విజ్ఞాన బీజాలు

0
4

[dropcap]కా[/dropcap]లం ఎవరి కోసం ఆగదు. తన పని తాను చేసుకుంటున్నట్లుగా సాగిపోతూనే వుంటుంది. కొన్ని సంఘటనలు, కొందరు వ్యక్తులని మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఆ సంఘటనలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

మనలో స్పూర్తిని నింపి మన విజయానికి కారణమైన వ్యక్తులని మనం జీవితకాలంలో మర్చిపోలేము. మనం ఎక్కడ వున్నా వారెప్పుడూ మనకి గుర్తుంటారు.

***

మా రాఘవ రావు మాస్టారిని నేను చూసి చాలా కాలం అయ్యింది. అనుకోకుండా వారిని ఓ రోజు పొన్నూరులో కలవడం జరిగింది. నేను మండలం ఆఫీస్‌లో నా పని నేను బిజీగా చేసుకుంటున్న సమయంలో.. నా సీట్ ఎదురుగా నిలబడి, నన్ను పిలుస్తున్న అ పెద్దాయన్ని చూడగానే నాలో ఒకింత విస్మయం..

“రాఘవ మాస్టారు” అపయత్నంగా నా పెదవులు ఆయన పేరుని ఉచ్చరించాయి. ఆయన ఎప్పటిలానే చిరునవ్వుల వదనంతో నా వైపు చూస్తున్నారు.

నేను వెంటనే లేచి, నా టేబుల్ ఎదురుగా సీట్ లేక పోవడంతో ఓ చైర్ లాగి ఆయనకి వేశాను.

నేను బ్రాహ్మణకోడూరు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో రాఘవ మాస్టారు సైన్స్ టీచర్‌గా వుండేవారు. ఆయన ఎప్పుడూ అందరిని నవ్వుతూ పలకరించేవారు. ఆయన క్లాస్ అంటే పిల్లలు ఎంతో ఇష్టపడేవారు.

నాకు సరిగ్గా చదువు అబ్బేదికాదు. కాని సైన్స్ అంటే చాలా ఇష్టంగా చదివేవాడిని. మిగతా సబ్జక్ట్స్‌లో ఓ మాదిరి మార్క్స్ అంటే ఎబౌ యావరేజ్ మార్క్స్ వస్తుండేవి.

నాన్న వ్యవసాయం చేస్తుండేవారు. అమ్మ గృహిణి. వున్న రెండెకరాలతో పాటు కౌలు పనులు చేస్తూ నాన్న నన్ను,తమ్ముడిని చదివిస్తుండేవారు. ప్రభుత్వ పాఠశాల కావడంతో.. చదువులకి డబ్బులు ఖర్చయ్యేవి కాదు!

ఆ సంవత్సరం అమ్మకి ఒంట్లో బాగోలేదు. హాస్పిటల్‌లో చేరాల్సి రావడం.. వర్షాలు సరిగ్గా లేక మా పొలంలో పంట సరిగ్గా పండక నాన్న అప్పులపాలవడం జరిగింది. నేనప్పుడు పదవ తరగతి.

అమ్మా నాన్నల పర్యవేక్షణ లేకపోవడం.. నేను ఆ యేడు సరిగ్గా స్కూల్‌కి వెళ్ళకపోవడంతో పదవ తరగతి అర్ధవార్షిక (Half yearly) పరీక్షలు సరిగ్గా వ్రాయలేదు. ఫలితంగా నాకు సైన్స్ లోనే కాదు అన్ని సబ్జక్ట్స్‌లో మార్కులు బాగా తగ్గిపోయాయి.

“మధుకర్! నిన్ను మన సైన్స్ మాస్టార్ గారు ఆఫీస్ రూం లోకి పిలుస్తున్నారు” నాగరాజు చెబుతుంటే..

“అలాగే” అంటూ హెడ్మాస్టర్ గారు రూం కి బయలుదేరాను.

ఆ రోజు మా హెడ్మాస్టర్ చక్రారెడ్డి గారు రాలేదు. రూంలో రాఘవ మాస్టార్ గారు ఒక్కరే కూర్చుని వున్నారు.

“ఏరా! ఈ మధ్య బైక్ రైడింగ్ నేర్చుకున్నావట!?నిజమేనా!?”

“అవును సార్!” కాలర్ అయితే ఎగరేయలేదు కాని ఠీవిగానే చెప్పాను.

“గుంటూరు వెళుతున్నావంట అప్పుడప్పుడు..!?”

“నేను గుంటూరు వరకు డైవ్ చేస్తాను. సిటిలో మాత్రం మా మామయ్య డ్రైవ్ చేస్తాడు.”

“అవునా! ఇప్పుడు అమ్మ ఆరోగ్యం ఎలా వుంది?”

“..అమ్మ ఆరోగ్యం బాగుంది”

ఆయన సడన్‌గా అమ్మ ఆరోగ్యం గురించి అడగడం ఆశ్చర్యంగా అనిపించింది.

నాకు గబుక్కున నవ్వొచ్చింది. ‘అమ్మ ఆరోగ్యం బాగోలేదని నేను సరిగ్గా చదవడం లేదనుకున్నారు కాబోలు మాస్టారుగారు’ అనుకున్నాను.

అంతలోనే సీరియస్‌గా మారిపోయారు రాఘవ మాస్టారు.అప్పుడు వెలిగింది నా ట్యూబ్ లైట్. చేతులు బిగించి కట్టుకున్నాను. కాళ్ళలో సన్నని ఒణుకు.పదిసెకన్లపాటు ఎం జరుగుతుందో అర్థం కాలేదు.

ఎప్పుడూ కోపంలో చూడని ఆయన్ని సాక్షాత్తూ మహాశివుడు మూడో కన్ను తెరిస్తే ఎలా వుంటుందో అలా మారిపోయారు.

“సినిమాలు చూస్తున్నావు కదా ఈ మధ్య!? గుంటూరు వెళుతున్నది అందుకే కదా.”

“కాదు సార్…”

నా సమాధానం ఆయన వినడం లేదు. బెత్తం నా వొంటిపై నాట్యమాడింది.

“సార్! నన్ను క్షమించండి. నేను ఇక అటుగా వెళ్ళను. శ్రద్దగా చదువుకుంటాను” అనే వరకూ కొడుతూనే వున్నారు.

కన్నీళ్ళు నిండిన నయనాలు, ఒంటిపై బెత్తం చేసిన గాయాలు..! నిశ్శబ్దంగా వచ్చి నా బెంచ్‌పై కూర్చున్నాను. నా వైపు జాలిగా చూసారే గాని.. ప్రక్కనే వున్న నాగరాజు గాని,విజయ్ గాని ఎవరూ పలకరించలేదు.

రెండు రోజుల తరువాత.. మళ్ళీ రాఘవ మాస్టారు గారు నన్ను పిలుస్తున్నారని కబురొచ్చింది. బిడియంగా నిలబడ్డాను.

నా వైపుచూస్తున్న ఆయన మోహంలోని భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నా ఏం అర్థం కావడం లేదు.. రాబోయే ఉపద్రవాన్ని ఊహించుకుంటూ మాస్టారివైపు చూస్తున్నాను. టేబుల్ పైన వున్న పుస్తకాన్ని తీసుకుని నాకు ఇచ్చారు.

వివేకానందుడి సూక్తుల పుస్తకం.

చదవమని చిరునవ్వుతో చెప్పారు.

ఎంతో ఆకర్షణీయంగా వున్న ఆపుస్తకం నాకు ఎంతో నచ్చింది. నాకు తెలియకుండానే నాలో ఎంతో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి వివేకానందుడి సూక్తులు.

ఆ తరువాత కూడా మంచి పుస్తకాలు చదవమని మా క్లాస్‌లో అందరికీ చెబుతుండేవారు రాఘవ మాస్టారు. కేవలం క్లాస్ పుస్తకాలు మాత్రమే కాకుండా ఇతర పుస్తకాలు, సైన్స్‌కి సంబంధించిన పుస్తకాలు చదవమని మాకు సూచిస్తుండేవారు. అప్పుడే మనలో విజ్ఞానం పెరుగుతుందని బోదిస్తుండేవారు. కేవలం పరీక్షల్లో వచ్చిన మార్కులు మాత్రమే విధ్యార్థి తెలివికి కొలమానం కాదని చెబుతుండేవారు.

అలా క్లాస్ లోని అందరినీ చదువుల్లో ప్రోత్సహిస్తుండేవారు మాస్టారు. ఫలితంగా ఎప్పుడూ పరీక్షా ఫలితాల్లో వెనుకలో వుండే నేను టెంత్ క్లాస్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాను. అమ్మా నాన్న ఎంతో సంతోషించారు.

బై.పి.సి తీసుకోమని సార్ సలహా ఇచ్చారు. ఆ తరువాత నేను కాలేజ్ చదువుల్లో బిజి అవడం,మాస్టారు మా వూరినుండి బదిలీ అవడం జరిగాయి.

అలా నేను ఎం.ఎస్సీ( ఫిజిక్స్) చదివి ప్రస్తుతం ఇలా జాబ్ చేయడానికి ఆయన అందించిన స్ఫూర్తే కారణం.

* * *

“మధు..”

నన్ను మాస్టారు పిలుస్తుంటే ఈ లోకం లోకి వచ్చాను.

“సార్..ఇలా వచ్చారు.!?” అడిగాను.

“నా పెంక్షన్ పేపర్స్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలంటే ఇలా వచ్చాను.” అంటూ కవర్ లోనుండి పేపర్స్ తీసి నా టేబుల్ పై పెట్టారు.

పేపర్లోని వివరాలు చూసుకుని సంతకం చేసి స్టాంప్ వేసి ఇచ్చాను.

“నువ్వు ఇక్కడ పని చేస్తున్నావని తెలిసి వచ్చాన్రా!” అంటున్నా ఆయనతో..

“మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా వుంది మాస్టారు. మీకు ఎప్పుడైనా నానుండి ఎటువంటి సాయం కావాలన్న చేస్తాను సార్. నిజానికి ఆ రోజుల్లో మీరు శ్రద్ధ తీసుకుని నా ధ్యాస చదువువైపు మళ్ళేలా చేసారు సార్. లేదంటే నేను ఎక్కాడో పనివాడిగా పనిచేస్తూ మిగిలిపోయేవాడిని. నేడు నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇంతమంచి స్థితిలో వున్నానటే కారణం ఆ రోజుల్లో మీరు చెప్పిన మాటల స్ఫూర్తే మాస్టారు. మీ చిరునామా తెలియక మిమ్మల్ని కలవలేక పోయాను. సారీ!” అన్నాను.

“నేను రిటైర్ అయ్యాక చాలకాలం మా అబ్బాయి దగ్గర హైదరాబాద్‌లో వున్నాను. ప్రస్తుతం చెరుకుపల్లిలో స్వంతంగా ఇల్లుకట్టుకుని వుంటున్నాము. తప్పకుండా మా ఇంటికి ఓ సారి వీలుచూసుకుని రా!” ఆప్యాయంగా తమ ఇంటికి రమ్మని పిలుస్తున్న వారి మాటలని గౌరవిస్తూ..

“తప్పకుండా వస్తాను మాస్టారు” అంటూ నా విజిటింగ్ కార్డ్ ఇచ్చాను.

ఫొన్ చేతుల్లోకి తీసుకుని శ్రీమతికి రాఘవ మాస్టారు వస్తున్నారని ఇద్దరికీ వంట చేయమని చెప్పి.. వారిని ఇంటికి తీసుకువెళ్ళి బోజనం చేశాక వారిని రేపల్లె బస్ ఎక్కించి ఆఫీస్‌కి చేరుకున్నాను.

విద్య వినయాన్ని నేర్పుతుంది. విద్య మనో వికాసాన్ని కలిగిస్తుంది.

చదువుకుంటే, పుస్తకాలలోని సారాన్ని గ్రహిస్తే.. రేపటి విజేతవి నువ్వే!

విద్య విజయాన్నిఅందిస్తుంది. సమాజం లో గుర్తింపు,గౌరవానికి కారణమవుతుంది చదువు!

(నాలో విజ్ఞాన బీజాలు నాటిన గురువులకి అంకితం ఈ కథ. – గొర్రెపాటి శ్రీను)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here