నెమలి సింహాసనము

0
3

[box type=’note’ fontsize=’16’] భారతదేశ గత వైభవ చిహ్నాలైన నెమలి సింహాసనం గురించి, కోహినూరు వజ్రం గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]భా[/dropcap]రతీయ నాగరికతకు చెందిన మూడవ స్వర్ణయుగానికి చెందిన జ్ఞాపక చిహ్నము ఈ నెమలి సింహాసనము. మొఘలులు విదేశీ వంశస్తులు అయినప్పటికీ వారు భారతీయ నాగరికతలో విడదీయరాని భాగముగా మారారు. ఇతర చక్రవర్తుల మాదిరి గానే వారు కూడా సంస్కృతీ, నాగరికత, వేదాంతము మొదలైన చాలా అంశాలలో వారి ముద్రను చాటుకున్నారు. అంతేకాకుండా భవన నిర్మాణాలలో మధ్య ఏషియన్ ప్రత్యేకతలను విధానాలను మిళితము చేసి పర్షియన్ ప్రభావము కనిపించేటట్లు కొనసాగించారు. ఆ విధముగా మిశ్రమము చేసినప్పటికీ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు నష్టము కలుగకుండా అనుసరించారు. ఈ నెమలి సింహాసనము భారతీయ నాగరికతకు చెందిన మూడవ స్వర్ణయుగానికి చెందిన అవతారంగా చెప్పవచ్చు మొఘలాయి రాజులు విదేశాల నుండి వచ్చినా వాళ్ళు భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలతో విడదీయరాని సంబంధమును ఏర్పరచుకున్నారు. వీళ్లందరు చాలా రకాలుగా భారతీయ కళలకు మధ్య ఆసియా అంశాలను కలిపి కొత్త సంస్కృతులను భారతదేశములో నెలకొల్పారు. ముఖ్యముగా భవన నిర్మాణములో పర్షియన్ ప్రభావాన్ని కలగలిపారు. ఆలా చేసినా భారతీయ అనవాళ్లు పోలేదు.,

1635 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ భారతీయ చక్రవర్తికి పురాతన కాలములో విక్రమాదిత్య మహారాజుకు ఉన్న సింహాసనము లాంటిది ఉండాలి అని భావించాడు. అటువంటి సింహాసనాన్ని తయారుచేసే బాధ్యత భారతీయ కళాకారులకు శిల్పులకు అప్పజెప్పాడు. కొన్ని వందల విలువైన వజ్రాలను రత్నాలను ఇంకా విలువైన రంగు రాళ్లను ఈ పనికి ఉపయోగించారు. ఆ రోజుల్లో భారతదేశము ఒక్కటే ధనిక దేశము. ఈ నెమలి సింహాసనానికి ఖర్చు గురించి ఏ మాత్రము ఆలోచించలేదు. వజ్రాల గనులున్న ప్రదేశము. పైపెచ్చు ఈ గనుల ఆధిపత్యము రాజవంశీకులదే కాబట్టి ఈ వజ్రాలపై హక్కు దారులు రాజకుటుంబాలవారే. ఈ సింహాసనాన్ని దివాన్ – ఎ – ఖాస్ (ప్రత్యేకమైన రిసెప్షన్ హాల్) లో ప్రతిష్ఠించాలి అని నిర్ణయించారు. ఈ సింహాసనము తయారు అవుతుండగానే ఈ హాల్ సైజు కూడా పెంచారు. చివరికి ఇది సింహాసనముగా రూపు దిద్దుకొని ఈ హాలు సింహాసనము అంతా కలిపి ఒక చిన్న సైజు భవంతి లాగా తయారు అయింది.

ఈ సింహాసనము చుట్టూ ఉండే దేవతా విగ్రహాలు మొదటిసారిగా చూసిన వారిని బోలెడు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. భారతదేశాన్ని పాలించే చక్రవర్తి ఈ సింహాసనముపై అతి కీలకమైన స్థానములో కూర్చుంటాడు. వ్యాపార నిమిత్తమైన, ఏదైనా కోరికలు కొరటానికి వచ్చే ఎవరైనా ఆ సింహాసనము పైన కూర్చున్న చక్రవర్తి వారికి కోరికలు తీర్చే దేవుడిలా కనిపిస్తాడు. ఈ సింహాసనము రాజ్యానికి రాజ్యాధికారానికి చిహ్నముగా ఉండేది. అందుచేతనే వంశపారంపర్య మొఘల్ సామ్రాజ్య ఆస్తిగా వారసులు భావించేవారు. ఆ విధముగా రాజులు మారుతున్న రాజరికపు గుర్తుగా ఈ సింహాసనము కొనసాగింది. ఔరంగజేబు పాలన వరకు ఈ సింహాసనము ప్రాముఖ్యత కొనసాగింది. ఔరంగజేబు పాలనలోనే హిందూ, సిక్కుల పట్ల అసహనం మొదలవటము జరిగింది. ఔరంగజేబు తరువాత సింహాసనము ఎక్కినా మొఘలు చక్రవర్తులు అంత సమర్థులు కాకపోవటంతో ఈ సింహాసనము ప్రాబల్యము కూడా తగ్గింది. అయినా చాలాకాలము భారతదేశానికి మొఘలుల రాజరికానికి గుర్తుగా గుర్తించబడింది. భారతదేశము ధనిక దేశముగా గుర్తింపబడింది. దరిద్రము అనేది తెలియని రోజులు అవి. 1738 నాటికి భారతీయ సంతతి రాజుల పాలన వచ్చింది. కానీ వలస దారుల చరిత్రకారులు మరాఠా రాజ్యము యొక్క విజయాన్ని చూపించకుండా మొఘల్ రాజులు మరఠా సంరక్షకులుగా గుర్తించారు. నాదిర్ షా దండయాత్ర 1739 లో జరిగింది.

మొఘలులు ఊహించని శత్రువు ఎక్కడి నుంచో అంటే పర్షియా నుంచి వచ్చిన గొర్రెల కాపరి. అక్కడ సఫావిద్ వంశానికి చెందిన వారిని అధికారము నుంచి తొలగించి 1739 లో షా గా ప్రకటించు కొని భారత దేశము పైకి దండయాత్ర చేసి హింసాత్మక మార్గాలను అవలంభించాడు. అతనికి ఈ నెమలి సింహాసనాన్ని మొఘలులు వదులుకోవలసి వచ్చింది. 6 గంటల సమయములో ఢిల్లీ లోని చాందిని చౌక్ ప్రాంతములో 30,000 వేల మంది భారతీయులను ఊచకోత కోశాడు. ఆ పరిస్థితికి హిందుస్తాన్ చక్రవర్తి – నాదిర్ షా కాళ్ళ బేరానికి వచ్చి ఈ ఊచకోత ఆపమని బ్రతిమాల వలసి వచ్చింది. అటువంటి పరిస్థితులలో మొహమ్మద్ షా తన విలువైన ఆస్తులను వజ్రాలను విలువైన రత్నాలను బంగారము వెండి ఆభరణాలను వదులుకోవలసి వచ్చింది. నాదిర్ షా పోతూ పోతూ నెమలి సింహాసనాన్ని తీసుకుపోతుంటే సిక్కు సైన్యము నాదిర్ షా సైన్యాన్ని వెనుక నుండి మైలు పొడవున ఉన్న సైన్యము పై దాడి చేసి చాలా మటుకు ఆస్తులను స్వాధీన పరచుకున్నారు. కానీ కోహినూర్ వజ్రము, నెమలి సింహాసనము మటుకు నాదిర్ షా తో పాటు భారతదేశాన్ని దాటిపోయాయి. ఆ విధముగా నాదిర్ షా నెమలి సింహాసనాన్ని అధిష్ఠించాడు.

పంజాబులో సిక్కుల పాలన వృద్ధి చెందటం మొదలుపెట్టింది. మరాఠా సామ్రాజ్యము మొఘలులను ఓడించినప్పటికీ వారిని హిందుస్తాన్ గద్దె మీద కూర్చోబెట్టింది. బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒక ద్రోహిని గుర్తించి ఆ ద్రోహికి( బెంగాల్‌కు చెందిన సుబహ్) మొఘల్‌లు నియమిచిన గవర్నర్ మీర్ జాఫర్‌కు బదులుగా గవర్నర్‌గా నియమిస్తామని ఆశ జూపారు. ఆ విధముగా బ్రిటిష్ వారు కుతంత్రాలతో బెంగాల్ లోని విలువైన సంపదలను దోచేశారు. మొఘలుల పాలన 1757 తో ముగిసి బ్రిటీష్ పాలన మొదలైయింది. 20 ఏళ్ల వారి పాలనలో సంపన్నముగావుండే బెంగాల్ కరువు కాటకాల ప్రాంతముగా మారింది.

నెమలి సింహాసనము కథ నాదిర్ షా క్రూరత్వానితో ముడిపడి ఉంది. ఈ సింహాసనము విషయములో నాదిర్ షా తన స్వంత కొడుకును కూడా దూరము పెట్టాడు. ఈ నెమలి సింహాసనము లోని విలువైన రత్నాలు మొదలైనవాటిని తొలగించి సింహాసనాన్ని చరిత్రలో కలిపేశారు. కానీ దీనితో పాటు ఉన్న కోహినూర్ వజ్రాన్ని అఫ్ఘన్ సేనాని 1813లో మహారాజ రంజిత్ సింగ్‌కు బహుమతిగా ఇవ్వటము వలన ఆ విలువైన వజ్రము భారత దేశానికి చేరింది. మహారాజా రంజిత్ సింగ్ మరణానంతరము బ్రిటిష్ వారు పంజాబ్‌ను ఆక్రమించుకోవటం వలన ఈ వజ్రము వారి స్వాధీనము లోకి వెళ్ళింది. ఆ విధముగా భారతదేశాన్ని వదలి ఇంగ్లాండ్ రాణి కిరీటములోకి చేరింది. కోహినూర్ వజ్రము ఒక్కటే ఆనాటి మొఘల్ కోర్ట్ లోని రెసెప్షన్ హాల్ గుర్తుగా మిగిలింది. ఎప్పటికైనా ఈ వజ్రము మళ్లా భారత దేశానికి చేరుతుందని భారతీయుల ఆశ. కానీ నెమలి సింహాసనమును కోల్పోవటము దాని ఆనవాళ్లు మిగలకపోవటం భారతదేశానికి భారతీయ నాగరికతకు తీరని నష్టము. ఆ విధముగా భారతదేశము యొక్క మూడవ స్వర్ణ యుగము ముగింపు కూడా మొదలయింది.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here