తలకొరివి

0
4

“అన్నయ్యా, బాబాయి మధ్యాహ్నం చనిపొయ్యాడు. రేపు ఉదయం అంత్యక్రియలు చేస్తారుట. ఈ విషయం నీకు తెలియజెయ్యమన్నారు బాబాయి పిల్లలు” తమ్ముడి దగ్గర్నుండి ఫోన్ వచ్చింది.

మాది గుంటూరు దగ్గర్లోని ఒక పల్లెటూరు. నేను ఉద్యోగం చేస్తూ ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటున్నాను. మా తమ్ముడు ఊర్లో మా నాన్నతో కలసి పొలం పని చూసుకుంటూ అక్కడే స్థిరపడ్డాడు. ఒక సంవత్సరం క్రితం మా నాన్న చనిపొయ్యాడు, మా అమ్మ అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం చనిపొయ్యింది. ఇప్పుడు మా తమ్ముడు, వాడి భార్య, వాడి ఇద్దరు కొడుకులు అక్కడే ఉంటున్నారు. ఇంతకుముందు మా అమ్మా నాన్నా ఉన్నంతకాలం కనీసం మూడు నెలలకొకసారైనా నేనొక్కడిని ఊరికి వెళ్ళొస్తూ ఉండేవాడిని. సంవత్సరానికి రెండు సార్లైనా మొత్తం మా కుటుంబసభ్యులందరం ఆ ఊరికి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం. మా నాన్న చనిపొయ్యిన తరువాత మాత్రం మా రాకపోకలు తగ్గినవి. బంధు మిత్రులనుండి ఏదైనా పెళ్ళి పిలుపో, చావు కబురో వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఏవైనా అనివార్య కారణాలవలన, కొన్ని సందర్భాలలో కుటుంబసభ్యులందరం వెళ్ళలేకపోయినా, నేనొక్కడినైనా వెళ్ళొస్తుండేవాడిని. మా నాన్న చనిపొయ్యినప్పుడు, మా బాబాయి ఒక మాటన్నాడు. మీ నాన్న లేడని ఈ ఊరికి రాకుండా ఉండొద్దు. నీ బాబాయిని చూడటానికైనా అప్పుడప్పుడూ వస్తూ ఉండు. ఆ మాటలంటున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరగడం గమనించాను.

“అయ్యో ఎంతమాట బాబాయి. తప్పకుండా వస్తాను. తమ్ముడు కూడ ఉన్నాడుగా ఇక్కడ. ఈ ఊరికి రాకుండా ఎలా ఉంటాను? నీ ఆరోగ్యం జాగ్రత్త” అని ఓదార్చాను.

కాని ఒక ఏడాదిగా నేనా ఊరు వెళ్ళలేదు. మాట తప్పాను. కావాలని తప్పలేదు. ఈ కరోనా వ్యాధి ప్రబలినప్పటినుండి బయట ఊర్లకు వెళ్ళటం మానేశాను. ఏ సందర్భం వచ్చినా అందరికీ “సారీ. రాలేను” అని చెప్పాను. ఒక రెండు నెలలనుండీ, కరోనా ఉధృతం తగ్గిందనిపిస్తున్నది. అయినా బాబాయి చనిపోతే కడసారి చూడటానికి వెళ్ళలేకపోతే ఎలా? తప్పక వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. భార్యాపిల్లలతో వెళ్ళడం శ్రేయస్కరం కాదనిపించి, నేనొక్కడినే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. వేకువజామునే బయలుదేరి వెళ్ళినా, 9 గంటల కల్లా ఊరికి వెళ్ళవచ్చని, అనుకుని అలారం పెట్టుకుని పడుకున్నాను. పడుకున్నానన్న మాటే గాని సరిగా నిద్రపట్టలేదు. బాబాయి గురించే ఆలోచనలు.

మా తాతకు మొత్తం 8 మంది సంతానం. మా నాన్న అందరికంటే పెద్దవాడు. ఆయన తరువాత ఆరుగురు ఆడపిల్లలు. ఆ తరువాత మా బాబాయి పుట్టాడు. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ పద్ధతులు అంతగా ప్రాచుర్యములో లేవు. ఉన్నా ఎక్కువమంది తెలియవు కూడా. ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో నివసించే వాళ్ళకి చాలామందికి అస్సలు తెలియదు. మా మేనత్తలందరి పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇక ఇంటిలో, మా అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతయ్య, నేను, మా తమ్ముడు ఇంక బాబాయి మాత్రమే ఉండేవారం. అందువలన మా చిన్నతనంలో, మా కంటే పన్నెండు లేదా పదమూడేళ్ళు పెద్దయినా, మా బాబాయే మా స్నేహితుడు అయ్యాడు. ఆయన పెళ్ళి అయ్యేంతవరకు ఆయన మాతోనే ఎక్కువ ఆడుకునేవాడు. నన్ను, మా తమ్ముడిని వేరే పిల్లలు ఎవరైనా ఏమైనా ఏడిపించినా, మా బాబాయి ఊరుకునేవాడు కాదు. నిజం చెప్పాలంటే, మాకు మా బాబాయి బాడీగార్డ్ లాగా ఉండేవాడు. ఒకసారి మా బాబాయి మమ్మల్నిద్దరినీ పొలం తీసుకుళ్ళాడు కందికాయలు కోసుకు తిందాము రమ్మని. మంచి మంచి కందికాయలు కోసుకుని అక్కడే తింటున్నాము. నేనూ బాబాయి ఒక వరసలో కందికాయలు కోసుకుంటున్నాము. మా తమ్ముడు వేరే వరసలో కోసుకుంటూ ఉన్నాడు. అంతలో, మా తమ్ముడు “అన్నయ్య, బాబాయి” అంటూ కేకలు వేశాడు. “ఏంటి, ఏంటి, ఏమయ్యింది” అంటూ మేమక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళాము. వాడక్కడ భయముతో బిర్రబిగుసుకుపొయ్యాడు. “పాము” అంటూ చేత్తో ఒకవైపు చూపాడు. అటు చూస్తే ఏముంది. ఒక పాము మెల్లగా జారుకుంటున్నది. మా అందరికీ పాములంటే చచ్చేంత భయ్యం. చివరకు బాబాయికి కూడా. అయినా, బాబాయి అక్కడ ఒక కర్రను వెదకి పట్టుకుని ఆ పాము వెళ్ళిన వైపు వెళ్ళి, పామును వెంబడించి దాని తలమీద గట్టిగా నాలుగైదుసార్లు బాదాడు. దెబ్బకు పాము చచ్చి ఊరుకుంది. ఇంకెప్పుడూ చేలోకి వెళ్ళకూడదు అన్నంత భయమేసింది మాకు. “కందికాయలొద్దు, ఏమొద్దు, బాబాయి, ఇంటికి వెళ్ళిపోదాము” అని బాబాయితో ఇంటికి బయలుదేరాము.

దారి మధ్యలో, బాబాయిని ఒక మాట అడిగాను. “బాబాయి, పాము దాని దారిన అది వెళ్ళిపోతుంది గదా. నీవెందుకు దానిని వెంబడించి మరీ చంపావు?”

 “ఏమిలేదురా. పాములు పగ బడతాయని తాతయ్య చెప్పేవాడు. అది తమ్ముడిని చూసిందిగా. వాడిపై పగబడితే, వాడి ప్రాణానికే ముప్పు కదా? అందుకే దానిని చంపాను. ఇక అది పగబట్టే ప్రశ్నే ఉండదు కదా?” అని చెప్పాడు.

మా తమ్ముడి ప్రాణం కోసం బాబాయి అంత సాహసం చేశాడని తలచుకున్నాను. అప్పటినుండి, మా బాబాయే మా హీరో అయ్యాడు.

ఆ తర్వాత మా బాబాయి, మా ఊరిలోనే ఒక మోతుబరి రైతు కూతుర్ని పెళ్ళి చేసుకుని, వేరే కాపురం పెట్టాడు. అందుకు కారణం లేకపోలేదు. ఇంటికి మా నాన్న పెద్ద కొడుకు కావడం వలన, అందునా మా తాతయ్య నాయనమ్మ మాతోనే ఉండటం వలన, మా మేనత్తలందరు, ఏ అవసరం వచ్చినా, వచ్చినప్పుడల్లా మా ఇంటికే వస్తుంటారు, పిల్లా జెల్లలతో. వాళ్ళకి ఇష్టమైనన్ని రోజులు వుండి వెళుతుంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు వారికి చీర జాకెట్టు లాంటివి పెట్టడం కూడా అనవాయితీ. ఇలాంటి ఖర్చులు చాలానే ఉంటవి. ఈ ఖర్చుల భారం తన అల్లుడి మీద పడకూడదని వాళ్ళ అత్తగారి భావన. అందుకే మా బాబాయికి ఇష్టం లేకపోయినా, వేరే కాపురం పెట్టక తప్పలేదు. మా మేనత్తలందరి పైనా మా బాబాయికి ఆమితమైన ప్రేమ ఉన్నది. మా మేనత్తలందరూ వచ్చినప్పుడల్లా తప్పకుండా వాళ్ళ తమ్ముడైన మా బాబాయిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళతారు, కాని ఒక్క రాత్రి అయినా వారు అక్కడ నిద్రపోరు. ఎందుకంటే, మా పిన్ని వాళ్ళతో అంత ఆప్యాయంగా ఉండదు గనుక. మా పిన్ని పైన వాళ్ళ అమ్మ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆమె ఏమి చెబితే అదే దైవ వాక్కు మా పిన్నికి. అయినా, మా బాబాయి మా ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునేవాడు.

మా బాబాయి పెళ్ళై విడిగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ బాగానే అభివృద్ధిలోకి వచ్చాడు. ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. నేను ఆ ఊర్లో ఉన్నంతవరకు బాబాయి గారి పిల్లలతో కలసి మెలసి ఆడుకున్నాము. పదవ తరగతి తర్వాత నేను గుంటూరులో హాస్టల్లో ఉంటూ ఉండి చదువుకునే వాడిని. సెలవులు రాగానే ఊరికి వెళ్ళే వాడిని. అందరితో కలసి మెలసి తిరిగే వాడిని. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజిలో జేరిన తర్వాత చాల తక్కువ సార్లు ఊరికి వెళ్ళేవాడిని. మా తమ్ముడు పదవ తరగతి తర్వాత చదువు మానేసి మా నాన్నకు తోడుగా వ్యవసాయం చేస్తూ ఊరిలోనే ఉండిపోయాడు. నేను ఇంజనీరింగ్‌లో పాసైన వెంటనే క్యాంపస్ సెలెక్షన్‌లో వచ్చిన ఉద్యోగంలో చేరడానికి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డాను. ఆ తర్వాత నాకూ, మా తమ్ముడికీ కూడా పెళ్ళి అయింది. నాకూ, మా తమ్ముడికి కూడా ఇద్దరేసి పిల్లలు పుట్టారు.

ఇప్పుడు మా బాబాయి మరణంకు ముందు కాలంలో, మా తాతయ్య, నాయనమ్మ, అమ్మ నాన్నల వరస మరణాలు మాకు అత్యంత విషాదాన్ని మిగిల్చిపొయ్యాయి. మా బాబాయి మరణం కంటే ఒక సంవత్సరం ముందు మా పిన్ని కూడా గుండె పోటుతో మరణించింది. మా బాబాయి పిల్లల్లో, పెద్దవాడు ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో ఉద్యోగం కూడా సంపాదించాడు. తన ఆఫీస్‌లో పనిచేసే ఒక కొలీగ్‌ను ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఆ అమ్మాయిది వేరే కులమే కాదు, వేరే మతం కూడా. మా బాబాయికి నచ్చక ఆ పెళ్ళిని వ్యతిరేకించాడు. దాంతో వాడు ఆర్యసమాజ్‌లో మిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. తండ్రి ఒప్పుకోలేదని, పెద్దవాడు ఇంటికి రావడం, తండ్రితో మాట్లాడడం పూర్తిగా మానేశాడు. కూతుళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు బాబాయి. భార్య పోయిన దగ్గర్నుండీ బాబాయి చాలా విచారంగా ఉంటున్నాడు. చిన్న కొడుకుకు పెళ్ళి చేసి వాడి దగ్గరే ఉంటున్నాడు. తనకు కూడా ప్రాణ భయం పట్టుకుంది. అందుకే ఇప్పుడు ఉంటున్న ఇల్లు చిన్న కొడుక్కి రాసేశాడు. మిగిలిన మూడెకరాల పొలం కూడా మొత్తం చిన్న కొడుక్కే ఇచ్చాడు. పెద్ద కొడుకుకి, కూతుళ్ళకి ఇదంతా తెలిసి వారంతా మా బాబాయిపై కోపంతో ఉన్నారు. మా బాబాయి తను చేసింది న్యాయమే అంటున్నాడు. ఆడపిల్లలకు పెళ్ళప్పుడు కట్నంగా కొంత పొలం రాసిచ్చాడు. కొంత డబ్బు కూడా ఇచ్చాడు. పెద్ద కొడుకు బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడి భార్య కూడా ఉద్యోగం చేస్తున్నది. వారి ఆదాయానికి ఢోకా లేదు. ఎటొచ్చీ చిన్న కొడుకు తనకోసం ఇంటివద్దనే ఉండి వ్యవసాయంలో సాయపడుతూ, తనని కంటికి రెప్పలా చూసుకుంటున్న వాడికి, ఏలోటూ లేకుండా చూసుకోవలసిన బాధ్యత తనమీద ఉందని భావించాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూతుళ్ళకి కట్నంగా ఇవ్వడం జరిగింది. కొంత భాగం పెద్దవాడి చదువు కొరకు ఖర్చు చెయ్యడం జరిగినది. ఛిన్న కొడుక్కిచ్చినదంతా తన స్వార్జితమే. అందువలన తన నిర్ణయం సబబైనదే అని మా బాబాయి అభిప్రాయం. ఈ నేపధ్యంలో, ఇప్పుడు మా బాబాయి మరణం సంభవించింది.

వేకువజామునే నిద్ర లేచి, ఉదయం నాలుగు గంటలకల్లా కారులో ఊరికి బయలు దేరాను. బయలుదేరినట్లు మా తమ్ముడికి చెప్పాను. మధ్యలో నాకొక అనుమానం వచ్చింది. మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేశాను.

“తమ్ముడూ, బాబాయి పెద్దబ్బాయికి ఈ విషయం చెప్పారా? వాడొచ్చాడా?” అని ఆడిగాను. ఎందుకంటే తండ్రి చనిపోతే పెద్దకొడుకే తలకొరివి పెట్టాలిగా. తండ్రిపై కోపంతో ఉన్నాడుగా, వస్తాడో రాడో అని నా అనుమానం.

“ఆ వచ్చాడన్నాయి.” అని సమాధానం చెప్పాడు మా తమ్ముడు.

“అమ్మయ్య, ఒక సమస్య తీరింది” అని అనిపించింది.

ఉదయం కావడం వల్లనేమో ట్రాఫిక్ తక్కువగా వుంది. 9.00 గంటలకల్లా ఊరికి చేరాను. ఇంకా ఐస్ బాక్స్ లోనే ఉంది బాబాయి మృతదేహం. వస్తూ వస్తూ గుంటూరు పూల మార్కెట్‌లో కొనుక్కు వచ్చిన పూలదండను శవపేటిక మీద ఉంచి బాబాయికి తలవంచి నమస్కరించాను. బాబాయితో ఉన్న క్షణాలను గుర్తుచేసుకుంటూ, ఆయన నిర్జీవమైన ముఖాన్ని చూస్తూ కొంచెం సేపు అక్కడే నిలుచుని శ్రద్ధాంజలి ఘటించాను. నాన్న తర్వాత నాన్న లాంటి బాబాయి ఇక కనిపించడు గదా అని బాధేసింది. పుట్టినవాడు గిట్టక తప్పదు కాని, ఆ చావు ప్రభావం మిగిలినవారిపై చాలా ఉంటుంది. చనిపోయేటప్పుడు ఏ వ్యక్తి అయినా ఏదో ఒక బాధతోనే చనిపోతాడు. కొందరికి అది ఒక భయంకరమైన వ్యాధి కావచ్చు. కొందరు దీర్ఘకాలం వారు బాధననుభవిస్తూ, వారి కుటుంబీకులను కూడా నిస్సహాయస్థితిలోకి నెడతారు. కొందరు ఎక్కువ కాలం బ్రతకరని తెలిసినా, ఎంతో డబ్బు ఖర్చవుతున్నా, ఒకవేళ వారు కోలుకున్నా వారి పనులు వారు చేసుకోలేరని, ఇంకొకరికి కష్టం కలిగించక తప్పదని తెలిసినా, చూస్తూ చూస్తూ ఎవరూ చికిత్సా ప్రయత్నాలను ఆపరు. ఎన్ని డబ్బులున్నా, చావును జయించే శక్తి మాత్రం ఎవరి చేతుల్లో ఉండదు. జ్యోతిష్యులు ఇతరుల చేతులు చూసి, జాతకాలు చూసి, మీ ఆయుష్షు ఇంత అని చెప్పగలరు కాని, వారి ఆయుష్షు మాత్రం వారు చెప్పలేరు. డాక్టర్లు ఎంతోమంది జబ్బుల్ని నయంచేసి మృత్యుముఖాల్నుంచి తప్పించగలరేమో కాని, వారు కూడ మరీ అంత దీర్ఘాయుష్షులేమీ కాదు. వారు కూడా చనిపోయేటప్పుడు ఏదో ఒక వ్యాధితోనే చనిపోతారు. ఎవరైన చనిపోయినప్పుడు, వాళ్ళు ఫలానా వ్యాధితో చనిపోయారని చెప్పుకుంటారు గాని, ఎవరైనా సరే, ప్రమాద మరణం, ఆత్మహత్య తప్ప, అందరూ ఏదో ఒక వ్యాధితోనే చనిపోతారనే సత్యాన్ని గ్రహించగలగాలి. నా దృష్టిలో చనిపోయినవారిని గౌరవించాలే గాని, వారు ఏ వ్యాధితో మరణించినా సరే, వారిని అగౌరవపరిచే వ్యాఖ్యానాలు చేయరాదు. కొందరు దుర్మార్గులు, హంతకులు, సంఘ విద్రోహులు, నరరూప రాక్షసులు చనిపోయినప్పుడు మాత్రం వారిని ద్వేషించక తప్పదు. కాని ఇలాంటి దుర్మార్గుల విగ్రహాలను కూడా జాతి గౌరవాన్ని నిలిపిన నేతల శిల్పాల మధ్య ప్రతిష్ఠిస్తుంటే గుండె భగభగ మండుతున్నది. రౌడీలు, హంతకులు, ఫ్యాక్షనిస్టులు, క్రిమినల్స్ రాజకీయ నాయకులై దేశాన్ని పట్టి పీడిస్తుంటే, సామాన్య మానవులకు స్వాతంత్ర్యం ఎక్కడుంటుంది? రక్షణ ఎక్కడుంటుంది? వారి జీవించేహక్కును ఎవరు కాపాడతారు? కొంతమంది రక్షకభటులే దమనకాండ జరుపుతుంటే, సగటు మనిషి ఎవరిని శరణు కోరతాడు?

ఇదేమిటి నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయి! ఎందుకు నాకిలాంటి ఆలోచనలు వచ్చాయి ఈ సమయంలో! నాలో కలిగిన ఆలోచనలు అందరికీ కలుగుతాయా! అందరూ నాలా ఆలోచిస్తారా! ఒక సెకను పాటు నా తల అటూ ఇటూ ఆడించాను. వర్తమానం లోకి వచ్చాను. ఇంతసేపూ నేను, నా బాబాయి పార్థివ దేహం వద్దే ఉన్నాను.

పక్కనున్న తమ్ముడిని పిలిచి “తీసుకు వెళ్ళే ప్రయత్నాలు మొదలయ్యాయా”? అని ఆడిగాను.

“అన్నయ్యా, ఒక సమస్య వచ్చింది. పెద్దవాడు బెంగళూరు నుండి వచ్చాడు కాని తలకొరివి పెట్టనంటున్నాడు” చెప్పాడు మా తమ్ముడు.

“ఏం. ఎందుకని?” అని ఆడిగాను.

“ఆస్తి వాడికి ఏమీ పెట్టలేదనంట”. చెప్పాడు తమ్ముడు.

“చిన్నోడికి ఇచ్చిన ఆస్తిలో తనకూ భాగమివ్వాలట. అప్పుడే తలకొరివి పెడతాడట. చిన్నోడేమో, తాను తల్లిదండ్రులకు సహాయంగా ఉంటూ,వారి బాగోగులు చూడటం వలన, బాబాయి తనకు ఆ ఆస్తిని ఇచ్చాడని, వ్యవసాయం మీద తనకు వచ్చే ఆదాయం చాల తక్కువని, ఇందులోంచి తను పెద్దోడికి భాగమిస్తే, తన సంసారం గడవడం కష్టమని వాదిస్తున్నాడు. కూతుళ్ళు కూడా పెద్దోడినే సమర్థిస్తున్నారు. పెద్దోళ్ళు ఎవ్వరు చెప్పినా ఎవరూ వినడం లేదు. ఏమి చెయ్యాలో అర్థమవడం లేదు అన్నాయ్.” చెప్పాడు తమ్ముడు.

అవును నిజమే. చిన్నోడి వాదనలో సత్యమున్నది. వాడు వాళ్ళ నాన్నకు వ్యవసాయంలో సాయం చేస్తూ, తల్లిదండ్రులను దగ్గర్నుండి చూసుకోవడమే గాకుండా, వచ్చిన ఆదాయంలో సింహభాగం పెద్దోడి చదువుకు, హాస్టల్ ఖర్చులకు ఖర్చుపెట్టిన విషయం నిజమే కదా. పైగా పెద్దోడికి ఇప్పుడు నెలకు యాభైవేలు జీతం, వాడి భార్యకు కూడా దాదాపు అంతే వస్తుంది. చిన్నోడికి ఆ మూడెకరాల ఆస్తిపై సంవత్సరానికి అన్ని ఖర్చులూ పోను ఒక యాభై వేలు మిగిలితే గొప్పే.

సమయం దాదాపు 11 గంటలయ్యింది. ఏదైనా కార్యక్రమం 12 గంటల లోపు పూర్తి కావాలంటారు పెద్దలు. లేదా సాయంత్రం మొదలుపెట్టవలసి వస్తుంది. చూడటానికి వచ్చిన బంధువులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు పెద్దోడు చెయ్యకపోతే చిన్నోడితో కార్యక్రమం చేయించమంటున్నారు. చిన్నోడేమో, పెద్దోడు ఉండగా నేను చెయ్యడమేమిటి అని అంటున్నాడు. చివరి ప్రయత్నంగా, నేను ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళను కలుపుకుని, పెద్దోడిని చిన్నోడిని ఒకచోట కూర్చోపెట్టి మాట్లాడి సమస్య పరిష్కరించాలని కార్యరంగం లోనికి దిగాను. నేను వాడికి చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకోమన్నాను. “నీవు పుట్టినప్పుడు మీ నాన్న ఎంత సంతోషించాడో నీకు తెలియదు. నిన్ను అల్లారుముద్దుగా పెంచారు నీ తల్లిడండ్రులు. మొదటి సంతానంగా నీకు అమితమైన ప్రేమను అందించారు వాళ్ళు. నిన్ను బాగా చదివించాలనే ప్రయత్నంలో, మిగతా పిల్లల చదువుల గురించి కూడా అంతగా పట్టించుకోలేదేమోనని అనిపించింది. మీ నాన్నకు నీ మీదున్న ప్రేమను శంకించకు. నీ పెళ్ళి విషయంలో, మీ నాన్నకు కోపం వచ్చిన మాట నిజమే. కాని తల్లిదండ్రుల కోపం గడ్డినిప్పు లాంటిది. అట్లా వస్తుంది ఇట్లా తగ్గిపోతుంది. నా మాట విని నీ మనసు మార్చుకో. ఆస్తులు శాశ్వతం కాదు. బంధాలు, అనుబంధాలే ముఖ్యం.” అని నావంతు ప్రయత్నం నేను చేశాను. ఎంతచెప్పినా, వాడి పంతం వీడలేదు. ఇప్పుడు గట్టిగా ఉండకపోతే, తనకు ఏమీ ప్రయోజనం ఉండదు అని అనుకుంటున్నట్లున్నాడు.

ఈ వాదోపవాదాలు అయిపోయేటప్పటికి 12 గంటల సమయం దాటిపోయింది. ఇక సరే, మధ్యాహ్నం చూసుకుందామని, అందరూ ఎవరిళ్ళకు వారు వెళ్ళిపొయ్యారు. నాకు మాత్రం బాధేసింది బాబాయి మరణం అలా వివాదాలకు తావుకావటం. నేను తమ్ముడింటికి వెళ్ళి ఏదో నాలుగు మెతుకులు తిన్నాననిపించాను. ఈ సమస్యకు పరిష్కారం ఎలా అని ఆలోచిస్తుంటే, ఒక ఆలోచన తట్టింది.

“తమ్ముడూ, బాబాయికి నేను తలకొరివి పెడితే ఎలా ఉంటది” అని తమ్ముడిని అడిగాను.

వాడు వెంటనే, “అదేంటన్నాయ్, బాబాయి కొడుకులు ఇద్దరూ ఉండగా నీవెలా పెడతావు?” అని కొంచెం కటువుగానే అన్నాడు.

“అదిగాదు తమ్ముడూ! వాళ్ళిద్దరూ గొడవపడుతున్నారు కదా!. ఎంతసేపు బాబాయి శవాన్ని అలా అనాథ  ప్రేతంలా అట్టిపెడతారు. నాకైతే బాధగా ఉంది తమ్ముడూ. మన బాబాయికి తలకొరివిపెడితే మనకు పొయ్యేదేమిలేదుగా. మనకు బాబాయి ఆస్తిలో భాగం అవసరం లేదుగా. బాబాయి మన చిన్నతనంలో, మనపై చూపించిన ప్రేమకు కృతఙ్ఞతగా ఈ పనిచేద్దామనుకుంటున్నాను. అడ్డు చెప్పకు తమ్ముడూ.” మా తమ్ముడుని ఒప్పించే ప్రయత్నం చేశాను.

చివరకు మా తమ్ముడు “సరే. నీ ఇష్టం అన్నాయ్” అన్నాడు.

వెంటనే తమ్ముడిని తీసుకుని బాబాయి వాళ్ళింటికి వెళ్ళాను. కొంతమంది బంధువులకు కూడా ఈ విషయం చెప్పి వాళ్ళను కూడా నాతో వెంటబెట్టుకుని వెళ్ళి పెద్దోడిని, చిన్నోడిని, బాబాయి కూతుళ్ళను కూడా పిలిచి నా నిర్ణయం చెప్పాను.

“మీరు ఎవరూ ముందుకు రాకపోతే, నేనే బాబాయికి తలకొరివి పెడతాను” అని గట్టిగా చెప్పాను.

ఏర్పాట్లు చెయ్యమని బంధువులకు చెప్పాను. వాళ్ళంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. నేను బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసి కుండతో నీళ్ళు పట్టుకుని వచ్చాను, బాబాయి శవానికి స్నానం చేయించడానికి. అవసరమైన డబ్బులిచ్చి నా తమ్ముడితో కావలసిన కొబ్బరికాయలు, సాంబ్రాణి, పూలు మొదలైనవి తెప్పించాను. పాడె కూడా సిద్ధం చేసే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నేను కూడా మానసికంగా పూర్తిగా సిద్ధమై ఉన్నాను.

ఇంతలో, పెద్దోడు, చిన్నోడితో కలసి హఠాత్తుగా వచ్చి నా చేతులు పట్టుకుని, “అన్నాయ్, నన్ను క్షమించు. నేను ఆస్తి కోసం మూర్ఖంగా ప్రవర్తించాను. ఆస్తి ముఖ్యం గాదు, ఆప్యాయతలు ముఖ్యం అని గ్రహించాను. మేము చెయ్యవలసిన కార్యాన్ని, నీవు ఏ ప్రయోజనం ఆశించకుండా ముందుకు రాగానే, నా తప్పు నేను తెలుసుకున్నాను. నాన్న నాకోసం ఎంతో కష్టపడి చదువు చెప్పించి నన్ను ఒక ప్రయోజకుడిని చేశాడు. నాకు చదువనే ఒక అమూల్యమైన ఆస్తిని ఇచ్చాడు. తద్వారా, నేను ఇప్పుడు బాగా సంపాదించగలుగుతున్నాను. పాపం తమ్ముడు, ఈ మట్టినే నమ్ముకుని బతుకుతున్నాడు. వాడి సంపాదన నా సంపాదనతో పోలిస్తే చాలా తక్కువ కదా! పైగా, వ్యవసాయంలో, స్థిరమైన సంపాదన ఉండదు. వాడి దగ్గర్నుండి నేను ఆశించడం తప్పు. నేనే ఇంకా వాడికి ఏదైనా సహాయం చెయ్యాలి. తండ్రికి తలకొరివి పెట్ట లేని పరిస్థితి రాకూడదని తెలుసుకున్నాను. నన్ను మన్నించు. నేనే నా తండ్రికి తలకొరివిపెడతాను.” అని కన్నీళ్ళ పర్యంతమయ్యాడు.

చిన్నోడు కూడా “క్షమించు అన్నాయ్. పెద్దోడు ఆస్తిలో భాగమడిగాడన్న కోపంతో నేను కూడా మూర్ఖంగా ప్రవర్తించాను. నీవెప్పుడయితే, తలకొరివి పెడతానికి ముందుకు వచ్చావో, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళి ‘అన్నాయ్, మనలో మనం తగవులాడుకుంటున్నామని, మన నాన్నకు తలకొరివి పెట్టడానికి పెద్దన్నాయ్ ముందుకు వచ్చాడు. అదే జరిగితే, తరువాత మనను ఊళ్ళో ఎవరూ గౌరవించరు. మన నాన్నకు మనలో ఎవరో ఒకరు తలకొరివి పెట్టడమే సమంజసం. నీకు ఆస్తిలో భాగం కావాలంటే తర్వాత మాట్లాడుకుందాము. నీవే తలకొరివి పెట్టు. ఉత్తరకాండలు ఇద్దరం కలసి చేద్దాము’ అని నచ్చచెప్పాను” అన్నాయ్.

అప్పుడు, వాడు కూడా “నీ ఆస్తిలో భాగం ఏమీ వద్దురా. నాన్నకు నేనే తలకొరివి పెడతాను” అని ముందుకొచ్చాడు. “అన్నయ్యలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే అన్నాయ్,” అని నన్ను ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళళ్ళో ఈ మార్పు వచ్చినందుకు నేనెంతో సంతోషించాను. మిగతా కార్యక్రమం అంతా వాళ్ళ చేతనే చేయించాను. సాయంత్రం 5 గంటలకల్లా బాబాయి శవ దహన కార్యక్రమాలు జరిగిపొయ్యాయి. అప్పుడు నాకనిపించింది. డబ్బు ముందు బంధాలు, అనుబంధాలూ బలాదూర్ అని. మనిషి తనకు తాను సంపాదించుకుని తినగలను, బ్రతకగలను అనే ఆత్మస్థైర్యం ఉంటే, తల్లిదండ్రుల ఆస్తులు, సంపాదన ఆశించడు. తల్లిదండ్రుల ఆస్తులు, వాళ్ళు బ్రతికి ఉన్నంతవరకు, ఎట్టి పరిస్థితులలోనూ, పంచమని సంతానం అడగకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే వారు సంపాదించిన ఆస్తులను సంపూర్ణంగా అనుభవించే అర్హత, హక్కు వారికే ఉంటుంది. ఒకవేళ వారసత్వంగా ఆస్తులు వస్తే, రానివ్వండి. వాటికొరకు వారసులు గొడవలు పడకూడదు. వాళ్ళ వాళ్ళ స్థితిగతులని బట్టి కొందరికి ఎక్కువ కొందరికి తక్కువగా వచ్చినంత మాత్రాన కొంపలేమి మునిగిపోవుగా. వారసులందరికీ సరిసమానముగా ఆస్తులను పంచడం చాలా కష్టతరం కూడా. సాధ్యమైనంతవరకు, ఎవరికీ అన్యాయం జరగకుండా పంచుకుంటే బాగుంటుంది. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టే సమయాలలో ఆస్తి తగాదాలు అస్సలు తీసుకు రాకూడదని నా అభిప్రాయం. మరి మీరేమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here