[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]”దా[/dropcap]దీమా.. నాకు ఖీర్ కన్నా మామీతో ఆడుకోవడం ఇష్టం” అంది రిజ్వానా.
మైనంతో చేసిన బొమ్మలా ముద్దుగా ఉండే రిజ్వానా అంటే ఫర్హానాకి చాలా యిష్టం. అది యింటి కొచ్చిందంటే చాలు పనులన్నీ పక్కనబెట్టి తనూ చిన్నపిల్లలా మారిపోయి దాంతో ఆడుకోవడంలో మునిగిపోతుంది. రిజ్వానాకి తీపి అంతగా ఇష్టం ఉండదు. చికెన్, చేపలు, మాంసం కూర ఉంటే మాత్రం లొట్టలేసుకుంటూ తింటుంది.
“నీ మామీకి చెప్పి నీ కోసం కారబ్బూంది తెప్పించి పెడ్తాలే” అంది తను.
రిజ్వానా కూడా “షుక్రియా దాదీమా” అంటూ మనోహరంగా నవ్వింది.
తను రిజ్వానా బుగ్గ మీద ముద్దు పెట్టకుని “నేను మున్నాగాడికి ఆకులు తిన్పించి వస్తాను. మీరు యింటికెళ్ళి బట్టలు మార్చుకుని కొద్దిసేపాగి రండి. ఆ పాటికి నేను యింటికి తిరిగొచ్చేస్తాను” అంది.
“అలాగే దాదీమా” అని పిల్లలిద్దరూ వెళ్ళిపోతుంటే వాళ్ళవైపు ముచ్చటగా చూసుకుని తను కూడా ముందుకు కదిలింది.
ఓ చెట్టుకింద నిలబడి ఆకులు తెంపబోతున్న సమయంలో పెద్ద శబ్దంతో వూరి మధ్యలో విస్ఫోటనం జరిగింది. అది మోర్టార్ పేలిన శబ్దమని తనకు తెలుసు. తనకే కాదు వూరి వాళ్ళందరికీ ఇటువంటి శబ్దాలతో పరిచయమే. యిళ్ళ పైనుంచి దట్టంగా పొగ లేచింది. తను ఆందోళనపడ్తూ వూరి వైపుకు వేగంగా నడిచింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యింట్లోకి వెళ్ళిపోవాలన్న ఆరాటం ఓ వైపయితే ఆ మోర్టార్ ఏ యింటి మీద పడిందో.. ఎవరిల్లు ధ్వంసమయిందో… ఎవరు కాలి మసైపోయారో అన్న ఆరాటం మరో వైపు.. అది తమ యిల్లేనేమోనన్న భయం యింకో వైపు..
దార్లో కన్పించిన దృశ్యానికి రాతి బొమ్మలా నిలబడిపోయింది. జరీనా వాళ్ళ యింటికి పది గజాల దూరంలో రోడ్డు మధ్యన అహ్మద్, రిజ్వానాల ఛిద్రమైన శరీరాలు పడి ఉన్నాయి. ఆ రోజు వూరు వూరంతా కన్నీరు పెట్టింది. పసిపిల్లల ప్రాణాల్ని హరించిన పాకిస్తానీ సైనికులకు శాపనార్థాలు పెట్టని మనిషి లేడు. ఆ రోజు సాయంత్రం బ్యానర్లు పట్టుకుని వూరి మగవాళ్ళందరూ పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలపైన తమ నిరసనని తెలియచేశారు. ‘మేము సైనికులం కాదు.. సామాన్య ప్రజలం.. మా ప్రాణాలు తీసే అధికారం మీకెవరిచ్చారు?’.. ‘పసి మొగ్గల్ని తుంపేసే రాక్షసుల్లా మారిన పాకిస్తానీ సైనికుల్లారా.. మానవత్వంతో మెలగండి’ లాంటి వాక్యాలు రాసిన బ్యానర్లతో గుంపుగా వెళ్ళి పిల్లల ఖనన సంస్కారాల్లో పాల్గొన్నారు. జరీనా ఐతే మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న ఫర్హానాని ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు.
పెద్ద శబ్దంతో అతి సమీపంలో ఎక్కడో బాంబు పేలడంతో ఫౌజియా తన ఆలోచనల్లోంచి బైటపడి ఫర్హానాని గట్టిగా కౌగిలించుకుని ‘యా అల్లా.. పర్‌వర్ దిగార్.. మేరే బచ్చోంకో సహీ సలామత్ రఖో’ అని ప్రార్థించింది. ‘తల్లిదండ్రులు బతికున్నప్పుడే పిల్లల చావుని చూడటం కన్నా ప్రత్యక్ష నరకం మరేముంటుంది? అటువంటి నరకం మాకొద్దు యా ఖుదా’ అని మనసులో అనుకుంది.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు తుపాకుల శబ్దాలు విన్పించి ఆగిపోయాయి.
అయినా ఎవ్వరూ బైటికొచ్చే సాహసం చేయలేదు. యిళ్ళల్లోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండిపోయారు. ఒకటిన్నరకు గుర్రపు డెక్కల శబ్దం విన్పించింది. దాంతో పాటు మైక్‌లో “అందరూ బైటికి రండి. సమీపంలోని అగ్రికల్చరల్ కార్యాలయంలో సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. మీకు రక్షణగా మన సైనికులు ఉంటారు. తొందరగా బయల్దేరండి” అనే మాటలు విన్పించాయి.
ఒక్కొక్కరు తలుపులు తీసుకుని బైటికి వస్తున్నారు. ఫౌజియా ఏం చేద్దామన్నట్టు తన భర్త వైపు చూసింది. “మనం యిక్కడ ఉండటం క్షేమం కాదు. శిబిరానికి వెళ్ళిపోవటమే మంచిది. అవసరమైన బట్టలు సర్దు” అన్నాడు ఫక్రుద్దీన్.
ఫౌజియాతో పాటు ఫర్హానా కూడా నాలుగు రోజులకు సరిపడా బట్టలు రెండు సంచుల్లో గబగబా సర్దేసుకున్నారు. ఫక్రుద్దీన్ తలుపు తీశాడు. అక్కడ దాదాపు పదిమంది వరకు సైనికులున్నారు. యిద్దరు సైనికులు గుర్రాల మీద అటూ యిటూ తిరుగుతూ గ్రామస్థుల్ని క్యాంప్‌కి బయల్దేరమని మైక్‌లో చెప్తున్నారు. నడవలేని ముసలోళ్ళ కోసం డోలీలతో పాటు ఎడ్లబండ్లు ఏర్పాటుచేయబడ్డాయి.
చిన్న పిల్లల్ని భుజాలమీద కూచోబెట్టుకుని కొందరు, ఎత్తుకుని కొందరు.. నెత్తిమీద బట్టల మూటల్తో క్యాంప్ కెళ్ళడానికి తయారయ్యారు. అగ్రికల్చరల్ కార్యాలయం వూరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఫౌజియా బట్టల మూటల్ని ఫక్రుద్దీన్ చేతికిచ్చి, ఒక చేత్తో ఫర్హానా చేయి పట్టుకుని, మరో చేత్తో మున్నాని కొమ్ముల దగ్గర పట్టుకుని బైటికొచ్చింది.
ఆమె పక్కనే నడుస్తున్న మేకపోతు వైపు చూసిన సైనికుడొకడు “మాజీ.. ఆ శిబిరంలో మనుషులకే సరిపడినంత స్థలం లేదు. యిక మేకలకూ, పశువులకూ చోటెక్కడిది? మీరు దాన్ని యిక్కడే వదిలేసి రావాల్సి ఉంటుంది” అన్నాడు.
“అయ్యో నాయనా.. ఇదంటే నాకు ప్రాణం బాబూ..నా కొడుకుతో సమానం. దీన్ని వదిలి రాలేను. బాబ్బాబు.. దీన్ని మాత్రం వద్దనకు. దీని శరీరం చిన్నదేగా. శిబిరం చేరుకున్నాక దీన్ని నా వొళ్ళో కూచోబెట్టుకుంటాను” అతన్ని బతిమాలుకుంటూ అంది ఫౌజియా.
“నహీ మాజీ.. మాఫ్ కరనా.. శిబిరంలో మనుషులకే ప్రవేశం” అన్నాడతను.
ఫౌజియా తన భర్త వైపు బేలగా చూసింది. “మున్నాని యిక్కడే వదిలేయక తప్పదు” అన్నాడు ఫక్రుద్దీన్.
ఆమె గబగబా మున్నాని వెనక్కి లాక్కెళ్ళి, యింటి గోడ పక్కన వదిలేసి, మిగిలున్న కొమ్మల్ని దాని ముందు వేసి “మున్నా.. యిక్కడే జాగ్రత్తగా ఉండు, తొందరగా తిరిగొచ్చేస్తాలే” అని చెప్పింది.
గుంపుకి ముందూ వెనకా సైనికులు మరతుపాకులతో నడుస్తూ వూరి జనాల్ని సహాయ శిబిరంలో దించిన కొద్దిసేపటికి ఆర్.ఎస్. పురా కెళ్ళే రోడ్డులో ఓ యువకుడి శవం పడి ఉందని సైనికులకు వర్తమానం అందింది. ఆ వార్త బైటికి పొక్కితే సహాయ శిబిరంలోని మనుషులు ఆందోళనకు లోనవుతారనీ, కొంత మందైనా శవాన్ని చూడటానికి రోడ్డు మీదకి వచ్చే ప్రమాదముందని తలచి, గుట్టుగా యిద్దరు సైనికులు ఆర్.ఎస్. పురాకి వెళ్ళే రోడ్డు వైపుకు బయల్దేరారు.
రోడ్డుమధ్యలో రెండుగా తెగిపడి ఉన్న రషీద్ శవం కంటపడగానే, ఆర్.ఎస్.పురాలో ఉన్న ఆస్పత్రికి ఫోన్ చేసి, అంబులెన్స్‌ని తెప్పించి, రషీద్ శరీరాన్ని తెల్లటి బట్టలో చుట్టి, సహాయ శిబిరానికి తీసుకొచ్చారు.
తమ వూరివాడే మోర్టార్ దాడిలో చనిపోయాడని తెలిసి, శిబిరంలో తలదాచుకుంటున్న జనాలందరూ ఆ శవం ఎవరిదో తెల్సుకోడానికి ఒక్కసారిగా తోసుకొచ్చారు. రషీద్ అందరికీ తెలిసిన కుర్రవాడే కావడం వల్ల అతని మొహంపై నుంచి గుడ్డ తొలగించిన వెంటనే గుర్తు పట్టి “అయ్యో.. మన రషీద్.. ఫక్రుద్దీన్ చాచా వాళ్ళబ్బాయి. చాచాని పిలవండి” అన్నాడో యువకుడు.
ఫిరంగి దాడిలో చనిపోయిన కుర్రవాడి శవాన్ని అంబులెన్స్‌లో తెచ్చారని విన్న క్షణమే ఫక్రుద్దీన్‌కి రషీద్ గుర్తొచ్చాడు. వెంటనే అంత చెడు ఆలోచనని మనసులోకి రానీయడం మంచిది కాదని తలచి, గుండెని చిక్కబట్టుకున్నాడు. గుంపులోంచి ఎవరో “ఫక్రుద్దీన్ చాచా” అని పిలవగానే అతనికి అర్థమైపోయింది. ఆ శవం తన వాళ్ళకు సంబంధించిందే అయిఉంటుందని. అతను మెల్లగా లేచినిలబడి తడబడే అడుగులో అంబులెన్స్‌ని సమీపించాడు. “మనల్నెందుకు పిలుస్తున్నారు?” అంటూ అతని వెనకే ఫౌజియా, ఫర్హానా బయల్దేరారు..
పదిహేనేళ్ళ కొడుకు రషీద్ శవాన్ని చూడగానే వొంట్లో సత్తువ లేనట్టు ఫక్రుద్దీన్ కింద కూలబడిపోయాడు. ఫౌజియా తన కళ్ళముందు కొడుకు శవం కన్పిస్తున్నా నమ్మలేకపోతోంది. తన కొడుకు క్షేమంగా పట్నం చేరుకుని ఉంటాడనీ, వాడి అన్న యింట్లో తలదాచుకుని ఉంటాడని కదా తను యిప్పటివరకూ అనుకుంది? ఫర్హానా కూడా అదే మాట కదా తనతో అంది. మరి తన కళ్ళ ముందు రషీద్ శవమై కన్పిస్తున్నాడేమిటి? యిది నిజమేనా లేక భ్రమా? భ్రమ కాదు నిజమే.. ఆ పెద్ద పెద్ద కళ్ళు తన చిన్న కొడుకు రషీద్‌వే. సన్నటి పై పెదవి మీద ఇప్పుడిప్పుడే మొలుస్తున్న ఆ నూనుగు మీసం తన ముద్దుల కొడుకు రషీద్‌దే. తలమీద ఆ గాయం ఏమిటి? మెడకింద ఎర్రగా ఆ రక్తమేమిటి? నిజంగానే రషీద్ చనిపోయాడా? నిజమే.. రషీద్ చనిపోయాడు అన్న స్పృహ కలగ్గానే ఆమె శవాన్ని వొళ్ళోకి తీసుకుని గుండెలవిసేలా ఏడ్చింది.
శవాన్ని ఖననం చేయడానికి జోరాఫాం వైపుకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ఆర్.ఎస్. పురాలోని ముస్లింల ఖబరస్తాన్‌లో పూడ్చిపెట్టాలని సైనికులు నిర్ణయించుకున్నారు. ఫక్రుద్దీతో పాటు మరో నలుగురు ముస్లిం పెద్దల్ని ఎక్కించుకుని, అంబులెన్స్ ఆర్.ఎస్. పురా వైపుకు బయల్దేరింది.
***
సహాయ శిబిరానికి ముందున్న విశాలమైన స్థలంలో రకరకాల చెట్లున్నాయి. ఓ చెట్టు బోదెనానుకుని కూచుని ఉన్నాడు ఫక్రుద్దీన్. అప్పటికి రషీద్ చనిపోయి రెండు రోజులు.. ఈ రెండ్రోజులూ ఇరువైపుల్నుంచి సైనికులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఫిరంగుల శబ్దాలు విన్పిస్తూనే ఉన్నాయి. ఫక్రుద్దీన్ లోపల కూడా ఓ యుద్ధం జరుగుతోంది. ఉప్పెనలా ముంచెత్తుతున్న విషాదంతో యుద్ధం.. ఎంత పోరాడినా ఓటమి తప్పడం లేదు. అతను శిబిరంలో అందచేసే భోజనం ముట్టుకుని రెండు రోజులు.. ఫౌజియా పరిస్థితి కూడా అలానే ఉంది. కళ్ళముందు రషీద్ కదులాడుతున్నట్టే ఉంది. మెదడు నిండా వాడి జ్ఞాపకాలే .. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎండిన కాసారాల్లా మారిపోయాయి. కళ్ళల్లోంచి కన్నీరు రాకున్నా హృదయం నుంచి రాలుతున్న రకాశ్రువులు మాత్రం ఆగడం లేదు.
ఉదయం పది గంటల సమయం… నాస్తా వడ్డించే చోటనో, చాయ్ తాగేటపుడో ఫక్రుద్దీన్ కన్పించకపోవడంతో అతన్ని వెతుక్కుంటూ బయల్దేరాడు శంకర్‌లాల్. చెట్లు గుబురుగా ఉండటంతో మొదట శంకర్‌లాల్‌కి ఫక్రుద్దీన్ కన్పించలేదు. నాలుగైదు చెట్లని దాటుకుని లోపలికెళ్ళాక ఓ చెట్టుకింద దుఃఖానికి ప్రతిరూపంలా తల వాల్చుకుని కూచునిఉన్న తన స్నేహితుడు ఫక్రుద్దీన్ కన్పించగానే అతనికి ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. “ఇక్కడున్నావా? నీ కోసం శిబిరం మొత్తం వెతుక్కుంటున్నాను తెలుసా? హమ్మయ్య.. ఎట్టకేలకు దొరికావు… సంతోషం” అతని పక్కన కూచుంటూ అన్నాడు.
(ఇంకా ఉంది)