జీవిత సహచరుడు

0
3

[dropcap]”అ[/dropcap]క్షయ్ ప్రముఖ రచయిత…. మా ఇంటికి వచ్చాడు… నువ్వు అతని అభిమానివి కదూ… పరిచయం చేస్తాను రా!” అంటూ ఫోన్ చేసింది పంకజ.

“నిజంగా… నీకెలా తెలుసు? ఇంతదాకా నాకెందుకు చెప్పలేదు?” అడిగింది నమ్మలేని సమీక్ష.

“వచ్చినపుడు చెబుదామని… త్వరగా వచ్చేయ్…” అని ఫోను పెట్టేసింది పంకజ.

డ్రస్ చేంజ్ చేసుకుని ఇంటికి తాళంవేసి అదే కాలనీలో రెండు వీధులు దాటి పంకజ ఇంటికి వెళ్ళింది సమీక్ష.

“రా రా… చాలా రోజులు అయింది కలసి. ఫోన్ చేసుకుంటున్నాం అనుకో…” అంటూ టీ ఇచ్చింది పంకజ.

“అవును మీరు చేసే టీ తాగి చాలా రోజులైంది…. నా ఒక్కదానికేనా? అక్షయ్ వచ్చారన్నారుగా…” కలయ చూస్తూ అడిగింది సమీ.

“అతనూ మీటింగ్ ఉందని వెళ్ళాడు….. వచ్చేసరికి నాలుగవుతుంది.”

“నన్ను ఇప్పుడే ఎందుకు పిలిచారు? అప్పుడే వద్దునుకదా…” నిరాశగా చెప్పింది సమీ.

“మీ అమ్మానాన్నగారు ఇంట్లో లేరుగా.. ఒక్కదానివీ ఏమి చేస్తావు… ఇద్దరం ఈవినింగ్ దాక స్పెండ్ చేద్దాం అని సరదాగా పిలిచాను. కోపంవద్దు….” అంది పంకజ.

“మీ మీద కోపం రాదు… కానీ ప్రాజెక్ట్ వర్క్ వుంది. చివరికి వచ్చింది. పూర్తి చేయాలనీ తొందర.అంతే!”

“ఇప్పటి వాళ్ళకి ఏదో ఒక బిజీ… కాస్తంత రిలాక్స్ ఉండాలి బేబీ… చూడు ఇదిగో అక్షయ్ కొత్త నవల…” అంటూ ఇచ్చింది.

ఆత్రంగా అందుకుని పేజీలు తిరగేసి… అపురూపంగా బ్యాగ్‌లో దాచుకుంది సమీ.

“మీరు చదివేరా?” అని అడిగింది.

“ఆ చదివాను, అక్షయ్ నిన్న రాత్రి వచ్చాడు. నందూ అక్షయ్ కబుర్లు చెప్పుకుంటే నేను బుక్ చదివేశా! స్టోరీ కొత్తగావుంది… భలే ఇంట్రస్టుగావుంది… అసలు…”

“వద్దు చెప్పకండి…. థ్రిల్ ఉండదు మొదట వింటే…” అంటూ ఆపింది సమీ.

పంకజ నవ్వి.. “చెప్పను. వూరికే నిన్ను టెస్ట్ చేశా… కొత్తరకం ఆర్కిడ్స్ వచ్చాయి చూడు…” అంటూ అటు తీసికెళ్ళింది.

సమీ ఫోటోలు తీసుకుని పూలను సుతిమెత్తగా తాకి మురిసిపోయింది. వాళ్ళిద్దరికీ పూలు పుస్తకాలూ ప్రాణం. బుక్- ఫ్లవర్ ఎక్సబిషన్‌లో మొదట పరిచయమయ్యారు. ఒకే కాలనీ అని తెలిసాక వాళ్ళ పరిచయం పెంచుకున్నారు రెండేళ్లుగా.

సమీక్ష ఇంజినీరింగ్ పూర్తిచేసి ఎం.బి.ఏ చేస్తోంది…. పంకజకి పెళ్లి ఐంది, ఇద్దరు పిల్లలు. ఐనా వయసుతో సంబంధం లేని స్నేహం ఏర్పాడింది వాళ్ళ మధ్య.

పంకజ భర్త గౌతమ్ వరల్డ్ బ్యాంకు ఆఫీసర్… ఎప్పుడూ ట్రావెల్ చేస్తూంటాడు. ఇంటిని పిల్లలను చూసుకుంటుంది పంకజ.

గౌతమ్‌కి పిన్నికొడుకు అక్షయ్. రచయిత. ఆర్టిస్టు కూడాను. బొమ్మలు వేస్తాడు. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్.

చాలా రోజుల వరకూ తన ఆరాధ్య రచయిత పంకజ బంధువుని సమీకి తెలియదు. పంకజ కావాలనే చెప్పలేదు. అక్షయ్‌కి ఇంకా పెళ్ళికాలేదు. సమీకి కాలేదు. అతడు ఫలానా అని తెలిస్తే ఏమో ఆశలు పెంచుకోవచ్చు…. సమీ వాళ్ళ కుటుంబం చాల చాదస్తులు. లేనిపోని ఇబ్బంది…. అనుకుంది.

కానీ సమీక్ష బాగా తెలిసాక అలాటి వీక్ మైండుకాదు… అంత సులువుగా మనసును పారేసుకోదు.. అని అర్థం చేసుకుంది. చెప్పినంత మాత్రాన దుర్బలురాలు కాదు… అని గ్రహించింది.

ఒక పుస్తకం చదివి ఆ రచయితను మెచ్చుకోడం, ఇష్టపడటం అంటే అది ప్రేమా, మొహం కాదు. ఆ రచయితలోని చెప్పే నైపుణ్యం ఆలోచనా సరళిని మెచ్చుకోడం… అంతే! ఆ రచయిత నవల్లో పాత్రలు నన్ను ఉద్దేశించి రాసేరు… నా మీద ప్రేమతో రాసేరు అనుకోవడం తెలివితక్కువతనం, దౌర్భాగ్యం అని పాఠకురాళ్లు తెలుసుకోవాలి.

సాయంత్రం దాక ఇద్దరూ గడిపేశారు. మొక్కలు పూవులు పుస్తకాలూ వాటిలోని పాత్రలు గురించి మాటాడుకున్నారు.

అక్షయ్ వచ్చాక పరిచయం చేసింది పంకజ. “మీ పుస్తకాలూ అన్ని చదివాను. ఇది బాగుంది. అది అస్సలు బాగాలేదు. మీరు ఏది రాసిన పాఠకులు చదువుతారు కొంటారు….అనుకోకండి. ఒకస్థాయికి చేరాక నన్ను ఎవరూ విమర్శించలేరు అనుకోవద్దు. ఎంత పేరు తెచ్చు కున్నారో అంట కిందకి పడిపోతారు….జాగ్రత్త…” అంటూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పింది సమీక్ష.

పంకజ మెచ్చుకోలుగా అభినందించింది. అక్షయ్ తలవంచుకున్నాడు.

ఇంతదాకా అతన్ని ఆకాశానికి ఎత్తేసి పొగిడినవారే ఎక్కువ. సమీక్ష పేరుకి తగ్గ పాఠకురాలు అన్నమాట అనుకున్నాడు.

“మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పినందుకు థాంక్స్ సమీక్ష గారూ. నా పొరబాటు సరిచేసుకుంటాను, అదెలాగో చెప్పండి….” అంటూ వివరణ కోరాడు.

“నేనిప్పుడు ప్రాజెక్ట్ వర్క్‌తో బిజీగా వున్నాను. …పూర్తిచేశాక మెయిల్ పంపుతాను. మీరు సీరియస్‌గా తీసుకున్నందుకు అప్రిషియేట్ చేస్తున్నా…” అంది సమీక్ష ఇంటికి బయలుదేరుతూ.

“ఈ ఎడిషన్ మీద మీ అభిప్రాయం కూడా పంపండి సమీక్షా!”

“అలాగేనండి…బై … బై…” అంటూ సెలవు తీసుకుంది.

ఆలా వాళ్ళమధ్య మెయిల్స్ ప్రారంభం అయ్యాయి. సమీక్ష తన అభిప్రాయాలూ చెప్పడం. …అక్షయ్ …. వాటిని అనుసరించడం జరిగేది.

కొన్నిరోజులకి పంకజ గౌతమ్ సమీక్ష వాళ్ళింటికి వచ్చారు.

సమీక్షతో ఒంటరిగా మాటాడింది పంకజ. సమీక్ష నాన్నగారితో అక్షయ్ గురించి చెప్పి “వాళ్ళిద్దరికీ పెళ్లి అయితే బాగుంటుంది…. మా అక్షయ్‌కి సరిజోడు మీ సమీక్ష. మీ అంగీకారం తెలియ చేయండి…” అన్నాడు.

“సమీక్ష తన భర్తను తానే ఎంచుకోగలదు. మాకు కుటుంబం వివరాలు చెపితే చాలు” అన్నారు ఆయన, భార్య.

“విషయమిది. అక్షయ్ నిన్ను లైక్ చేస్తున్నాడు…. ఏమంటావ్ సమీ..?” అడిగింది పంకజ.

“అతను కూడా నన్ను అడిగాడు… పంకజగారూ… కుటుంబం గురించి ప్రాపర్టీస్ గురించి చెప్పేడు. నాకు వాటితో సంబంధం లేదు….. అక్షయ్‌లో పెద్దలోపం…. మీకు కనిపించలేదా?” అడిగింది సమీక్ష.

పంకజ ఆశ్చర్యంగా చూసింది…. ‘నేను సమీక్షను సగటు ఒక అమ్మాయిగానే అనుకున్నా… ఈ వయసులో ఆకర్షణకి లొంగిపోయి పేరు, అబ్బాయి అందం, మంచి జాబ్, ఆస్తీ ఉన్నవాడిని ఇష్టపడతారు… అందులో సమీక్ష పెద్ద అందమైందీ కాదు. వాళ్ళ నాన్నగారికి సామాన్యమైన వుద్యోగం. అడగటమే ఆలస్యం… ఒప్పుకుంటుంది….అని అనుకున్నా…కానీ… అక్షయ్‌కే పేరు పెడుతోంది. లోపం వుంది అంటోంది…’ అని కోపం వచ్చినా…. అదేమిటో తెలుసుకోవాలి అనుకుంది పంకజ.

“సమీ అతను నాకు బంధువు కనుక లోపాలు ఏమి కనిపించలేదో….లేక నా దృష్టికి రాలేదో … నువ్వే చెప్పు.”

“అతడిని నిశితంగా గమనించాను. అతడి రచనలు కూడా ఒక అంతస్తు వారికే…. చెందినట్టు ఉంటాయి. అతను పేదరికాన్ని ఇష్టపడడు. అందాన్ని ఆరాధిస్తాడు.. అమ్మాయిలు దేవకన్యలు అయి ఉండాలి…. అన్ని గొప్ప లక్షణాలు ఉండాలి అంటాడు.. సామాన్యమైన వారు అతడికి కనబడరు. రచయిత ఆలోచనలు ఇష్టాలు అతడి రచనల్లో…. కనిపిస్తాయి.. అంత సంపద వున్నవాడు ఎవరికీ సహాయపడడు. అణువణువూ అహం చూపిస్తాడు. పెద్ద ఉద్యోగాల్లో వున్నవారితోనే స్నేహం చేస్తాడు. నేను అందుకు వ్యతిరేకం. మేం పేదవాళ్లం అయినా ఉన్నంతలో మా బంధువులను ఆదుకుంటాము. తోటి మనిషిని ప్రేమించని, ఆదుకోని వ్యక్తిత్వం నేను భరించలేను. సారీ… పంకజగారూ… మన స్నేహం ఇలాగే ఉంటుంది. బంధుత్వంగా మారాల్సిన అవసరంలేదు.” అంది సమీక్ష తన అభిప్రాయం చెబుతూ.

“నీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినందుకు మెచ్చుకుంటున్నా. అవును నేను గమనించలేదు. అక్షయ్‌లో నువ్వు చెప్పిన లోపాలు నిజమే. కానీ అతను నిన్ను జీవిత భాగస్వామిగా ఎంచుకోడానికి కారణం? అతడి ఆలోచనకు ఇది విరుద్ధం కదా?”

“ఏమీ లేదు. అతని రచనలకు నేనొక ఆలంబన కావాలని… లోపాలు గుర్తించడానికి, తప్పులు దిద్దుకోవచ్చని, అది కేవలం అతడి బుక్స్ అమ్ముడు పోవడానికి. వ్యాపార దృష్టితో…. మాత్రమే. అతడి జీవితంలో నేను ప్రవేశించాక సమస్యలు ప్రారంభం అవుతాయి. నాకు నమ్మకంగా తెలుసు. అతడిని నేను తప్పకుండ మార్చడానికి ప్రయత్నిస్తాను. అతడికి అది నచ్చదు.”

“పోనీ ఇప్పుడు మార్చడానికి ట్రై చేయవచ్చుకడా ….!

“ఒక అభిమానిగా తప్పకుండా ప్రయత్నిస్తా…! దీనికి పెళ్లి అనే బంధం అవసరంలేదు పంకజగారూ. నా భర్తకి డబ్బు, అందం, హోదా అవసరం లేదు…. జాలి, దయ, కరుణ, మంచిమనసు కావాలి. నాకు చేయూతగా ఉండాలి. నా భావాలను గౌరవించేవాడు కావాలి.”

“మంచిది. నీకు నచ్చేవాడు లభించాలి. ఆల్ ది బెస్ట్.” అంటూ నిరాశగా వెనుతిరిగింది పంకజ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here