ఉపన్యాస పయోనిధి – పుస్తక పరిచయం

0
5

[dropcap]ఇ[/dropcap]ది కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారి “ఉపన్యాస పయోనిధి” అన్న పుస్తకం గురించిన పరిచయ వ్యాసం.

కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు ఆంధ్రదేశాన్ని ఎడా పెడా సంస్కరించిన కాలంలో ఆయనకు ఎదురుగా నిలిచిన వారెవరు? వారు చేసిన వాదనలు ఏమిటి? బ్రహ్మ సమాజీకుల (BrahmoSamaj) సంస్కరణ భావాలను అప్పటి తెలుగు సమాజపు సంప్రదాయ వాదులు ఎలా ప్రతిఘటించారు? అని ఆలోచించిన క్రమంలో నేను చదివిన పుస్తకం ఇది. 1911 ముద్రణ ఇది. బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవిత కాలం 1860-1940. ఆ కాలపు తెలుగు సమాజం యొక్క స్థితిగతుల గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి ఈ వ్యాసాలను చదివితే. ధార్మిక విషయాలలో తమకు ఉన్న దృక్పథాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో లాగా అనిపిస్తాయి ఈ పుస్తకంలోని వ్యాసాలు.

ఈ పుస్తకం సంపాదకుడు అయిన నందిరాజు చలపతిరావు గారు ఇలా రాశారు ముందుమాటలో

“ఈ “ఉపన్యాసపయోనిధి” యందు మన దేశమందలి హూణవిద్యా ప్రగల్బులగు నాంధ్రులలో సాంఘిక, నీతి, మతములయందు గలిగిన చిత్రవిచిత్రములగు మార్పులనేకములు దిక్ప్రదర్శనముగా జూపబడినవి” అని. ఒక్క వాక్యంలో ఈ వ్యాసాల గురించి చెప్పాలంటే ఇంతకు మించిన వివరణ అక్కర్లేదు. సంప్రదాయానికి సంస్కరణాభిలాషకు ఆంగ్లేయుల కాలంలో జరిగినంత రాపిడి మరి ఏ ఇతర కాలంలోనూ జరగలేదు మన తెలుగు రాష్ట్రాలలో. అప్పటి కాలపు సంప్రదాయ వాదులు ఎదుర్కొన్న సంఘర్షణకు ప్రతీక ఈ పుస్తకం. సాధారణంగా మనకు సంస్కర్తల దృక్కోణం మాత్రమే పరిచయం పాఠ్య పుస్తకాలలో. ఈ పుస్తకంలో సంస్కర్తలకు ఎదురొడ్డినిలిచిన వారి ఆలోచనలు ప్రస్తావించబడ్డాయి.

“జీవన్మతమేది” అన్నవ్యాసం ఒకటి ఉన్నది ఈ పుస్తకంలో. జీవన్మతము అంటే Living religion అనే అర్థంలో వాడారు ఇక్కడ.అప్పటి కాలంలో ఉన్నమతాల గురించి చెప్పుకొస్తూ హిందూ మతము, బౌద్ధ మతము, క్రైస్తవ మతము, ఇస్లాము మతము, బ్రహ్మ సమాజ మతము అన్నవి అప్పటికి ప్రచారంలో ఉన్న మతాలంటారు శాస్త్రి గారు. అయితే వీటిలో ప్రధానమైన మతాలు మూడేనని అవి హిందూ, క్రైస్తవ, బ్రహ్మ సమాజ మతాలేనని అంటారాయన. ఎందుకంటే బౌద్ధము వంటి మతాలు హిందూ మతములోనే ఐక్యమైపోయాయని మహమ్మదీయ మతము అన్నది వ్యాప్తి లేక మృతప్రాయమైపోయిందని అందరికి తెలిసిన విషయమే కదా అంటారు శాస్త్రి గారు.

అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు! ఆయన ఏ ప్రాతిపదికన మహమ్మదీయ మతానికి వ్యాప్తి లేదన్నారో ఏమో మరి. ఆ కాలపు తెలుగు రాష్ట్రాల జనాభా తాలూకా మత గణాంకాలు నేను చూడలేదు. ఇప్పుటి విషయానికొస్తే హిందూ మతం క్రైస్తవ మతం కాకుండా ఇస్లాం మతం తెలుగు రాష్ట్రాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ప్రధాన మతం! అప్పటికి బహుశా తెలుగు రాష్ట్రాలలో అంతగా లేదేమో కానీ ఇప్పటి లెక్కన కమ్యూనిస్టు మతానుయాయులు నాస్తిక మతానుయాయులు అగ్నాస్టిక్ అనబడే అజ్ఞేయమతం వారు స్పిరిట్యుయల్ బట్ నాట్ రెలిజియస్ మతము వారు ఇలా మన దగ్గర ఇప్పుడు లేని మతం లేదు. ఇక్కడ మతం అంటే భావజాల సారూప్యత గల సమూహం అన్న అర్థముతో వాడుతున్నాను. ఈ విషయం పైన రకరకాలుగా వాదించుకోవచ్చును కానీ ప్రస్తుత పరిచయ వ్యాసానికి అది అనవసరం. బ్రహ్మయ్య శాస్త్రి గారి జీవన్మతమేది అనే వ్యాసానికి తిరిగి వెళితే బ్రహ్మ సమాజం అన్న మతానికి మాత్రం ఆయువు నిండిపోయిందని అవసాన దశ సమీపించిందని అంటారు శాస్త్రి గారు. హిందూ మతానికి మాత్రమే అజ్ఞులకు ప్రాజ్ఞులకు ఇరువురికి నచ్చే లక్షణం ఉందని అభిప్రాయపడ్డారు శాస్త్రి గారు. క్రైస్తవంలోనూ మహమ్మదీయ మతంలోనూ ఈ లక్షణము లేదు అని ఆయన అభిప్రాయం. చాలా వరకు ఈ వ్యాసంలో బ్రహ్మ సమాజ పోకడలను గురించిన విమర్శలే ఎక్కువ. ఏమైనా దాదాపు వంద సంవత్సరాల క్రిందటి వ్యాసం ఇది. అప్పటికి ఇప్పటికి చాలా మారాము.

“మతము యొక్క ఆవశ్యకత” అన్న వ్యాసము కందుకూరి వీరేశలింగం గారి “ఉపన్యాస మంజరి” లోని కొన్ని వ్యాఖ్యలను ఖండించటంతో మొదలవుతుంది. శబ్ద ప్రమాణము అధమ ప్రమాణమని , శృతులను షడ్దర్శనాలను గుడ్డిగా నమ్మకూడదని ప్రతి విషయాన్ని స్వీయానుభవముతో స్వీయ బుద్ధితో అర్థం చేసుకోవాలన్న వీరేశలింగం పంతులు గారి వ్యాఖ్యను ప్రస్తావిస్తారు ఇక్కడ శాస్త్రులు గారు. ఎవరు కరెక్టు ఎవరు తప్పు అన్న చర్చ పక్కకు పెడితే అసలు ఇలాంటి ఒక వాదన అప్పుడు కొనసాగిందని మా పాఠ్య పుస్తకాలలో ఎవరూ చెప్పిన పాపాన పోలేదు. వీరేశలింగం పంతులు గురించి చెప్పిన వారు ఇలా కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి వాదన కూడా విన్పించి మీకు నచ్చింది మీరు చేసుకోండయ్యా అని చెప్పటం సరైన పద్దతి. లేదంటే పాఠ్య పుస్తకాల సిలబస్సులలో కూడా రాజకీయాలు ఉంటాయని ఒప్పుకొని ఇది ఫలానా భావజాలానికి చెందిన ప్రభుత్వము మా రాజకీయ భావాలకు అనుగుణంగా తయారు చేసిన పుస్తకాలివి అని ముందుగానే చెప్పాలి. మనవాళ్ళకి మొదటిది చేసే దమ్ము లేదు రెండవది ఒప్పుకోటానికి కావలసిన నిజాయితీ లేదు!

“హిందూ మతము దాని ధర్మములును” అన్నది మరొక వ్యాసం. అప్పటి కాలంలో జరిగిన యజ్ఞోపవీత విసర్జనోత్సవము గురించిన ప్రస్తావనతో ప్రారంభం అవుతుంది ఈ వ్యాసం. అప్పట్లో వీరేశలింగం గారితో కూడా యజ్ఞోపవీతం తీయించి వేసారట సంస్కరణ వాదులు.ఇటువంటివి తమిళనాట ద్రావిడ ఉద్యమ కాలంలో జరిగినట్టుగా తెలుసు. రాజమండ్రిలో న్యాపతి సుబ్బారావు పంతులు గారు ఒక సభలో ఇలా అన్నారట. కర్మ యోగము మరియు పునర్జన్మ వంటి విషయాలను అంగీకరింపక పరమత ధర్మాలతో నిండి యున్న బ్రహ్మసమాజ మతము హిందూ మతమే కానేరదని అన్నారట ఆయన..హిందూ మతాన్ని సంస్కరించాలని అనుకునే వారు హిందూ ధర్మంలోనే ఉండి తమ సంస్కరణలను అమలు చేయాలనీ హిందూ ధర్మాన్ని వదులుకొని పరమతమని చెప్పదగిన బ్రహ్మసమాజము వంటి హైందవేతర మతాలలో ప్రవేశించి హిందువులను సంస్కరించాలని అనుకోవటం సబబు కాదని అభిప్రాయపడ్డారట న్యాపతి సుబ్బారావు పంతులు గారు. అయితే “హిందూ” అన్న పదమే మన పూర్వులు వాడలేదని పునర్జన్మలను గురించిన ప్రస్తావన వేదాలలో లేదని పూర్వపు ఋషులు అందరు బ్రహ్మమును కొలుచుచుండేవారని కాబట్టి బ్రహ్మసమాజ మతమే ఈ దేశపు మతమని వాదించారట వీరేశలింగం పంతులు గారు. ఈ వాదనలన్నిటి గురించి బ్రహ్మయ్య శాస్త్రి గారు చేసిన చర్చే ఈ వ్యాసము. హిందూ అన్న పదమును వీరేశలింగము గారే తమ వ్యాసాలలో గ్రంథాలలో ఎన్నో సార్లు వాడారనీ అటువంటిది ఆయన బ్రహ్మ సమాజాన్ని వెనకేసుకు రావటానికి ఇప్పుడు ఇలా అనటం హాస్యాస్పదమని అంటారు బ్రహ్మయ్య శాస్త్రి.

బ్రహ్మ సామాజికులకు సంప్రదాయ మతానుయాయులకు జరిగిన ఈ వాదోపవాదాల గురించి మనము మర్చిపోయాము ఇంచుమించుగా. వీరేశలింగం పంతులు ఎవరు? అని పరీక్షలో ప్రశ్న వస్తే, వీరేశలింగం పంతులు గొప్ప సంస్కర్త. న్యాపతి సుబ్బారావు పంతులు ఎవరో మాకు తెలియదు. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గురించి మాకు అనవసరం. వీరేశలింగం పంతులు గొప్ప సంస్కర్త. చాలా గొప్ప సంస్కర్త అని రాసిందే మళ్ళీ మళ్ళీ రాసి ఇవ్వండి ఐదు మార్కుల ప్రశ్నకు ఆరు మార్కులు అని అడగటమే మన చదువులు!

నిజానికి చాలా లోతైన చర్చలు చేసారు బ్రహ్మయ్య శాస్త్రిగారు బ్రహ్మ సమాజ ధోరణి గురించి ఈ వ్యాసాలలో. అయితే ఇప్పటి కాలపు తెలుగువారికి ఇవి అక్కర్లేదు.బహుశా ఇంగిలీషులో అచ్చు వేస్తే చదువుతారు కామోసు. ఏదో అమెరికా విశ్వవిద్యాలయం వారు పూనుకుంటే మంచిది ఈ విషయమై. కెనడా న్యూజిలాండు ఆస్ట్రేలియా వారైతే ఇంకా మంచిది.

“హిందూ మతము ఒంటెత్తుతనము కలిగించునదియా” అన్నది మరొక అద్భుతమైన వ్యాసము. బ్రహ్మసమాజ ప్రముఖులలో ఒకరైన శివనాథ శాస్త్రి గారి గురించిన ప్రస్తావన వస్తుంది ఈ వ్యాసాలలో పదే పదే . బ్రహ్మ సామాజీకులైన శివనాథ శాస్త్రి గారు కాకినాడలో జరిగిన ఒక సభలో హిందూ మతము గురించి ఇలా అన్నారట: “It has made the higher religion of India essentially anti-social” అని. ఈ విషయమై చర్చిస్తూ బ్రహ్మయ్య శాస్త్రి గారు లాలా లజపతి రాయి రాసిన హిందూ మత సామజిక లక్షణము (The social genius of Hinduism) అన్నవ్యాసం గురించి ప్రస్తావించారు. అసలు శివనాథ శాస్త్రి వంటి బ్రహ్మ సామాజికులు ఉన్నత హిందూమతము సాంఘిక ధర్మవిరుద్ధమగు వైరాగ్యాన్ని బోధించింది అని అనటం చాలా పెద్ద తప్పని అంటారు బ్రహ్మయ్య శాస్త్రిగారు. జ్ఞానులలో ప్రథమగణ్యులైన జనకుడు సంసారి కాదా? జ్ఞాన వాశిష్ఠం వంటి మహా వేదాంత గ్రంథాలను విరచించిన వశిష్ఠుడు సంసారి కాదా ? లోకానికంతా వేదాంతాన్ని బోధించిన అవతారమూర్తులైన రామకృష్ణాదులు సంసారులు కాదా? ఉన్నత హిందూ మతము భోదించే భగవద్గీత శత్రు సంహారము గావించి జగము నేలమని చెప్పింది కానీ దిగంబరులై అడవుల పాలు కమ్మని చెప్పలేదు కదా? అని ప్రశ్నిస్తారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమము అన్నది కూడా ఒకటి కదా అసలు మనవాళ్ళు తక్కిన అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమమే ఘనమైనదిగా అభివర్ణించారని అంటారు శాస్త్రులు గారు. ఎవరో ఎందుకు సకల వేదాంత సారము తెలుసుకున్న ఆది శంకరాచార్యులు జనసంఘాన్ని విడిచి అడవికి పోయి ముక్కు మూసుకొని తపస్సు చేయలేదు సరికదా ఆసేతు హిమాచలం తిరిగి లోకక్షేమార్ధం మతభోధ గావించాడని ఇందువలన హిందూ మతము యాంటీ సోషల్ అంటే సాంఘిక ధర్మ విరుద్ధమైన మతము అన్న అభిప్రాయము తప్పని నిరూపిస్తారు బ్రహ్మయ్య శాస్త్రి. అయితే ఈ వ్యాసంలో చాలావరకు లాలా లజపతి రాయి రాసిన ఇంగిలీషు వ్యాసం తాలూకా భాగాలను ఉటంకించారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. లజపతి రాయి గారు తన ఇంగిలీషు వ్యాసంలో వేదాలలోని కొన్ని వాక్యాలకు ఆంగ్ల అనువాదాన్ని యథాతథంగా వాడారట. అలా చేయటానికి గల కారణం వివరిస్తూ వేదవాక్యాల విషయంలో యూరోపు మేధావుల ఆంగ్ల అనువాదాలను యథాతథంగా ప్రస్తావిస్తే తన సొంత ఊహతో కల్పన చేస్తున్నాడు అని తనను ఆక్షేపించే అవకాశం ఉండదు కదా అని సంజాయిషీ ఇచ్చారట లాలా లజపతి రాయి అప్పట్లోనే. ఇది ఎప్పుడో 1911 ముందునాటి మాట. వందేళ్లల్లో ఈ భావదాస్యం ఇంకా చొచ్చుకుపోయింది మన మస్తిష్కాలలో. అసలు ఇప్పుడు ఇటువంటి విషయాల పై ఏమి మాట్లాడాలన్నా వాడు విదేశీ విద్యాలయాలలో మత శాస్త్రాలలో లేదా తత్వ శాస్త్రాలలో పట్టభద్రుడై ఉండాలి. అసలుకే విదేశీయుడైతే మరీ మంచిది. ఇదే మనం సాధించిన ప్రగతి.

ఇక మరొక వ్యాసంలో వీరేశలింగం పంతులు గారు ప్రతిపాదించిన మత విషయాలన్నిటిలో అద్వైత మత బీజములు ఉన్నాయని అయితే ఆ విషయం ఆయనకి అర్థమైనట్టుగా లేదని అంటారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు.

“రావుబహదూర్ వీరేశలింగం పంతులు గారి ఆత్మజ్ఞానము” అన్న మరొక వ్యాసంలో వీరేశలింగం పంతులు గారి భావజాలాన్ని కూలంకషంగా విశ్లేషిస్తారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు. విగ్రహారాధనను పునర్జన్మల పరంపరలను తిరస్కరించిన వీరేశలింగం పంతులు గారికి ఆత్మను గురించి ఏమియును తెలియకపోగా విపరీత జ్ఞానము కూడా కలదని నిష్పక్షపాత బుద్ధితో ఆయన రచనలను చదివిన వారికి తెలుస్తుందని అభిప్రాయపడతారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు. వీరేశలింగం గారు మనస్సే పరమాత్మ అని తన రచనలలో రాసారని మన పెద్దలు మనస్సే ఆత్మని రాసిన దాఖలాలు లేవని పైపెచ్చు మనస్సు ఆత్మ కాదని కూడా నొక్కి చెప్పి ఉన్నారని అంటారు శాస్త్రులు గారు. పంతులు వారు మనసును ఆత్మగా గ్రహించుట తప్పనీ అది ప్రకృతి కంటే వేరేదియును లేదను నిరీశ్వర వాదులు (materialists) చేయు వాదన కానీ ఆస్తికులు చేయు వాదము కాదనీ అంటారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు. దేహమునకు చక్షురేంద్రియాలు ఎలాగో ఆత్మకు మనోబుద్ధి చిత్తాహంకారములు అటువంటివని అంటూ మనస్సే ఆత్మ అనే వీరేశలింగం పంతులు గారి వాదాన్ని తిప్పికొడతారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు.

నేనేమి మహా తపస్విని కాను పూర్వాచార పరాయణుడిని కాను కేవలం కుతూహలం కలిగిన చదువరిని. నా బాధల్లా ఏమిటంటే ఇంత చక్కని వాగ్వివాద సంస్కృతిని మనము కోల్పోయామే అని.అసలు తెలుగు సాహిత్యంలో ఇటువంటి సంప్రదాయ దృక్కోణాన్ని వినిపించే నాథుడు ఉన్నాడా ఇప్పుడు? అసలు తెలుగు సాహిత్యంలో ఇప్పుడు ఇలాంటి చర్చలు జరిగే వాతావరణం ఉందా? ఎందుకు ఇంత అధ్వాన స్థితికి చేరుకుంది తెలుగు సాహిత్యం? ఇవి నా మస్తిష్కంలో ప్రశ్నలు ఇటువంటివి చదివినప్పుడు.

ఈ పుస్తకంలోని వ్యాసాలలో చాలా చోట్ల హిందూ మత విషయాల గురించి విదేశీయులు రాసిన గ్రంథాలలోని ఇంగిలీషు వాక్యాలు యథాతథంగా ప్రచురించి తర్వాత తెలుగులో అనువదించారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. ఇలా హూణ భాషలలోని వ్యాఖ్యలనే తాను ప్రమాణాలుగా ఎందుకు చూపాల్సి వచ్చిందో ఒక వ్యాసంలో ఇలా చెప్పుకొస్తారు శాస్త్రిగారు. ఈ కాలపు ఆర్యసంతతుల వారు పలువురు హూణభాషలో ఉన్న దానినే ఎక్కువగా గౌరవిస్తున్నారని కాబట్టే ఇలా రాయాల్సి వచ్చింది కానీ అంత మాత్రం చేత మన భాషలలో మన పెద్దలెవరు ఇటువంటి విషయాలు రాయలేదని అనుకోనక్కర్లేదని అంటారు శాస్త్రులుగారు. వందేళ్ళ ముందే ఒక రచయిత ఇలా సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది అంటే మనమెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నట్టు? అసలు ఈ భావదాస్యాన్ని గొప్ప ప్రగతిగా భావించే స్థాయికి వచ్చాము ఇప్పుడు మనం. తెలుగు సినిమా పాట సాహిత్యాన్ని ఇంగ్లీషు లిపిలో చదువుకొనే స్థాయికి వచ్చాము ఇప్పుడు. కొత్త తరం వారికి తెలుగు అర్థం అవుతుంది కానీ చదవటం రాదట! మన భాషలో ఉన్న ఇటువంటి సాహిత్యం తర్వాతి తరానికి చేరేది ఎలాగో ఇలాగైతే!

ఈ పుస్తకంలోని ప్రతీ వ్యాసమూ వీరేశలింగం గారిని తిట్టిపోసేందుకో లేక బ్రహ్మసామాజికులను ఇతర సంస్కర్తలను తప్పుపట్టటానికో రాసినవి కావు. కొన్ని శుద్ధమైన వేదాంత మత తత్త్వ విషయాల చర్చను గురించినవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు భ్రమరకీట న్యాయము అన్న వ్యాసమును తీసుకుంటే గొంగళి పురుగు నుంచి సీతాకోకచిలుక పుట్టే ప్రకారణాన్ని ఉదాహరణగా చూపుతూ అందులో “తత్వమసి” అనే శృతి వాక్య సారాన్ని దర్శింపవచ్చని సామాన్యులకి అర్ధమయ్యే భాషలో చక్కగా వివరించారు బ్రహ్మయ్య శాస్త్రి గారు.

ఏకేశ్వర వాదం అంటే మోనోథీయిజం అన్నది బ్రహ్మ సమాజం వారి వల్లనే ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రారంభమైందని అంతకు మునుపు భారత దేశంలోని హిందూ మతంలో ఆ ఆలోచన అసలు లేదని ఆ కాలంలో పలువురు భ్రమించేవారట. అటువంటి వారికి కనువిప్పు కలిగించటానికి రాసినదే “ఏకేశ్వర వాదం” అన్న వ్యాసం. బ్రహ్మ సమాజ భావజాల ప్రభావం 1900 కాలం నాటి తెలుగు రాష్ట్రాలలో ఇంతగా ఉండేదనమాట !

“శ్రీ కృష్ణ భగవానులవారు” “శ్రీ కృష్ణమూర్తి “ “శ్రీ కృష్ణుడు జారుడా” అని కృష్ణుని గురించిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి ఈ పుస్తకంలో. కొందరు క్రైస్తవ వాదులు శ్రీ కృష్ణుడిది వట్టి కల్పిత కథ అని నిజానికి అతని చరిత్ర క్రైస్తవం నుండి క్రీస్తు చరిత్ర నుండి గ్రహింపబడిందని రాశారట అప్పట్లో. అటువంటి వ్యర్థ ప్రేలాపనలకు ప్రతిగా రాసిన వ్యాసాలు ఇవి. ఇదంతా చుస్తే అప్పటికి ఇప్పటికి సమాజంలో పెద్ద మార్పు వచ్చినట్టుగా అనిపించదు. ఇప్పుడు కూడా హిందూ దేవతల గురించి రకరకాల మాధ్యమాలలో ఇటువంటి వాదనలు చేసేవారికి కొదువ లేదు. కృష్ణునికి జారత్వము ఆపాదించటం అన్నది చాలా పెద్ద తప్పని నిజానికి కృష్ణుడి జీవిత కాలంలో ఆయనకి ఆగర్భ శత్రువులైనటువంటి శిశుపాలుడు జరాసంధుడు వంటివారు కూడా నేటికాలపు విమర్శకులవలె కృష్ణుడికి జారత్వాన్ని ఆపాదించే స్థాయికి దిగజారలేదని అంటారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. గోపికా వస్త్రాపహరణంను అర్థం చేసుకోవలసిన విధానం గురించీ “గోపీ” శబ్దార్థము గురించీ రాసారు ఈ వ్యాసంలో బ్రహ్మయ్య శాస్త్రిగారు. ఐతే గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో వేదాంతార్థము ఉంటే ఉండవచ్చును కానీ నిజానికి అంత సద్భావమును బోధించాలంటే అంతకంటే మంచి ఘట్టమే దొరకలేదా మీకు వర్ణించటానికి అని నవనాగరికులు ఆక్షేపించచ్చును అంటారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు. ఈ ఆక్షేపణలకు ప్రతిగా వేదాంత ధోరణిలో కాకుండా వ్యావహారిక ధోరణిలోనే సమాధానం ఇస్తారు శాస్త్రి గారు.

1905లో పరమపదించిన బ్రహ్మసమాజ ప్రవక్త అయినటువంటి ప్రతాప చంద్ర మజుందార్ గురించిన వ్యాసం మరొకటి ఉన్నది ఈ పుస్తకంలో . రాజరామ మోహన్ రాయి వంటి వారు కర్మ మార్గాన్ని త్యజించి కేవల జ్ఞాన మార్గ మతంగా క్రైస్తవ మతం యొక్క భావాల స్పూర్తితో బ్రహ్మ సమాజ మతాన్ని స్థాపించి ప్రజలలో వ్యాప్తికి ప్రయత్నించారని అయితే కేవలం జ్ఞాన మార్గం మీద ఆధార పడిన మతం ఈ దేశంలో ఎప్పటికి వ్యాప్తి చెందదని అంటారు ఈ వ్యాసంలో బ్రహ్మయ్య శాస్త్రి గారు. మన అభిప్రాయములు ఇతరులకు చెప్పటానికి శబ్దము అన్నది ఎలా అవసరమో అలాగే మతధర్మములు సామాన్యులకు బోధ పరచటానికి విగ్రహారాధన ఇతర కర్మానుష్టానము అంతాను అవసరమేనని విగ్రహారాధనను వ్యతిరేకించిన బ్రహ్మసమాజాది సంస్కర్తల మతం తప్పని వాదిస్తారు శాస్త్రి గారు. ఈ వ్యాసంలో బ్రహ్మ సమాజం ఆవిర్భావం నుంచి అంటే రాజా రామ్ మోహన్ రాయి, దేబేంద్రనాథ్ ఠాగూర్ కాలం నుంచి కేశబ్ చంద్ర సేన్ వంటి తర్వాతి కాలపు ప్రముఖ బ్రహ్మ సామాజికుల గురించిన చర్చలు చేసారు బ్రహ్మయ్య శాస్త్రి గారు.

“బ్రహ్మ సమాజ మతము హిందూ మతమా “ అని మరొక వ్యాసము. పునర్జన్మ వాదాన్ని జన్మ పరంపరలను ఒప్పుకోని బ్రహ్మ సమాజ మతము హిందూ మతము కానేరదని ఖరాఖండిగా తీర్మానిస్తారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు. ఇంతే కాక హిందూ మతము కర్మ అనాది అనీ మానవులకే కాక పశుపక్ష్యాదులకు శిలా పర్వతాలకు కూడా ఆత్మ కలదని చెప్తుందనీ క్రెస్తవ ప్రభావానికి లోనైన బ్రహ్మ సామాజికులు ఈ విషయం అంగీకరింపరని అప్పుడిక వారు హిందూ మతస్తులు ఎలా అవుతారని వాదిస్తారు శాస్త్రులు గారు. ఇంతేకాక క్రైస్తవ ప్రభావానికి లోనైన బ్రహ్మ సామాజికులు విగ్రహారాధనను గుడ్డిగా వ్యతిరేకించారని కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము కలగలిసిన హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నంలో క్రైస్తవుల వలె కేవలం భక్తి యోగాన్ని మాత్రమే విలక్షణ యోగంగా బ్రహ్మ సామాజికులు చూడటం ప్రారంభించారని అంటారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు.హిందూ మతములో దేవునియందు మాతృ భావన కూడా ఉన్నదని క్రైస్తవం వలె బ్రహ్మ సామాజికుల మతంలో కూడా అది లేదని ఆత్మను అవయవిగా మనసును అవయవంగా భావించే హిందూ మతంతో వీరేశలింగం గారిలా మనస్సే ఆత్మ అని వాదించే బ్రహ్మసమాజీకులతో పోలిక తగదని బ్రహ్మసమాజ మతం ఈ కారణాల వల్ల ఏ విధంగా ఆలోచించినా అసలు హిందూ మతమే కాదని అంటారు బ్రహ్మయ్య శాస్త్రి.

ఇదంతా చదువుతూ ఉంటే అప్పటి కాలపు మిషనరీలు రాసిన సాహిత్యం గుర్తుకు వచ్చింది నాకు.

The various samajs and eclectic systems of today are thus the resultant of contact of the Indian mind with Christian truth and institutions, leading to a return to the Vedas and to the amalgamation with them of many Christian ideas. Most of these movements are merely half-way houses between Hinduism and Christianity. They are with faces more or less turned toward the light and possess the progressive spirit, which, in some cases, can not fail of landing their members at no distant date in the Christian fold

అంటే అప్పటి కాలంలో పుట్టుకొచ్సిన రకరకాల సమాజాలు అనగా బ్రహ్మ సమాజం ఇతరత్రా సంస్కరణోద్యమాలు వగైరాలు అన్ని కూడా రేపో మాపో ఈ దేశాన్ని సమూలంగా క్రైస్తవీకరించటానికి ఉపయోగపడే సాధనాలే అని “ఇండియా అండ్ క్రిస్టియన్ ఆపర్చునిటీ” అన్న తన పుస్తకంలో రాసుకున్నాడొక మిషనరీ అప్పట్లో. కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఈ వ్యాసాలలో చెప్పినది అంతా కూడా ఇదే.

అయితే అప్పటి బ్రహ్మ సామాజికులు ఈ వాదనలు త్రోసిపుచ్చుతూ తమది బ్రహ్మ మతమని అంటే ఉత్తమమైన ఉపనిషత్ భోదిత హిందూ మతమని సామాన్య జనులు ఆదరించే పౌరాణిక హిందూ మతము కాదని అనేవారట. ఈ వాదనలు కూడా ఖండిస్తూ బ్రహ్మయ్య శాస్త్రులు గారు ఉపనిషన్మతమే పురాణ మతమని పురాణ మతమే ఉపనిషన్మతమని వీటిని వేరుగా చూడటంలో అర్థం లేదని ప్రమాణపూర్తిగా వాదిస్తారు “బ్రహ్మ సమాజ మతము హిందూ మతమా “ అన్న ఈ వ్యాసంలో.

ఇలాగే కేశబ్ చంద్ర సేన్ ను దైవ సమానులని భావించి ఆయన శిష్యులు పూజించారని బ్రహ్మ సామాజికుల మార్గాలను విమర్శిస్తూ అంటారు బ్రహ్మయ్య శాస్త్రిగారు. కేశబ్ చంద్ర సేన్ మరియు అతని అనుయాయుల వింత పోకడల గురించి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ప్రస్తావించారు తన నవలా సాహిత్యంలో పలు చోట్ల. అది గుర్తుకు వచ్చింది నాకు ఇది చదువుతూ ఉంటే.

ఇక క్రీస్తు మత శాఖలు అన్న వ్యాసంలో క్రైస్తవంలో గల 154 శాఖలను గురించి ప్రస్తావిస్తారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. ఇక మరొక వ్యాసం రాజా రామ్ మోహన్ రాయ్ గురించి. ఇందులో రామ్ మోహన్ రాయి విదేశాలకు వెళ్ళినపుడు కులం చెడకుండా తన వెంట ఒక వంట బ్రాహ్మణుడిని తీసుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తారు కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు. రాజారామ్ మోహన్ రాయి యజ్ఞోపవీతాన్ని సహితం విడిచి పెట్టలేదని అంటారు ఆయన. ఈ విషయమై మానియర్ విలియమ్స్ రాసిన వాక్యాలను ప్రస్తావించారు బ్రహ్మయ్య శాస్త్రి గారు: మానియర్ విలియమ్స్ ఇలా రాశారట రాజా రామ్ మోహన్ రాయి గురించి.

He died a Hindu in respect of external observances; his Brahman servant performed the usual rites required by his master’s caste, and his Brahmanical thread was found coiled round his person when his spirit passed away.

In all his Anti-Brahmanism he continued a Brahman to the end.

మానియర్ విలియమ్స్ రాజా రామ్ మోహన్ రాయి గురించి రాసిన రచనలలో నుంచే మరొక విషయం గురించి కూడా ప్రస్తావించారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. అప్పటి బ్రహ్మ సమాజ సమావేశ మందిరాలలో వేద పఠనానికి సంబంధించిన ప్రైవేట్ గదులు ఉండేవట వాటిలోకి బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉండేదట. కాబట్టి రాజా రామ్ మోహన్ రాయి హిందూ మతాన్ని మూలాలతో సహా పెకిలించివేసి సంస్కరించాలని అని అనుకునేటటువంటి సంస్కర్త కాదని అంటారు బ్రహ్మయ్య శాస్త్రులు గారు. ఇటువంటి ధోరణి రామ్ మోహన్ రాయ్ అనంతరం వచ్చిన బ్రహ్మ సామాజికులలో బాగా ప్రబలిందని అంటారు రచయిత.

“బ్రహ్మ సమాజ మత పరిణామము” అన్న వ్యాసంలో అప్పటి సమాజంపై క్రైస్తవ సంస్కృతి ప్రభావం గురించి ఆ ప్రభావం వల్ల పుట్టుకొచ్చిన సంస్కరణోద్యమాల గురించీ వ్యాఖ్యానించారు. బిపిన్ చంద్ర పాల్ వంటివారు కూడా మొదట బ్రహ్మసమాజం లో చేరి చివరికి హిందూ మతంలోకి తిరిగి వచ్చారని అంటారు బ్రహ్మయ్య శాస్త్రి గారు.

“బ్రహ్మ సమాజమునందు విశేషము కలదా” అన్న వ్యాసంలో శాస్త్రిగారు చేసిన ఈ వ్యాఖ్యలు నాకు బాగా గుర్తుండిపోయాయి. బ్రహ్మ సామాజికులు మన మత గ్రంథములు చదవరు. మన మత చరిత్రములను అభ్యసించరు.క్రీస్తు మత గ్రంథములను చదివి వాని చరిత్రములను అనుసరించి మన మతాన్ని విమర్శిస్తారు. క్రీస్తు మతము నుండి బయలు వెడలిన ప్రొటస్టెంటు మతమును బట్టి వారు చేసే వాదములను అనుసరించి మన మతంలోకి వీరి వాదాన్ని తెచ్చి పెట్టారేకానీ మన మతమును తెలుసుకొని కాదని అంటారు బ్రహ్మయ్య శాస్త్రి గారు.

ఇక 1872 ప్రాంతంలో బ్రహ్మో వివాహాల కోసం తెచ్చిన సివిల్ మ్యారేజ్ చట్టాల గురించి ప్రస్తావిస్తూ “మొదటి బ్రహ్మో వివాహము” అన్న వ్యాసమొకటి ఉన్నది ఈ పుస్తకంలో. అసలు మన దేశములో కేవల లౌకిక వివాహాలు అన్నవి ఎప్పుడు లేవని ఈ బ్రహ్మ సామాజీకులే ఇటువంటి వివాహాలను కొత్తగా తెచ్చిన వారయ్యారని అంటారు శాస్త్రి గారు. వీరేశలింగం పంతులు గారి పర్యవేక్షణలో ఇటువంటి బ్రహ్మో వివాహం జరిగిన ఘట్టాన్ని ప్రస్తావిస్తారు ఈ వ్యాసంలో బ్రహ్మయ్య శాస్త్రిగారు. అయితే బ్రహ్మ సామాజికులు కొత్త వివాహ పద్దతిని కనిపెట్టాలని ఎంత తాపత్రయ పడినా చివరికి వారి వివాహ పద్ధతులు కూడా హిందూ వివాహ పద్దతుల వలెనే ఉన్నాయని అంటారు శాస్త్రిగారు. కన్యాదానం పాణిగ్రహణము మంగళసూత్ర ధారణ సప్తపది వగైరాలన్నీ ఈ బ్రహ్మో వివాహాలలో కూడా ఉన్నాయని అంటారు బ్రహ్మయ్య శాస్త్రి గారు. పురుషుల మెడలో ఉండే యజ్ఞోపవీతాన్ని అది విగ్రహారాధకము వంటిదని నిందించి దానిని తీసివేస్తున్నవారు స్త్రీల మెడలో యజ్ఞోపవీత స్థానీయమగు మంగళసూత్రాన్ని కట్టించటం హాస్యాస్పదం అంటారు శాస్త్రిగారు. పురుషుని మెడలో సూత్రము విగ్రహారాధకమైతే స్త్రీ మెడలో సూత్రము మాత్రము విగ్రహారాధకము కాదని ఎలా అనగలుగుతున్నారో తనకు బోధపడట్లేదని అంటారు శాస్త్రిగారు.

నాకైతే ఈ వ్యాసాలు ఉపన్యాసాలు చదువుతూ ఉంటే ఇవేవో వందేళ్ల కిందటి పాతబడిన విషయాల గురించిన వ్యర్థ చర్చలుగా అనిపించలేదు. నేటికీ ఈ వాదప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి మన సమాజంలో రకరకాల స్థాయిలలో. ఒక రకంగా చూస్తే పెద్దగా ఏమి మార్పులేదు అని కూడా అనచ్చు. ఇంకా చదవాల్సినది చాలా ఉన్నది అప్పటి కాలంలో సంస్కర్తలకు వ్యతిరేకంగా వచ్చిన వాదనలను గురించి. అప్పుడే అప్పటి సమాజం గురించి సరైన అవగాహన అన్నది వచ్చేది. కాబట్టి వీరేశలింగం పంతులు గారు చేసిన రకరకాల సంస్కరణలను మెచ్చుకుంటే మెచ్చుకున్నారుగాక కానీ ఆయనను ప్రభావితం చేసిన బ్రహ్మ సమాజ భావాలను వాటి తాత్విక మూలాలను వారిపై వలస పాలకుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అది అంతా అర్థం కావాలంటే కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి వంటి వారి రచనలను ఈ తరం మరొక్కసారి నెమరువేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here