కాజాల్లాంటి బాజాలు-71: ఒక్కపూట…

5
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]హై[/dropcap]ద్రాబాదులో అదొక గృహ సముదాయం. అన్నింటిలాగానే ఆ సముదాయ నిర్వహణకి కూడా అందరినీ ఏకతాటిమీద నడిపిస్తున్న ఒక కమిటీ, దానికో ప్రెసిడెంటూ, సెక్రటరీ, కార్యవర్గం అందరూ వున్నారు. క్రిందటి నెల జనరల్ బాడీ మీటింగ్‌లో మెంబర్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చేరు. అదేమిటంటే ప్రస్తుతం దేశం వున్న పరిస్థితులలో ప్రతివారూ తమ బాధ్యతగా పొదుపు చెయ్యాలీ అని. ఆ పొదుపు అన్నది యెలా చెయ్యాలనే విషయం మీద అనేక తర్జన భర్జనలయ్యేక, వారంలో ఒక పూట అంటే ఆదివారం సాయంత్రం యిళ్ళలో వంట చెయ్యకూడదూ అనే నిర్ణయానికి వచ్చేరు. దానివల్ల గాస్ ఆదా అవడంతోపాటు, సరుకులూ, సమయం, శ్రమా అన్నీ కలిసొస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయానికి మగవాళ్లందరూ నలుగురిలో వేరేగా మాట్లాడడం యెందుకని సరే నన్నారు. ఆడవాళ్ళందరూ ఒక్క పూటైనా తమకి వంటింటినుంచి శెలవు లభిస్తుందని ఆనందపడిపోయేరు.

ఆ తర్వాతి ఆదివారం సాయంత్రం ఒక్కొక్క ఫ్లాట్ నుంచీ ఒక్కొక్క రకమైన డవిలాగులు వినిపించేయి.

ఫ్లాట్ నంబర్ 101 నుంచి మగగొంతు – “ఆకలేస్తోంది.. వడ్డించెయ్..”

ఆడగొంతు – “ఈ పూట ఉపవాస మనుకున్నాం కదా! ఏవీ వండలేదు..”

మగగొంతు – “ఏదో మాటవరసకంటే నిజంగానే అన్నం వండలేదా! పోనీ ఇప్పుడు చెయ్యి..”

ఆడగొంతు – “ఊహు..కుకర్ విజిల్ అందరికీ వినిపిస్తుంది.”

మగగొంతు – “హతోస్మి… మరెలా!’

ఆడగొంతు – (కిసుక్కు)

ఫ్లాట్ నంబర్ 110 – మగగొంతు – “ఆకలేస్తోంది.. అక్కడేదో నలుగురిలో బుర్రూపేసేను.. అన్నం కాపోతే కాస్త టిఫినైనా చెయ్యి..”

ఆడగొంతు – “ఉప్మా పోపేస్తే వాసన అందరికీ తెల్సిపోతుంది కదండీ..”

మగగొంతు – “అన్ని వేలెట్టి చిమ్నీ పెట్టించేనుగా కిచెన్‌లో.. ఏ వాసనా రాదు.. కాస్త కలియపెట్టై తొందరగా..”

ఆడగొంతు – “ఊహు..ఇప్పుడు ఎదుటి ఫ్లాట్ సునీత వస్తానంది చీర డిజైన్ చూడ్డానికి. తను చూస్తే ఇంక బి బి సి నే..”

మగగొంతు – “ఖర్మరా బాబూ..”

ఆడగొంతు – (కిసుక్కు)

ఫ్లాట్ నంబర్ – 204 – మగగొంతు – “అలా ఓ పూట వండకూడదూ అనుకున్నప్పుడు రాత్రికి కూడా పొద్దున్నే యేదైనా చేసెయ్యొచ్చుగా..”

ఆడగొంతు – “అలా చేస్తే అది ఉపవాసమెందుకవుతుందండీ!”

మగగొంతు – “అబ్బ.. అపర హర్రిశ్చంద్రమణివి.. కడుపులో కాల్తోంది.. ఇప్పుడేం చెయ్యమంటావ్.. బైటకిపోయి తిందామంటే వెధవది రోజులుకూడా బాగులేవు.”

ఆడగొంతు – (కిసుక్కు)

ఫ్లాట్  నంబర్ -103 – మగగొంతు – “ఏం.. ఆమాత్రం నాకు చేతకాదనుకున్నావా! నేను పోపేసి పులిహార కలిపేనంటే పక్కూరివాళ్ళు పరిగెత్తుకొస్తారు. హూ.. ఇప్పుడే చేసేస్తా. ఏవనుకున్నావో.. హూ..”

ఆడగొంతు – “చెయ్యండి…చెయ్యండి.. ఆ పోపు ఘాటుకి కాంప్లెక్స్‌లో వాళ్లంతా పరిగెట్టుకొస్తారు..”

మగగొంతు.. “ఛీ.. వెధవ జీవితం..”

ఆడగొంతు – (కిసుక్కు)

ఫ్లాట్ నంబర్ 302 లో ఫోన్ మోగింది.. అది ఫ్లాట్ నంబర్ 201 నుంచి వచ్చిన ఫోన్..

201 – “ఏంటి వదినా.. మీ అన్నయ్య మరీ యింత గొడవ పెట్టేస్తున్నాడూ! ఒక్కపూట ఉపవాసం ఉండలేరూ!”

302 – “ సర్లే మీ అన్నయ్య మాటేం చెప్పమంటావ్..చంటిపిల్లాడిలా అలిగికూర్చున్నా డనుకో..”

201– “హూ.. ఏవిటో.. ఈ వంకనైనా ఒకపూట వంటింటికీ. నాకూ శెలవు దొరుకుతుందనుకున్నాను.”

302 – “ఆ రోజుల్లో కె. రామలక్ష్మిగారు ఈ మాటే చెప్పేరు.. వంటింటికి తాళమేసేసి తాళంచెవి పడేసుకుంటేనే ఆ యింటి ఆడదానికి ఆ తాళంచెవి దొరికేవరకూ శెలవుట..”

201– “ఆ.. అది మటుకు యెక్కడ కుదుర్తుందిలే.. నా మొగుడులాంటివాడైతే తాళంచెవి వెదకడు.. తాళం పగలకొట్టేస్తాడు..”

ఫక్కుమంది 302 ఫ్లాట్ లోని ఆడగొంతు.

ఒక్క పూట ఉపవాసానికి యింత శోషొచ్చి పడిపోయే మగవాళ్ళుంటారో లేదో నాకు తెలీదు కానీ ఒక్కపూటైనా వంటింటి నుంచి శెలవు దొరికితే బాగుండుననుకునే ఆడవాళ్ళుంటారని మటుకు ఘంటాపథంగా చెప్పగలను. ఔనంటారా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here