[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
దాతా భవేత్ క్షితిపతిర్యద సాదరోయమ్
లోకోపి దర్శాయతి తత్ స్వకళాకలాపమ్।
వర్షాసు వర్షతిఘనో యది చాతకోపి
నృత్యాన్ ముదా భవతి తజ్జాన రంజనాయా॥
(జైన రాజతరంగిణి 7,1)
[dropcap]రా[/dropcap]జు ఔదార్యవంతుడయితే ప్రజలు స్వేచ్ఛగా తమ కళాప్రదర్శన చేస్తారు. ఎలాగయితే మేఘం వర్షం కురియగానే చాతక పక్షి ప్రజలకు ఆనందం కలిగిస్తూ నృత్యం చేస్తుందో, అలాగ రాజు మంచివాడయితే ప్రజలు స్వేచ్ఛగా కళాప్రదర్శన చేస్తారు.
శ్రీవరుడు జైనులాబిదీన్‍కు అత్యంత సన్నిహితుడు అన్న విషయం ఆయన కొనసాగించిన రాజతరంగిణిలో అడుగడుగునా తెలుస్తూంటుంది.
కల్హణ రాజతరంగిణిని కల్హణుడు స్వచ్ఛందంగా రాశాడు. జోనరాజు రాజతరంగిణిని సుల్తాన్ జైనులాబిదీన్ కోరికను అనుసరించి రచించాడు. జోనరాజు మరణం తరువాత, జోనరాజు శిష్యుడు శ్రీవరుడు జైనులాబిదీన్ గురించి రాయడం తన బాధ్యత, తన కర్తవ్యం అన్న భావనతో రాజతరంగిణిని కొనసాగించాడు. కల్హణుడి రాజతరంగిణి కశ్మీరు ఆవిర్భావం నుంచి క్రీ.శ.1148 వరకు కశ్మీరు చరిత్రను ప్రదర్శిస్తుంది. జోనరాజు రాజతరంగిణి క్రీ.శ. 1148 నుండి క్రీ.శ. 1459 వరకూ కశ్మీరు చరిత్రను ప్రదర్శిస్తుంది. శ్రీవరుడి రాజతరంగిణి క్రీ.శ. 1459 నుండి క్రీ.శ. 1486 వరకు అంటే 27 ఏళ్ళ కశ్మీరు చరిత్రను మాత్రమే ప్రదర్శిస్తుంది. ఇది శ్రీవరుడి రాజతరంగిణిని కల్హణుడి రాజతరంగిణి, జోనరాజు రాజతరంగిణికి సంపూర్ణంగా భిన్నంగా నిలుపుతుంది.
కల్హణుడి భాష కానీ, భావం కానీ, రాజతరంగిణి కోసం విషయ సేకరణ కానీ అద్వితీయం. సంపూర్ణంగా స్వతంత్రం. నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా కల్హణుడు రాజతరంగిణి రచనను కొనసాగించాడు. జోనరాజుకు ఇంత స్వేచ్ఛ లేదు. అందుకని దాదాపుగా రెండు వందల ఏళ్ళ చరిత్రను నిర్మోహంగా, పైపైన రాజుల పేర్లు ప్రస్తావిస్తూ, ఏవో ఒకటి రెండు ప్రధానమైన విషయాలు చెప్తూ రచనను సాగించాడు. తాను అనుభవించిన అంశాలను విపులంగా వర్ణించాదు. జైనులాబిదీన్ పాలనను ఇంకా విపులంగా వర్ణించాడు. శ్రీవరుడు తన రాజతరంగిణికి ‘జైన రాజతరంగిణి’ అని నామకరణం చేయటంతోనే, అతని రాజతరంగిణి, కశ్మీరు చరిత్ర అనే కన్నా, ‘జైనులాబిదీన్’ జీవితచరిత్రగా తయారయింది. నిజానికి శ్రీవరుడు తన రాజతరంగిణిలో చూపవలసింది జైనులాబిదీన్ పాలనా కాలంలోని చివరి దశాబ్దం మాత్రమే. అయితే శ్రీవరుడు రాజుతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారం చేసుకుని రాజతరంగిణి రచనను – జైనులాబిదీన్‍తో తనకున్న అనుబంధం, జైనులాబిదీన్ గొప్పతనం వంటి విషయాలను ప్రత్యక్ష సాక్షిగా, ఒక చరిత్ర రచయితలా కాక జీవిత చరిత్ర రచయితలా ప్రదర్శించాడు. జోనరాజు రాజతరంగిణిని ఎక్కడ ఆపాడో, అక్కడ్ని నుంఛి కాక, అంతకు ముందు జరిగిన సంఘటనలనూ తన రాజతరంగిణిలో పొందుపరిచాడు.
జైనులాబిదీన్ జీవితానికి సంబంధించిన అనేక విశేషాలు, విషయాలు, అతని గొప్పతనం, ధీశాలిత్వం, దానగుణం, ధైర్యసాహసాలు ఇలా అనేక విషయాలను రాజతరంగిణిలో ప్రదర్శించాడు కానీ వాటిని కాలమానం ప్రకారం ప్రదర్శించలేదు. ఏ సంఘటన ఎప్పుడు జరిగింది, ముందేది? వెనుక ఏది అన్నట్టు కాకుండా, ఆధునిక చరిత్ర పరిశోధకులు వాంఛించే chronology ని కలగాపులగం చేసేశాడు శ్రీవరుడు. జైనులాబిదీన్ గురించి ఎన్ని గొప్ప విషయాలు చెప్పగలడో అన్నీ చెప్పేయాలని ప్రయత్నించాడు. అందుకనే పలువురు శ్రీవరుడి రాజతరంగిణినిని చరిత్రగా కాక, జీవితచరిత్రగా పరిగణించాలని వాదిస్తారు. అయితే, శ్రీవరుడి రాజతరంగిణి ప్రధానంగా శ్రీవరుడి కవిత్వ పటుత్వ సంపదను, ప్రతిభా పాటవాలను చూపిస్తుంది. ఒక అద్భుతమైన సృజనాత్మక కళాకారుడిగా, శ్రీవరుడు సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ, సంస్కృత భాషను ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా మలచాలని, సజీవంగా నిలపాలని ప్రయత్నించిన తీరు ఆశ్చర్యం కలిగించటమే కాదు, అద్భుతం అనిపిస్తుంది. ఒక భాష సజీవంగా నిలవటంలో సృజనాత్మక కవులు, రచయితలు పోషించాల్సిన క్రియాశీల పాత్రను భావితరాల ముందు ఆదర్శంగా నిలుపుతాడు శ్రీవరుడు.
అంతవరకు కశ్మీరంలో సంస్కృత కావ్యాలు సృజించినవారికీ, శ్రీవరుడికీ ప్రధానంగా ఒక తేడా ఉంది. శ్రీవరుడు సంస్కృతంలోనే కాదు, పర్శియన్, అరబిక్ భాషలలోనూ నిష్ణాతుడు. తాను రచించిన ‘కథా కౌతు కం’లో ‘ఇతి యవనశాస్త్ర పారంగత పండిత శ్రీవర విరచితే కథా కౌతుకే!’ అని చెప్పుకున్నాడు. యవనశాస్త్ర పారంగతుడన్నమాట శ్రీవరుడు!
‘కథా కౌతుకం’ అన్నది ముల్లా జామి రచించిన పర్షియన్ ప్రసిద్ధ గ్రంథం ‘యూసఫ్ – జులైఖా’కు సంస్కృత అనువాదం. ఈ అనువాదం పర్షియన్, సంస్కృత భాషలు బాగా తెలిసిన జైనులాబిదీన్ ప్రశంసలు పొందింది. ఈ పర్షియన్ భాష పదాలకు సరిపడ సంస్కృత పదాలను శ్రీవరుడు అవసరాన్ని బట్టి సృష్టించాడు. అదీ ఎంతో ప్రశంసనీయమైన విధంగా. ఒక భాష అభివృద్ధి చెందాలంటే ఆ భాషలో కొత్త కొత్త పదాలు మారుతున్న కాలానికి అనుగుణంగా పుడుతుండాలి. ఆ పదాలు ప్రజల నోళ్ళల్లో నానాలి. అప్పుడు ఆ భాష సజీవంగా కొనసాగుతుంది. పర్షియన్ భాష రాజ భాష అయి, సంస్కృత భాష ప్రాధాన్యం తగ్గుతున్న సమయంలో శ్రీవరుడు అటు పర్షియన్ పదాలు, ఇటు కశ్మీరీ భాషలోని పదాల భావాలను సంస్కృతీకరణ చేసి కొత్త కొత్త పదాలను సృష్టించాడు. సంస్కృత భాష ప్రభావాన్ని పెంచాడు.
ఉదాహరణకు, జైనులాబిదీన్ కాలంలో మందుగుళ్ళు, ఫిరంగుల తయారీ ఆరంభమయింది. ఈ పదాలు సంస్కృత భాషకు కొత్త. దాంతో వాటిని వర్ణించేందుకు శ్రీవరుడు పదాలు సృష్టించాల్సి వచ్చింది. మందుగుండు సామాగ్రి ఉంచే దాన్ని ‘యంత్ర భాండం’ అన్నాడు. ‘ధాతు మిశ్రమం’, ‘లోహ మిశ్రమం’ అంటే metal alloy అన్న పదానికి ‘తత్త ధాతుమయ’ అని వాడేడు. ఆధునిక కాలంలో ‘fuse’ అన్న పదం వాడతాం. దానికి సరైన తెలుగు పదం లేదు. ‘వృద్ధి గుణాయుక్త్యా’ అని వాడేడు శ్రీవరుడు – ‘fuse’ అన్న అర్థాన్నిచ్చేందుకు. ఫిరంగిలో మందుగుండు దట్టించి దాన్ని వెలిగిస్తే దానిలోని ‘ధాతువిభక్తి స్ఫారాత్’ – ‘మందుగుండు సామాగ్రి లేదా combustible material’ పేలుతుంది. అది పేలేందుకు ‘long fuse’ ను వాడేందుకు ఎంతో నైపుణ్యం కావాలి. ఆ long fuse ను ‘వృద్ధి గుణాయుక్త్యా’ అన్నాడు. ఈనాడు అందరికీ అర్థమవ్వాలన్న ఆతృతలో మాతృభాష పదాల కన్నా విదేశీ పదాలనే అధికంగా వాడటాన్ని సమర్థిస్తున్నాం. అందువల్ల భాషలో కొత్త పదాలు సృజించే అవకాశం లభించటం లేదు. దాంతో బాష కుంచించుకుపోతోంది. ఇందుకు భిన్నంగా ఆ కాలంలో సంస్కృత భాష ఉపయోగం నిత్య జీవితంలో కొనసాగేందుకు ఆనాటి సృజనాత్మక రచయితలు కొత్త కొత్త పదాలు సృష్టించారు. వారి రచనలు ప్రజాదరణ పొందటంతో పదాలు వాడుకలోకి వచ్చాయి. భాష ప్రాచుర్యం పెరిగింది. మరింత కాలం భాష సజీవంగా నిలిచే వీలు చిక్కింది.
శ్రీవరుడు తాను సంస్కృతానికి, ‘మౌసుల భాష’కూ ముడి పెట్టానని స్పష్టం చేశాడు. ‘మౌసుల భాష’ అంటే ‘ముస్లిం భాష’. ఉదాహరణకు ‘దూద్ – కాంద్’ అన్న పదం ఉంది. ‘దూద్’ అంటే పర్షియన్‍లో పొగ. ‘ధుంద్’ అంటే పొగమంచు. ‘కాంద’ అంటే కర్ర. ‘దూద్ కాంద్’ అంటే పొగ కర్ర. ఫిరంగిని వర్ణించేందుకు ఈ పదం వాడేడు శ్రీవరుడు. కొత్త సాంకేతిక అభివృద్ధి కొత్త పదాల సృష్టికి దారి తీస్తేనే భాష సజీవంగా నిలుస్తుంది.
పర్షియన్ కావ్యాలలో నాయిక వర్ణనలు సంస్కృత కావ్యాలలో నాయిక వర్ణనలకు భిన్నంగా ఉంటాయి. పదజాలాలు వేరు ఉంటాయి. వాటిని సంస్కృతంలోకి మలచటంలో అతి గొప్ప ప్రతిభను చూపాడు శ్రీవరుడు.
దుష్టమత్యద్భుతం తస్యాం ద్వయమాత్మ విరోధకృత్।
అహో ముఖ స్వరూపోద్ధం తమీచ కచ సంభవా॥
ఆమెలో అద్భుతంగా రెండు విభిన్నమైన భావాలు ద్యోతకమవుతాయి. ఆమె శరీరం రంగు ఉదయపు వెలుగు అయితే, ఆమె కురులు రాత్రి చీకటిని ప్రతిబింబిస్తాయి. ఇదే వర్ణన కొనసాగిస్తూ శంఖంలాంటి ఆమె మెడకు నక్షత్రాల గొలుసు, చంద్రవదనకు సేవ చేసేందుకు నక్షత్రాలు వచ్చినట్టుంది అంటాడు. ఇవన్నీ పర్షియన్ కవుల వర్ణనలు. కురుల నీడలలో జీవితం గడపటం, కురులను రాత్రి చీకటితో పోల్చటం, శరీరం రంగు ఉదయపు కాంతి అనటం ఇలాంటి వర్ణనలు పర్షియన్ కవులకు ప్రత్యేకం. వాటిని సంస్కృతం లోకి అనువదించటం ద్వారా శ్రీవరుడు జైనులాబిదీన్ ఆశించినట్టు రెండు సంస్కృతుల నడుమ సమర్థవంతంగా వారధిని నిర్మించే పని చేశాడు.
పర్షియన్, సంస్కృత ఆత్మలను అనుసంధానం చేస్తూ తాను అనువదించిన కావ్య ఉద్దేశాన్ని ఆత్మను అత్యద్భుతమైన రీతిలో ఆవిష్కరించాడు.
నాస్తి లోకోపరం కించిచ్చానురాగం వినాపరమ్।
తత ప్రర హి వైరాగ్యం జాయతే సుఖదం పునః॥
‘వైరాగ్యంలో అనురాగం, యోగంలో భోగం’ అన్నది ఈ కావ్య ప్రధానోద్దేశం అన్నాడు శ్రీవరుడు. అసాధారణమైన దానిలో సత్యాన్ని దర్శించటమనే పర్షియన్ లక్షణాన్ని భారతీయ తత్త్వంతో జతపరిచాడు శ్రీవరుడు.
పర్షియన్ కావ్యాలను సంస్కృతంలోకి, సంస్కృత కావ్యాలను పర్షియన్ భాషలోకి అనువదింప చేయటం జైనులాబిదీన్ చేపట్టిన గొప్ప కార్యం. దీని వల్ల ప్రజల నడుమ అవగాహన ఏర్పడింది. ఈ కాలంలోనే భట్టాహ్లాదకుడు ‘దిలారామా – కథాసార’ అనే కావ్యం రచించాడు. ఇది అప్పటి ముస్లిం సమాజంలో చలామణిలో వున్న ప్రసిద్ధ నర్తకి ‘దిలారామా’ కత. ఈ కాలంలోనే అనేక సంస్కృత కావ్యాలను పర్షియన్ కవులు తమ భాషలోకి అనువదించారు. అయితే వీరు మాత్రం భారతీయ దైవాల ప్రాశస్త్యం, రాజుల గొప్పతనం వంటి విషయాలను వీలయినత వరకూ విస్మరించి, లేకపోతే మొక్కుబడిగా చూపించి వదిలివేశారు. ఇందుకు భిన్నంగా పర్షియన్ కావ్యాలను సంస్కృతంలోకి అనువదించిన కవులు పర్షియన్ భాషలోని వర్ణనలకు కొన్ని సంస్కృత అతిశయోక్తులు జోడించి మరీ వారి గొప్పతనాన్ని ప్రదర్శించారు. ఇక్కడే రెండు సంస్కృతుల నడుమ మానసికంగా ఉన్న భేదం స్పష్టమవుతుంది.
భారతీయులు ఎదుటివాడిలో గొప్పతనాన్ని చూసి అభినందించి, ఆనందించే సహృదయులు. ఇతరులు ఎదుటివాడి గొప్పను సహించలేరు. వీలయితే వాడి గొప్పను విస్మరిస్తారు. అవకాశం ఉంటే దాన్ని దిగజారుస్తారు. శ్రీవరుడు పలు సందర్భాలలో జైనులాబిదీన్‍ను ఆరాధిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే, శ్రీవరుడు జైనులాబిదీన్‍కు అత్యంత సన్నిహితుడు కావటంతో తన పాలనా కాలంలో జరిగిన ప్రతి ప్రధాన సంఘటన సందర్భంలో శ్రీవరుడు కవితాగానం చేయాల్సి వచ్చేది. ఆ బాధ్యతను శ్రీవరుడు సమర్థవంతంగా నిర్వహించాడు. ఫిరంగి (Cannon) ని ఆవిష్కరించే సందర్భంలో సుల్తాన్ కోరికను అనుసరించి రచించిన ప్రశస్తి కావ్యాన్ని అలాగే రాజతరంగిణిలో చేర్చాడు శ్రీవరుడు.
ప్రశస్తి క్రియాతామ్ యంత్ర భాండేస్య ఇతి నృపాజ్ఞయా।
మయైవ రచితాన్ శ్లోకాన్ ప్రసంగాత్ కథయామ్యహం॥
యంత్ర భాండం గురించి ప్రశస్తి కావ్యం సుల్తాన్ ఆజ్ఞానుసారం రచించాను. దాన్ని ఇప్పుడు వినిపిస్తాను.
ఇక్కడ యంత్రావిష్కరణ, ఆ సందర్భంలో కావ్యగానం వంటి భారతీయ పద్ధతులను సుల్తాన్ అనుసరించటం, ఆ సమయంలో సంస్కృత కావ్యగానం వంటివి ఆ కాలంలో ఏ రకంగా రెండు సంస్కృతులు సామరస్య భావనతో కలిసి ఉండే ప్రయత్నాలు చేశాయో తెలుపుతుంది. దీనికి సుల్తాన్ జైనులాబిదీన్ ప్రేరణగా పనిచేయటం తెలుస్తుంది.
మరో సందర్భంలో సుల్తాన్ చివరిదశలో ఆయన అనుభవించిన కష్టాలు, కొడుకు తిరుగుబాటు, తద్వారా సంభవించిన ఘర్షణ, యుద్ధం వంటి సందర్భాలు వర్ణిస్తూ, ఆ సందర్భంలో సుల్తాన్ తన కొడుకుకు రాసిన లేఖను శ్రీవరుడు అత్యద్భుతమైన రీతిలో వర్ణించాడు. ఆ లేఖ చదువుతుంటే జైనులాబిదీన్ సుల్తాన్‍గా, తండ్రిగా ఎంత ఉన్నతుడో తెలుస్తుంది.
‘నేను సమాధిలో ఒక కాలు పెట్టి ఉన్నాను. నన్ను ఈ కష్టం నుంచి రక్షించగలిగేది నువ్aవే. నా ఉత్తరం చదవగానే, పడుకుని ఉంటే లేచి కూచో, కూర్చుని ఉంటే లేని నిలుచో. నిలుచుని ఉంటే పరిగెత్తి రా. నేను ప్రాణాలతో ఉన్నప్పుడే నువ్వు రావాలి. అప్పుడే ఏదైనా సాధించగలవు. కానీ ప్రపంచం వదిలిన తరువాత నువ్వు వచ్చి లాభం ఏమిటి?’ ఇలా సాగుతుంది ఆ ఉత్తరం. చివరి దశలో సుల్తాన్ ఎంత దుర్భరమైన వేదనను అనుభవించాడో, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నాడో శ్రీవరుడు కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు.
పర్షియన్ వర్ణనలను ‘రాజతరంగిణి’లో స్వతంత్ర కావ్యమైనా శ్రీవరుడు అక్కడక్కడా వాడడం కనిపిస్తుంది. ఈ వర్ణనలకు కావ్యశైలి వర్ణణలను జతపరచటం వల్ల ఒక కొత్త కావ్య రచనా పద్ధతికి శ్రీవరుడు శ్రీకారం చుట్టాడు. ‘దాల్ సరస్సు’ వర్ణన సందర్భంలో ఈ సమ్మిశ్రమ వర్ణన శైలి ప్రస్ఫుటమౌతుంది.
‘సరస్సు నిర్మలమైన నీటిలో తీరంలోని పక్షులు మొక్కల్లా, పర్వతాలు తాబేళ్ళులా, హర్మ్యాలు నీటిలోని నాగుల నగరాల్లా కనిపిస్తున్నాయి. నీటి పై తేలే పచ్చటి వరిపంట దృశ్యాలను చూస్తూ ప్రజలు మైమరిచిపోతున్నారు. దాల్ సరస్సు నీటిలోని తామరపూల పరిమళాలను ఆఘ్రాణించేందుకు వారు ఆత్రపడుతున్నారు.’
ఇలాంటి పరమ రమణీయమైన వర్ణనలతో శ్రీవరుడు జైన రాజతరంగిణిని రచించాడు. శ్రీవరుడికి ప్రాచీన కావ్యాలపై పట్టుందని అతని వర్ణనలు నిరూపిస్తాయి. పర్షియన్ భాషపై పట్టు అనువాదాలలో ప్రయోగించిన పదాలు నిరూపిస్తాయి. సంస్కృత భాషలో నిష్ణాతుడని అతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్కృతీకరణ చేస్తూ సృజించిన పదాలు ప్రదర్శిస్తాయి.
(ఇంకా ఉంది)