[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత, సంపాదకులు, పాత్రికేయులు జి. వల్లీశ్వర్ ’99 సెకన్ల కథ’ సిరీస్‌లో ఈ వారం రెండు కథలు సంచిక పాఠకులకు అందిస్తున్నారు. ఈ కథలు ప్రపంచతత్వాన్ని, మానవ మనస్తత్వాన్ని సూక్ష్మంగా ప్రదర్శిస్తాయి. [/box]
1. తెలుగు భాష వైభవం!
[dropcap]తె[/dropcap]లుగుభాష మీద ప్రేమ కొద్దీ తెలుగు భాషా పండితుడిగా యోగ్యత సంపాదించుకొని, ఓ మంచి కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా ఓ వెలుగు వెలిగిన నందన రావు కొన్ని దశాబ్దాలపాటు అమెరికాలోని విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు భాషకి, సాహిత్యానికి సేవ చేసి, చేసి, ఇక చాలనుకున్నాక స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేశాడు.
వచ్చిన రెండో రోజునే ఇక్కడ తెలుగు భాష ప్రేమికుల వేదిక ఒకటి పనిచేస్తోందని తెలిసి, బ్రహ్మానందపడిపోయాడు.
మూడో రోజునుంచి తెలుగు పత్రికలు రెండు తెప్పించుకుంటున్నాడు.
“ఆహా, తెలుగు భాషని ఇలా పత్రికల రూపంలో చూస్తుంటే ఎంత రమ్యంగా ఉంది” అని మురిసిపోయాడు.
అమెరికాలో ఉంటూ కూడా తెలుగు భాష, సాహిత్యం గురించి అనేక వ్యాసాల రూపంలో తెలుగుని సుసంపన్నం చేస్తూ వచ్చిన మహానుభావుడిగా నందన రావుని గుర్తించిన ఓ సాహితీ వేదిక ఆయనకి ఘన సన్మానం చేసింది. తెలుగు భాష ప్రేమికులతో కిటకిటలాడిపోయిన ఆ ప్రాంగణం చూసి, నందన రావు ఆనందపడ్డాడు.
“ఆహా, తెలుగు భాషకి మళ్ళీ ఎంతకాలానికి మంచిరోజులు వస్తున్నాయి…” అని మురిసిపోయాడు.
తెల్లవారింది!
ఉదయాన్నే అత్యధిక ప్రతుల విక్రయాలకు పేరుపడ్డ తెలుగు పత్రికలో తన సన్మాన సభ వార్త చదువుతుంటే, మనసు చివుక్కుమంది.
గుండె విలవిల్లాడిపోయింది. కల్తీలేనిదల్లా 4X5 సెంటీమీటర్ల స్థలంలో వేసిన సన్మానం ఫొటో ఒక్కటే.
ఇక వార్తలో నాలుగో వంతు విపరీతార్ధాలనిచ్చే పదాలే కనుపిస్తున్నాయి.
“… సభలో ‘ఆహుతులంతా’ చేసిన కరతాళధ్వనులతో ఆ ప్రాంగణం…”
ఎవడీ ‘ఆహుతుల్ని’ కనిపెట్టింది?
మరో తెలుగు పత్రిక తీశాడు.
అదే వార్త. ఫొటో అందరికీ ఒకటే ఇచ్చినట్లున్నారు. ‘బాగుంది’ అనుకున్నాడు.
ఆ వార్త చదువుతుంటే పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.
కాని, చివరికొచ్చేసరికి ఒళ్ళు జలదరించింది..
“…. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలుగు భాషను బ్రతికించుకోవాలంటే, మనమంతా ‘సమిష్టిగా’ కృషి చేయాలి …”
ఈ ‘సమిష్టి’ ఎక్కడనుంచి వచ్చింది?
రుచికరమైన భోజనంలో పంటి క్రింద రాయిలా తగిలింది.
మరో పేరున్న తెలుగు పత్రిక తీశాడు.
అందులో సన్మానం వార్తని బాగా వివరంగా ఇచ్చారు.
అదే ఫొటో.
“… పత్రికా సంపాదకుడు రావు గారు మాట్లాడుతూ, ఇప్పటి కుర్రాళ్ళకి తెలుగు భాష ‘ఉచ్ఛారణ ‘ నేర్పాల్సిన అవసరం ఎంతో ఉంది అన్నారు. చాలా మంది నాయకుల ప్రసంగాలలో కూడా ఈ ‘ఉచ్ఛారణ ‘ దోషాలు రావటం దురదృష్టకరం అని ఆయన ….”
శరీరం అంతా కంపరమెత్తుతోంది నందన రావుకి.
ఇదేం దౌర్భాగ్యం ? పత్రిక సంపాదకుడే ‘ఉచ్ఛారణ’ అంటాడా?
మనసంతా దేవినట్లయింది.
బాధ భరించలేకపోతున్నాదు.
పత్రికలు పక్కన పడేశాడు.
టివి ఆన్ చేశాడు.
పి.సి.సర్కార్ ఇంద్రజాలం గురించి ప్రత్యేక కథనం వస్తోంది.
మనసుకి కొంచెం ఉపశమనం కలిగిస్తుందని దాన్ని ఆస్వాదిస్తున్నాడు.
ఓ అందమైన యువతి వ్యాఖ్యానం చేస్తోంది.
“… ఇంద్రజాల ప్రదర్శనలో ప్రపంచదేశాలన్నీ మెచ్చుకున్న ‘ఇంద్రజాలికుడు ‘సర్కార్ అనటంలో సందేహం లేదు ….”
నందనరావుకి ఒక్కసారిగా ఒంటిమీద తేళ్ళూ, జెర్రులూ ప్రాకుతున్నట్లనిపించింది.
భరించలేకపోయాడు.
ఠపీమని టివిని కట్టేశాడు.
తెలుగుభాషకి పూర్వవైభవం తేవాలని కృషి చేస్తున్న వేదిక అధ్యక్షుడు సర్వమంగళ రావు చరవాణి సంఖ్య సంపాదించి, ఆయనకి ఫోను చేశాడు.
“… నా బాధ అర్థం చేసుకోండి. ఆహూతుల్ని ‘ఆహుతులు ‘ అనీ, సమష్టిని ‘సమిష్టి ‘ అనీ, ఉచ్చారణని ‘ఉచ్ఛారణ ‘ అనీ, ఐంద్రజాలికుడిని ‘ఇంద్రజాలికుడు ‘ అనీ … ఇలా తెలుగు భాషని మీడియా వారు భ్రష్టు పట్టిస్తునారు సర్వమంగళం గారు. ఈ మీడియాని మనం సంస్కరించాలి.. భరించలేనన్ని తప్పులు …మన భాషని కాపాడుకోవాలి …”
నందన రావు రొదంతా విన్నాడు సర్వమంగళ.
“రావుగారూ. మీరు అర్థ శతాబ్దకాలంపాటు విదేశాల్లో ఉండిపోయారు. ఈ 50 ఏళ్ళల్లో మన తెలుగు నేల మీద తెలుగు భాషలో వచ్చిన పరిణామక్రమాన్ని మీరు గుర్తించలేకపోయారు. అయినప్పటికీ మీ ఆలోచన తప్పు కాదు. తప్పకుండా చేద్దాం… అయితే నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. అక్కడ మన వేదిక కార్యదర్శి వినాయకుడున్నాడు. మీరు వారితో మాట్లాడండి…”
“సరే, వారి చరవాణి సంఖ్య చెప్పగలరా ?”
“రాసుకోండి. Nine Eight Nine Eight Zero Nine Eight Nine Eight Zero (98980 98980)”
ఒక తెలుగుభాష ప్రేమికుడు మరో తెలుగుభాష ప్రేమికుడితో చరవాణి సంఖ్యను ఆంగ్లంలో చెబుతున్నాడు.
అంతే!
నందన రావు నోట మాట లేదు.
గుండె పగిలినట్లయింది.
చరవాణి చేతిలోంచి జారిపోయింది.
2. దుర్మార్గపు అత్త, మొగుడు?
“ఏమ్మా కనక సమేత కాంతం. అందరూ బాగున్నారా?” అంటూ కనకారావు ఇంట్లోకి అడుగుపెట్టారు శేషయ్య.
“రండి, రండి అన్నయ్య గారు. చాలా రోజులయింది మీరు ఇటువచ్చి” అంటూ సాదరంగా స్వాగతించింది కాంతం.
“బహుకాల దర్శనం” అంటూ కనకారావు కూడా ఓ నమస్కారం పెట్టి, కాంతానికి దారి ఇచ్చి, తాను కంప్యూటరులో పేకాటకి మేడెక్కేశాడు.
“ఏమైనా కనక సమేత కాంతమ్మా …”
“ఊరుకోండి అన్నయ్యగారూ, ప్రతిసారీ నన్ను ఆయన పేరుతో కలిపి పిలవాలా ఏమిటి? మీరు మరీను…” అంటూ సిగ్గు అభినయించే ప్రయత్నం చేసింది.
పరామర్శలూ, పానీయాలూ అయ్యాక, మెల్లగా శేషయ్య కదిపారు.
“అవునూ, నీ గారాలపట్టి అమెరికాలో కాపురానికి వెళ్ళి ఆరు మాసాలు దాటినట్లుంది. అక్కడ అంతా బాగేనా?”
“అదే, ఆ విషయాలు మాట్లాడదామనే మీకు ఫోన్ చేశాను. పరిస్థితి ఏమీ బాగాలేదు. అల్లుడు సతాయింపుగాడు. అమ్మాయికి నేను మొదట్లోనే కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించానా! అయినా, అతని ధాటికి తట్టుకోలేకపోతోంది. దానికి తోడు, వాళ్ళమ్మ దిగిందిట ఈ మధ్యనే. ఇక చూడండి… (గొంతులో బాధ తొంగిచూసింది.) అమ్మాయి పరిస్థితి చాలా కష్టంగా తయారైంది… (అంతలో గొంతులో కసి తొంగి చూసింది.) నేను ఊరుకుంటానా! అత్తకి ఎలా జవాబు చెప్పాలో, మొగుణ్ణి ఎలా అదుపులో పెట్టుకోవాలో చెబుతూనే ఉన్నానులెండి…”
‘నీలాగానా మహా తల్లీ’ అనుకున్నారు శేషయ్య మనసులో.
“అంటే ఎలాంటి కష్టాలు?” శేషయ్య ప్రశ్న.
“కూరలో ఉప్పువేయటం మర్చిపోయిందని అల్లుడు అలిగేసి అన్నం తినటం మానేస్తాడు. ‘ఇంత లేటుగానా ఇంటికి రావటం’ అని అడిగిందని రెండు రోజులు మాట్లాడటం మానేస్తాడు.. మన పిల్ల గట్టిగా నిలదీస్తే, ‘మీ అమ్మ చెప్పిందా?’ అని గద్దిస్తాడట… ఇక ఆ మహా తల్లి వచ్చాక – ‘నాకు అలా ఆ కూర చేసి పెట్టు, నువ్వు పడుకునేముందు నన్ను లేపి అయినా సరే గోరువెచ్చటి పాలల్లో పసుపు వేసి ఇవ్వు, అలాగే కొంచం కాళ్ళు పట్టు….’ అంటూ సన్నగా మన మంగ తాయారుని వాయించేస్తోందిట.. (గొంతులో దుఃఖం తొంగిచూసింది.) చదువుకున్న పిల్ల. మీరు చెప్పారనే కదా, వాళ్ళ కోరిక ప్రకారం ఉద్యోగం చేయకుండా ఒప్పించి పంపించాను… చూస్తాను, ఆవిడ ఆటలు ఎంతకాలం సాగుతాయో…!” ఈసారి ఆ గొంతులో ఆవేశం తొంగి….!
శేషయ్యకి విషయం అర్థమైపోయింది.
“ఇంత చిన్న విషయాలు కూడా నీకు ఎలా తెలుస్తున్నాయి కాంతమ్మా?” అని అడిగారు.
“అదేమిటండి. ఒక్కగానొక్క పిల్ల. ఎంత ముద్దు ముద్దుగా పెంచాను. ఆమాత్రం అడిగి తెలుసుకోలేనా! ఏ పని చేస్తున్నా, మనసంతా ఆ పిల్ల మీదే ఉంటుంది…” గొంతులో మళ్ళీ దుఃఖం తెర !
“సరే, పిల్లకి నువ్వేం చెబుతున్నావేమిటి?” అనుమానంగా అడిగారు శేషయ్య.
“మీ అత్తగారు పిచ్చి వేషాలు వేసినా, వాడు అమ్మ కూచిలా మాట్లాడినా ఏమాత్రం సంకోచించకు. నిలదీయి. వాడికన్న మంచిసంబంధాలే నీకు వచ్చాయి. ఏదో శేషయ్య అన్నయ్యగారు చెప్పారు గదాని ఈ బోడి సంబంధం ఒప్పుకున్నాను గానీ, లేకపోతే …”
“చాల్చాలు. అర్థమైంది కాంతమ్మా. నాకు ఒక సభకి వెళ్ళే సమయమైంది. మళ్ళీ మాట్లాడతాను…” అంటూ ఎలాగో కష్టపడి లేచారు శేషయ్య. అలాగే మాటల్లో పెట్టి, కాంతమ్మ దగ్గర మంగ తాయారు ఫోన్ నెంబరు కూడా తీసుకున్నారు.
‘నువ్వు ఏకాంతంగా మాట్లాడగల సమయం చెప్పు’ అంటూ మంగకి ఓ సందేశం పంపారు శేషయ్య.
ఆ రాత్రి ఠంచనుగా మంగే ఫోన్ చేసింది.
“ఏమ్మా, నువ్వేదో చాలా కష్టాలు పడుతున్నట్లు మీ అమ్మ చెప్పింది. నిజమేనా? మీ ఆయన చాలా సతాయింపు మనిషిట గదా! అత్తగారు బాగా కష్టపెడుతుందటగదా!… “
మంగ ఏదో మాట్లాడబోయింది.
“చూడు మంగా, మీ అమ్మ నాకు చెప్పిన ఉదాహరణలు ఇవి. (జాబితా చెప్పారు.) ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఇవన్నీ నిజమే అనుకుందాం. నీకు మీ నాన్నతో ఇలాంటి అలకలు గిలకలు అనుభవాలు ఎప్పుడూ కాలేదా?.. మీ అమ్మ ఎప్పుడూ నిన్ను – చదువుకుంటున్నావు అని కూడా చూడకుండా – తనకి కాళ్ళు పట్టమని అడగలేదా? …. కాని, పెళ్ళి తరువాత నువ్వుంటున్నదే నీ కుటుంబం. అదే నీ ఇల్లు. అత్తగారే మీ అమ్మ అనుకొని ప్రేమగా మాట్లాడి చూడు… (మంగ కంఠంలో దుఃఖం)… కాని, ఇలాంటి చిన్న చిన్న వాటిని ప్రతిదానినీ అమ్మకి ఫోన్ చేసి లేని సమస్యని సృష్టించుకోకు…”
మంగ ఏడ్చేసింది.
శేషయ్య అనునయించారు.
“తాతగారు, మీరు చెప్పినంత పెద్దవి కావు ఆ సమస్యలు. అమ్మే నా మీద ప్రేమ కొద్దీ, నేను ఇక్కడికి వచ్చినప్పట్నుంచీ ప్రతిరోజూ ఏమేం జరుగుతోందో అడిగి తెలుసుకుంటూ ఉంటుంది… అమ్మ అడిగితే అబద్ధం చెప్పలేను కదా! మా అమ్మ చూస్తున్నట్లుగా మా అత్తగారు, మా ఆయన చెడ్డవాళ్ళు కాదు… అమ్మ రంధ్రాన్వేషణ ఎక్కువ చేస్తోంది..”
శేషయ్యకి విషయం అర్థమైంది.
“అందుకే కొత్త కాపురంలో ఆనందకరమైన విషయాలనే ఎప్పుడూ తల్లిదండ్రులకి చెబుతూ ఉండాలి. సమస్య అతి పెద్దది అయితే తప్ప, చిన్న విషయాల్ని అసలు చెప్పకూడదు. అమ్మ ప్రేమకి , అందులోను ఒక్కత్తే కూతురివి కాబట్టి గారాబంగా పెంచింది కదా, అలాగే కనుపిస్తాయి. ..ఇప్పట్నుంచి అల్పమైన విషయాలు మీ అమ్మకి చెప్పకు. సీతా దేవి రాముడితో కలిసి వనవాసం వెళ్తానంటే, అత్తగారు ‘వాడి తండ్రి కోసం వాడు వెళ్తాడు. నీకేం అవసరం?’ అని అడిగింది.
అప్పుడు సీత ఇలా చెప్పింది: ‘మితం దదాతి హి పితా, మితం మాతా మితం సుతః, అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్?’ – స్త్రీకి సంపద కానీ, సంతోషం కానీ తల్లిదండ్రులు, ఆమెకి పుట్టే పిల్లలు కూడా పరిమితంగానే పంచి ఇవ్వగలరు. కాని, సంపదని, సంతోషాన్ని, పుణ్యకార్యాలు కలిసి చేయటం ద్వారా సంక్రమించే పుణ్యాన్ని కానీ అపరిమితంగా స్త్రీతో పంచుకునేవాడు భర్త మాత్రమే…. ” “తాతగారూ, నన్ను ఒక భ్రమలోంచి బయటపడేశారు. శతకోటి ధన్యవాదాలు…”అంటోంది మంగతాయారు ఆనందంగా పదే పదే.