకున్నాక, బలరాం మళ్ళీ నోరు విప్పాడు.

“మీరు ఉండి ఉంటే, ఆయన్ని అదుపుచేసి ఉండేవారు…. మీకు విషయం పూర్తిగా తెలియదు. వినండి. బస్సు పెట్టమని పెళ్ళివారు అడిగారు. వాళ్ళ ఊరినుంచి ఇక్కడికి ఎన్ని వందల కిలోమీటర్లు, ఎలా ఛార్జ్ చేస్తారు – అని నేను నోటితో అంచనాగా లెక్కించి, ‘సుమారుగా అయిదారు వేలు అవుతుంది కదా!’ అన్నాను పెళ్ళివారితో. అంతే, ఈయన గారు అందుకొని, ‘నీ లెఖ్క తప్పు. పదకొండు వేలు అవుతుంది’ అని, పెళ్ళివారికేసి తిరిగాడు. ‘మా వాడు లెఖ్కల్లో పూర్. చిన్నప్పట్నుంచీ అంతే. ఎక్కాలు చెప్పలేక నా చేతుల్లో బడితెపూజలు చేయించుకునేవాడు ‘ అంటూ పెళ్ళివారికేసి చూసి పగలబడి నవ్వాడు… ఛీ, ఛీ…. నేను యూనివర్సిటీలో ప్రొఫెసర్ని గదా అంకుల్. వాళ్ళముందు నాకు గాలి తీయాలని చూస్తాడా!”

శేషయ్య ఏదో చెప్పబోయారు.

బలరాం ఆపలేదు.

“ఇంటికి బంధువులు రానీ, స్నేహితులు రానీ, తను ఆ సమయానికి అక్కడ ఉన్నాడంటే ఇలాంటిదేదో ఒక ఎత్తిపొడుపుమాట అంటూనే ఉంటాడు… చిన్నప్పుడు తొడపాసం ఇచ్చి చదివించానని అందరికీ చెప్పాలా అంకుల్? మనసు చివుక్కుమంటుంది. ఏదో వయసులో పెద్దవాడు గదా అని ఊరుకుంటుంటే..”

శేషయ్య మళ్ళీ ఏదో చెప్పబోయారు.

బలరాం ఆపలేదు.

“చిన్నప్పుడే నాన్న పోవటంతో ఈయనే మా బాగోగులు చూసిన మాట నిజమే. అమ్మకీ ఆ గౌరవం ఉంది. కాని, ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువైపోయాయి అంకుల్… నేను అడక్కపోయినా ప్రతి విషయంలోనూ కల్పించుకొని మరీ సలహాలు ఇస్తున్నాడు ఈమధ్య. నా వయస్సు కూడా చూడడా! నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా మానేశాను….సారీ అంకుల్. నేను రాలేను. నన్ను వదిలేయండి” అంటూ అక్కడనుంచి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు బలరాం.

“సరే, నీ ఇష్టం” అన్నారు శేషయ్య.

బలరాం నిష్క్రమించాడు.

***

వారం గడిచిపోయింది. ఆ ఊరికి శేషయ్య వెళ్ళారు.

బలరాం బాయాయి రామ్మూర్తి షష్టిపూర్తి ఘనంగా జరుగుతోంది. ఆ ఉదయంనుంచీ, రామ్మూర్తి చాలా అసహనంతో ఉన్నాడు.

“బలరాం ఇంకా రాలేదు శేషయ్యగారూ… రాలేదు..” అంటూ చీకాకు పడుతున్నాడు రామ్మూర్తి.

శేషయ్య మాట్లాడలేదు.

బంధువులంతా వచ్చారు. స్నేహితులు ఇంకా ముందే వచ్చారు.

ఆ కళ్యాణమండపం నాదస్వర మాధుర్యంతో వీనుల విందు చేస్తోంది.

“ముహూర్తానికి సమయం అయింది. ఇక కొత్త వధూవరుల్లాగా మీ జంట పీటల మీద కూర్చోవాలి” అంటూ పురోహితులు హెచ్చరించారు. కుర్ర గ్యాంగ్ అంతా, “రండి పెళ్ళికొడుకుగారూ, పెళ్ళికూతురుగారూ” అంటూ పరిహాసోక్తులు విసురుతున్నారు.

రామ్మూర్తి అయిష్టంగా భార్యతో సహా పీటల మీద కూర్చున్నాడు.

అన్యమనస్కంగా పురోహితులు చెప్పిన క్రియలు చేస్తున్నాడు. మధ్య మధ్యలో భార్య హెచ్చరిస్తోంది ‘అంత పరాకు పనికిరాదు. కొంచెం ఇక్కడ మనసు పెట్టండి’ అంటూ. రామ్మూర్తి కళ్ళు మాత్రం మండప ప్రవేశ ద్వారం కేసి చూస్తున్నాయి.

సరిగ్గా ముహూర్త సమయానికి బలరాం తల్లిని తీసుకొని కారులో దిగాడు. తల్లిని ఎవరికో అప్పగించి పరుగు పరుగున వచ్చి రామ్మూర్తి కాళ్ళమీద పడ్డాడు. రామ్మూర్తి కళ్ళు ఒక్కసారిగా ఆనందంతో వెలిగిపోయాయి. పురోహితులు మంత్రాలు చదువుతుంటే, ఆ ఉద్వేగంతో, ఉత్సాహంతో భార్య మెడలో షష్టిపూర్తి మాంగల్యాన్ని కట్టేశాడు.

కొన్ని నిమిషాల తరువాత, బలరాం శేషయ్యగారిదగ్గరికొచ్చి పాదాభివందనం చేసి, జేబులోంచి ఒక కాగితం తీసి, ఇచ్చేశాడు. తలొంచుకొని పక్కకి వెళ్ళిపోయాడు.

శేషయ్య తాను రాసిన ఆ కాగితంలో అంశాల్ని మనసులోనే మననం చేసుకున్నారు. నవ్వుతూ చింపేశారు.

అందులో ఏముంది ?

“బలరాం, బాల్యంలో నువ్వు నిజంగా శుద్ధమొద్దువే. నీ మీద ప్రేమ ఉండబట్టే, మీ బాబాయి చింతబడితెలతో కొట్టో, తొడపాశం ఇచ్చో, గోడ కుర్చీలు వేయించో నిన్ను పట్టుదలగా చదివించాడు. అతనికి ఆ ప్రేమే లేకపోతే, ఒకసారి ఇంట్లోంచి పారిపోయి నువ్వు ఎక్కడో హోటల్లో కప్పులు కడుక్కున్నావే – అదే పని ఇప్పటికీ చేస్తూండేవాడివి. ఇప్పుడు నువ్వు ఆయన్ని ఎన్ని మాటలంటున్నావో వాటిని – ఆయన మీ చదువుల కోసం పడిన శ్రమ, కాలవ్యయం, తనపలతో త్రాసులో తూకం వేసి చెప్పు ‘ఆయనది ప్రేమో, శతృత్వమో’!… రామ్మూర్తి నిన్నింకా చిన్నప్పటి బలరాంలా చూస్తున్నాడు. అంటే, నువ్వింకా ‘చిన్నవాడినే’ అనుకునే అదృష్టం కల్పిస్తున్నాడు. ఆయన అలా అనటాన్ని, నువ్వు వినయంగా స్వీకరించటం నీ ‘సంస్కారం’గా బయట వాళ్ళకి కనుపిస్తుంది. ఆ అదృష్టం అందరికీ రాదు… నాకు అలాంటి అదృష్టం ఈ జన్మకి లేదు! – శేషయ్య”

…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here