దివ్యాంగ ధీరులు 9 – సాయం, సహకారం చేస్తూ జీవిస్తున్న గైడింగ్ లైట్ అధ్యక్షుడు భవానీశంకర్

1
3

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. భవానీశంకర్ తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. [/box]

[dropcap]మి[/dropcap]ట్టమధ్యాహ్నపు వేళ అది. ఎండాకాలం రాకున్నా ఎండ భగ్గుమంటోంది. ఆ వేళలో పది సంవత్సరాల అబ్బాయి దివ్యాంగుల వసతి గృహం గేట్ దాటి ఒంటరిగా బయటకి వచ్చాడు.. చూపులేదు. చేతుల్లో స్టిక్ మాత్రం వుంది. దాని సాయంతో తడుముకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు.

ప్రపంచంలో ఎన్నో అందాలు, అర్థం కాని విషయాలు వున్నాయి. అవన్నీ తెలుసుకోవాలన్నదే అతని ఆరాటం. ఎటు వెళ్ళాలి అన్నది కాదు విషయం, అన్ని వైపులకీ వెళ్ళి అన్ని దారులు తెలుసుకోవాలన్నదే అతగాడి తాపత్రయం. ఒక్కళ్ళూ ఎక్కడికీ వెళ్ళడానికి ఇష్టపడరు చూడలేనివారు. ఎవరితోనైనా వెళ్లినా భయమే. ఎక్కడికి నడిపిస్తాడో ఎక్కడ పడేస్తాడో అని. అన్నీ మర్చిపోయి పరిగెత్తడం, అన్నింటికీ భయపడి ఆగిపోడం రెండూ మన చేతుల్లోనే వున్నాయి అన్నది దివ్యాంగులకే కాదు సర్వాంగులకీ అర్థం కాదు. ఎప్పుడూ పక్కవారిమీద ఆధారపడుతూ వుంటారు.. భవానీశంకర్‌కి సాగడమే తప్ప ఆగడం తెలీదు.

“ఏయ్ అబ్బాయ్? ఏంటి రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుస్తున్నావు? ఏ వాహనం అయినా గుద్దేస్తే చస్తావు. అసలే నీకు కళ్ళు కనబడవులా వుంది. వొక్కడివి బయటకి రాకూడదని తెలీదా? నేను సడన్ బ్రేక్ వేసాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బండి కిందే పడేవాడివి” అన్నాడు వాహనదారుడు.

“సారీ అండీ” అనేసి ముందుకు సాగిన కుర్రాడిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు వాహనదారుడు.

ఎటేటో నడిచాడు. నడిచిన దారులన్నీ గుర్తు పెట్టుకుంటుండగానే టక్కున జారీ కిందపడ్డాడు. అతను కింద పడడానికి అరటిపండు తొక్క కారణం. దివ్యాంగులు, వయోధికులు, పిల్లలు,గర్భిణులు తిరిగే రోడ్డు మీద పండ్లతొక్కలు వేయకూడదన్న ఇంగితం ఈ మనుషులకు ఎప్పుడు తెలుస్తుందో. భవానీశంకర్‌కి బాగానే దెబ్బలు తగిలాయి. ఓ పక్కన కాస్సేపు కూర్చుని గుర్తుపెట్టుకున్న దిశగా హాస్టల్‌కి తిరిగి వచ్చాడు కానీ ఎవ్వరికీ తాను పడినట్టు చెప్పలేదు. చెప్తే అసలే భయస్థులైన ఫ్రెండ్స్ ఇంక అస్సలు నడవరు.. హాస్టల్లో వార్డెన్ చివాట్లు తప్పవు.

భవానీశంకర్ తల్లితండులు డబ్బు వున్నవారే. తండ్రి ప్రసాదరావు ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. తల్లి పేరు పార్వతి. భార్య పోయాక ఆమెని చేసుకున్నారు. భవానీశంకర్ తల్లి ఆయనకి రెండవ భార్య. ఆమెకి పుట్టినవాళ్ళు ఇద్దరు. తల్లితండ్రులిద్దరికీ 15 ఏళ్ళ తేడా వుంది. ఆయనకీ ఇల్లు పిల్లలు పట్టరు. బేగంబజార్ క్లబ్, హార్స్ రేసులలో తిరుగుతూ డబ్బును వృథా చేశారు.

నాలుగేళ్ల వయసులో విరోచనాలు వాంతులు అయ్యి శక్తి పోయిన పిల్లాడి సంగతి తండ్రి పట్టించుకోలేదు. తల్లిది మిడిమిడి జ్ఞానం, చాకలిపద్దు రాసే చదువు. అందుకే చూపు అకారణంగా మెల్ల మెల్లగా కోల్పోయాడు భవానీశంకర్.

పిల్లలతో గోళీలాడేటప్పుడు గోళీలు తడమడం వల్ల పిల్లలకి సంగతి తెలిసి అతని తల్లికి చెప్పారు. చెప్పిన వెంటనే కూడా చూపించలేదు. డా.శివారెడ్డికి చాలా ఆలస్యంగా చూపించారు. ఆపరేషన్ అవసరమన్నా అక్కడా ఆలస్యం జరిగిపోయింది. అందుకే అన్నారు ఆలస్యం అమృతం విషం అని. భవానీశంకర్‌కి కన్ను పోయింది. పక్క కన్ను కూడా మెల్లి మెల్లిగాపోయింది. కన్నుకి పూవు పూసినట్టు అయ్యి అలా జరిగింది. గ్లూకోమా వస్తే ప్రథమ స్థాయిలో దాన్ని తగ్గించవచ్చు. ఆపరేషన్ ద్వారా పూర్తిగా పోగొట్టవచ్చూ. కానీ తల్లితండ్రులు నిర్లక్ష్యం చేసినా అజ్ఞానం వల్ల ఆశ్రధ్ధ చేసినా అది అంధత్వానికి దారి తీస్తుంది అనడానికి భవానీశంకర్ ఉదాహరణ. తర్వాత ఆపరేషన్ చేయించారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. చూపు శాశ్వతంగా పోయింది.

తండ్రి అజ్ఞానం వల్ల ఆస్తులు కరిగిపోయాయి. ఆయన దురలవాటైన తాగుడే ఆయన ఆస్తిని హరించింది. తాగించి సంతకాలు పెట్టించుకున్నారు. తర్వాత ప్రసాదరావుకు పక్షవాతం వచ్చింది. తల్లి పార్వతి చిన్న చిన్న పనులు కార్ఖానాల్లో చేసి ఇల్లు నడపడం జరిగేది. ఎముకల పోగులా ‘వుఫ్’ అంటే ఎగిరిపోయేలా ఉండేవాడు భవానీశంకర్. అతని ఇంటిపక్కవాళ్ళు “దారుషఫా అనే అంధ బాలుల హాస్టల్ వుంది చేర్చండి” అనడంతో అలా దారుషఫాలోకి వచ్చాడు భవాని.

ప్రతి శనివారం తల్లి పార్వతి అతన్ని ఇంటికి తీసుకువెళ్లి మళ్ళీ ఆదివారం సాయంత్రం హాస్టల్‌కి తీసుకురావడం జరుగుతుండగా భవాని ‘నేనొక్కడినే ఎందుకు వెళ్లి రాలేను?’ అని ఆలోచించసాగాడు. ‘తమ్ముడు తనకంటే చిన్నవాడైనా ఒక్కడే ఎప్పుడూ వెళ్తాడు. నేను మాత్రం అమ్మ మీద ఆధార పడాలి. కళ్ళు కనబడవు కనక కన్నతల్లి తోడు అవసరం అంటారు. బుర్ర చురుకుగా వుంది కాళ్ళు చకచకా సాగితే చాలు కదా’ అనుకున్నాడు. ఆ మాట తల్లికి చెప్పగానే భయంగా ఖండించింది. దాంతో ఒకసారి శుక్రవారం సాయంత్రమే తనంతట తానూ బయలుదేరి బస్సు ఎక్కి ఒంటరిగా ఇల్లు చేరాడు.

ఆ రోజు తల్లి ముందు భయపడింది. తర్వాత అతనెలా రాగలిగాడా అని ఆశ్చర్యపోయింది. ఆపైన “మా భవాని ఒంటరిగా వచ్చాడు తెలుసా?” అని గర్వంగా అందరికీ చెప్పుకుంది.

“అమ్మా ఒక్కడినే వెళ్లి రావడంలో గొప్పేమీ లేదు.. ఏమి గొప్ప పని చేశానని అందరికీ చెప్తున్నావు? ఈ సారెప్పుడూ చెప్పకు.” అన్నాడు తల్లితో.

ఏడవ తరగతికి వచ్చేసరికల్లా బాగా తెలివైన కుర్రాడిగా పేరు తెచ్చుకున్నాడు భవాని.

”నిన్ను మీ వాళ్ళు చదువులో ఆలస్యంగా చేర్చారు. కానీ నువ్వు తెలివైనవాడివి కనక ప్రైవేటుగా మెట్రిక్ కట్టి పాస్ అయిపోతే సరిపోతుంది” అని ఒక సార్ స్కూల్లో చెప్పడం భవాని మనసు మీద బాగా పని చేసింది. అయితే దానికి సంబంధించిన అంశాలను గురించి తెలుసుకోడానికి ఒంటరిగా ఎన్నో సార్లు ఎవరెవరినో దారి కనుక్కుంటూ వెళ్ళాడు భవానీశంకర్. కొన్నిచోట్లకి బస్ లలో ఇంకొన్నిచోట్లకి నడిచి వెళ్లి విషయం అవగాహన చేసుకుని మెట్రిక్ పరీక్షకి కూడా కట్టాడు.

ఈలోగా స్కూల్లో ఏ పోటీ పెట్టినా దాన్లో మొదటి స్థానం సంపాదించడం అతనికి అలవాటైపోయింది. అన్ని సబ్జెక్టులలోనూ మొదటి స్థానంలోనే ఉండడం అతనికి మామూలుగా మారింది. కుప్పలకొద్దీ చిన్న చిన్న బహుమతులు, టవల్స్, టిఫిన్ బాక్స్ ఇలా ఏవేవో అందుకుంటూ వున్న భవానితో “వెధవా ఇన్ని బహుమతులేమి చేసుకుంటావురా? చదువులోనూ, అల్లరిలోనూ నువ్వు ముందు వుండవలసిందేనా, ఇంకెవ్వరికీ ఛాన్స్ ఇవ్వవా?” అని ఒక సార్ అడిగారొకసారి.

నవ్వి ఊరుకున్నాడు భవానీశంకర్.

ఒకసారి క్లాస్ ఫస్ట్ భవానీశంకర్‌కి కాక ఇంకొకరికి వచ్చింది. దాంతో ఆతను ఆ రోజు భోజనం చెయ్యలేదు. చాలా దిగాలుగా వుండిపోయాడు. రాత్రయ్యేసరికి జ్వరం వచ్చింది. డాక్టర్ని హాస్టల్‌కి పిలిచి ఇంజక్షన్ ఇప్పించారు. అప్పుడు టీచర్ “నీకే ఫస్ట్ రాంక్ వచ్చింది రా భవానీ. కానీ మిగతా పిల్లలు మరీ వెనకబడి వుంటున్నారు కదా, వాళ్ళని ప్రోత్సహించాలని ఒకరికి రాంక్ పెంచాను” అని చెప్పింది. ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ విజయం తధ్యం, ఎక్కడ ప్రతిభ ఉంటుందో అక్కడ పురస్కారమూ ఉంటుంది. అలాగే నిత్యం కష్టపడే వ్యక్తిని దాటి ముందుకు వెళ్లడం కష్టం. అతగాడు తెలివైనవాడైతే అతగాడిని దాటి వెళ్లడం అసాధ్యం” అని కూడా పూర్తిచేసింది.

ఆ మాటలు మననం చేసుకుంటూ పడుకున్న భవానికి నిద్రపట్టింది.

ఒకసారి ఎప్పటిలా బహుమతులన్నీ గెల్చుకుని వెళ్తున్న భవానిని మిత్రుడడిగాడు. “నీ విజయ రహస్యం ఏంటిరా? నీ తెలివితేటలా? నార్మల్స్‌ని ఓడించాలన్న కసా?”

“కాదు. నా వైకల్యాన్ని ఓడించాలన్న కసి. ఎలా పుట్టినా ఎదగగలనన్న నమ్మకం. శ్రమిస్తే సాధించలేనిది లేదన్న ఆశావాదం” అన్నాడు పెద్దమనిషిలా.

చాలా సరదాగా ఉండే శ్రీపాల్రెడ్డి సర్‌తో భవానికి మంచి అనుభందం ఏర్పడింది. ఆయన పిల్లల్లో పిల్లాడిలా కలసిపోడమే అందుకు కారణం. ఆయనని అంతాక్షరి ఆటలో ఓడించినరోజు భవాని శంకర్ సంతోషానికి పట్టపగ్గాలు లేవు.

ఒకసారి ఆయన ఆఫీసులో కూర్చున్నప్పుడు ”లోపలి రావచ్చాండీ?” అని అడిగాడు.

“ఎవరు?” అని లోపలినుండి అడిగారు శ్రీపాల్రెడ్డి సర్.

“సార్వభౌముడు” అన్నాడు చిలిపిగా భవాని శంకర్.

“ఏ సామ్రాజ్యానికి సార్వభౌముడివిరా?” అని అడిగి ఒక దెబ్బ వేశారు సర్.

రోజూ తెల్లవారుజామున నాలుగు కొట్టకముందే లేచి చన్నీళ్ళ స్నానం చేసి అప్పుడు చదువుకోవడం అలవాటయ్యిందతనికి. అంత త్వరగా తెమలడానికి కారణం ఆలస్యంగా లేస్తే పెద్ద పిల్లలు లేచి తొక్కుకుంటూ పోవడమే. వాళ్లకి కనబడదు. వీళ్ళకి ఒళ్ళు హూనం కాక తప్పదు. రాత్రంతా దోమలు కుట్టేవి. ఉక్కపోతగా ఉండేది. అందుకే ఏదో వంకపెట్టి నెలలో సగం రోజులు ఇంట్లోనే ఉండడం, టీచర్లు మార్కులు చూసి గట్టిగా మందలించకపోవడం జరుగుతూ వచ్చింది.

ప్రతీ రోజూ వొక దారి కనుక్కుని రావడం, తరుచూ దెబ్బలు తగిలించుకోడం చాలా మామూలయ్యింది.

అంధులకు టేప్ రికార్డర్ ఉచితంగా ఇవ్వబోతున్నారని విన్నాడు. వెంటనే ఒక్కడూ ఒంగోలుకు వెళ్లి కలెక్టర్‌కి అప్లికేషన్ పెట్టాడు. నేటివిటీ సర్టిఫికెట్ కావాలని అంటే వేటపాలెం వెళ్లి అక్కడి తాసిల్దారిని కలిసి సర్టిఫికెట్ సంపాదించి అది కలెక్టర్‌కి అందజేశాడు. టేప్ రికార్డర్‌తో గర్వంగా తిరిగి వచ్చిన భవానిని అందరూ అదృష్టవంతుడన్నారు. అదృష్టం వేరు అనుకున్నది సాధించడానికి అత్యధికంగా శ్రమించడం వేరు. ఒంటరిగా చేతిలో పచ్చనోట్లు లేకుండా ఊరుకాని వూరికి మొండి ధైర్యంతో అందరినీ కనుక్కుంటూ వెళ్లడం ఎంత కష్టమో భవాని ఒక్కడికీ తెలుసు.

ఎక్కడికైనా దారి వెతుక్కుంటూ వెళ్లాలంటే బాగా రాత్రయ్యాకో లేక తెల్లవాఱుజాముకు వెళ్లాలని విని అదే చేస్తూ వచ్చిన భవానిని కుక్కలు తరమడం, అలాంటప్పుడు నిముషం ఆగి సాగడం అలవాటయ్యింది. ఒంగోలు ప్రయాణం గురించి విన్నవారికి చూసినవారికి సంభ్రమం కలిగింది. ప్రభుత్వ ఆఫీసులలో పనులు ఒక్కరోజులో అవ్వవు. తిరగాలి. రోజుల తరబడి పడిగాపులు కాయాలి. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గల గుడిసె హోటల్లో తిని హాజరవ్వడం, రోజంతా అలాగే పడిగాపులు పడడం జరిగాక టేప్ రికార్డర్ లభించింది.

ఎన్నో సార్లు ఒంగోలు వెళ్లి మొత్తానికి సాధించిన భవానీశంకర్ ఒకరోజు ఒంగోల్ వెళ్లి వస్తుండగా కారులో వెళ్తున్న ఒకాయన కార్ ఆపి “ఎటు వెళ్తున్నావు?” అని అడిగారు.

కలెక్టర్ ఆఫీసుకి అని జవ్వాబు చెప్పిన భవానికి లిఫ్ట్ ఇచ్చారు. దార్లో ఎన్నో సంగతులు మాట్లాడారు. “నువ్వు ఒక్కడివే వెళ్లగలిగితే మా అమ్మాయికి ఈ ప్యాకెట్ ఇస్తావా?” అని అడిగారు.

“తప్పకుండా ఇస్తాను” అన్నాడు భవాని.

మర్నాడు వనితా కాలేజ్ హాస్టల్‌కి వెళ్లి సుజాత అనే అమ్మాయికి ఆ ప్యాకెట్ ఇచ్చాడు. ఒక్కడూ ధైర్యంగా ఊరంతా తిరగగలుగుతున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది సుజాత. సుజాతకి భవానీశంకర్ మంచి మిత్రుడయ్యాడు. ‘నేను మెడిసిన్ చదివాక కంటివైద్య నిపుణురాలినవుతాను భవానీ.. ఉచితంగా ఎందరికో చూపు వచ్చేలా చేస్తాను’ అంది. కాలేజీ టాపర్‌గా మెడిసిన్ చదివి పోస్టు గ్రాడ్యుయేషన్ తర్వాత వాషింగ్టన్‌కి వెళ్తూ ప్లేన్ క్రాష్‌లో ప్రాణాలు కోల్పోయింది. ‘ఒక మంచి మిత్రురాలిని తాను, ఒక మంచి డాక్టర్ని తెలుగు రాష్ట్రం కోల్పోయింది’ అనుకున్నాడు బాధగా భవానీశంకర్.

భవానీశంకర్ అడుగడుగునా కష్టించాకే అనుకున్నది సాధిస్తూ వచ్చాడు. నార్మల్ పిల్లలకి కూడా ఉచితంగా గ్రామర్ నేర్పాడు. పేద పిల్లలకి ట్యూషన్ చెప్పి వాళ్ళు పాస్ అయ్యేలా చూసాడు. ఇంటర్‍లో సీట్ కోసం తిరగవలసి వచ్చింది. తిప్పి తిప్పి సీట్ ఇవ్వడం తప్పు అన్న భావన ఆఫీస్ వారికి ఉండక పోవడం బాధాకరం.. ఇంటర్‌లో చేరాక నార్మల్స్‌తో సమానంగా స్పీడ్‌గా బ్రెయిలీలో రాసేవాడు. వ్యాస వక్తృత్వాలలో నార్మల్స్‌ని ఓడించేవాడు.

నిజాం కాలేజీలో డిగ్రీ చేసాడు. హాస్టల్ నుండి కాలేజీకి పావుగంట నడక. ఆలస్యంగా వెళ్లడం ఇష్టం లేక ముందే బయలుదేరడం దాని వల్ల బ్రేక్‌ఫాస్ట్ మిస్ కావడం జరుగుతూ వచ్చింది. కాలేజీలో అన్ని బ్రాంచ్‌ల వాళ్ళు లెక్చరర్లూ కూడా భవానికి మిత్రులు కావడం అందరినీ సంభ్రమానికి గురిచేసిన అంశం. రామోజీరావుగారి అబ్బాయి సుమన్, తర్వాత ఐఏఎస్ చేసిన ఉమేష్ భవాని క్లాస్‌మేట్స్..  చూడలేని భావానికి అన్నిరకాల పత్రికలూ ఉమేష్ ఓపికగా చదివి వినిపించడం భవాని మరువలేని మహత్తర జ్ఞాపకం.

డిగ్రీ అయ్యాక ఉస్మానియాలో ఎమ్మే ఇంగ్లీష్‌లో చేరాడు. అక్కడ ప్రస్తత టీవీ 9 రవి ప్రకాష్ పరిచయం కావడం, మంచి మిత్రుడవ్వడం జరిగాయి. అక్కడ ఆతను బీసీజే, ఎంసిఏజే చేశారు. ఫైర్ బ్రాండ్ గానే కాదు ఆపద్బాంధవుడిగాను విశ్వవిద్యాలయంలో రవిప్రకాశ్‍కి పేరుంది. విశ్వవిద్యాలయంలో భవాని ఒంటరిగా వెళ్లడం, దివ్యాంగుల హక్కులకోసం పోరాడడం ఆకట్టుకుని అతన్ని అనుసరించడం మామూలుగా మారింది. 1992లో హాస్టల్లోని దివ్యాంగుల సంఖ్య తగ్గించడంతో ఉద్యమం ప్రారంభించాడు భవాని. నిరాహారదీక్షకి కూడా కూర్చున్నాడు. దివ్యాంగులెందరో అతన్ని అనుసరించారు. వారు సాధించిన విజయం దివ్యాంగులకయ్యింది వరం.

తర్వాత అటు టీటీసీ, ఇటు బీఈడీ కోర్సు చేసాడు. ప్రతీ చోటా పక్కవారికి సాయపడుతూనే వచ్చాడు. తరుచూ కిందపడి గాయాలపాలయ్యేవాడు, కానీ ఎప్పుడూ ఎక్కడా ఆగలేదు. ఆగాలని అసలు అనుకోలేదు.

టెలిఫోన్ ఆపరేటర్‌గా చేరి కొంతకాలం చేసి అనారోగ్య కారణంగా అది ఒదిలేసిన భవానీశంకర్‌కి పది ఆపరేషన్లు జరిగాయి. కళ్ళకి నాలుగు, కాలికి మూడు, చెవికి మూడు. పది సంవత్సరాలు చెవితో చాలా అవస్థ పడ్డాడు. ఒక డాక్టర్ “నీకు 95% చెవి భాగవచ్చు. కానీ అయిదు శాతం ఎముకలకు వున్న గ్యాప్ పోకపోవచ్చూ. దానివల్ల నీ సమస్య పరిష్కరింపబడక పోవచ్చూ” అనడం జరిగింది.

“అయ్యో అవునా” అన్నాడు కంగారుగా భవాని శంకర్. వినికిడి సమస్య వఛ్చి వినబడకపోవడం చాలా బాధాకరం అందరికీ. చూపు లేని వారికి అది ప్రాణాంతకం. చెవి కన్నులా ప్రత్యేక పాత్ర వహిస్తుంది. అలాంటి చెవికి వినికిడి శక్తి పొతే ఎంత బాధాకరం. ఆలోచనలో పడ్డాడు భవాని.

“ఒకాయన మాటలాడలేడు, వినలేడు అయినా బ్రతుకుతున్నాడు తెలుసా?” అన్నాడు డాక్టర్.

“అంటే నేనలా బ్రతకవలసి రావచ్చు అనేగా, సర్లెండి దీంతోనే ఇలాగే బ్రతుకుతాను” అన్నాడు నిరాశగా అత్యంత నెమ్మదిగా భవానీశంకర్.

వైద్యుల్ని కలిస్తే సగం బాధ పోతుంది. వారు ప్రోత్సాహకరంగా మాట్లాడితే ధైర్యం వొస్తుంది కానీ ఆవిధంగా మాట్లాడితే ఉన్న ధైర్యం పోతుంది. బ్యాంక్ ఉద్యోగస్తుడిగా మంచిపేరు తెచ్చుకోడమే కాక నార్మల్స్‌తో సమానంగా పనిచేయడంలో ముందుంటూ పేరు తెచ్చుకుంటున్నా చెవి బాధ అతన్ని వెంటాడుతూనే ఉండడం విచారకరమయ్యింది.

టీవీ 9 రవిప్రకాష్ విషయం తెలుసుకుని “నేను మంచి డాక్టర్తో నీకు వైద్యం చేయిస్తాను చూడు” అనడం, అపాయింట్‌మెంట్ తీసుకోడం వెంట వెంటనే జరిగిపోయాయి. కేర్ ఆసుపత్రిలో వున్న డా. విష్ణు స్వరూప్ “మీ చెవి ఎముకల కనెక్షన్ లూస్‌గా వుంది. అది సరిచేయాలి. ధైర్యంగావుండండి. మీ చెవి మీకు ఎంతో సేవచేస్తుంది. నేను వెంకయ్యనాయుడుగారి భార్యనుండి ఎందరో ప్రముఖులకు వైద్యం చేసాను. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఒక చెవి చేసి గ్యాప్‌లో రెండో చెవికి చేస్తాను” అన్నారు. అదే చేసి చెవులను పెర్ఫెక్ట్‌గా మార్చేసారు డాక్టర్. అది పునర్జన్మనిచ్చిన సంఘటనగా భావిస్తాడు భవానీశంకర్.

తర్వాత కెనరా బ్యాంక్‌లో ఉద్యోగానికి చేరాడు.

1992 ఆగస్టులో నార్మల్ అమ్మాయితో భవానీశంకర్‌కి పెళ్లయ్యింది. శివకిరణ్ అనే చక్కటి అబ్బాయి పుట్టాడు.

భవానీశంకర్ వాస్తు బ్రాహ్మానందంగా చెప్పగలడు. మంచి స్థలాలు వాస్తు ప్రకారం కొనిపించగలడు. అలా అతని సహఉద్యోగులూ ఇతర పెద్దలూ అతని సలహాతో స్థలాలూ ఇల్లూ కొనడం జరిగింది. అతనే ప్లాన్ వేసి ఇల్లు కొన్ని ఏళ్ళ తర్వాత కట్టించుకోడం కూడా అందరినీ ఆశ్చర్య పరచింది.

వాళ్ళ బాబు చిన్న పిల్లాడిగా వున్నప్పుడు అతన్ని నర్సరీలో చేర్చేందుకు తీసుకుని వెళ్తుండగా వొక మైనర్ బాలుడు చేతక్ మీద వెళ్తూ భవానీశంకర్‌ని గుద్దాడు. దాంతో భవానీ ఎగిరి పడ్డాడు. కాలికి ఫ్రాక్చర్ అయ్యింది.. రాడ్ సరిగ్గా సెట్ కాలేని పరిస్థితి ఏర్పడడంతో మళ్లీ ఆపరేషన్ చేశారు.

స్కూటర్ గుద్దిన అబ్బాయి తండ్రి వఛ్చి కాళ్ళు పట్టుకుని క్షమార్పణ అడిగాడు. “మీరు కేసు పెడితే మేమెళ్లాలనుకున్న షిర్డీ ప్రయాణం ఆగిపోతుంది. టికెట్స్ చాలా రోజుల క్రితం బుక్ చేసాము. దయవుంచి వదిలిపెట్టండి. రాగానే కలిసి కాంపెన్సేషన్ ఇస్తాను” అని బతిమాలి వెళ్ళాడు. వారం తర్వాత సీఐ, ఎసై లని బ్రైబ్ చేసాడో ఏమో కేసు ఏమీ జరగలేదు. చేతికి ఒక్క రూపాయి కూడా రాలేదు. దాంతో సంవత్సరంపాటు అష్టకష్టాలు పడ్డారు. ఎలా వున్నారో ఏమి తిన్నారో అసలెలా బ్రతికి వున్నారో అన్నట్టుగా రోజులు గడిచాయి. ఎరియర్లు, స్నేహితుల సాయాలతో ముద్ద నోట్లోకి వెళ్లగలిగింది. “హారన్ కొడితే మీరు పక్కకి జరగలేదట,. మీకు చెవికి కూడా ఏదో సమస్య ఉందిట” అంటూ వీగించిన కేసు అంధుడికి చేసిన అన్యాయానికి సాక్ష్యం అయ్యింది.

ఇల్లు (చూడలేనివాడికి) అద్దెకి ఇవ్వడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అందుకీ ఎవ్వరూ అద్దెకి ఇవ్వడానికి ముందుకు వచ్చేవారు కారు.. వచ్చినా ఏదో వంక పెట్టి ఖాళీ చేయించాలని చూసేవారు. అందువల్లే 1992 నుండి 2012 దాకా 27 ఇళ్లు మారారు. వెనక భార్య మైథిలి ఉండడం చూసి అద్దెకి ఇచ్చినవారున్నారు. లేకపోతే చూడలేని వ్యక్తికి ఇల్లు అద్దెకి ఇచ్చే ప్రసక్తే లేదన్నది వారి ఉద్దేశం.

ప్రతీవారూ మైథిలిని చూసి జాలి సానుభూతి కుమ్మరించడం నిత్యకృత్యం అనే చెప్పాలి. ‘పాపం ఆమె ఎంత కష్ట పడుతున్నారో మీ కోసం, ఎంత త్యాగం చేశారో..’ ఇలాంటి మాటలే ప్రతీవాళ్లూ మాట్లాడడం భవానీశంకర్‌కి బాధ కలిగించే విషయం. తనకి లోపం వున్నది నిజమే కాన్నీ దాన్ని అధిగమించి ఎన్నో రంగాల్లో తానూ ముందున్న విషయం ఎవ్వరూ గుర్తుంచుకోకపోవడం అతన్ని వేధించే విషయం.

తర్వాత 2003లో గైడింగ్ లైట్ ఫౌండేషన్ ప్రారంభించాడు. రిజిస్టర్ చేసాడు. ఇంతకాలం తాను అవస్థ పడుతున్నా, సమస్య వున్న దివ్యాంగ పిల్లలకి ఏదో విధంగా సాయం చెయ్యడం మానలేదు. వాళ్లకి చదువులు, పాఠాలు, ఉద్యోగాలు అన్ని విషయాల్లోనూ చేయూత ఇస్తూనే వచ్చాడు.

రవిప్రకాష్ సాయంతో సుజాత అనే చూపు లేని అమ్మాయికి న్యూస్ రీడర్ ఉద్యోగం ఇప్పించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చక్కగా మాట్లాడేలా ట్రైన్ చేసింది కూడా భవానీశంకర్ అని చెప్పి తీరాలి.

గైడింగ్ లైట్ ఫౌండేషన్ ద్వారా వైద్యం, విద్య, సాంస్కృతిక, సేవాకార్యక్రమాలు చెయ్యడంలో ముందే ఉంటూ వచ్చాడు భవానీశంకర్. స్త్రీ పరమైన సమస్యలు ఆడపిల్లలకి తలెత్తినప్పుడు తన దగ్గర జనరల్ సెక్రెటరీగా ఉన్న స్త్రీ చేయూతతో తోడ్పాటును అందించాడు. విభిన్న కార్యక్రమాలు విశేషంగా చేయడం జనానికి నచ్చడం, పిల్లలు మెచ్చడం జరుగుతూ వచ్చాయి. తర్వాత పిల్లలకోసం ఒక హాస్టల్ ప్రారంభించాడు. అక్కడ వారికి సాంస్కృతిక, విద్యా మొదలైన అంశాలు నేర్పడం జరుగుతూ వచ్చింది. దాతలు కొద్దీ కొద్దిగా ఇస్తున్న చేయూత అతన్ని నెమ్మది నెమ్మదిగా ముందడుగేయిస్తోంది. ఆర్.ఎస్.ఎస్ వారు తోడ్పాటును ఇవ్వసాగారు. పిల్లలచేత వాద్య సహకారంతో పాడిస్తూ, నృత్యాలు చేయిస్తూ, స్టిక్‌తో నడవడం నేర్పుతూ మంచి మర్యాదలు వివరిస్తూ ముందుకు సాగుతున్న భవానీశంకర్ మంచి గాయకుడు, ఆధ్యాత్మిక జ్ఞానం అపరిమితంగా వున్న వ్యక్తి. అందుకే ఆలేరు దగ్గరున్న మటూర్ గ్రామంలో గ్రంథాలయం ప్రారంభించిన రోజున భవానీశంకర్ చేత మంచి ఉపన్యాసం ఇప్పించారు. అతని వాగ్ధాటి విషయం పరిజ్ఞానాలు అసమానం… అతను అన్ని విధాలా అందరిలోనూ భిన్నం. అందుకే కష్టపడుతూనే పిల్లల బాగుకోసం కృషి చేస్తున్నాడు. చేస్తూనే ఉంటాడు.

సాయం చెయ్యడం, సహకారం అందించడమే జీవిత లక్ష్యాలుగా ముందుకు సాగుతున్న భవానీ శంకర్‍కి అభినందనలూ శుభాకాంక్షలూ అందిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here