[box type=’note’ fontsize=’16’] ఈ శీర్షిక ద్వారా గత 20వ శతాబ్దిలో ఎందరో విశ్వవిద్యాలయ, కళాశాలల తెలుగు అధ్యాపకులను/ఆచార్యులను తీర్చిదిద్దిన ప్రాతఃస్మరణీయ యశఃకాయులను పరిచయం చేస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
బ్రిటీషు ఇండియాలో తొలి తెలుగు శాఖ:
[dropcap]ఉ[/dropcap]స్మానియా విశ్వవిద్యాలయం లోని తెలుగు విభాగ కీర్తి ప్రతిష్ఠలు పెంచిన విద్వాంసుల గూర్చి గత తొమ్మిది ప్రకరణాలలో విస్తరించాను. ఉస్మానియా తెలుగు శాఖ నిజం ప్రభుత్వ హయాంలో నెలకొల్పారు. 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిందని సర్వులకు తెలిసిన విషయమే. అదే సంవత్సరం మదరాసు విశ్వవిద్యాలయం స్థాపించబడి దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నత విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిందనే సంగతి కొద్దిమందికే తెలుసు. ఆ తర్వాత 70 సంవత్సరాలకు 1927లో ఆ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ పురుడు పోసుకుంది.
తెలుగు శాఖకు నాందీ ప్రవచనం చేసిన చిరస్మరణీయ వ్యక్తి కోరాడ రామకృష్ణయ్య. ఆయన వద్ద నండూరి బంగారయ్య, పింగళి లక్ష్మీకాంతంలు అధ్యాపకులుగా సహకరించారు. బంగారయ్య 1928లోనూ, లక్ష్మీకాంతం 1930లలోనూ మదరాసు విశ్వవిద్యాలయం వదిలి వేరే ఉద్యోగాలలో చేరారు. వజ్ఝల సీతారామశాస్త్రి, శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి 1930లో అధ్యాపకులుగా చేరారు. వారంతా తొలినాటి పండితులు, పరిశోధనాతత్పరులు. శ్రీపాద వారు 1933లో పదవి త్యజించారు.
కోరాడ రామకృష్ణయ్య 1930 నాటికి సీనియర్ లెక్చరర్. చాలా కాలం తర్వాత 1944లో నిడుదవోలు వెంకటరావు తెలుగు విభాగంలో చేరారు. 1949వరకు కోరాడ వారు శాఖాధిపతి. వారి తరువాత నిడుదవోలు వారు పీఠాధిరోహణం చేశారు. ఆ సంవత్సరమే శిష్ట్లా రామకృష్ణశాస్త్రి ఉపన్యాసకులుగా వచ్చారు. నిడుదవోలు వారు 1960లో పదవీ విరమణ చేయగా, శిష్ట్లాకు ఆధిపత్యం లభించింది. దీనిని తొలి తరంగా (1927-68) భావించవచ్చు.
తెలుగులో ఎం.ఏ. తరగతులు:
కోరాడ వారు, నిడుదవోలు వారు తెలుగు శాఖలో రీడర్‍లు గానే వ్యవహరించారు. 1970లో డా. గంధం అప్పారావు తొలి తెలుగు ప్రొఫెసరుగా నియమింపబడ్డారు. ప్రఖ్యాత వైస్ ఛాన్స్‌లర్ మాల్కం ఆదిశేషయ్య హయాంలో తెలుగులో ఎం.ఏ. కోర్సులు 1976 నుండి ఆరంభమయ్యాయి. ఈ శుభారంభంతో డా. సానికొమ్ము అక్కిరెడ్డి, డా. వి. రామచంద్రలకు తెలుగు శాఖలో లెక్చరర్, రీడర్‌గా అవకాశం లభించింది. 1987లో అప్పారావు రిటైర్ కాగా రామచంద్ర శాఖాధిపతి/ప్రొఫెసరు అయి పది సంవత్సరాలు పని చేశారు. 1997లో అక్కిరెడ్డి ఆచార్యులై మూడేళ్ళు పని చేశారు. 2000 సంవత్సరంలో జి.యస్.ఆర్.కృష్ణమూర్తి శాఖాధ్యక్షులయ్యారు. 2002లో యస్. శమంతకమణి ఆ పదవి నధిష్ఠించారు. 2009లో శమంతకమణి మరణంతో డా. మాడభూషి సంపత్‍కుమార్ అధ్యక్షులయ్యారు. 2020లో ఆయన రిటైరు కాగా డా. విస్తాలి శంకరరావు శాఖాధ్యక్ష పదవి చేపట్టారు. సంక్షిప్త చరిత్ర ఇదీ.
సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు:
నవయుగ వైతాళికులు వెంకటరత్నం నాయుడు. ఆయన కర్మయోగి. 1862 అక్టోబరు 1న ఆయన జన్మించారు. తండ్రి ఆర్మీలో సుబేదారు. ఉద్యోగరీత్యా తండ్రి బదిలీ మీద హైదరాబాదు వెళ్ళినప్పుడు నాయుడు నిజాం హైస్కూలులో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ వద్ద విద్య నభ్యసించారు. ఆయన కుమార్తెయే సరోజినీనాయుడు. బ్రహ్మసమాజ కార్యకలాపాల పట్ల ప్రభావితుడై పండిత శివనాథశాస్త్రి వద్ద బ్రహ్మచర్య దీక్ష స్వీకరించారు. 1885లో మదరాసు క్రైస్తవ కళాశాల నుండి బి.ఏ. డిగ్రీ సంపాదించారు. ఆంగ్లభాషా సాహిత్యాలలో ఎం.ఏ. పట్టాను 1891లో సంపాదించి మద్రాసు పచ్చయప్ప కళాశాలలో 1892లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‍గా, రెండేళ్ళ తరువాత బందరు నోబెల్ కళాశాలలో చేరారు. 50 సంవత్సరాల పాటు కఠిన బ్రహ్మాచర్యం పాటించారు.
హైదరాబాదు నగరంతో ఆయనకు సన్నిహిత సంబంధం. 1899 నుండి ఐదేళ్ళ పాటు సికిందరాబాదులో మహబూబ్ కళాశాల ప్రిన్సిపాల్ పదవిలో ఉన్నారు. ప్రతిష్ఠాత్మకమైన కాకినాడ పి.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ పదవిని 1904లో చేపట్టి పిఠాపురం మహారాజా వారికి ఆత్మీయులయ్యారు. 15 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ప్రిన్సిపాల్‌గా పనిచెసి ఎందరో యువకుల భవిష్యత్తుకు బాటలు వేశారు.
మలుపు తిరిగిన జీవితం:
ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మదరాసు విశ్వవిద్యాలయం పురోగతిని సాధించింది. వెంకటరత్నం నాయుడు 1912లో ఆ విశ్వవిద్యాలయం సెనేటరు, ఫెలోగా ఎన్నికలో గెలిచారు. వారి విజ్ఞానాన్ని గుర్తించి 1925లో వైస్ ఛాన్స్‌లర్‌గా ఎన్నుకోబడ్డారు. తెలుగు శాఖకు అవి సుదినాలు. ఆయనకున్న భాషాభిమానంతో ఓరియంటల్ శాఖ ప్రారంభించి సుకృతులయ్యారు. తెలుగును ద్వితీయ భాషగా ప్రవేశపెట్టారు.
కేవలం మదరాసు విశ్వవిద్యాలయ ప్రగతికే గాక, శాసనమండలిలో ఆంధ్ర విశ్వవిద్యాలయ బిల్లును ప్రవేశపెట్టేలా చేశారు. అది చట్టంగా రూపొందడానికి శక్తి కొలది కృషి చేసి సఫలీకృతులయ్యారు. బ్రిటీషు ప్రభుత్వం ఆయనను 1912లో రావు బహాదూర్ బిరుదుతోనూ, 1919లో దివాన్ బహాదూర్ బిరుదుతోనూ గౌరవించింది.
మహర్షిగా ఆయన ప్రఖ్యాతులు:
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి తొలి స్నాతకోత్సవంలో వెంకటరత్నం నాయుడికి గౌరవ డి.లిట్ ప్రదానం చేశారు. 1939 మే 26న బ్రహ్మ సాయుజ్యం పొందారు. సంఘసేవ కార్యకలాపాలలో భాగంగా అనాథ శరణాలయం కాకినాడలో స్థాపించారు. మదరాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు ఆనాడు ఆయన వేసిన బీజం ఒక మహావృక్షమై ఎందరో ఛాత్రులకు ఛాయనందించింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటివారు ఆయన శిష్యులు.
తొలి తెలుగు పరిశోధక విద్యార్థి (1923):
మదరాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ కోరాడ వారి మార్గదర్శనంలో నడుస్తున్న రోజుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించారు. భాషాశాస్త్రంపై మక్కువ గల చిలుకూరు నారాయణరావు ’11వ శతాబ్ది తెలుగు భాష’ అనే అంశంపై ప్రామాణిక పరిశోధనా గ్రంథం సమర్పించి మదరాసు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. సంపాదించారు. ఆంగ్లంలో వ్రాసిన సిద్ధాంత గ్రంథమది. ఉస్మానియా తెలుగు శాఖలో తొలి పి.హెచ్.డి. పొందింది బిరుదరాజు రామరాజు.
చిలుకూరు వారి ఆంధ్ర భాషా చరిత్ర సంపుటాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1937లో ప్రచురించారు. అదే సంవత్సరం DRAVIDIAN METERS అనే మరో సిద్ధాంత గ్రంథాన్ని మదరాసు విశ్వవిద్యాలయానికే సమర్పించారు. పండితుల అసూయ ఆ డిగ్రీ అందుకోనీకుండా చేసింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి:
చిలుకూరి వారు పరిశోధనలోనూ, పాండిత్యంలోనూ ఘనాపాఠి. బెనారస్‍లో కవిపండ క్లబ్ వారు నిర్వహించిన కవితా గోష్ఠిలో ఆశువుగా గేయం పాడి సభ్యుల మెప్పు పొందారు. త్యాగరాజ కీర్తనలను ఆంగ్లంలోకి అనువదించి – ‘Songs of Tyagaraja’ అనే గ్రంథం ప్రచురించారు. జీవిత చరిత్రలు, భాషా చరిత్ర, వాఙ్మయ చరిత్ర, పద్యకావ్యాలు రచించిన దిట్ట. వ్యావహరిక భాషకు పట్టం గట్టారు. స్వయంగా – అచ్చి, పెండ్లి, వాడే – నాటకాలు వ్రాశారు.
రాళ్ళపల్లి అనంతశర్మ ‘అచ్చి’ నాటకానికి దర్శకత్వం వహించారు. అపరాధ పరిశోధన నాటక రచనకు చిలుకూరు ఆద్యులు. వీరిని ‘ఆంధ్రా బెర్నాడ్ షా’ అని ఆప్యాయంగా పిలుస్తారు. ‘కాపు వలపు’ జానపద సంభాషణలతో సాగిన నాటకం. పౌరాణిక నాటకాలలో ‘అశ్వత్థామ’, ‘అంబ’ ప్రసిద్ధాలు. ‘విక్రమాశ్వత్థామీయం’ సంస్కృత నాటకం.
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి క్లుప్తంగా ఇలా వర్ణించారు – “ఓరిమి – పరిశ్రమ పేరిమి – ప్రతిభావ్యుత్పత్తుల నేరిమి కలిసి చిలుకూరు నారాయణరావు పేర వెలసినది.”
వీరి ఇతర రచనలు:
- సంస్కృత లోకోక్తులు
- An Introduction to Dravidian Philology (1929)
- గుజరాతీ వాజ్మయ చరిత్ర
- ఉమర్ ఖయ్యాం రుబాయితులు
- తుక్ఖాంబ
- జర్మనీ దేశ విద్యావిధానము
- ప్రాచీన హైందవ ప్రజాస్వామిక ప్రభుత్వం
- ఉపనిషత్తులు
- The University Exercises in Translations
- పద్దెనిమిది భారతీయ సాహిత్యాల చరిత్ర
చిలుకూరి వారు తనను గూర్చి చెబుతూ – ‘నేను వాఙ్మయ తపస్విని, సారస్వతయాజిని, వాఙ్మయం ద్వారా దేశారాధనను, ఈశ్వరారాధనను సాగింప కృషి చేసినవాడ’నని సవినయంగా పలికారు.
చిలుకూరి నారాయణరావు 1890 సెప్టెంబరు 10న విశాఖపట్నం జిల్లా ఆనందపురం అగ్రహారంలో శ్రోత్రియ కుటుంబంలో జన్మించారు. పర్లాకిమిడిలో గిడుగు రామమూర్తి గారి యింట్లో ఉండి ఎఫ్.ఏ. చదివారు. ఆయన చిలుకూరిని పుత్రసమానంగా ఆదరించారు. విజయనగర మహారాజా కళాశాలలో వేదాంతంలో బి.ఏ. చేశారు. ఎల్.టి. డిగ్రీ అధ్యాపకుల కవసరం. అది చదివారు. 1914లో మదరాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు, కన్నడ డిగ్రీలు పొందారు.
శ్రీకాకుళంలో పాఠశాలలోనూ, విశాఖపట్టణంలోనూ ఉపాధ్యాయుడిగా పని చేసి స్కూళ్ళ ఇనస్పెక్టరుగా పని చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాలలో నాలుగేళ్ళు అధ్యాపకులు. 1927 జనవరిలో అనంతపురం సీడెడ్ జిల్లాల కళాశాలలో ఉపన్యాసకులై 1945 దాకా ఉన్నారు. సంస్కృతం, తెలుగు, కన్నడ భాషలు బోధించారు. పదవీ విరమణ అనంతరం ఆత్రేయాశ్రమంలో వానప్రస్థ జీవితం గడిపారు.
వ్యాకరణంలో ఉద్దండులు:
వజ్ఘల చిన సీతారామస్వామిశాస్త్రి మదరాసు, ఆంధ్ర విశ్వవిద్యాలయాలలో పని చేశారు. 1878 జూన్ 25న బొబ్బిలి సమీపంలోని పాలతేరులో జన్మించారు. విజయనగర సంస్కృత కళాశాలలో పని చేసిన తర్వాత మదరాసు విశ్వవిద్యాలయంలో అధ్యాపక బాధ్యతలు 1930లో స్వీకరించి ప్రాచ్య విద్యాపరిశోధక సంస్థలో చేరారు. 1933లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ఆహ్వానం మేరకు అధ్యాపకులుగా చేరి 1941 వరకు ఉన్నారు.
ద్రావిడ భాషల స్వభావ సారూప్యాల పరిశీలనలో ఆయన లోతుగా కృషి చేశారు. తెలుగు వ్యాకరణాలపై ఘనాపాఠీ. ఆయన గ్రంథాలలో ముఖ్యమైనవి:
- ద్రావిడ భాషా పరిశీలనము
- ద్రావిడ భాషా సామ్యములు – భాషాశాస్త్ర పరిశోధనలు తలమానికలు
- బాలవ్యాకరణోద్ద్యోతము
- ఆంధ్ర వ్యాకరణ సంహితా సర్వస్వము
- వైయాకరణ పారిజాతము
- నన్నయాధర్వణీయము – వ్యాకరణ శాస్త్ర గ్రంథాలు
శాస్త్రి గారిని ఆంధ్ర విశ్వకళాపరిషత్ 1947లో ‘కళాప్రపూర్ణ’తో సత్కరించింది. 1964 మే 29న 86 వ ఏట గతించారు. 1910 నుంచి 1941 వరకు 32 సంవత్సరాలు అధ్యాపక జీవనంలో ఎందరికో ఒజ్జ అయ్యారు వజ్ఝల. ఆ తరం వ్యాకరణ పండితులలో గుణశ్రేష్ఠుడు సీతారామస్వామి.