[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి ముమ్ముడి శ్యామలారాణి గారి కలం నుంచి జాలువారిన ‘ప్రేమించే మనసా… ద్వేషించకే!’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ఈ[/dropcap] అమ్మాయి తీరు చూస్తుంటే తను బ్రతికుండగా పుట్టింటి వాళ్ల గుమ్మం ఎక్కేట్టు లేదు. కొడుకు పెళ్లి చేసి కట్నకానుకలు సారె, చీర కోడలు తెస్తే అనుభవిద్దాం అనుకుంటే ఈవిడగారొచ్చారు. అసలు తను మొట్టమొదటిసారిగా కట్టు బట్టలతో యింట్లో అడుగుపెడితే నోరు మూసుకోవటానికి కారణం తను గొప్పింటి అమ్మాయి అని తెలిసే కదూ! నాలుగు రోజులలో పంతాలు పట్టింపులు మాయమవుతాయనుకుంటే ఎక్కడ ఆ సూచన లేదు. నోరు తెరచి అడిగీ అడగటంతోనే తను జన్మలో కట్టలేని వేంకటగిరి జరీ చీరలు తెచ్చింది…. ఈ అమ్మాయి మహా పట్టుదల గల పిల్ల…. తను యిలా సూటి పోటీ మాటలంటే అభిమానం వదిలి పుట్టంటికి వెళుతుంది. వాళ్లు మట్టుకు వున్న ఆస్తినంతా ఏం చేసుకుంటారు. ఈ పిల్లకే యిస్తారు. అపుడు తనకు ఏ లోటు వుండదు. మంచం మీద పడుకున్న మీనాక్షి ఆలోచనలు అలా సాగిపోతున్నాయి.
చేపను పట్టుకొని కోస్తుందన్న మాటేగాని చిన్న పిల్ల పౌరాణిక సినిమాల్లో రాక్షసుణ్ణి చూసి భయంతో శరీరం వణికిపోయి కళ్లు మూసుకున్నట్లుంది సుజాత పరిస్థితి.
పెద్ద తలకాయ, చిన్న చిన్న గ్రుడ్లు, నోరు తెరిచి బయటకు కనబడుతున్న నాలుక చూస్తుంటే చేపను కాదు ఏదో భయంకరమైన జంతువును పట్టుకున్నట్లుంది.
భయంతో శరీరం కంపించసాగింది. గుర్తు వచ్చే దేవుళ్లనందర్ని తలంచుకొని చేపను కోసే శక్తి యివ్వమని కోరింది.
ఎలాగైతేనేం చేపని తల దగ్గర కొయటంతో చేపతో పాటు చిటికెన వ్రేలు సర్రున అంత లోతుకి చీలిపోయి చేప రక్తమో వేలి రక్తమో తెలియనట్లు సర్రున రక్తం చిందటం చూసి కెవ్వున అరచి వెనక్కి పడిపోయింది సుజాత.
వెనక్కి పడిపోయిన సుజాత “నేను కోయను… నేను కోయను…” అని అంటునే గట్టిగా కళ్లు మూసుకుంది.
మీనాక్షి తెల్లబోయింది కోడలి భయంకి.
భయపడుతుందేగాని కోయలేకపోతుందా అనుకుందిగాని ఇంతలా బెదిరిపోతుంది అనుకోలేదు. గదిలోంచి వచ్చిన మీనాక్షి ఏం చేయాలో తెలియనిదానిలా నిలబడిపోయింది. అంతలోనే కొడుకు రావటం…. గాబరాగా సుజాత దగ్గరకు పరుగెత్తటం క్షణాల్లో జరిగిపోయింది.
కొడుక్కి సమాధానం ఏం చెప్పాలా, చేపను సుజాత చేత ఎందుకు కోయించావంటే – అని ఒకటే ఆలోచించసాగింది.
“సుజీ! సుజీ! నిన్నెవరు కోయమన్నారు? కోయమన్నవాళ్లకు బుద్ధి లేకపోయినా నీకైనా ఉండొద్దు?” అని అమాంతంగా క్రిందపడిపోయిన సుజాతను రెండు చేతులతో ఎత్తి “మైగాడ్ ఎలా రక్తం కారిపోతుందో?” అని గబగబా అడుగులు గదిలోకి వేసాడు సుదర్శన్.
“బాగుంది బాబు నింద. చౌకగా వచ్చిందని త్రిమూర్తులు నేను చిన్న చేప తేమ్మంటే పెద్దది తెచ్చాడు. నీవు కోయద్దమ్మా, నీకు చేతకాదు, భయపడతావు అంటే ఎన్నాళ్లత్తయ్యా, ఆయనకు ఇష్టం కదా! నేర్చుకుంటాను అంది.”
అపుడే కళ్లు తెరుస్తున్న సుజాత అత్తగారి మాటలకు తెల్లబోయింది. చిన్న చేప అసలు తీసుకురావద్దు పెద్ద చేప వుంటేనే తీసుకురా అని చెప్పిన అత్తగారు మాట ఎంత తొందరగా మార్చేశారు?
ఫస్ట్ ఎయిడ్ చేసి, బాధగా సుజాత వైపు చూస్తున్న సుదర్శన్‌కి తల్లి మాటలకు సుజాతపై ఎక్కడలేని కోపం వచ్చింది.
తన తల్లి చెప్పిన పనులు సగం, చెప్పలేని పనులు సగం నెత్తి మీద వేసుకుని చేస్తుంది. క్రొత్తగా స్కూల్లో జాయిన్ అయిన కుర్రాడు మాష్టారుని చూసి బిత్తర చూపులు చూస్తున్నట్లు తల్లిని చూసి ఒక్కటే భయపడిపోతుంది. ‘నువ్వు మా అమ్మకు భయపడవలసిన పని లేదు సుజీ! నువ్వు ఎప్పటిలా దర్జాగా వుండు’ అంటే ‘చాల్లెండి, అత్తగారిది అసలే అదో రకం తత్వం… ఆవిడను బాధ పెట్టి నేను బాధ పడలేను’ అంటుంది. సుజాత తీరే అంత. ఆలోచన రావడమే తడవుగా “సుజీ! ఎలా వుంది నొప్పి” అని అడిగాడు.
చిన్నగా కళ్లు ఎత్తి చూసింది.
“సుజీ! నిన్ను ఎవరు కోయమనకుండానే పెద్ద ఏదో చేతయినట్లు రాని పనుల జోలికి వెళ్లటం ఎందుకు. నీకు ఎన్నో సార్లు చెప్పాను. అయినా నీకు నా మాట లెఖ్ఖలేదు. అవున్లే ఎందుకుంటుంది. నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? సంపాదిస్తున్నానా? నా మీద గౌరవం వుండటానికి” నిష్ఠూరంగా అన్నాడు సుదర్శన్.
అనుకోని సుదర్శన్ నిష్ఠూరపు మాటలకి సుజాత మనసు బాధగా మూలిగింది. తను ఎంత భయపడింది చేప కోయటానికి. ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది అత్తగారు. అయినా సుదర్శన్ తననే అంటున్నాడు. సున్నితమైన మనసు గల సుజాత బాధను తట్టుకోలేని దానిలా దుఃఖంతో రెండు చేతుల మధ్య ముఖం చాటుచేసుకుంది.
అటుగా వచ్చిన రంగారావుగారు కొడుకు మాటలకు తెల్లబోయారు.
మీనాక్షి పనే అయివుంటుందని ముందే గ్రహించారు రంగారావుగారు. కాని తన కొడుకు గ్రహించకపోవటం ఆశ్చర్యమనిపించింది రంగారావుగారికి. అంతలోనే అతని అంతరాత్మ ఎదురు ప్రశ్నవేసింది. తన అనుభవంలో సగం లేదు సుదర్శన్‌కి, తల్లి తత్వం వాడేం గ్రహించగలడు అనుకున్నారు. అంతలోనే కోడలు కంటి వెంట కన్నీరు రావటం చూసి ఆయన మనస్సు చివుక్కుమంది.
“నోరు ముయ్యరా పెద్ద చెప్పొచ్చావ్! చేప కోస్తే నువ్వు మీ అమ్మా మెచ్చుకొని మేక తోలు కప్పలేదని కోసింది. వయసు వచ్చింది గాని జ్ఞానం రాలేదు. లేకపోతే హంసతూలిక తల్పంపై పెరగవలసిన బిడ్డను తీసుకొచ్చి గచ్చు నేల మీద పడేస్తావా? తెలివి తేటలకు సంతోషించించాను కాని బాధపడుతున్న అమ్మాయిని ఇంకా బాధ పెడతావా? ఏవమ్మా సుజాతా యింకా నొప్పిగా వుందా? ఎందుకు తల్లి అనవసరంగా రాని పనికి కూర్చున్నావు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలమ్మా. నీవు యిలా మంచం మీద పడుకోవడం మీ అత్తకు యింకా బాధ…. ముందే చేయను అని ఖచ్చితంగా చెప్పేస్తే ఇంత వరకు వచ్చేది కాదు” అన్నారు.
మావగారు తన దగ్గరగా రావడం చూసి కంగారుగా మంచం మీద నుంచి లేవబోయింది.
“లేవకమ్మా! తండ్రి లాంటి వాడిని. నా దగ్గర మన్నన ఎందుకు. ఏ ఆలోచనలు మనసులోనికి రానివ్వకు. మనశ్శాంతిని మించింది మరొకటి లేదమ్మా!” అని తల మీద చేయి వేసి నిమురుతున్న మావగారిలో కన్న తల్లి తండ్రులే కనిపించారు సుజాతకు.
మీనాక్షికి, కొడుకు భర్త మాటలు వింటుంటే శరీరానికి కారం రాసుకున్నట్లనిపించింది.
అందచందాలతో కొడుకుని కొంగున ముడి వేసుకుంది. మధ్యన ఈ ముసలాయన కోడలంటే అలా పడి చచ్చిపోతున్నారే ఖర్మ!
ఊహు! లాభం లేదు. తన కొడుక్కి, భర్తకి కోడలు విషయంలో తప్పుకి తను దొరక్కూడదు. తెలివిగా మసలుకోవాలి. తను అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి. నాలుగు మాటలన్నా, చేయలేని పనులు చేయించినా పంతాలు పట్టింపులు మాని పుట్టింటి గడప తొక్కుతుందేమో అనుకుంటే, పట్టుదల వదిలేటట్లు కనపడటం లేదు. ఈ పిల్లకు అభిమానం జాస్తిలా వుంది. ఆ అభిమానం వదిలేటట్లు చేస్తే చచ్చినట్లు పుట్టింటికి వెళుతుంది. మొగుడంటే పంచప్రాణాలు! మొగుడు కావాలనుకున్నదయితే తను పెట్టే పాట్లకు తప్పక పుట్టింటికి వెళుతుంది. ఆమ్మో పుట్టింటికెళితే తనకు కావలసినదేముంది? నిముషాల్లో వాళ్ల నాన్న ఖరీదు గల సామానులు, నౌకర్లు, చాకర్లు…. ఒకటేమిటి ఉన్న ఒక్క కూతురు సుఖపడటం కోసం ఏమైనా చేస్తాడు. విమానం లాంటి కార్లు రెండు వున్నాయట. అవి కూతురుకే యిస్తాడు. బజారుకెళ్లాలంటే దారి పొడవునా ఆటోలు బేరమాడలేక చస్తున్నాను. అపుడైతే డ్రైవరు తలుపు తీసిపట్టుకుంటే దర్జాగా కారెక్కి కూర్చుంటుంది. చెవ్వులకి రవ్వల దుద్దులు పెట్టుకోవాలి. ఒకటేమిటి వాళ్లు ఐశ్వర్యంతో కొనలేనివి, అనుభవించలేనివి లేవు. అందుకనే కదా! ఆ పిల్ల వట్టి చేతులతో కాలు పెట్టినా నోరు మూసుకుని ఊరుకున్నది. తర్వాత మెల్లగా రాబట్టవచ్చనే! మీనాక్షి కోడలి ఐశ్వర్యంతో తను అనుభవించేవి వూహించుకుంటూ రంగురంగుల కలలు కనసాగింది.
“అమ్మా” అన్న గర్జింపుకి గభాలున వాస్తవంలోకి వచ్చింది. ఏమిటి అన్నట్లు కొడుకు ముఖంలోకి చూసింది.
“అమ్మా నీకు మనసెలా ఒప్పిందమ్మా! ఎపుడు అలవాటు లేని సుజాత చేత ఎందుకు కోయించావే! అంతగా మేమిద్దరం తిని కూర్చుంటున్నాం అని అనుకంటే ఇలాంటి పనులు నా ఒక్కడికే చెప్పమ్మా” అన్నాడు ఆవేశంగా!
కొడుకు మాటలకు మీనాక్షి నీరయిపోయింది. అప్పుటికపుడు ఏం అనాలో చకచకా ఆలోచించి “ఎంత మాటన్నావురా బాబు. నేనంత పాపిష్టిదాన్ని కాదురా. వద్దమ్మా అని నీకు చేతకాదని ఎంత వారిస్తున్నా, ఎన్నాళ్లత్తయ్యా చేతకాదని ఊరుకోవటం… ఒకవేళ ఆయనకు ఉద్యోగం వచ్చిందే అనుకోండి. అక్కడ నాకు ఎవరు చేసి పెడతారని ఎదురు ప్రశ్నవేసింది. ఎవరో ఒకరు చేసి పడతారులే, అసలే నువ్వు సున్నితం అమ్మా, మోటు పనులు చేయలేవు అంటే నా గురించి మీరు అలా అనుకుంటున్నారు గాని చూడండత్తయ్యా నాకున్న బలం మీకు లేదని నవ్వుతూ కత్తి పీట ముందు కూర్చుంది బాబు. త్రిమూర్తులు కూడా విన్నాడు ఆ మాట. కావాలంటే అడుగు… అంతలా చెబుతున్నపుడు కోయవద్దు అంటే చిన్నబుచ్చుకుంటుందేమో అని ‘సరే కోయమ్మా, తల పగిలిపోతుంది అలా కొంచెం సేపు తల వాల్చుతాను’ అని వెళ్లి పడుకున్నాను బాబు. సుజాతకు అలా కావడంతో నా మనసెంతలా కొట్టుకుపోతుందో నీకెం తెలుసు” అంది బలవంతంగా బాధను గొంతులో తెచ్చుకుని.
తల్లి మాటలు విని నోరెత్తలేకపోయాడు సుదర్శన్! గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వచ్చేశాడు.
అటువైపు తిరిగి పడుకున్న సుజాత కళ్లనుండి కన్నీళ్లు ఏకధారగా కారుతున్నాయి.
అవి చేయి తెగి బాధపడుతున్నందుకు వచ్చే కన్నీళ్లు కావు. కొన్ని కొన్ని కథలు, నవల్సు చదువుతున్నపుడు ఆహా రచయిత కథను ఎంత చక్కగా అల్లాడు, పాత్రలకు ప్రాణం పోసాడు అనిపించేది. నిజంగా సంఘటనలు, పాత్రలు అలా వూహించి అల్లటం వారికే చెల్లింది. అది గొప్ప వరం. అది అందరికి చేతకావద్దు అనుకునేది గాని, అత్తగారి మాటలు వింటుంటే ఎక్కడలేని ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత చక్కగా లేనిది కల్పించి చెప్పారు. లేనిపోనిది అల్లడంలో ప్రవీణురాలన్న మాట. తన మనసు ఎంత బాధకు గురిచేసింది. తన మనసు ఏమైనా ఫర్వాలేదు తన భర్త మనసుని లేనిపోనివి చెప్పి ఈవిడ మార్చదు గదా! ఆవిడ ఒక వేళ అంతకు తెగించినా సుదర్శన్ గట్టిగా బుద్ధి చెబుతాడు… ఆలోచన రావడమే తడువుగా మనసు కుదుటపడింది సుజాతకు.
గదిలోకి సుదర్శన్ వచ్చి ఇటు అటు పచార్లు చేయసాగాడు. మధ్య మధ్యలో ఆవేశం అణచుకోలేని వాడిలా కుడి చేత్తో నదురు గట్టిగా నొక్కుకుంటూ అలానే చేయి వెనక్కి జరిపి నుదురు మీద పడుతున్న జుత్తును వెనక్కు నెట్టాడు. ఉండుండి పిడికిలి బిగించి అరచేతితో గుద్దుకోసాగాడు.
ఇటు తిరిగి భర్తను ఒకసారి ధారకట్టిన కన్నీళ్లలోంచి చూసిన సుజాత మనసులో ఆలోచనలన్నీ పటాపంచలయ్యాయి. వాటి స్థానంలో ఏవో మధురమైన ఊహలు చోటు చేసుకోవడం మొదలుపెట్టాయి.
(సశేషం)