[box type=’note’ fontsize=’16’] చిత్తూరు జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా కార్వేటి నగరం లోని ‘శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం, కార్వేటి నగరం
[dropcap]చి[/dropcap]త్తూరు జిల్లాలోని కార్వేటి నగరాన్ని ఏలిన రాజులు పూర్వం చోళ రాజుల పరంపరలోనివారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని విజయనగర రాజులేకాక వారి సామంత రాజులు, మిత్ర రాజులు కూడా సేవించి తరించారు. వాళ్ళల్లో ప్రసిధ్ధులు కార్వేటి నగర రాజులు. పద్మావతీ దేవి తండ్రి అయిన ఆకాశరాజుకు నారాయణపురంతో కూడిన అర్ధ రాజ్యాన్ని ధారాదత్తం చేసింది ఈ రాజులే. వీరికి శ్రీహరి స్వప్న సాక్షాత్కారంలో అలా చేయమని చెప్పాడంటారు.
ఈ రాజులు వైష్ణవాలయాలతోబాటు శివాలయాలు కూడా నిర్మించి శివ కేశవులకు బేధం లేదని నిరూపించారు. ఆయా ప్రాంతాల రాజుల ప్రాభవాలు వారితోనే అంతరించి పోతున్నాయి. మన పూర్వీకుల చరిత్రలను నిక్షిప్తం చేసి వారి పేర్లని నిలబెట్టే అణుమాత్రం పని కూడా ఎవరూ చెయ్యటం లేదేమో అనిపిస్తోంది. అలా చరిత్రలో కలిసిపోయిన రాజ్యాలలో ఈ కార్వేటినగరం కూడా ఒకటి. ఈ చరిత్రలన్నీ ముద్రణకి నోచుకుని భావి తరాలకు ప్రోత్సాహకంగా సజీవంగా నిలవాలని ఆశిద్దాము.
ఇంక ఇక్కడ వెలసిన శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం విషయానికి వద్దాం.
కార్వేటి నగర రాజులలో 142వ రాజైన రాజా వెంకట పెరుమాళ్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడంటారు. క్రీ.శ. 1157వ సంవత్సరంలో ఈ దేవాలయంలో 80 రోజులు శివ సంబంధ యజ్ఞం చేసి అవిముక్తేశ్వరం (కాశి), ఇల్లకేశ్వరం, అక్కసలేశ్వరం మొదలగు శివాలయాలకి భూదానం చేసినట్లు ఒక తమిళ శాసనంలో వున్నది.
భగవాన్ రామానుజుల తరువాత కాలంలో ఇది విష్ణ్వాలయంగా మారి వుండవచ్చునంటారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామితోపాటు పూజలందుకొంటున్న శ్రీ వేణుగోపాలస్వామివారిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి నగర రాజులు శివాలయాన్ని వైష్ణవాలయంగా మార్చేశారంటారు. ఇది అన్నమయ్య కాలంలో జరిగి వుండవచ్చు అంటారు. అన్నమయ్య శ్రీకృష్ణునిపై అనేక కీర్తనలు రచించారు. తిరుమలలో తను నిత్యం సేవించే స్వామివారు లేరని అన్నమయ్య ఒక కీర్తనలో తన ఆవేదనని వ్యక్తం చేశాడు. (ఇందిరా రమణు తెచ్చి ఇయ్యరో మాకిటువలే…)
విశిష్ట కృష్ణాలయాలలో ఒకటైన ఈ ఆలయ గోపురం మీద మనోహరమైన శిల్పకళని చూడవచ్చు. దశావతారాలు, కృష్ణ లీలా తరంగిణి, క్షీర సాగర మథనం వగైరా ఎన్నో పురాణ కథలు చెక్కబడి వున్నవి. ప్రతి అంతస్తు మీద బారులు తీరిన శిల్పకళని చూడవచ్చు.
ఆలయం విశాలమైన ఆవరణలో ప్రశాతత ఉట్టి పడుతూ వుటుంది. ముఖమండపంపై పలు దేవతా మూర్తులు అలరారుతున్నాయి. ప్రధాన ఆలయం విమానంపై కృష్ణ వైభవం, కృష్ణ భక్తుల విగ్రహాలు, దశావతారాలు వున్నాయి. ఆలయంలో స్తంభాలపై కూడా అద్భుతమైన శిల్పకళని చూడవచ్చు.
ఉపాలయాలలో ఆంజనేయస్వామి, దర్శనమిస్తారు. ముకుళిత హస్తాలతో, స్ధానక రూపంలో ప్రసన్నంగా వున్న ఈ స్వామిని దర్శించుకుంటే సకల భయాలు పోతాయి అంటారు. మరో ఉపాలయంలో మహలక్ష్మీ దేవి కొలువు తీరి వుంది. ఈ ఆలయం ప్రాంగణంలోనే శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయం కూడా వున్నది. ఇక్కడ చాలా అద్భుతమైన ఏకశిలా విగ్రహం, శ్రీ సీతారాముల పట్టాభిషేకానిది వున్నది.
చోళ రాజులు నిర్మించిన విశాలమైన కోనేరుని ఇక్కడ చూడవచ్చు. నిర్మించి శతాబ్దాలు గడిచినా నేటికీ అద్భుతమైన జలరాశితో కళకళలాడుతోంది.
ఈ దేవాలయాన్ని 1989లో తిరుమల తిరుపతి దేవస్ధానం వారు దేవాదాయ – ధర్మాదాయ శాఖనుండి తమ అధీనంలోకి తీసుకున్నారు. అంతకు ముందే శిధిలమవుతున్న ఆలయాన్ని వీరు స్వాధీనం చేసుకున్న తర్వాత పునరుధ్ధరిస్తున్నారు.
ఈ ప్రాంతం గురించి 1830లో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తమ కాశీయాత్రలో కార్వేటినగరంలోని కనకమ్మసత్రంలో విడిదిచేశామని రాశారు. కనకమ్మసత్రాన్ని బొమ్మకంటి శంకరయ్య నిర్మించారు. ఈ ప్రాంతం వ్యాపారాలు బాగా జరిగే పేట స్థలమనీ, ఇక్కడ సంపన్నులైన కోమట్లు నివాసముండేవారని వ్రాశారు. కోనేటి నీళ్ళు చాలా బాగున్నాయని వ్రాశారు.
18వ శతాబ్దం మొదట్లో వున్న సారంగపాణి అనే వాగ్గేయకారుడు ఈ స్వామిపై అనేక పాటలు రాశాడు. ఆ పాటలలో 200 దాకా ఇప్పుడు లభ్యమవుతాయిట.
చిత్తూరు – పుత్తూరు జాతీయ రహదారిపై పుత్తూరు నుండి 12 కి.మీ.ల దూరంలో వున్న ఈ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం నుంచీ సాయంత్రం 5-30 దాకా.