లేడీ ఆఫ్ ఖయల్ – గంగూబాయి హంగల్

4
3

[dropcap]మా[/dropcap]ర్చి 5వ తేదీ శ్రీమతి గంగూబాయి హంగల్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

పదకొండేళ్ళ వయస్సులోనే ‘భారత జాతీయ కాంగ్రెస్’ సమావేశంలో స్వాగత గీతం ఆలపించిన బాలిక, తొంభై ఏళ్ళ ముదిమి వయస్సులో క్యాన్సర్‌ను జయించిన ధీరవనిత, పసిప్రాయంలోనే వివక్షకు గురైనా తను కోరుకున్నట్లు ‘ఖయల్ గాయని’గా పేరుపొంది ఆకాశవాణి రికార్డులు, వేదికల మీద కచ్చేరీలతో తను కలలుగన్న సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసుకున్న ‘లేడీ ఆఫ్ ఖయల్’ గంగూబాయి హంగల్. అసలు పేరు గాంధారి హంగల్. వీరు 1913వ సంవత్సరం మార్చి 5వ తేదీన నాటి బొంబాయి ప్రెసిడెన్సీ (నేటి కర్నాటక) లోని ధార్వాడ్‌లో జన్మించారు. వీరి తల్లి అంబబాయి, తండ్రి చిక్కురావు నడిగర్. అమ్మమ్మ కమలాబాయి. అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ కర్నాటక సంగీత కళాకారిణులు. అందుకే వీరికి కర్నాటక సంగీతం నేర్పించాలని తహతహ లాడారు. అయితే వీరికి హిందూస్థానీ సంగీతమంటే మిక్కిలి ఇష్టం.

ఐదవ తరగతి చదివే పసితనంలోనే బడిని వదిలేసింది. గ్రామఫోన్ రికార్డుల షాపుల దగ్గర నుండి వినిపించే హిందూస్థానీ సంగీతాన్ని, మరాఠీ అభంగ్‍లు, పాటలను వింటూ, సాధన చేస్తూ ఉండేవారు.

1924 వ సంవత్సరంలో 11 ఏళ్ళ లేలేత, వయస్సులోనే ‘బెల్గాం’లో జరిగిన ‘భారత జాతీయ కాంగ్రెస్’ వార్షిక సమావేశాలలో ప్రార్థనాగీతాన్ని ఆలపించే స్థాయికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో హేమాహేమీలైన జాతీయ నాయకులు గాంధీజీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సరోజనీ నాయుడు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటివారు పాల్గొని గంగూబాయిని అభినందించారు. గంగూబాయి జీవితంలో మరపురాని సంఘటనగా ఇది నిలిచింది.

2 సంవత్సరాల కాలం కథక్ నృత్యాన్ని అభ్యసించారు. కాని సంగీతం పట్ల మక్కువ చూపించి విశ్వవిఖ్యాతిని పొందారు.

13 ఏళ్ళ వయసులో కృష్ణాచార్య హల్గార్ వద్ద ‘కిన్నరి’ (వీణ వంటి తీగ వాయిద్యం) ని సాధన చేశారు. 1928 నాటికి ధార్వాడ్ నుండి హుబ్లీకి కుటుంబంతో తరలి వచ్చారు. సవాయి గాంధర్వ, డాటో పంత్ దేశాయ్‌ల వద్ద హిందూస్థానీ సంగీతాన్ని అభ్యసించారు.

1928లో 16వ ఏట గురురావు కౌల్గి అనే న్యాయవాదితో వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. వివాహం జరిగిన నాలుగేళ్ళకే 1933వ సంవత్సరంలో భర్త మరణించారు.

ఒంటరిగా పిల్లలను పెంచుకుంటూ సంగీత సాధన చేశారు. తన దగ్గరున్న బంగారాన్ని అమ్మి గురుదక్షిణ సమర్పించుకోవడానికి, కుటుంబ పోషణకు ఖర్చు పెట్టుకున్నారు. రోజు 30కి.మీ. రైలు ప్రయాణం చేసి సంగీత సాధన చేయడం ఆ రోజుల్లో చాల కష్టం. అయినా సంగీతాభ్యసనం కోసం ఆ కష్టాన్ని సుఖంగా భావించారు.

1930 నుండి బయట కచ్చేరీలు చేయడం ఆరంభించారు. దేశమంతా గణేష్ ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలలో కచ్చేరీలు చేశారు. ఈ విధంగా దేశములో గొప్ప హిందూస్థానీ గాయనిగా పేరుపొందారు.

HMV వారికి రికార్డులను పాడారు, HMV అధినేత ‘గాంధారి హంగల్’ పేరును ‘గంగూబాయి హంగల్’ గా మార్చారు.

తొలిరోజుల్లో సెమీక్లాసికల్ పద్దతిలో ఉండే తుమ్రీలు, రాగాలను ఆలపించేవారు. తరువాత తరువాత హిందూస్థానీ క్లాసికల్ సంగీతమైన ఖయల్‌ను ఆలపించేవారు.

1940 నుండి పూర్తిగా ఖయల్ గాయనిగా మారారు.

వీరి స్వరం పురుషుని స్వరంలా ఉండేది. అయితే వైద్యుల చేత కరెంటు షాక్‌ల వైద్యం చేయించుకుని స్వరాన్ని మార్చుకున్నారు. దీని కోసం ఎంత నొప్పిని భరించారో? అయితే ఏం! అది సత్ఫలితాలనే ఇచ్చింది.

1933వ సంవత్సరంలో సబర్బన్ మ్యూజిక్ సర్కిల్, శాంతాక్రజ్, బొంబాయిలో తొలిసారిగా సంగీత కచ్చేరి చేశారు. తరువాత ఆకాశవాణిలో తరచుగా పాడేవారు. 1945 వరకు ఆకాశవాణిలో భజన్లు, తుమ్రీలు, రాగాలు పాడేవారు. లలిత సంగీతం పాడడానికి నిరాకరించారు.

1936 వ సంవత్సరంలో AIR రికార్డింగ్ జరిగినపుడు ప్రముఖ హిందుస్థానీ గాయనీమణి హీరాబాయి బరోడేకర్ సమక్షంలో పాడే అవకాశం లభించడం తన జీవితంలో అపురూప అదృష్టమని చెప్పి సంబరపడేవారు.

వీరి కుమార్తె ‘కృష్ణ హంగల్’ కూడా హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించారు. అంతటితో ఆగలేదు. తల్లికి ధీటుగా సాధన చేశారు. తల్లితో కలిసి కచ్చేరీలలో ఆలపించారు. కుమార్తె సాయంతో తన కచ్చేరిలు సుసంపన్నమయ్యేవని స్వయంగా చెప్పుకున్నారు గంగూబాయి.

‘నేను మొదట్లో కచ్చేరీలు చేసింది నా కుటుంబాన్ని పోషించుకోవడానికే’ అని నిష్కల్మషంగా చెప్పిన వారు గంగూబాయి. ఆమె సంగీతం నేర్చుకుంటున్న తొలిరోజుల్లో ‘గాయకుడు వచ్చాడు, గాయకుడు వచ్చాడు’ అని వీధుల్లో ఎగతాళి చేసేవారు. ‘అయినా పట్టించుకోకుండా నా పని చేసుకొని వెళ్తూ ఉండేదానిని’ అని కూడా చెపుతూ ఉండేవారు.

ప్రముఖ నటి నర్గీస్ తల్లి జద్దన్ బాయి కలకత్తాలోని సంగీత సమావేశాలకు వెళ్ళమని సలహా ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తరువాత నిర్వాహకులు ముందుగా ఒక ప్రైవేటు కచ్చేరిలో పాడమని అడిగారు, తప్పనిసరియై పాడారు. అక్కడే త్రిపురరాజు ప్రశంసించి బంగారు పతకాన్ని బహుకరించారు. ప్రముఖ సినీగాయకులు కె.యల్. సైగల్ ప్రశంసలను పొందగలిగారు. ఉస్తాద్ నిస్సార్ హుస్సేన్ ఖాన్‌ను కూడా ఇక్కడే కలిశారు.

కలకత్తాలో వరుసగా 15 సంవత్సరములపాటు ‘అఖిల భారత బెంగాల్ సంగీతోత్సవాలు’ జరిగాయి. ఉత్సవాలలో ఓంకార్‌నాధ్, కేసరిబాయి, బిస్మిల్లాఖాన్, అల్లావుద్దీన్‌ఖాన్, సిద్దేశ్వరదేవి మొదలయిన గొప్ప హిందుస్థానీ సంగీత కళాకారులందరూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు కలిసి పాడేవారు. పరస్పరం అందరి పాటలను అందరు విని, వాటిల్లోని తప్పొప్పులను చర్చించుకుని పరస్పర సలహాలను ఇచ్చిపుచ్చుకొనేవారు. ప్రతి ఒకరికి రెండు సిట్టింగులకు ప్రణాళిక వేసుకొని పాడేవారు. అంత గొప్ప గాయనీ గాయకులతో కార్యక్రమాలలో పాలు పంచుకోవడాన్ని తలచుకుని గంగూబాయి సంబరపడేవారు.

హిందుస్థానీ సాంప్రదాయ సంగీతంలో ఒక శ్రావ్యమైన అత్యంత అద్భుతమైన కళా ప్రక్రియ ఖయల్ గానం. ఈ ‘లేడి ఆఫ్ ఖయాల్’ 7 దశాబ్దాల పాటు హిందుస్థానీ సాంప్రదాయంలోని ఖయల్ కళాప్రక్రియలో కచ్చేరీలు, రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతే కాదు దేశ విదేశాల్లో తన ప్రదర్శనలతో అంతర్జాతీయంగా ప్రేక్షకులను అనందడోలికలలో తేలియాడించారు.

‘కిరానా’ ఘరానా పిత అబ్దుల్ కరీంఖాన్ గంగూభాయి తల్లి అంబాబాయి రాగాలాపనను ఆలకించి సంబరపడేవారు. భీమ్ సేన్ జోషి అయితే గంగూభాయి తన సోదరి అని చెప్పేవారు.

1970 నుండి 1980ల మధ్య వీరు ఫ్రాన్స్, కెనడా, పశ్చిమ జర్మనీ, అమెరికా మరికొన్ని ఐరోపా దేశాలలో పర్యటించి హిందుస్థానీ (ముఖ్యంగా ఖయల్ ఆలాపన) సంగీత కచ్చేరీలను చేసి మనదేశానికి పేరు తెచ్చారు.

కర్నాటక సంగీత విశ్వవిధ్యాలయంలో గౌరవ సంగీత ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.

వీరు రాజ్యసభ సభ్యులయ్యారు, వీరు ఐదుగురు రాష్ట్రపతులు, 9 మంది ప్రధాన మంత్రుల చేతుల మీదుగా వివిధ పురస్కారాలను అందుకుని రికార్డు సృష్టించారు.

1962లో కర్నాటక సంగీత నృత్య అకాడమీ అవార్డు, 1971లో పద్మభూషణ్ పురస్కారం, 1973లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1984లో తాన్‍సేన్ అవార్డు, 1996లో సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, 1997లో దీనానాధ్ ప్రతిష్ఠాన్ పురస్కారం, 1998లో మానిక్ రతన్ పురస్కారం, 2002లో పద్మవిభూషణ్ పురస్కారాలు లభించాయి.

2003వ సంవత్సరంలో వీరికి ఎముకమజ్జ క్యాన్సర్ వ్యాధి సోకింది. ధైర్యంతో అధిగమించారు. క్యాన్సర్ వ్యాధి నయమయింది.

అయితే వీరికి కుటుంబ నిర్వహణ, కచ్చేరీలలో తన శాయశక్తులా సహాయం చేసిన కుమార్తె కృష్ణ హంగల్ 2004వ సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. కుమార్తె మరణంతో మరింత క్రుంగిపోయారు. అయినా ధైర్యం కోల్పోలేదు. 2006వ సంవత్సరం వరకు కచ్చేరీలను కొనసాగించి విజయం సాధించారు.

హుబ్లీలో విశ్రాంతి తీసుకుంటూ జీవించారు. 2009 వ సంవత్సరం జులై 21వ తేదీన హుబ్లీలోని హస్పటల్‌లో గుండెపోటుతో మరణించారు. కర్నాటక ప్రభుత్వ గౌరవలాంఛనాలు వీరికి లభించాయి.

కర్నాటక ప్రభుత్వం ‘డా॥ గంగూబాయి హంగల్ మ్యూజిక్ అండ్ ఫెర్మార్మింగ్ ఆర్ట్ యూనివర్సిటీ’ని స్థాపించి గౌరవించింది. ఈ విశ్వవిద్యాలయంలో కర్నాటక, హిందుస్థానీ సంప్రదాయ సంగీతంలో వాయిద్య సంగీతం, వివిధ సంగీత వాయిద్యాలను వాయించే మెలకువలను నేర్పే విద్య నేర్పుతారు. అంతేగాక, చిత్రలేఖనం, కళలు, రంగస్థల నాటికలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద గేయాలు మొదలైన వివిధ కళారీతులలో శిక్షణను ఇస్తారు.

వీరు 96 ఏళ్ళ ముదిమి వయస్సులో మరణించి కూడా ప్రజలకు స్ఫూర్తినిచ్చే పని చేశారు. అదే నేత్రదానం. Dr. M.M. JOSHI EYE INSTITUTE కి తన కళ్ళను దానం చేశారు. ఈ విధంగా బాల్యం నుండి కుల వివక్ష, మహిళా వివక్షలను ఎదుర్కొని, పురుషుల కోసమే అని ప్రాచుర్యమైన ఖయల్ గానాన్ని స్వంతం చేసుకుని, ‘లేడీ ఆఫ్ ఖయల్’ అని పిలిపించుకుని, ప్రముఖ హిందుస్థానీ సంగీత కళాకారులందరికి తలలోని నాలుకలా మెలగి, స్నేహసమానురాలయిన కుమార్తె క్యాన్సర్ వ్యాధికి బలియైన దుఃఖాన్ని గరళంలా మింగి, చివరకు తను స్వయంగా క్యాన్సర్ బాధితురాలైనా అధిగమించారు. ఆ తరువాత కూడా కచ్చేరీలు చేసే ధైర్యాన్ని పుంజుకోగలిగారు. 96 ఏళ్ళ జీవితాన్ని చాలించే సమయంలో కూడా నేత్రదానం చేసి తరువాత తరాల వారికి స్ఫూర్తిని కలిగించారు.

2014 సెప్టెంబర్ 3వ తేదీన ఎనిమిది మంది హేమాహేమీలయిన సంగీత కళాకారుల చిత్రాలతో INDIAN MUSICIANS శీర్షికన 8 స్టాంపుల బ్లాక్ విడుదల అయింది. ఈ ఎనిమిది మందిలో గంగూబాయి హంగల్ గారికి స్థానం కల్పించారు. దీని ద్వారా విశ్వవిఖ్యాతంగా వీరికి గల పేరు ప్రఖ్యాతులను ప్రపంచానికి తెలియజేసింది భారత తపాలాశాఖ.

వీరి జయంతి మార్చి 5 వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here