[dropcap]“ఒ[/dropcap]రేయ్ శేఖరం, మన ఊర్లో అందరూ ఏదో ఒకటి చేసేసి గుర్తింపు తెచ్చేసుకుంటున్నారూ, ఫేమస్ అయిపోతున్నారు. వాళ్ళని అలా చూస్తుంటే, నేనూ వాళ్లలానే ఓ ప్రయత్నం చేసేసి, ఓ మోస్తరు గుర్తింపైనా తెచ్చేసుకోవాలని తెగ ఉబలాటంగా ఉంది నాకు. పోయిన వారం పాపన్న పల్లిలో, రోడ్డుమీద దోసకాయలా దొర్లుతూ రెండు కిలోమీటర్ల వెళ్లాడని మన అప్పారావ్‌కి విన్నిస్ రికార్డు వచ్చింది. కాకా, బాకా అనే సంస్థ వారు, వాడిని సన్మానించారు కూడా. వాడిని టీవీలో కూడా చూపించారు. మొన్నటికి మొన్న, ఎక్కువ కుంకుడు రసంతో ఓ పూటంతా తల స్నానం చేసి రికార్డు సాధించాడు ఒకడు. మన రవణారావ్ అయితే, చెత్త కుప్పలమీద కుప్పలుగా పడున్న రకరకాల రంగు సోడా కప్పులు ఏరుకు సంపాదించి, విన్నిస్ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు. అలానే ఏకధాటిగా ఆరు రోజులు అష్టాచమ్మా ఆడిన ఆముదం బాబుని జింకా ప్రపంచ రికార్డు వరిoచింది. ఒంటికాలితో ఒకటిన్నర కిలోమీటర్లు తొక్కుడు బిళ్ళ ఆట ఆడి కోలా రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు సూరిబాబు. కనుక నేను కూడా అలాంటిదేదైనా సరే చేసి, హఠాత్తుగా గొప్ప పేరు సంపాదించుకోవాలి” చెప్పాడు గిరి.
“ఎవరో ఏదో చేశారని నువ్వూ అదే చేయడం ఎందుకూ. గుర్తింపు మాట దేవుడెరుగు, తేడా పాడా వస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెత అయిపోద్ది. అలాగే ఆ రికార్డులు సాధించడం కూడా అంత సులువు అనుకోకు. అలా రికార్డులు సాధించే క్రమంలో కూడా ప్రమాదాలు ఉంటాయి మరి” చెప్పాడు శేఖరం.
“అది ఎలాగా” ఆశ్చర్యపడ్డాడు గిరి ఆవదం మొహంతో.
“మన పక్క ఊరి పరుశురామ్ గారు, ఒక రోజంతా సముద్రంలో తేలిపోతూ కూర్చుని విన్నిస్ రికార్డు కోసం ప్రయత్నించారు. కానీ ఆరోజు రాత్రి అనుకోకుండా నిద్రలోకి జారుకున్నారు.”
“విన్నిస్ రికార్డు ఎక్కలేదా మరి.”
“లేదు, పాడేక్కాడు.”
“అలాగే మన మనోహరం కూడా, రికార్డు కోసం వాళ్ల మేడ మీద నుంచి వేరే మేడ మీదకు గెంతి రికార్డు సాధిద్దాం అనుకున్నాడు. కానీ ఆఖరులో అతని ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో అతను చెట్టునుండి జారిపడ్డ పండులా దబ్బుమని కింద పడ్డాడు.”
“ఏం సరిగ్గా గెంతలేకపోయాడా.”
“కాదు, ఎవరో అమ్మాయిని ఇంకో మేడ మీద చూసి, ఈ మేడ మీదకి బదులు, కక్కుర్తితో ఆ వేరే మేడ మీదకి గెంతాడు. దాంతో ఇపుడు హాస్పిటల్లో ఉన్నాడు. అయినా ఇలా అనుకుంటున్నావు కానీ, అది ఖర్చుతో కూడుకున్న పని. విన్నిస్ వాళ్ళు ఇక్కడికి రావడానికి, ఆరు లక్షల రూపాయలు నీ దగ్గరనుంచి తీసుకుంటారట. పైగా వారికి వసతి సౌకర్యాల కల్పన కూడా మనదే. ఆలోచించుకో మరి” హెచ్చరించాడు శేఖరం.
“వచ్చే గుర్తింపుతో పోల్చుకుంటే, పోయే సొమ్ము ఒక లెక్కా! కనుక ఆ డబ్బులు ఇచ్చేసి రికార్డు సాధించేసి ఒకసారే సడన్‌గా వీర ఫేమస్ అయిపోతాను.”
“సరే గిరి, నీ ఆనందం నీది. కానీ ఆలోచించుకో, ఎదిగిన ఆడపిల్ల ఉంది, నీది ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం. అది కాక నీకు ఉన్నది ఒక ఎకరం పొలం” అని ఓ క్షణం బుర్ర గోక్కుని, “ఇంతకీ ఎందులో విన్నిస్ రికార్డు సాధించాలని ఆలోచిస్తున్నావ్.”
“అదే నాకూ అర్ధం కావడం లేదు” చెప్పాడు అయోమయంగా చూస్తూ.
“పోనీ ఓ పని చెయ్, ఒకేసారి ఎక్కువ మందిని ఒకే చోట పోగేసి ముట్టుకునే ఆట ఆడించు లేదా ఎక్కువ సేపు మన ఊరి చెరువులో స్నానం చేసేయ్. అదీ కాదంటే ఓ వారం రోజుల పాటు తాటి ముంజులు తినేసి బ్రతికేయి. ఇలా ఏదో ఒకటి చేస్తే చాలు, ఏదోక సంస్థ నీకో రికార్డు ప్రకటిస్తుంది. దాంతో నువ్వూ రికార్డు సాధించానని గర్వంగా చెప్పుకు తిరుగుదువు గాని” చెప్పాడు శేఖరం వ్యంగ్యంగా.
ఆ మాటలకి గిరి మురిసిపోతూ, “బాగున్నాయిరా నీ ఆలోచనలు. అయితే నా పొలం బేరం పెట్టేయ్. ఆలస్యం. చేయకు” చెప్పాడు ఉత్సాహంగా. త్వరలోనే గిరి విన్నిస్ బుక్‌లో ఎక్కబోతున్నాడని గ్రామంలో అందరూ అనుకోసాగారు. ఆ వార్త, జిల్లా పేపర్లో కూడా వచ్చింది. అనుకోకుండా ఈ మధ్యలో గిరి జ్వరం పడ్డాడు. అతన్ని చూడ్డానికి ఎవరూ రాలేదు. కూతురే కాలేజీ సెలవు పెట్టి అతన్ని జాగ్రత్తగా చూసింది. అప్పు చేసి మందులూ అవీ కొంది. అతని స్నేహితులూ,తెలిసిన వాళ్ళు కనీసం పలకరింపుకు కూడా రాలేదు. గిరికి కోపం వచ్చింది. “నేను త్వరలో విన్నిస్ బుక్‌లో చేరి మన గ్రామానికి గొప్ప పేరు తీసుకురాబోతున్నాను. అలాంటిది, నన్ను ఎవరు పట్టించుకోలేదేంటి” అడిగాడు కూతురిని.
“ఎందుకు వస్తారు నాన్న! ఇలాంటివి ఎవరికి ఉపయోగం చెప్పు. నీ అంతట నువ్వు చెబితే గాని ఎవరికీ తెలియదు కూడా. ఇలా అనుకునే బోలెడుమంది ఈ నకిలీ గుర్తింపు వెనుక పరుగెత్తి, గొప్ప కోసం డబ్బు, సమయం నష్టపోతున్నారు. నువ్వు కూడా ఊరూ, పేరూ లేని యూనివర్సిటీ నుండి డబ్బిచ్చి డాక్టరేట్ కొనుక్కున్నావు. గొప్పగా పేరుకి ముందు తగిలించుకుని మురిసిపోతున్నావ్.ఈ సంవత్సరం మొదట్లో డబ్బులు ఇచ్చి సన్మానాలు కూడా చేయించుకున్నావు. ఏం లాభం? కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాలి, డబ్బు పోసి కాదు. ఇవి నీటి బుడగలు. నీలానే ఈ మాయలో చాలా మంది పడి కొట్టుకుపోతున్నారు” చెప్పిందామె.
కూతురు మాటలతో ఆ విన్నిస్ రికార్డు ఆలోచన విరమించుకుని తన పని తను చూసుకుంటూ., ఆ ఊరి రామాలయంలో వారానికోమారు అన్నదానం చేయడం ప్రారంభించాడు. తర్వాత అతనికి ఆ ఊరిలో అన్నదాతగా మంచి పేరూ,గుర్తింపూ రావడంతో పాటు, టి.వి.లో కూడా కనిపించాడు. అప్పుడు “గ్లామర్ ముఖ్యం కాదు, జీవితాన్ని దిద్దుకునే గ్రామర్ నేర్చుకోవాలి” అనుకున్నాడు మనసులో. ఆ కార్యక్రమాలు అలానే నిస్వార్థంగా చేస్తుండడంతో, కొద్ది సంవత్సరాలలోనే, ఆ గ్రామంలో ఆకలి గొన్న వారి ఆకలి తీరుస్తున్న వ్యక్తిగా అతని పేరు జింకా రికార్డుల్లోకి ఎక్కింది మరి.