సత్యాన్వేషణ-30

0
3

[box type=’note’ fontsize=’16’] ఇది ఆత్మాన్వేషణ. ఇది సత్యాన్వేషణ. సత్యాన్వేషణ పథానికి మార్గదర్శనం చేసే గురువు అన్వేషణ. సంధ్య యల్లాప్రగడ స్వీయానుభవ కథనం. [/box]

[dropcap]కేవలము సాధకులకు మాత్రమే తెలిసే మహాద్భుతమీ అరుణగిరి.

అరుణాచలేశ్వరుడు అగ్ని లింగము…

బ్రహ్మ విష్ణువులు తమ తమ గొప్పతనము గురించిన సంవాదములో వారి మధ్య ప్రత్యక్షమై, తుది మొదలు కనుగొనమని పంపుతాడు పరమశివుడు. ఆ విషయము కనుగొనటము వారికి సాధ్యపడదు. ఆ లింగమే అరుణగిరిగా మారి అరుణాచలమైనది అని స్థలపురాణము.

‘కైలాసము, కాశీ పరమశివ నివాసము… అందుకే అవి పవిత్రము. అరుణాచలము పరమశివ హృదయము.. అతి పవిత్రమ’ని రమణులు ఒక సందర్భములో చెబుతారు.

అరుణాచలమంటే ఈశుని హృదయము. దానిని తలిచినంతనే మోక్షమిస్తుందని అరుణాచల పురాణము చెబుతుంది.

ఇది గోప్యమైనందున పూర్ణ దీక్షాపరులకు, సాధకులకు మాత్రమే తెలిసేది పూర్వము. కానీ నేడు ప్రవచనాల వలన తెలుగువారికి బాగా తెలిసిన ప్రదేశమైనది.

అరుణాచలమునే తిరువన్నామలై అంటారు. అది మద్రాసుకు దాదాపు 200 కిలోమీటర్లు. నేను హిమాలయాల నుంచి నేరుగా మా అక్కయ్యగారి ఇంటికి వెళ్ళి, ఆమెతో కలసి  చెన్నై చేరాను. మావారు వచ్చేందుకు ఒక రోజు పట్టింది. అంతవరకూ మేము చెన్నైలోనే ఎదురుచూస్తూ గడిపాము. ఆయన వచ్చాక మేము ముగ్గురము కలసి మందుగా మాట్లాడి పెట్టుకున్న ట్యాక్సీలో తిరువన్నామలై బయలుదేరాము.

“హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం
హ్యహ మహమితి సాక్షాదాత్మ రూపేణ భాతిః
హృది విశ మనసా స్వంచిన్వతా మజ్ఞ్యతా వా
పవన చలన రోధాత్ ఆత్మ నిష్ఠ్భోవ త్వం।।”
(భగవాను రమణులు రమణగీత, )

అర్థము: ఈ హృదయంలోని ఆత్మను ఉపాసించటమే దహరోపాసన.

భగవానుని తలుచుకొనగానే హృదయములో పొంగుకొచ్చే అనిర్వచనీయమైన ఆనందకరమైన భావము కన్నుల వెంట ప్రవహిస్తుంది.

మౌనం సాకరమైతే అది వారి రూపము.

సూటైన దారిని సులువుగా మానవాళికి బోధించిన అపర దక్షిణామూర్తి ఆయన. జ్ఞానాన్ని తేలికపాటి మాటలతో పంచి ఎందరికో కైవల్యమిచ్చిన కరుణామూర్తి. వారి బోధ ‘నేనెవరు?’ అని ప్రశ్నించి, జనులకు ఆత్మరూపముకు దారి చూపిన దివ్య చైతన్యము వారు. సాక్షాత్తూ ఆత్మజ్ఞాని వారు. ఆత్మజ్ఞాని యే బ్రహ్మమని ఉపనిషత్తు మాట. అందుకే వారు కేవలము బ్రహ్మమే!!

జిజ్ఞాసువుల హృదయాలను తట్టి లేపిన మహర్షి వారు.

ప్రతివారిని తమ హృదయ మూలలలోనికి పయనించమని చెప్పి ఆలోచనల మూల స్థానము పట్టుకోమని చెప్పారు. ఆ స్థానము మీద ధ్యానము చెయ్యమని, తద్వారా స్వాత్మారాముని చూడవచ్చని దారి చూపారు. మనకు కేవలము ఒక్క తరము ముందు వారున్నారంటే మనకు ఆశ్చర్యము కలగక మానదు. వారు నేటి కలిపోకడల అపనమ్మకపు బ్రతుకులకు జీవన మార్గము చూపటానికే అవతరించారు. మన ఋషులు, వేదాలు, ఉపనిషత్తులు పరమ సత్యమని నేటి కలి మానవులకు చెప్పటానికే వారు అవతరించారు. మనకు పరమాత్మ మీద, తపస్సు మీద, సనాతన హైందవ ధర్మ మార్గము మీదా నమ్మకము కలిగించటానకి, అవతరించిన సత్యరూపమైన పరబ్రహ్మము వారు.

శుద్ధమైన చైతన్యము మానవరూపము దాల్చి వచ్చి, మానవాళికి దారి చూపి జీవన్ముక్తులవటానికి జన్మిస్తూ వుంటారు. వారి జన్మ కేవలము లోకోద్ధరణ కోసమే. అలా భువికి రమణులుగా వచ్చారు.

రమణుల జన్మస్థలము తిరుచ్చుళి. తిరుచ్చుళిలో శివాలయము వుంది. ఆ వూరు ప్రాచీన యాత్రా స్థలము కూడా. ఆ వూరిలోని సుందరం అయ్యర్, అలగమ్మాళ్‌ లకు ద్వితీయ సంతానము వెంకట్రామన్‌. ఆయన చిన్నతనము చాలా సాదాసీదాగా జరిగింది. ఆయన చిన్నతనములోనే తండ్రిని కోల్పోయారు. పినతండ్రి ఇంట్లో వుండి చదువుకునేవారు ఆయనా, వారి అన్నగారు. దృఢమైన శరీరము, ఆరోగ్యము ఆయనకు చిన్నతనమున వుండేది.

చిన్నతనములో బంధువులు ఇంటికి వస్తే వారు ‘అరుణాచల’మని సమాధానము ఆయనను ఆనంద పరుస్తుంది. చిన్న చిన్న మార్పులు ఆయనలో మొదలైనాయి. ఆయనకు తన 16 ఏట ‘మరణానుభవము’ కలిగింది. ఆయనలో ఆలోచనలు మొదలయ్యాయి. ‘శరీరము మరణిస్తుంది. పిమ్మట స్మశానములో దహనము కాబడి బూడిదవుతుంది. కానీ ‘నేను’ మరణించటములేదు’. మరణించని ఈ ‘నేను’ ఎమిటి? అన్న ఆలోచన కలిగింది.

చిన్న చీటి రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. 1896 సెప్టెంబరు 1 న అరుణాచలము చేరి, సరాసరి దేవాలయములోని శివుడ్ని కౌగిలించుకొని, “అప్పా నీ యాజ్ఞ మేరకు వచ్చేశాను” అన్నారు.

కౌపీనము ధరించి, దేవాలయ వెయ్యికాళ్ళ మండపములో కళ్ళు మూసుకు దీక్ష మొదలెట్టారు. తుంటరి పిల్లలు నానా అల్లరీ చేసేవారు. ఆయనను చికాకు పెట్టినా చలించక మౌనముగా వుండేవారాయన. పిల్లల అల్లరికి సమాధానము ఇవ్వక, ఎవ్వరితో మాట్లాడక మౌనముగా వున్నందున మౌనస్వామి అన్నారు తొలుత. ఆయన నానా కష్టాలను సైతము లెక్కపెట్టలేదు. తీవ్రమైన సమాధిలో శరీరము పై సృహ లేని రోజులలో, అక్కడి భక్తులు ఆయన శరీరమును కాపాడారు. రకరకాల చోట్ల ఆయన సమాధి స్థితిలో వుండి బ్రహ్మవేత్తగా, మౌనముగా వుండిపోయారు.

ఆయన మొదట తపస్సు చేసిన పాతాళ లింగము ఆలయ ప్రాంగణములోనే వున్నది. దానిని రమణాశ్రమము వారు 2011లో బాగుపరచారు. అక్కడ్నుంచి ఆయన అరుణగిరిపై మౌనస్వామిగా మౌనముతో లయమై తపమాచరించారు.

ఆయన పేరు తెలియక చాలా కాలము బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు ప్రజలు. ఆయన విరూపాక్షగుహలో చేరాక పళనిస్వామి ఆయనను సేవించుకున్నాడు. పళని స్వామి యోగవాశిష్ఠము, కైవల్య నవనీతము, వివేకచూడామణి తేవటము, భగవాను వివరించటము చేసేవారు.

ఆత్మసాక్షాత్కారము జరిగిన జ్ఞాని భౌతికదేహము వదిలితే సాధకులకు దారి చూపే వారు ఎవరు?

అందుకేనెమో భగవానులు ప్రాపంచిక కర్మలు చేస్తూ ఆ కర్మలకు తాను కర్తకాదని భావముతో మెలుగుతూ వుండేవారు.

బ్రాహ్మణస్వామిగా పెరుపడిన భగవానుకు రమణ మహర్షి అని నామకరణము చేసినది శ్రీ కావ్యకంఠ గణపతి ముని.

1907 లో గణపతి ముని, మౌన స్వామిని దర్శించాడు. ‘ఎన్నో గ్రంథాలు చదివాను, కోట్ల కొలది పంచాక్షరీ జపించాను. కానీ తపస్సు యొక్క స్వరూపము అవగతము కాలేదు. దానిని తెలిపి మనఃశాంతి కూర్చమ’ని భగవానులను పార్థిస్తాడు గణపతి ముని.

మౌనముగా వుండే మౌనస్వామి మొదటిసారి మాట్లాడుతూ, “నేను అన్న భావము ఎక్కడ్నుంచి పుడుతుందో గ్రహించగలిగితే మనస్సు అందులో లీనమవుతుంది” అంటారు. “మంత్రోచ్చారణతో మంత్రనాదం ఉద్భవించే ప్రదేశము గమనిస్తే మనస్సు అందులో లయమవుతుంది. అదియే తపస్సు” అంటారు. గణపతి ముని అక్కడే అలా సాధన చేసి ఆత్మసాక్షాత్కారము పొందుతాడు. ఆయనే భగవానుకు రమణ మహర్షి అన్న నామకరణము చేస్తాడు. రమణుల మీద ‘రమణగీత’ వెలువరించినది కూడా ఆయనే.

హంఫ్రీసు అన్న ఆంగ్లేయుడు రమణులకు మొదటి విదేశీ భక్తుడు. ఈ హంఫ్రీసు గణపతి ముని శిష్యులకు యజమాని. సాధువుల యందు భక్తి గలవాడు. అక్కడి గురువులను చూపమని అడిగితే ఆ శిష్యులు రమణుల వద్దకు హంఫ్రీసును తీసుకువస్తారు. హంఫ్రీసు మొదట భగవాను గురించి వివరాలు రాసి ప్రచురించాడు. ఆ వ్యాసము ఎందరినో రమణుల వద్దకు తీసుకువచ్చినది. అలాగే పాల్ బ్రంటను వచ్చారు. ఇక అటు తరువాత ఆయన వ్రాసిన వ్యాస పరంపరలు…. ‘మై సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా’ వెలువరించటము జరిగాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here