[dropcap]ఇ[/dropcap]ప్పుడు మనం మాట్లాడుకోవలసింది
హత్యలకన్నా ఆత్మహత్యల గురించే!
ఆత్మీయులు దూరమైనప్పుడు కుంగిపోవటం
మనసు చేసే మాయా వైపరీత్యం
తోటిమనిషి ప్రాణాన్ని అంతం చేసుకోవటం
లోకాన్ని కూడా భావోద్వేగాలకు గురిచేస్తుంది.
పొరల పొరల జీవితం ఆహ్లాదకరంగా ఉండదు
ఉద్యోగం.. కుటుంబం.. వ్యాపారాల
అతుకులబొంతే మనసును ఆవరించిన చిత్రపటం
అవన్నీ సమాజానికి పరివర్తిత నిత్యసూత్రాలు
ఆ బొంతలోంచి ఒక ముక్క రాలిపోయినప్పుడు
కన్నీళ్ళు యాసిడ్‌లా మారిపోతాయి
తీవ్ర అనారోగ్యం, ఆర్థోక సమస్యలు, విఫలప్రేమలతో
మనసు భావోద్వేగాలు జీవాన్ని శాసిస్తాయి
జీవితాన్ని కాలమే మింగుతుంది
మనసునీడ మనిషి ప్రాణాన్ని హరిస్తున్నది
మనసు ఒక అసామాన్య సంభావ్యత
జీవం.. ప్రకృతిలా పాలపుంతల అనుభూతి చెందినప్పుడు
వ్యక్తిగత అనుభూతి అంత విశేషం కాదు.
ఏ కారణం చేత మరణించినా ఆత్మహత్య ఒక పరిణామం
మనసు కన్నా జీవం బలంగా ఉన్నప్పుడు
విఫల ఆత్మహత్యలూ ఉంటాయి
ఏది ఏమైనా ఒకసారి ప్రయాణమై పోయినవారికి
మనం శిరసువంచి నమస్కరించాలంతే!!